మానసవీణ-25 - అచ్చంగా తెలుగు

   మానసవీణ-25

శ్రీమతి కొంకేపూడి అనూరాధ
విజయనగరం



(ఒక అనాధాశ్రమంలో పెరుగుతున్న మానస సేవా మార్గంలో పయనిస్తూ, స్వయంకృషితో ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ఆమెను ప్రేమిస్తారు రాజేష్, అనిరుధ్ లు. కాని, మానస లక్ష్యం వేరు... శ్రావణి  చూపే తల్లి  ప్రేమతో ఊరట పొందుతూ ఉంటుంది మానస. భూషణం కోమాలోకి వెళ్తాడు.)

          ఎప్పటిలాగే ఆరోజుకూడా పాడుబడ్డ గుడికి వెళ్ళింది మానస. సంధ్యారుణ కాంతుల ఆగమనాన్ని తెలుపుతూ మలయానిలము చల్లగా గట్టుమీద కూర్చుని మేఘాల ఆకృతిని పరిశీలిస్తున్న మానస చుబుకాన్ని దాటి పక్కకి వెళ్ళి ఆ చల్లని స్పర్శ శ్రావణి అధరాలు తన చుబుకాన్ని ముద్దిడినట్లనిపించి ఉలిక్కిపడింది మానస.

          ఏమిటి? నా మనస్సు ఇంత విచిత్రంగా ప్రవర్తిస్తోంది అనుకుంది మానస. ఈరోజెందుకో మానస మనస్సు వెర్రి ఆనందంగా ఉంది. తనని చూడటంతోనే శ్రావణిలో ఆ పిచ్చి చేష్టలు తగ్గి ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అయి ఓ తల్లి తన కూతురితో ఎలా ప్రవర్తిన్తుందో అలాగే ఉంటోంది. మానసకి కూడా ఆమె చూపులు, ఆమె స్పర్శ అచ్చంగా తన తల్లిలాగే అనిపిస్తున్నాయి. ఆమె రాకకోసం చకోరపక్షిలా ఎదురు చూడటం. శ్రావణి రాగానే మానస హృదయ తంత్రులు ఆనందంతో కోటిరాగాలు పలకడం నిత్యకృత్యమైపోయింది. నిజంగా శ్రావణి తన తల్లి అయినట్లు శ్రావణి భర్త రఘురాం తన తండ్రి అని. తనకే ఒక తాత ఉండి, తల్లి తండ్రి, తాతతో తానాక కుటుంబంతో ఉన్నట్లు ఆ ఊహ మానస మనస్సుని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ, ఇన్నాళ్ళూ అనుభవించని ఏదో కొండంత ధైర్యం, ఆత్మబలం, సంతృప్తిలో మానస మనస్సు ఆనంద డోలలూగుతోంది.

          ఇంకా శ్రావణి రాలేదని ఏదో తెలియని అధికారంతో అలకబూనింది మానస మనన్సు. మళ్ళీ అంతలోనే తనలోతాను ఇలా అనుకుంది మానస.

           తన కారణంగా ఏదో కాస్త కోలుకున్నంత మాత్రాన అంత చనువుగా శ్రావణి గురించి ఊహలు పెంచుకోవడం తప్పు కదూ! తాను హద్దుమీరి ఆశలు పెంచుకోకూడదు. నా తలరాత ఈ విధంగా ఉండి అనాధనయ్యాను. ఆ విధంగానే పెరిగి పెద్ద అయి నాలాటి అనాథల ఆర్తిని తీరుస్తాను. అంతేగానీ ఏదో అకస్మాత్తుగా సినిమాలలో లాగే తల్లీ, తండ్రీ ప్రత్యక్షం అయిపోతారా? తప్పు తప్పు అనుకుంటూ మనస్సులోనే చెంపలు వేసుకోసాగింది మానస.

          ‘ఈ ప్రదేశం ఎంత భయంకరమో తెలుసా? అసలే నీకిదివరలో ఇక్కడే ప్రమాదం జరిగిందన్న విషయం మర్చిపోయావా? ఒంటరిగా ఇంత సమయం వరకూ ఇక్కడున్నావేమిటి? నడు వెడదాం’ అంటూ ఆదుర్దాగా అంటున్న అనిరుధ్మాటలకు ఈలోకంలోకి వచ్చింది మానస.

          ‘నిన్న ఈరోజు కూడా శ్రావణిగారెందుకో రాలేదు అనిరుథ్‌. నాకెందుకో బెంగగా ఉంది. ఆవిడని చూడకపోతే ఉండలేను’ అని అంటూ తన రెండు చేతులతో ముఖం దాచుకొని వెక్కివెక్కి ఏడుస్తున్న మానసని ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడు అనిరుధ్‌.

          ‘ఛ! ఊరుకో! మానసా! ఆవిడకి ఆరోగ్యం బాగోలేదో లేక పని ఒత్తిడిలో ఉన్నారో! కనుక్కుందామంటే రేపుకూడా చూసి ఆవిడ రాకపోతే మనమే వాళ్ళింటికి వెడదాం! సరేనీ! ప్లీజ మనూ! ఏడవకురా!’ అంటూ కళ్ళు తుడిచాడు అనిరుధ్‌.

          అందరికీ ధైర్యం చెప్పే మానస మొట్టమొదటిసారిగా బేలతనంగా బాధపడటం, అనిరుధ్ఆప్యాయతగా ఓదార్చడం ఇటు మానసకి, అటు అనిరుథ్కి కూడా ఏదో అనిర్వచనీయ అనుభూతి కల్గింది. అలాగే మానస భుజాల చుట్టూ చెయ్యివేసి కారు దగ్గరకు నడిపించుకుని వచ్చి కారు డోర్తీసారు అనిరుథ్‌. మౌనంగా కారులో కూర్చుంది మానస. హేమలత అనాథాశ్రమం గేటు దగ్గర కారాపి ప్రశాంతంగా పడుకో! రేవు శ్రావణిగారి గురించి కనుక్కుందాం సరేనా! దిగు లోనికివెళ్ళు అంటూ మానస కారు దిగి ఆశ్రమం లోపలకు వెళ్ళేవరకు ఆగి కారు స్టార్ట్చేసాడు అనిరుధ్‌.

***

          మూడు నెలల పసిపాపని పక్కలో పడుకోబెట్టుకొని

         ఏడవకు నా తల్లి చిట్టి పాపాయి

         ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు

          అంటూ పాటపాడుతూ కూతుర్ని సముదాయిస్తున్న కోడలు శ్రావణి, తన మనవరాలు మస్తిష్కంలో మెదిలారు భూషణానికి.

          తాతయ్యా! తాతయ్యా! కళ్ళు తెరవండి. మీ ముద్దుల మనవరాలిని వచ్చేసాగా.

          తాతా... తాతా... అంటూ భూషణం బుగ్గలు పట్టుకుని ఆత్మీయంగా స్పృశిస్తున్న మానసలో ఏదో ఆత్మీయబంధం, రక్త సంబంధం, మమతాను బంధం కలగలిపి ‘తాతయ్యా!’ అని గట్టిగా అరుస్తున్నట్లుగానే పిలిచింది. శ్రావణి, రఘురామ్ల నోట మాటరాలేదు. ‘నాన్నా!’ అంటూ ఆనందంగా వెర్రి కేక పెట్టారు రఘురామ్‌. ‘వాట్ఎ సర్ప్రైజ్’ అంటూ రౌండ్స్ కి వచ్చిన డాక్టర్ఆశ్చర్యపోయారు.

          మానస పిలిచిన పిలుపో లేక ఆమె ఆత్మీయ స్పర్శో. ఏ కారణం అయితేనేం భూషణం కోమాలో నుండి బయటకు వచ్చారు. మానసని, శ్రావణిని మార్చి మార్చి చూస్తున్నాడు. తన మనవరాలిని ఆయన ఇట్టే గుర్తు పట్టేసాడు. భూషణం కళ్ళవెంట ధారాపాతంగా కన్నీళ్ళు కారుతున్నాయి. పశ్చాత్తాపంతో ఆయన హృదయం విలవిల లాడిపోతోంది. తన పాపానికి నిషృతి లేదు. ‘తాను చెడు తలచినా భగవంతుడు తనయందుండి తన మనవరాలిని బ్రతికించి, తన కోడలు శ్రావణి దగ్గరకు చేర్చాడు’ అని మనస్సులోనే కృతజ్ఞతలర్పించుకుంటున్నాడు భూషణం. నోరు విప్పి చెబుదామంటే మాటలేదు. మానస చెయ్యి మాత్రం భూషణంగారి చేతిలోనే ఉంది.

          ‘వెళ్ళొస్తాను ఆంటీ!’ సరిత వచ్చి తాతగారి గురించి చెప్పేసరికి ‘మీరు రాలేని కారణం అర్ధం అయ్యింది. అసలే మిమ్మల్ని చూసి మూడు రోజులైందేమో. విషయం తెలియగానే ఆగలేకపోయాను. సమయానికి అనిరుథ్కూడా నాతోనే ఉండబట్టి వెంటనే రాగలిగాను. ఏమాత్రం అవసరం ఉన్నా నాకు ఫోన్చెయ్యండి. తప్పకుండా వచ్చి హెల్ప్చేస్తాను. వస్తాను’ అంటూ భూషణం గారి చేతిని విడిపించుకుని ‘మళ్లీ వస్తాను. తాతయ్యా!’ అంటూ వెళ్ళిపోతున్న మానసని, అనిరుథ్ని చూస్తూ అయోమయంలో పడ్డాడు భూషణం.

No comments:

Post a Comment

Pages