నెత్తుటి పువ్వు - 36
మహీధర శేషారత్నం
(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ఆమెను ఏమార్చి, సరోజ ఇంటికి వెళ్తుంటాడు రాజు. కడుపుతో ఉంటుంది సరోజ. ఆమెను మారేడుమిల్లి అడవులకు తీసుకు వెళ్తాడు రాజు. బావమరిది వెటకారంతో బాధపడ్డ రాజు శంకర్ కు ఫోన్ చేస్తాడు...)
“మీ ఇంట్లోనూ వద్దు,
మా ఇంట్లోనూ వద్దు లక్ష్మీవిలాస్ సెంటర్ దగ్గరకు రా! నీతో కొంచెం
పర్సనల్గా మాట్లాడాలి” అన్నాడు.
“పార్వతి ఇంట్లో లేదులే,
ఫ్రీగా ఉన్నాలే చెప్పు.” అన్నాడు శంకరం.
“వద్దు నే చెప్పిన
చోటుకే రా!” మరోమాటకి అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసాడు.
నాగరాజుని చూస్తూనే శంకరం
ఆశ్చర్యపోయాడు. కళ్ళు ఎర్రబడి జుట్టురేగి జబ్బుపడ్డ వాడిలా ఉన్నాడు.
సాయంత్రం ఆరుగంటలకు ఇద్దరూ ఆనందభవన్
హోటల్లో కార్నర్ సీటు చూసుకు కూర్చున్నారు. “ఏమయిందిరా! రాజూ!
అనునయంగా అడిగాడు శంకరం, నాగరాజు చిన్నగా టీ తాగుతూ తన
బావమరిది బెదిరింపులు, హెచ్చరింపులు చెప్పాడు.
“వాడు వెధవ ... ఆ
చిలక్కొట్టుడుగాడు నిన్ను బెదిరించే స్థితికి వచ్చాడా?” శంకరం
ఆవేశపడి పోయాడు.
వాడిది చిలక్కొట్టుడు వ్యవహారం, డబ్బు ఇస్తాడు అక్కడితో ఆపనితో ఆ వ్యవహారం కట్. వాడికి మనసు, అభిమానం, ఇష్టం ఇలాంటివేవీ ఉండవు. నా మనస్తత్వం
అదికాదు. నా సమస్య సరోజకి హాని జరగకూడదు. వాడు ఇప్పట్లో లక్ష్మికి ఈ విషయం
చెప్పడు. వాడెంత వెధవైనా చెల్లెలంటే కొద్దో గొప్పో ప్రేమ ఏడ్చింది. కాని వాడికి
నిజం తెలిసి సరోజ ఉనికి తెలిస్తే చంపినా చంపేస్తాడు. ఎలా? చూపుడువేలిలో
నుదురుకొట్టుకుంటూ అన్నాడు నాగరాజు.
సరోజ ఏక్షణాన్న నన్ను అన్నయ్యా అని
వరస కలిపిందో కాని నాకూ ఆ పిల్ల అంటే అభిమానం ఏర్పడింది. పార్వతికి కూడా చెప్పాను.
మనింట్లోనే ఒక గది ఇద్దాం. చిన్నదైనా మా ఇల్లు స్వంత ఇల్లు కనుక అద్దె బాధ ఉ ండదు.
వందో, రెండు వందలో మిగిలినా మిగిలినట్లే అని. ఏమయిందో ముందు
ఒప్పుకుని తరువాత ఇప్పుడు కాదులే అన్నయ్యా కొంతకాలం ఆగివస్తానంది. నిష్టూరంగా
అన్నాడు శంకరం.
“నేనే చెప్పాలేరా! నాకు
పార్వతి ముఖం చూడాలంటే సిగ్గుగా ఉంటుంది. చేసేది తప్పుపని, పార్వతి
లక్ష్మి స్నేహితురాలు. అందుకని తరవాత వెళ్ళచ్చులే అన్నాను” తలవంచుకు
అన్నాడు.
శంకరం అర్ధమయినట్లు తల ఊపి
ఊరుకున్నాడు. ఒక్క క్షణం ఆగి నాగరాజు తను అన్నాడు. “సరోజ మీ ఇంట్లో ఉంటేనే రక్షణ ఉంటుంది రా! తీసికెళ్ళు”. తల వంచుకుని చిన్నగా అన్నాడు నాగరాజు.
ఫరవాలేదు మా ఇంటికి వెనక గదికి ప్రహరీ
వైపు కూడా తలుపుంది. ఆ గది ఇస్తే మా ఇంటితో సంబంధం లేకుండా నువ్వు అప్పుడప్పుడు
వచ్చిపోవచ్చు. పార్వతికి తెలుసు ఈ విషయాలన్నీ తప్పు చెయ్యకుండానే ఉండాలి కాని ఆ
తప్పులు దాగవు. దిగులుపడకు రేపే ఇల్లు మారుస్తాను. చుట్టు పక్కలవాళ్ళకి మా పిన్ని
కూతురిగా చెప్తాను. పద సమస్య నాకు చెప్పావుగా నే చూసుకుంటా నువ్వు మాత్రం అస్తమానం
రాకు “హెచ్చరికగా అంటూ లేచాడు శంకరం.
రేవతి అనుకున్నట్టే శంకరానికి ఫోన్
చేసింది ఒకరోజు ముందు దీనికి మధ్యాహ్నం. శంకరం స్టేషన్లో డ్యూటీలో ఉన్నాడు. ఎవరో
అర్ధం కాలేదు తొందరగా
"నే నండీ రేవతిని,
మీరూ సరోజనే అమ్మాయిని నా దగ్గరకు తీసుకు వచ్చారు కదా! డ్వాక్రా
గ్రూపులో మెంబరుషిప్ కోసం.... ఆగింది.
“ఆఁ! ఆఁ! చెప్పండి
మేడమ్” అన్నాడు చటుక్కున గుర్తుపట్టి శంకరం.
ఆఁ! సామ్రాజ్యం అని యానిమేటర్ ఒకావిడ
వచ్చారు. వాళ్ళ గ్రూపులో ఒకమ్మాయి మెంబరుషిప్ తీసుకు కట్టలేక మానేసిందిట. మీరు
రెండు వేలు, సరోజని తీసుకుని రేపు ఉదయం తొమ్మిది గంటలకి రండి. ఆ
అమ్మాయికి సహాయం చేద్దాం” అంది.
సరే! మేడమ్! రేపు ఉదయం తొమ్మిది
గంటలకు తప్పకుండా వస్తాం.
శంకరం నాగరాజుకి ఫోన్ చేసి విషయం
చెప్పాడు. నాగరాజు సాయంత్రం శంకరం దగ్గరకు వచ్చాడు. ఆ రెండువేలు నేనే కడతారా! అంటూ
ఇచ్చాడు నేను రాలేను కాని నువ్వే సరోజను తీసుకెళ్ళు” అన్నాడు.
శంకరం పొద్దున్నే సరోజకి ఫోన్ చేసి
చెప్పాడు.
ఎనిమిదిన్నర అయ్యేసరికి మా ఇంటికి
వచ్చెయ్ అమ్మా అంటూ సరోజ వచ్చింది.
పార్వతి టిఫిన్ పెట్టి టీ ఇచ్చింది
శంకరం లూనాపై రేవతి ఇంటికి తీసుకెళ్ళాడు. శంకరం రేవతికి రెండువేలు ఇచ్చాడు. వాళ్ళ
ఎదురుగానే ఆడబ్బు రేవతి సామ్రాజ్యానికి ఇచ్చింది. సామ్రాజ్యం, సరోజను వదిలి శంకరాన్ని వెళ్ళి పొమ్మంది. మేం ఆటోలో వెళ్ళి ఫార్మాలిటీస్
పూర్తిచేసుకు వస్తాము. మున్సిపల్ ఆఫీస్ కి వళ్ళి అక్కడ నుంచి బ్యాంకు ఆఫ్ ఇండియాకు
తీసుకెళ్ళి ఎకౌంటు ఓపెన్ చేయించి పాస్ బుక్ ఇచ్చింది. సరోజ సంతోషం పట్టలేక
సామ్రాజ్యానికి నమస్కారం చేసింది. థ్యాంక్స్ చెబుతూ సరోజ సంతోషంతో తేలిపోతూ శంకరం
ఇంటికి వెళ్ళింది. పార్వతి సరోజ సంతోషాన్ని షేర్ చేసుకుంది. “ఎండలో వెళ్ళకు, ఈ పూటకు అన్నం తిని సాయంత్రం దాకా
ఇక్కడే ఉండు - అన్నయ్యకు వివరంగా చెప్పి చల్లబడ్డాక వెళ్ళు”. అంది పార్వతి.
సరోజ సంతోషంగా అక్కడే ఉండి శంకరం
వచ్చాక వివరంగాచెప్పి వెళ్ళింది.
సామ్రాజ్యం వాళ్ళు డ్వాక్రా సంఘం
ద్వారా పచ్చళ్ళు పెట్టి గ్రామీణాభివృద్ధి సంస్థ సహకారంతో ఎగ్జిబిషన్ అప్పుడు
స్టాల్స్ పెట్టి అమ్ముతారు.
సరోజ గ్రూపులో మెంబరయింది. ప్రతినెల
కట్టాల్సిన వంద రూపాయలు నాగరాజు శంకరం చేతికి ఇచ్చి పంపిస్తున్నాడు. ఆ అమ్మాయి
ముఖంలో ఒక వెలుగు, ధీమా వచ్చాయి. మొదటి విడతలో అందరూ పంచుకుంటే పదివేలు
వచ్చాయి. సరోజతెచ్చి శంకరం చేతికి ఇచ్చింది. నాకెందుకు? నువ్వే
ఉంచుకో అన్నాడు శంకరం. సరోజ శంకరం చేతిలో పెట్టి నవ్వేసి వెళ్ళిపోయింది. శంకరం
పార్వతిని పిలిచి విషయంచెప్పి ఇచ్చాడు.
“సర్లే! నా ఎకౌంట్లో
వేసి సరోజకి చూపిస్తా. పురిటి ఖర్చులకు కావాలిగా” అంది
పార్వతి. పిల్లలు లేని పార్వతికి సరోజను చూస్తే సంబరంగా ఉంది. పార్వతి ఈర్ష్య
పడకుండా, చిన్నచూపు చూడకుండా ఉండడంచూస్తే శంకరానికి సంతోషం
అనిపించింది. “నీ దెంత మంచి మనసు పార్వతీ!” అన్నాడు మనస్పూర్తిగా పార్వతి నవ్వేసి వెళ్ళిపోయింది.
అదే విషయం సరోజకి కూడా చెప్పింది.
“నీ ఇష్టం వదినా!”
అంది సరోజ.
“వదినా! నువ్వు
పనమ్మాయికి ఎంత ఇస్తావు?” అంది హఠాత్తుగా.
“నెలకి వెయ్యి. ఏం
చేసుకోలేక పోతున్నావా? నీకూ చెయ్యమని చెప్పనా?”
“కాదొదినా! మీ ఇంట్లో
ఆపని నేనే చేస్తాను, రెండు వందలు అద్దెగా మినహాయించుకుని
మిగిలిన
ఎనిమిదివందలు నాకు ఇయ్యి. నేను బయటికివెళ్ళి ఆ
పని చెయ్యలేను” అంది.
పార్వతి పెద్దగా నవ్వింది.
“అప్పుడే పుట్టబోయే
బిడ్డకు డబ్బులు కూడా పెట్టాలని నీ కెంత తాపత్రయం.”
“అది కాదొదినా! కనీసం
మూడు నాలుగు నెలలు పనిచెయ్యలేకపోతే డబ్బులు వుండాలిగా!” అంది
పెద్దఆరిందాలా.
“ఊఁ! ఊఁ! ఆ అవసరం
వచ్చినప్పుడు చూద్దాంలే” అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది.
శంకరం, పార్వతిల సహకారంతో సరోజ జీవితంలో మొదటిసారిగా కాస్త హాయిగా బ్రతుకుతోంది.
నాగరాజు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతున్నాడు. వచ్చినప్పుడల్లా పళ్ళో, బిస్కట్లో తెచ్చి ఇస్తున్నాడు.
(ఇంకా ఉంది)
*****
No comments:
Post a Comment