పురాణ కధలు - 17 - అచ్చంగా తెలుగు

                               పురాణ కధలు .. బసవ పురాణం 

                                                       సేకరణ   పి.యస్.యమ్. లక్ష్మి




17 మడివాలు మాచయ్య బసవేశ్వరుని దూలనాడుట


రోజులు గడుస్తున్నాయి.  మాచయ్య తన నిత్య కృత్యములను యధావిధిగా నెరవేర్చుకుంటున్నాడు.  అలాగే బసవేశ్వరులు తన భక్తగోష్టులనుకూడా మామూలుగా చేసుకుంటూ సుఖంగా వున్నారు.  బసవేశ్వరులవారి అభిప్రాయం ఏమిటంటే లోకంలో వున్న భక్తులలో కొందరు తన గురించి తెలిసికొని వచ్చినవారు, కొందరు తన త్యాగనిరతి తెలిసికొని వచ్చినవారు, కొందరిని తను వెతికించి భక్తిపూర్వకంగా ఆహ్వానించినవారు...ఇలా భక్తులందరూ తన దగ్గరకు వచ్చి సౌఖ్యంగా వున్నారు.  భక్తులలో దీనులగువారు ఇంకలేరని,  తానందరినీ అన్ని విధాల ఆదరిస్తున్నానని కొంత గర్వము కూడా బసవేశ్వరులకు కలిగింది. 


ఆ సమయంలో అకస్మాత్తుగా కొందరు భక్త శిఖామణులు, కేవలం కౌపీన ధారులై, జటాజూటములతో, రుద్రాక్షల అలంకరణతో, చేతిలో భిక్షా పాత్రతో భిక్షకై బసవేశ్వరుల మందిరంలోకి రావటం చూశారు.   వారి రూపురేఖలు చూసి వారు జ్ఞాన సంపన్నులుగా అనుకోక చాలా పేదవారని భావించి  ఆ సమయంలో బసవేశ్వరుడు ఒక పాట పాడారు. దాని  అర్ధము భక్తుల దైన్య స్ధితి పట్ల కనికరము కలిగించేటట్లు వున్నది. 


అయ్యో, భక్త జన దారిద్ర్యాన్ని పోగొట్టటానికి తాను మూల మూలలనున్న భక్తులను వెతికించి తెప్పించి వారి అవసరాలన్నీ తీరుస్తూ వుండగా ఈ భక్తులేమిటి ఇంత దైన్య స్ధితిలో తన దగ్గరకు రావటం.  అసలు భక్తులలో ఇంకా ఇంత దైన్య స్ధితిలో వున్నవారు వున్నారా అని ఆ పాట అప్రయత్నంగా పాడారు.  కానీ వారు తనని పరీక్షించటానికి వచ్చిన మాచయ్య భక్తులని తెలుసుకోలేదు.  ఆ భక్తులు మాచయ్య దగ్గరకు వెళ్ళి ఆ గీతాన్ని గానం చేశారు. 


అది విని మాచయ్య బాధపడి బసవేశ్వరుని దూషించి, “పరమ భక్తుల పేదరికము ఎప్పుడూ నా చెవులబడకూడదు. భక్తులెన్నటికీ దరిద్రులు కారు అనే విధంగా, ఈ భక్తులు భగవదష్టయిశ్వర్య సంపన్నులుగాని, నీవనుకునేట్లు దరిద్రులు కారు.  నీ ధన మదాంధతచో నీవే లోకమున ధనాఢ్యుడవని, మహాదాతవని, నీ దగ్గరకు వచ్చేవారంతా దీనులని అనుకుని నీ అహంభవాన్ని చూపిస్తున్నావు.  నీ త్యాగమెంత? నీవిచ్చిన భోగమెంత??  ధన, కనక, వస్తువాహన, వగైరా నీవిచ్చే ఐశ్వర్యములెంత??  నీకంటికి భక్తులంత దరిద్రులుగా కనబడుతున్నారా!?  నీవిచ్చినదేపాటి!??  చూడు నా సామర్ధ్యంబు! నేటినుండి భక్తులకు నీవొక కాసైన ఇచ్చే అవసరం లేదు.  ఇదిగే నేను నవ నిధులు వారి  కొరకేర్పరుస్తున్నాను.  నువ్వు ఆ నిధులను కాపాడుతూ, వచ్చిన భక్తులకిస్తూ వుండు” అని బసవన్ననుద్దేశించి చెప్పాడు.   తర్వాత కొంచెము నిర్మల జలాన్ని చేతిలోకి తీసుకుని మంత్రించి లింగానికి చూపించి నేల మీద చల్లేసరికి ఆ బిందువులన్నీ నానా విధములైన నవ రత్నాల కుప్పలై అక్కడ కనిపించాయి.  


దీనికి ముందరే బసవేశ్వరుడు మాచయ్య తనను దూషించటం విని వెంటనే అక్కడికి వెళ్ళి మాచయ్య కాళ్ళమీద పడి, “దేవా, నువ్వు సాక్షాత్తూ సంగమేశ్వరుడవు.  నువ్వు అనేక విధముల నన్ను పరీక్షించటానికి వస్తూ వుంటావు.  నేను నిన్ను తెలుసుకోలేక తప్పులు చేస్తూ వుంటాను.  నువ్వు పంపిన భక్తులను నీ మాయవల్లే తెలుసుకోలేక పోయాను.  నా తప్పులు క్షమించి నాకు సర్వదా సహాయుడవై వుండమని ప్రార్ధిస్తున్నాను.”  అని మాచయ్య పాదాలు పట్టుకుని విడవని బసవన్నని కరుణా దృష్టితో చూసి,  “ఓ బసవా, నువ్వు చెప్పినట్లు నీ భక్తి పారవశ్యతను, భక్త జనాదరణని, త్యాగశీలత ఇత్యాది నీ గుణాలను ఎంత చూసినా తనివి తీరక ఇలా మారు వేషాలతో నీ దగ్గరకు వస్తున్నాను.  మనుష్యులకు వున్న ఎన్ని దుర్గుణాలనైనా క్షమించ వచ్చుగాని అహంభావాన్ని మించిన దోషం ఇంకోకటి లేదు.  అహంకారం లేనివాడే భగవంతుడిని పొందగలడు.  కనుకే నీలోని అహంకారాన్ని నీకు చూపించి అందులో పడవద్దని నీకు చెప్పటానికి వచ్చిన నీ ఇష్టదైవమైన సంగమేశ్వరుడను నేను”.  అని చెప్పి ఇంకొందరు అహంభావులైన భక్తుల కధలు చెప్పి, ఆ అహంభావం వల్ల వారికి ఎలాంటి దురవస్తుల కలిగాయో చెప్పాడు.

***

No comments:

Post a Comment

Pages