శివం - 78
రాజ కార్తీక్
అశ్వం మీదుగా ప్రయాణిస్తున్న హర సిద్దు.. ఇప్పుడు తనకు వచ్చిన డబ్బుతో తన తల్లికి స్థిర జీవనోపాధి ఏర్పాటు చేసి, తర్వాత బొజ్జ లింగ రాజ్యంలో తనకు వచ్చిన డబ్బుని మరుసటి పౌర్ణమి కి తీసుకోవాలి. తన కొడుకు ఎంత గొప్పవాడయ్యాడో అని తన తల్లి తనను అవమానించిన బంధువులందరూ ఆశ్చర్యపోయేలా చేద్దామని అనుకొని, ఇక్కడ జరిగింది ఏమీ చెప్పకుండా.. తన రాజ్యం వైపు ప్రయాణించసాగాడు.
నేను మాత్రం హర సిద్ధుకి... తన ఊహల్లో, తన తలపులో, తన దగ్గరికి వచ్చిన కుంభన్న రూపంలోనే కనబడుతున్నాను. తన వ్యధ ఆలకించి తనను దయ చూసిన నాకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకొని... మళ్లీ తన ఎదుట గనక ప్రత్యక్షమైతే, చెప్పుకోలేనంత గొప్పగా స్తోత్రం చేద్దామని నిర్ణయించుకున్నాడు.
ఇక తనకి గుర్తొస్తుంది మరొక విషయం... గతంలో మనం ప్రస్తావించి ఉన్నది... శివుడు ఎప్పుడూ లింగరూపంలో ఉంటాడు. కానీ ఆ పరమేశ్వరుని సాక్షాత్ పరమ శివుడి లాగా చూసాడు కదా... అదే నా యొక్క రూపాన్ని చూసానని ఆనందంగా చెప్పాలని, తన నాయనమ్మ కోరికని సాధ్యమైనంత తొందరగా నెరవేర్చాలని మనసులో అనుకున్నాడు. తనకు ఎట్లాగో ధనం వచ్చింది కాబట్టి, తన సొంత డబ్బుతో అదంతా చేసి... తన నాయనమ్మ కి అంకితం ఇద్దామనుకున్నాడు.
నా ప్రియమైన సిద్ధుని చేతితో మరొకమారు నా రూపాన్ని చెక్కించు కోవడం... నాకెంతో ఆనందంగా ఉంది.
పౌర్ణమి లోపు తనకి ఏదో మంచి జరగబోతోంది. అందుకే రాజుగారు, ధర్మయ్య బాబాయ్. కచ్చితంగా రమ్మన్నారు అని తన బుద్ధికి గోచరించింది.
అటు అంతఃపురంలో రాజుగారు ధర్మయ్యతో అంతరంగిక మందిరంలో ఏదో చర్చ చేస్తున్నారు. హర సిద్ధుని గురించే ఏవో మంతనాలు జరుగుతున్నాయి.
హర సిద్ధు దారి పొడవునా ప్రయాణిస్తూ... "నా ప్రతిభను నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వు స్వామి అని అడిగాను. ఆ అవకాశం మీరు ఇచ్చారు, ఆ అవకాశాన్ని సఫలీకృతం చేసుకున్నాను. ఆ సఫలీకృతం చేసుకునే విధంగా కూడా చేసింది నీవే స్వామి" అని జీవితంలో వెలుగు బాట పట్టిన యోధుని వలె నన్ను కీర్తింప సాగాడు.
భక్తులారా... నన్ను నమ్మి నా మీద భారం వేసి మీ కష్టం మీరు పడండి. ఇప్పటిదాకా ఏది కోల్పోయినా దాని గురించి బాధపడవద్దు. నేను ఇచ్చేది ఇప్పటిదాకా కోల్పోయిన దానికన్నా ఎక్కువ. ఇక ముందు మీరు పొందే దానికన్నా ఇంకా ఎక్కువ. పూర్వజన్మ కర్మ అని డీలా పడకుండా ప్రయత్నం మాత్రం మానకండి. నా మీద విశ్వాసంతో మీరు చేస్తున్న ఏ పనైనా. పూర్వ జన్మ కర్మ తో ఢీకొని, ఈ జన్మలో మీ ప్రయత్నం గెలిచే విధంగా తప్పక ఆశీర్వదిస్తున్నాను. హర సిద్దు వలే మంచి ఆశయాలు కలిగి, వాటి కోసం పరితపించి, ఆ పని కోసం కష్టపడండి. ఆలస్యం ఏమీ ఉండదు. మీ యొక్క ఆశయాలు తప్పక నెరవేరుతాయి.
హర సిద్ధుని తల్లి మాత్రం... "ఊరికి వెళ్తాను అన్న బిడ్డ ఇంతకాలమైనా ఇంకా రాలేదు. ఎక్కడికి పోయి ఉంటాడు? అసలే లౌక్యం తెలియని తెలివి గల అమయాకుడు" అని తన బిడ్డ గురించి బాధపడుతూ ఉంది. తన బిడ్డ మంచి వాడు సమర్ధుడు అని తెలుసు, కానీ కాలం కలిసి రాక తను గెలవలేకపోయాడని మాత్రం తను తెలుసుకోలేక పోయింది. హర సిద్ధుని మాట తీరు వల్ల, ప్రతిఘటనల వల్ల, క్షణికావేశం వల్ల ఎన్నో కోల్పోయాడు. అవన్ని సందర్భం వచ్చినప్పుడు పూస గుచ్చినట్టు వివరంగా విపులీకరిస్తాను. అసలు ఎందుకు హర సిద్ధుడు అంటే అందరికీ ఒక వ్యతిరేకత? చెప్పాను కదా సత్యవాది లోక విరోధి అని... ఆవేశపరుడు చేసినా పొరపాటు వల్ల తాను ఏం కోల్పోయాడో, దాని వల్ల ఏం జరగబోతుందో కొంతకాలం చూస్తూ ఉండక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో తను చేసిన తప్పును తెలుసుకున్న నా ప్రియమైన బిడ్డ హర సిద్దుని చెయ్యి మాత్రం కచ్చితంగా వదలను.
అశ్వం మీద ప్రయాణిస్తున్న హరసిద్దునికి దూరంగా ఒక మనిషి కనపడుతున్నాడు. అతనెవరో కాదు బొజ్జ లింగం గుడిలో దగ్గరికి వచ్చి "మా గుడిని కూడా సరిగ్గా చేయండి" అని అడిగిన ఒక పుణ్యాత్ముడు. అక్కడ గుర్రాన్ని ఆపి అతన్ని పలకరించి.. కుశలం అడిగాడు... అతగాడు మాత్రం హర సిద్దు ను చూసి గుర్తుపట్టి, "మీ గురించే ఆలోచిస్తున్నాను, మీకు ఎంత పారితోషికం ఇవ్వాలి, గుడి ఎట్లా బాగు చేయాలని ఆలోచిస్తున్నాను మిత్రమా!" అని చాలా ఆప్యాయంగా అన్నాడు. దానికి ఆ సిద్ధుడు "పదండి, ముందు ఆ పాతబడిన గుడికి వెళదామని" ఆ గుర్రం మీద తీసుకు వెళ్ళాడు.
ఆ గుడిని చూశాడు. దగ్గర్లో ఉన్న కొన్ని రాళ్లను చూశాడు. ఆ గుడిని ఒక్క పూట లో ఎలా బాగు చేయాలో, ఆ రాళ్ళని ఎలా మలచాలో ఒక ప్రణాళిక వేసుకొని... సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే లోపల ఎలా అయిపో కొట్టాలని ఒక నిర్ణయానికి వచ్చేశాడు. తనవల్ల అయింది చేద్దామని ఆ రాత్రి అక్కడే ఉన్నాడు.
కానీ అతడు హర సిద్దునికి ఎటువంటి పారితోషికం ఇవ్వలేడు అని తెలుసుకొని అది చెప్పటానికి తటపటాయించాడు. కానీ నా హర సిద్ధుని మనసు నాకన్నా ఎవరికి బాగా తెలుసు?
"మిత్రమా! నేను జనం కోసం పని చేసే వాడిని కాదు.. ఈ ఆలయాన్ని బాధ్యతగా నేను బాగు చేస్తాను. నా దగ్గర కొంత ధనం ఉంటే దానితో రేపు కొంతమంది పని వాళ్ళను తెచ్చి, ఈ గుడిని శుభ్రం చేద్దాము. నాకు సహాయకునిగా ఉంటే చాలు" అని చెప్పి అనేసరికి అతను పొంగిపోయాడు. ఇక నా హర సిద్ధు కి పొగడ్తలు సహజమే కదా! ఆలయం బాగు చేయటం అనే సరికి ఔత్సాహికులు కొంతమంది అక్కడికి వచ్చారు. ఎక్కడెక్కడ ఎలా బాగు చేయాలని ప్రణాళిక వేసి ఆ యొక్క పనిని భాగాలుగా పంచి చాలా కొద్ది గంటల్లో ఆ పని అయిపోయే విధంగా అందరికీ పురమాయించాడు.
తాను పట్టు దొరకడానికి రాళ్లతో కొన్ని ఆకృతులు చెక్కాడు.
తనకి దక్షిణగా వచ్చిన డబ్బుమూటలు అలాగే ఉండగా, ఆ డబ్బులు కేవలం తన తల్లి కోసమే వాడతాడు నిర్ణయించుకో బట్టి, అంతకు ముందు తన దగ్గర ఉన్న కొన్ని నాణేలు తీసుకొని, పనిచేసిన వారందరికీ "సేవ అనుకొని ఉంచుకోండి" అని ఇచ్చాడు.
చూడండి హర సిద్ధుని నీతి... తన తల్లి కోసం వచ్చిన డబ్బు కేవలం తన తల్లి కోసమే. ఇంత కాలము తన చాలీచాలని జీవితం గడిపి కూడా తన తల్లికి స్థిరభుక్తి ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకొని... ముందు తన దగ్గర ఉన్న ధనాన్ని వినియోగించాడు.
ఎన్నో ఏళ్లుగా శిధిలమైపోయిన ఆలయాన్ని కేవలం ఒక్క రోజులో కళగా మార్చి, ఆలయాన్ని శోభాయమానంగా తుఅరు చేశాడు. అక్కడున్న అతికొద్ది మంది మన హర సిద్ధ ప్రతిభకి జేజేలు పలికారు. హార సిద్ధుని మిత్రుడు మాత్రం, ఆనందభష్పాలతో కృతజ్ఞతలు తెలిపాడు.
హర సిద్దు "మిత్రమా ఈ ఊరిలో ఎంతో మంది ఉండగా ఆలయం కోసం నీవు చేసిన ప్రయత్నం కన్నా నేను చేసింది పెద్ద గొప్పేమీ కాదు. ఇక నేను చేయవలసింది అంతా అయిపోయింది. ఆలయాన్ని సుందరంగా అలంకరించుకుని, యధావిధిగా పూజలు మొదలు పెట్టకోవచ్చు అని.." తన చేతులు పట్టుకుని సముదాయింపు గా చెప్పాడు..
మిత్రుడు మాత్రం "మీరు కుంభ స్వామి ఆలయాన్ని బాగు చేయడం చూసి ఏదో భక్తి ఆవేశంతో మా గుడి కూడా బాగు చేయాలి అని అడిగాను కానీ నాకు స్తోమత ఎక్కడిది అని ఆ రాజ్యం నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వస్తూ ఆలోచించుకుంటూ వస్తున్నాను.. ఈ లోపల నీవే కనపడి నా సమస్యని, నా కలని తీర్చావు మిత్రమా అని ఆలింగనం చేసుకున్నాడు.
ఈ గుడి పూర్తయితే బొజ్జ లింగస్వామి మళ్లీ దర్శించుకుంటారని మొక్కి ఉన్నాము మిత్రమా. కానీ నా మోక్కు ఇంత తొందరగా తీరిపోతుంది అనుకోలేదు అని ఆనంద పడసాగాడు.
సాటి వారు నిజంగా మానసికంగా ఆనందం పొందితే ఎదుటి మనిషి ఎంత ఆనంద పడవచ్చు అని హర సిద్దు కి బాగా తెలుసు..
అటుగా పోతుంది ఒక రాజ పరివారం ఒక పల్లకి కొంతమంది మనుషులు ఏదో ఒక అంతఃపురం సమూహం...
ఆ పల్లకిలో నుంచి దిగారు మరొక రాజు గారు...
వారు ఎవరో కాదు ప్రస్తుతం హర సిద్ధుడు ఉంటున్న రాజ్యపు రాజు... అయ్యన్న.
అయ్యన్న "ఎవరు ఈ ఆలయాన్ని ఇంత బాగా చేసింది? మేము నిన్న ఇటు పోతూ ఎందుకు ఈ ఆలయం శిధిలమై పోయింది అని ఆలోచించాం. ఒక్క రోజులోనే ఇంత సుందరంగా మార్చింది ఎవరు"అని ఆశ్చర్య చకితంగా ప్రశ్న వేశారు.
దానికి సమాధానంగా అందరూ హరసిద్ధుని వైపు చేయొత్తి చూపించారు.
మాటల్లో తనది తమ రాజ్యమే అని తెలుసుకొని, తన చిరునామా కనుక్కొని, రేపు గౌరవంగా భటులను పంపిస్తాము. మా రాజ్య కొలువుకి రండి... మీతో ఒక విషయం చర్చించాలని విన్నపం చేశాడు.
హర సిద్ధునికి నా దయవల్ల ఎక్కడో సుదూర తీరాన ఉన్న పొరుగు రాజ్యంలో గుర్తింపు వచ్చింది. "ఇప్పుడు తన సొంత రాజ్యంలో గుర్తింపు రావాలని స్వామి నన్ను కరుణించాడు" అని నా గురించి అనుకున్నాడు.
మిత్రుడు మాత్రం... "మిత్రమా హర సిద్ధ! నీకు ఇంకా మంచి జరగాలి. నేను రేపు ఉదయాన్నే వెళ్లి బొజ్జ లింగస్వామి దర్శనం చేసుకుంటాను" అని ఆనందంగా చెప్పాడు.
"తప్పక వస్తాను ప్రభు! నేను ఇంటికి బయలుదేరుతాను" అని సెలవు తీసుకొని తన ఇంటికి బయల్దేరాడు.
హర సిద్ధుని తల్లి బిడ్డను చూసి ఆనంద పడింది...
హర సిద్దు మనసులో (జరిగిందంతా పౌర్ణమి తర్వాత చెబుదాము ఆశ్చర్యచకితుల్ని చేద్దామని, ఏమి చెప్పకుండా)... "అమ్మా! నేను చేసిన ఒక పనికి ప్రతిఫలం దక్కింది. ఆ డబ్బుతో ఇక నువ్వు హాయిగా ఉండవచ్చు. ప్రస్తుతానికి నేను నీకు ఇంత వరకే చేయగలను. తప్పు ఉంటే క్షమించమ్మా, నేను చేసిన తప్పులు మొత్తం గుర్తుపెట్టుకోవద్దమ్మ" అని ప్రేమగా క్షమాపణ పూర్వకంగా వాళ్ళ అమ్మ ముందు దక్షిణగా వచ్చిన మొత్తాన్ని పెట్టాడు. ఆనంద పడుతున్న కన్నతల్లి... "నీ డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అయినా ఇప్పటిదాకా ఏమి ఇవ్వని నువ్వు ఇప్పుడు ఇవ్వటం ఎందుకు?" అని కరాఖండిగా చెప్పింది.
అదే ఇదివరకైతే హరసిద్దుడు వాదన ప్రతివాదన చేసేవాడు.
తను ఇంకా ఎంతో సాధించబోతున్నానో, తనకు ఇంకా ఏదో గొప్పది రాబోతుందో గుర్తుచేసుకుని.."లేదమ్మా ఇలాంటివి ఇంకా చాలా వస్తాయి. ఇప్పుడే నా సమయం మొదలైందని" ఆప్యాయంగా పలికి, తనకు ఆకలి వేస్తుంది ఏమన్నా పెట్టవలసిందిగా అడిగాడు.
హార సిద్ధుడు మనసులో "తన తల్లి త్వరలో తన వైభవాన్ని చూసి మురిసి పోతుంది అలా అయినా నాడే... అందరి మనసులు గెలుచుకుంటాను" అని అనుకున్నాడు.
చూద్దాం ఏం జరగబోతుందో... హర సిద్దు ఎంతో మంది మనసులు గెలుచుకోవాలి... మరి అతని కథ ఏ మలుపు తిరుగుతుందో...
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment