ఏమి సేతు నిందుకు మందేమైన బోయ రాదా...
వివరణ: డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0335-03 సం: 04-204
పల్లవి: ఏమి సేతు నిందుకు మందేమైన బోయ రాదా
సామజగురుడ నీతో సంగమొల్ల దేటికే
చ.1: మాయలసంసారము మరిగిన కర్మము
ఈయెడ నిను మరుగ దేటికో హరి
కాయజకేలిపైదమిగలిగిన మనసు
కాయజుతండ్రి నీపైగలుగ దిదేఁటికే
చ.2: నాటకపుగనకము నమ్మినట్టిబదుకు
యేటికి నీభక్తి నమ్మదేలే హరి
గూటబడే పదవులు గోరేటిజీవుడు
కూటువైననిజముక్తి గోరడిది యేఁటికే
చ.3: పాపపుణ్యములకె పాలుపడ్డ నేను
యేపున నీపాలజిక్క నేలకో హరి
శ్రీపతివి నాలోని శ్రీవేంకటేశుడ
నీపేరివాడ నాకు నిండుమాయ లేటికే
భావం
పల్లవి:
సామజగురుడ(ఏనుగును కాపాడినవాడా !)వేంకటేశ్వరా ! ఏమి చేయాలో అర్థం కావటంలేదు. నీతో కలిసి ఉండటానికి నాకు ఇష్టం కావటంలేదు. ఎందుకంటావ్? ఇలా కాకుండా ఉండాలంటే మందేమైనా ఉంటే నా చేత తాగించు.
చ.1:
ఓ హరీ !ఈ మాయలసంసారమును మరిగిన(మోహించు) కర్మము నిను మరగదెందుకు?
కాయము నుండి పుట్టిన మన్మథుని ఆటపై(రతికేళి) ఆసక్తి కలిగిన నా మనస్సు- కాయము నుండి పుట్టిన మన్మథుని తండ్రివైన నీపై ఆసక్తి చూపించదు ఎందుకు?
చ.2:
ఓ హరీ ! నాటకాలాడించే బంగారమును నమ్మినట్టి బతుకు ఎందుకు నీభక్తిని నమ్మదు?
జీవితాన్ని ఒక దారిలోపడేటట్లు చేయు , స్థిమితపడేటట్లు చేయు పదవులు కోరే జీవుడు శుభముల పోగయిన నిజముక్తిని కోరడు. ఎందుకో !
చ.3:
శ్రీ హరీ ! పాపపుణ్యముల స్వాధీనమైన నేను- నీ స్వాధీనము కాను. ఎందుకో?
శ్రీపతివి నువ్వు.నాలోని శ్రీవేంకటేశుడ!నీ పేరు పేర్కొనువాడను. నాకు నీ నిండుమాయలు ఎందుకు? ( మాయలు తొలగించమని ప్రార్థన)
***
No comments:
Post a Comment