ముక్కెర - అచ్చంగా తెలుగు

ముక్కెర

Share This
 ముక్కెర
జొన్నలగడ్డ సౌదామిని
 
అమ్మా, ఉయ్యాలలో కూచుని ఊగుతున్న నీ వైభవం ఏమని చెప్పేది. ఆభరణాలు అన్నీ పెట్టుకుని చక్కగా సింగారించుకుని కూచున్నావు, కానీ నామనస్సు మట్టుక్కు నీ ముక్కెరని చూసిన దగ్గర నుంచీ వలయాకారంలో ఉన్న దాని చుట్టూనే  తిరుగుతూ ఉన్నది.,  అంతులేనిది అయినా, నీ అదుపాజ్ఞలలో ఉన్న  సంసార చక్రానికి గుర్తుగా నీ చేత ధరింపబడిన ఈ చక్రాకారంలో  ఉన్న ఈ ముక్కెరకు మా నమస్కారాలు.

అమ్మా, నీ ముక్కెరలోని నవరత్నాలు, నవ గ్రహాల కాంతిని అధికరించి ప్రకాశించటం చూసి, తామే లోకానికి వెలుగుని ఇచ్చి రక్షిస్తున్నామని అనుకునే సూర్యాది దేవతలు అందరూ నీ పదపల్లవాలని పూజించి తమ పదవులని రక్షించుకోవటానికి బారులుకట్టి
ఉండగా, వారిని తగువిధంగా కరుణించే నీ ముక్కెర  కాంతులకి వినతులు 

అమ్మా, నీ ముక్కెరకి ఉన్న చిన్న చిన్న గజ్జెలు సన్నసన్నని, వినీవినపడని ధ్వనులు చేస్తుంటే, వాటిపై కోపంతో కాలికి ఉన్న మంజీరాలు ఆ సన్నసన్నని శబ్దాలు వినపడకుండా చేస్తాయి. నిద్రాసమయం కాగానే నువ్వు ఆ మంజీరాలని త్యజించి స్వామి దగ్గరకు వెళుతుంటే అప్పుడు విజయగర్వంతో సన్నసన్నగా ధ్వనించే నీ ముక్కెరలోని గజ్జెలకి మా జోహార్లు.

అమ్మా, బంగారం అన్నిటినీ శుభ్రపరుస్తుందని పెద్దలు చెబుతారు. నీ ముక్కెరని చూస్తే అది నిజమని తెలుస్తోంది. నువ్వు గాలి పీల్చుకుంటే ఆ గాలిని నీ ముక్కు మొదట్లోనే ఉన్న ముక్కెర శుభ్రపరచి నీలో ఉన్న లోకాలకి మంచి గాలిని అందిస్తుంది. అలాగే నువ్వు గాలి వదిలినప్పుడు బయట ఉన్న లోకాలకి ఇబ్బంది కలగకుండా, ఆ గాలినీ శుభ్రపరచి మంచి గాలిని అందిస్తుంది. ఇలా లోకాలని రక్షిస్తూన్న నీ ముక్కెరకి వందనం

అమ్మా, నువ్వు ఉయ్యాల ఊగుతూ  ముందుకు వచ్చినప్పుడు నీ ముక్కెరలోని వజ్రం మీద కాంతి పడి, అది అనన్య సామాన్యంగా ప్రకాశించి నీ ముఖ మండలాన్ని శోభాయమానంగా చేస్తుంది. అప్పుడు ఆ ముఖ మండలం సర్వ జగత్తునీ  వెలుగులో నింపి కార్యోన్ముఖం చేస్తుంది. నీఉయ్యాల ఊగుతూ వెనుకకి వెళ్ళినప్పుడు, నీ ముక్కెరలోని వజ్రం మీద కాంతి పడక, అది మెరవదు. దాంతో జగత్తంతా అంధకార బంధురంగా మారిపోతుంది. ఇలా, సృష్టికీ, ప్రళయానికీ ఆధారమైన నీ ముక్కెరకి ప్రణామాలు.

అమ్మా, కాంతి అంటే, సూర్య, చంద్రుల పేరు చెబుతారు, వారు లేకపోతే దీపకాంతిని చెబుతారు. ఇవేవీ లేకపోతే ఎల్లా అంటే బుద్ధి అంటారు. కానీ, సూర్య చంద్రులకీ, బుద్ధికీ ఆధారమైన ప్రకాశం ఒకటుందనీ, అది నీ ముక్కెరలోంచి వెలువడుతుందనే విషయం ఎవరికి తెలుసు?. అటువంటి స్వయం ప్రకాశవంతమైన నీ ముక్కెరకి నమస్సులు.

అమ్మా, ముక్కెరలో భాగంగా,  ముక్కుకి మధ్యలో పెదవులకి పైన, ముక్కు దూలం కింద వేలాడుతున్న చిన్న రత్నపు తునుక ఎంత మహనీయంగా ఉంది తల్లీ. భక్తులపై దయతో నువ్వు చిందించబోయే అమృతపు  బిందువు లాగా, నీ తండ్రి హిమవంతుడు వివాహవేళ నీకు ఇచ్చిన ఈ రత్నం సకల రత్న రాశులనీ తృణీకరించి వెలుగుతున్నది. అటువంటి ముక్కెరకి దండాలు.

అమ్మా, ముక్కు దూలం కింద వేలాడుతున్న రత్నానికి కొద్దిగా క్రిందుగా వేలాడుతున్న ముత్యం గురించి ఏమి చెప్పను?. ఒక్క క్షణం, నీ తలమీద ఉన్న పూర్ణ చంద్రుడు జారి ముక్కు కిందకు వచ్చేశాడా అన్నట్టుగా ఉన్నది. స్వఛ్ఛంగా, నీ భర్త శరీరం రంగుకు సామ్యమైన రంగుతో ఆ ముత్యం, నీ భర్త, నిన్ను ప్రకాశింపజేయడానికి తనే ఒక మంచి ముత్యంగా మారాడా అన్నట్టున్నది. పైన రత్నమూ, క్రింద ముత్యమూ అలా వేళ్ళాడుతూ ఉంటే ఎర్రటి నువ్వూ, తెల్లటి శివుడూ పక్కపక్కన కూర్చున్నట్టు ఉంది. అటువంటి ముక్కెరకి మరీమరీ నమస్సులు 

ముక్కెర అష్టకం సంపూర్ణం

No comments:

Post a Comment

Pages