చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 10 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 10

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 10

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene

 


(చంద్రమణి కోటను విదేశీయులు నిర్మించారని, ఒక వ్యక్తి కందకంలో మునిగి చనిపోవడంతో కోట నిర్మాణం మధ్యలో ఆగిపోయిందని, నాటినుండి ప్రజలు దానిని పట్టించుకోలేదని, కానీ అప్పుడప్పుడు పోలీసులు ‌తనిఖీ చేస్తుంటారని, గతంలో ఆ ప్రాంతాన్ని చంద్రమణి‌ లోయ అనేవారని, అది డీప్ రివర్ గా ఎలా మారిందో తనకు తెలియదని హేంస్టెడ్ వాళ్ళకి చెబుతుంది. మాటల మధ్యలో హోర్టన్ విషయం కూడా చెబుతుంది. నాన్సీ, బెస్ తిరిగి ఊరి జంక్షన్ కి వచ్చినప్పుడు ‌జార్జ్ కలుస్తుంది. సీమన్ కారులో వెళ్ళిపోయాక తాను వెనక్కి వస్తుంటే ఎవడో తనను వెంబడించాడని, అతన్ని తప్పించుకొనుటకు తాను ఈ హోటల్లో దూరానని జార్జ్ చెబుతుంది.  తరువాత.....)


@@@@@@@@@


"అతను చూడటానికి ఎలా ఉంటాడు?" బెస్ అడిగింది.


  "అతను చాలా సన్నగా ఉన్నాడు.  నిజానికి, రివర్ హైట్స్ లో నిన్ను వెంబడించిన వ్యక్తి యితనేనని నాకు అనిపించింది నాన్సీ!" జార్జ్ చెప్పింది.  అకస్మాత్తుగా కిటికీలోంచి బయటకు చూసిన ఆమె, "అదిగో! అతను వెళ్తున్నాడు.  చూడు!" అని అరిచింది.


  నాన్సీ, బెస్ వేగంగా కిటికీ దగ్గరకు పరుగెత్తారు.  కానీ ఆ వ్యక్తి హడావిడిగా రోడ్డు మీదకు వెళ్ళిపోయాడు.  


  "అతను నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిలా అనిపిస్తున్నాడు" ఉత్సాహంగా అంది నాన్సీ.


@@@@@@@@@@


"ఆ మనిషి నీకు తెలుసా?" జార్జ్ ప్రశ్నించింది.


    నాన్సీ ఎంతగా ఆలోచించినా, అతనెవరో గుర్తు రావటంలేదు.  "అతని ముఖం నాకు బాగా తెలిసినట్లే అనిపిస్తోంది.  బహుశా అది తరువాత గుర్తుకు రావచ్చు.  ముందు అతని వెంటబడి, అతనెవరో తెలుసుకోగలమేమో చూద్దాం."


  జార్జ్ భోజనం బిల్లు చెల్లించాక, వారు ఆత్రుతగా వీధిలోకి వచ్చారు.  వారు వెతుకుతున్న అపరిచితుడు ఎక్కడా కనిపించలేదు.  ముగ్గురు యువ గూఢచారులు దారిలో యింకా తెరిచి ఉన్న దుకాణాల్లోకి, రోడ్ల కూడలి వద్ద నిలబడి ఆ చివరినుంచి ఈ చివరకు కళ్ళతో గాలించారు.  ఆ వ్యక్తి మాయమయ్యాడు.  


  "సరె! మనం కూడా యింటికి పోవచ్చు.  నాకు నిద్ర ముంచుకు వస్తోంది" అంది నాన్సీ.


  "నాక్కూడా!" అంటూ బెస్ ఆవలించింది.


  మోటెలుకి తిరిగి వెళ్ళే దారిలో, మరునాడు తెల్లవారుజామునే తాను కోటను చూడాలనుకొంటున్నట్లు నాన్సీ చెప్పింది.  "ఆ ప్రాంతం నన్ను పట్టి లాగుతోంది.  బహుశా అక్కడేదో మిస్టరీ ఉండి ఉంటుంది."  


  "జోనీ హోర్టన్ని కనుక్కోవటానికి మనం ప్రయత్నిస్తామని నేను అనుకొన్నాను" బెస్ అంది.  "ఆ అమ్మాయిని కోటలో దాచారని నువ్వు అనుకొంటున్నట్లు నాతో చెప్పొద్దు!"


  నాన్సీ నవ్వింది.  "లేదు. ఇన్నేళ్ళ తరువాత కూడా ఆమె అక్కడే ఉండదు.  అల్పాహారం ముందు మనం కోటను చూడటానికి వెళ్దామని సూచిస్తున్నాను.  తరువాత మనం బాంకుల వద్ద, న్యాయవాదుల కార్యాలయాల వద్ద మన పరిశోధన ప్రారంభించవచ్చు."  


  ముగ్గురు స్నేహితురాళ్ళు పెందలకడనే నిద్ర లేచారు.  తమ కారుని నిలిపి ఉంచిన చోటికి వెళ్తున్న వాళ్ళు లోయ ప్రాంతాన్ని చూడటానికి ఆగారు.  సూర్యుడింకా పైకి రాలేదు.  కొండ కింద కొన్ని ప్రాంతాలింకా చీకటిలోనే ఉన్నాయి.  అయితే, కోట మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.


"అమ్మాయిలూ!  కోట గోడకు ఆనుకొని ఉన్న ఆ కందకం వంతెన కిందకు దించబడింది" ఆశ్చర్యంతో అరిచింది నాన్సీ.


  "కానీ ఆ ప్రాంతమంతా ఖాళీగా ఉండాలి!" బెస్ అంది.  "ఇదేదో ఖచ్చితంగా భయానక విషయమే!"


  మిగిలినవాళ్ళు ఆమె వాదనకు అంగీకరిస్తూ, విస్మయంతో అటువైపు కన్నార్పకుండా చూస్తున్నారు.  వంతెన ఈ స్థితిలో ఎందుకు ఉంది? ఎవరు దాన్ని కిందకు దించారు?  


  "దానంతట అదే పడిపోయి ఉండాలి?" నాన్సీ సూచించింది.    


   "కావచ్చు" అంది జార్జ్.  "లేదా కొంతమంది సందర్శకులు లోపల ఉండి ఉండవచ్చు.  ఎండిపోయిన కందకంలో దిగి అటు వెళ్ళి, ఆ వంతెనను కిందకు దించి ఉంటారు. తద్వారా వాళ్ళు దానిపై వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది కదా!"


  "ఇది తార్కికమైన వివరణ" నాన్సీ అంగీకరించింది.  "సరె! మనం వెళ్దామా?"   


    అమ్మాయిలు నాన్సీ కారులోకి ఎక్కగానే, ఆమె కొండపైనుండి దిగువన ఉన్న పట్టణం వైపు పోనిచ్చింది.  డీప్ రివర్ ప్రాంతంలో ఎక్కువమంది ప్రజలు వారికి కనపడలేదు.  ఆ వేళకి రెస్టారెంట్లు యింకా తెరవరని సందర్శకులకు తెలుసు.  


  "మనం అక్కడనుంచి వెనుతిరగక ముందే నేను ఆకలితో మాడిపోతానని నాకు తెలుసు" అని బెస్ ప్రకటించింది. 


  "ఆకలి నిన్నేమీ యిబ్బంది పెట్టదులే" బొద్దుగా ఉన్న బెస్ ను కొలతలు కొలుస్తూ చెప్పింది జార్జ్. 


  బెస్ తిరిగి తిట్టకుండా నాలుక బయటకు పెట్టి వెక్కిరించింది.  నాన్సీ కారును మైలు తరువాత మైలు దాటిస్తూంటే, బెస్ మౌనంగా ఉంది.  "ఈ వాణిజ్య ప్రాంతానికి కోట చాలా దూరంగా ఉందని నాకు తెలియదు" అని మాత్రం వ్యాఖ్యానించింది.  చివరకు ఒత్తుగా గడ్డి పెరిగిన సందు దగ్గరకు వారు చేరుకొన్నారు.  అక్కడనుంచి కోటకు పోయే దారి ఉంది.  


  "టైరు గుర్తులు!" జార్జ్ వేలుతో చూపించింది.  "ఈ మధ్యనే యిక్కడకు ఎవరో వచ్చి ఉంటారు."


నాన్సీ కారుని ఆ సందులో ఒక పక్కకు, కందకానికి కొంచెం దూరంలో ఆపింది.  మరొక కారు టైరు గుర్తులు కందకం మీద వంతెన వరకు కనిపించాయి.  "మనం  కాలి నడకన వెళ్ళటమే మంచిదనుకొంటున్నా!" అందామె.  అమ్మాయిలంతా కారు దిగి ముందుకు నడిచారు.


"వంతెన కిందకు ఉన్నందుకు సంతోషిస్తున్నాను" అంది బెస్.  "ఇటుపక్క కందకంలోకి ఆయాసపడుతూ దిగి, మళ్ళీ అవతల వైపు పైకి ఎక్కటం నాకిష్టం లేదు" 


   ముందు నడుస్తున్న నాన్సీ అకస్మాత్తుగా అరిచింది,  "కందకంలో నీళ్ళు .....  బాగానే ఉన్నాయి."


     వెనుక వస్తున్న కజిన్లిద్దరు కందకం అంచున నిలుచున్న నాన్సీ పక్కకు కంగారుగా వచ్చి నిలబడ్డారు.     


"ఇది చాలా లోతుగా కనిపిస్తోంది," అందామె.  “ఇది కేవలం వాన నీరు మాత్రం కాదు.”


  బెస్ భయపడింది.  "ఇక్కడ ఎవరూ నివసించనప్పుడు, ఈ నీటిని ఎవరు నింపారు?"  


  నాన్సీ తనకు చిత్రంగా అనిపించినట్లు ఒప్పుకొంది.  కానీ తాను కోట వరకు వెళ్ళి చూడాలన్న ఆసక్తిని వదిలిపెట్టలేదు.  అమ్మాయిలు ముందుకు అడుగు వేసేలోగా, వంతెన తిరిగి పైకి లేవటం ప్రారంభమైంది.


"ఓహ్!" బెస్ భయంతో అరిచింది.  "ఈ కోటలో దయ్యాలు తిరుగుతున్నాయి.  ఈ వంతెనని ఒక దయ్యం పైకెత్తుతోంది." 


   "పిచ్చిగా మాట్లాడకు!" జార్జ్ ఆమెను కేకలేసింది.  "పట్టణవాసులు, పోలీసులు దీన్ని నిర్మానుష్య ప్రాంతమని అనుకొంటున్నారు, కానీ నా అంచనా ప్రకారం యిక్కడ ఎవరో దాక్కున్నారు."  


  దాయాదులిద్దరూ ఒకరి అభిప్రాయాన్ని ఒకరు విభేదించినప్పుడు, తాను ఎవరి పక్షాన మాట్లాడకూడదని నాన్సీ చాలాకాలం క్రితమే ఒక నిర్ణయానికి వచ్చింది.  "ఒక విషయం మాత్రం ఖచ్చితం.  ఇప్పుడే మనం దీన్ని చూడాలని ఆశిస్తే, మనం ఈత కొట్టాల్సి ఉంటుంది.  ఇప్పుడు మనం పట్టణానికి తిరిగెళ్ళి, అల్పాహారం తీసుకొందాం.  తరువాత బాంకులు, న్యాయవాదుల వద్దకెళ్ళి మాట్లాడుదాం.  ఆపైన మన స్నానపు దుస్తులను ధరించి యిక్కడకు వద్దాం."  


   ఈ సూచనపై బెస్ ఏమీ వ్యాఖ్యానించలేదు, కానీ ఆమె ముఖ కవళికలను బట్టి తాను ఈ సాహసం చేయటానికి సుముఖంగా లేదని తెలుస్తోంది.  కారు దగ్గరకు తిరిగి వెడుతూ,  కోట మైదానంలో నుంచి తమనెవరైనా గమనిస్తున్నారేమో చూద్దామని  ముగ్గురు స్నేహితురాళ్ళు అకస్మాత్తుగా వెనక్కి తిరిగారు.  అక్కడ ఎవరూ కనిపించలేదు.  ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంది.  


"ఈ కోటలో ఒక వ్యక్తి కన్నా ఎక్కువ మంది దాక్కున్నారేమోనని నాకు అనుమానంగా ఉంది" చెప్పింది నాన్సీ.


అక్కడ కచ్చితంగా ఒకరి కన్నా ఎక్కువ మంది ఉండవచ్చునని జార్జ్ వ్యాఖ్యానించింది.  కారు కందకాన్ని దాటాలనుకొన్నప్పుడు ఆ వంతెనను కిందకు దించుతారు.  అలా కారు కందకాన్ని దాటాక కోట గోడ‌ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరో గొలుసులు కట్టి ఉన్న ఆ‌ వంతెనను తిరిగి కోట గోడను ఆనుకొనేలా పైకి లాగుతాడు.


  "ఓ మిత్రమా!" బెస్ చెప్పింది.  "ఇదంతా గందరగోళంగా అనిపిస్తోంది.  మన గూఢచర్యం నుంచి ఈ వంతెనను ఎందుకు తప్పించకూడదు?"


మిగిలిన అమ్మాయిలు ఆమెకు బదులివ్వలేదు. కానీ నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలో ఏమి జరుగుతున్నదో చూడాలని నాన్సీ, జార్జ్ లిద్దరికీ చాలా ఆసక్తిగా ఉంది.  కందకంలో నీటిని ఎందుకు నింపుతున్నారు, ఎవరు నింపుతున్నారు? కోట లోనికి ప్రజలెవ్వరూ రాకూడదని అలా చేస్తున్నారా?


ఆ‌ అమ్మాయిలు డీప్ రివర్ కి చేరుకోగానే, వాళ్ళు బ్రాస్ కెటిల్ కి వెళ్ళారు కానీ అది యింకా తెరిచి లేదు.  వాళ్ళు వెనుదిరిగి ప్రధాన వీధికి నడిచి వచ్చి, ఆధునికమైన హోటల్ లోనికి ప్రవేశించారు.  వారి అల్పాహారం రుచికరంగా ఉండటంతో, బెస్ లోనికి హుషారు తిరిగి వచ్చింది.  


  వాళ్ళు తినటం ముగించే సమయానికి,‌ దుకాణాలు, ఆఫీసులు తెరుచుకున్నాయి.  నాన్సీ డీప్ రివర్ జాతీయ బాంకు వైపు అడుగేసింది.


(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages