హరికథా పితామహుడు "అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు"
అంబడిపూడి శ్యామసుందరరావు
సంగీతం, సాహిత్యం, నృత్యాల మేళవింపుతో హరికథ ప్రక్రియని సృజించి "హరికదా పితామహుడు " అనే బిరుదుతో ప్రఖ్యాతి గాంచిన నారాయణదాసుగారు సంస్కృతాంధ్రాలలో అనేక రచనలు చేసిన రచయిత, కవి, బహుభాషా కోవిదుడు, తాత్వికుడు. తెలుగు నాటనే కాక ఇతర రాష్ట్రాలలో కూడా హరికథా ప్రదర్శనలిచ్చి, ప్రజల మన్ననలను పొందిన కళాకారుడాయన. "శ్రీమత్", "అజ్జాడ" పదాలు కలిపి "శ్రీమదజ్జాడ నారాయణ దాసు" గురువునకు వందనములు చెప్పడం హరికథారంభంలో ఇప్పటికీ హరికథా కళాకారులు పాటిస్తున్న సంప్రదాయం అయన అసలు పేరు సూర్యనారాయణ హరికధకుడిగా ప్రసిద్ధి చెందాక నారాయణదాసుగా గుర్తింపు పొందాడు. చిన్నతనములో పేదరికము కారణముగా బడికి వెళ్లకపోయినా పద్యాలూ శ్లోకాలు విని కంఠతా పట్టి తిరిగి అప్పజెప్పేవాడుట. ఈయన విజయనగరం జిల్లాలోని బొబ్బిలి వద్ద గల బలిజిపేట మండలములోని ఆజ్జాడ గ్రామములో వేంకట చయనులు,నరసమాంబ దంపతులకు 1864, ఆగస్టు 31న జన్మించారు. ఐదేళ్ల చిరుప్రాయము లోనే భాగవతము లోని పద్యాలూ గడ గడ అప్పజెప్పి పుస్తకాల కొట్టు యజమాని అభిమానాన్ని చూరగొని భాగవత ప్రతిని కొంత దక్షిణను బహుమానముగాపొందాడు. తాతగారి ఇంటివద్ద అరుగు మీద కూర్చుని రాగయుక్తముగాపద్యాలు పాడుతూ ఉంటె తాతగారు ముచ్చటపడి మనుమడిని తన దగ్గరే ఉంచుకొని సంగీతము నేర్పించటం మొదలు పెట్టారురుట ఆ విధముగా సంగీత సాధన, విద్యాభ్యాసము రెంటిని ఓర్పుగా నేర్పుగా చిన్నవయస్సు లోనే సంబాళించు కుంటూ వచ్చాడు. .
.తెలుగు, సంస్కృతం, తమిళం, హిందీ, బెంగాలీ, ఉర్దూ, ఆంగ్లం, అరబ్బీ, పారశీకం భాషలలో ఆయన ప్రావీణ్యం సంపాదించాడు అష్టావధానాలు చేసేవాడు. అచ్చతెలుగులోను, సంస్కృతంలోను, సంస్కృత భూయిష్టమైన తెలుగులోను కూడా వివిధ విషయాలపై శతాధిక గ్రంథాలు రచించిన మహా పండితుడు. అంతకు ముందు తెలుగులో ఉమర్ ఖయ్యామ్ రుబాయితులను వ్రాసినవారు ఎక్కువగా ఎడ్వర్డ్ ఫిడ్జిరాల్డ్ రచించిన ఆంగ్ల రచననే మూలంగా తీసుకొన్నారు. అలా చేయడం వలన మూలగ్రంథాలలోని విషయం సరిగా చూపడం కుదరలేదని తలచాడు ఆదిభట్ల నారాయణదాసు. ఈ విషయం ఋజువు చేయడానికి ఆయన పారశీక భాష లోని మూల గ్రంథం కవితలనూ, ఫిడ్జిరాల్డ్ ఆంగ్లానువాదాన్నీ కూడా అచ్చ తెలుగులోకీ, సంస్కృతంలోకీ వేరు వేరు ఛందస్సులలో అనువదించాడు. 1932లో వెలువడిన ఈ రచన పాండిత్యానికి పరాకాష్ఠగా ఆనాటి సాహితీకారులచే మన్నింపబడింది.మరొక గొప్ప రచన - 1922లో ప్రచురితమైన నవరస తరంగిణి - ఇందులో సంస్కృత మహాకవి, నాటక కర్త కాళిదాసు రచనల నుండి, ఆంగ్లభాషలో ప్రసిద్ధ నాటక రచయిత షేక్స్పియర్ రచనలనుండి నవరసాలను వర్ణించే ఖండికలను తెలుగులోకి అనువదించి చూపాడు.
ఆయన రచనలలో ఉద్గ్రంథంగా చెప్పబడేది జగజ్యోతి అనే తాత్విక రచన. వివిధ భారతీయ తాత్వికుల సిద్ధాంతాలను, దృక్పథాలనూ ఈ గ్రంథంలో వివరించాడు. నాస్తిక వాదాలు కూడా విస్తృతంగా చర్చింపబడ్డాయి.నారాయణదాసు సంస్కృత రచనలలో ముఖ్యమైనవి - మూడు హరికథల కూర్పు హరికథామృతం, స్వతంత్ర రచన తారకం, రెండు శతకాలు రామచంద్ర శతకం, కాశీ శతకము, ఈయన ఋగ్వేదంలోని 300 పైచిలుకు ఋక్కులకు సంగీతాన్ని సమకూర్చి, వాటిని వీణమీద వాయించడం విద్యార్థులకు నేర్పాడు. ఆ ఋక్కులను తెలుగులో గీతాలుగా అనువదించాడు.దశవిధ రాగ నవతి కుసుమ మంజరి అనే పాటలో మంజరి వృత్తంలో 90 రాగాలు కూర్చాడు. అంతవరకూ ఎవరూ సాహసించని ఈ ప్రక్రియ సంగీతంలోనూ, కవితలోనూ నారాయణదాసుకు ఉన్న ప్రతిభకు తార్కాణం నారాయణదాసు సంగీత ప్రతిభ ఆయన సాహితీ ప్రకర్షకు సమస్థాయిలో పరిమళించింది. ఆనాటి సంగీత విద్వాంసులు ఆయనను లయ బ్రహ్మ అనీ, పంచముఖి పరమేశ్వర అనీ సన్మానించారు. ఒకేమారు ఐదు తాళాలకు అనుగుణంగా పాడడం ఆయన ప్రత్యేకత.
నారాయణ దాసు ఆనంద గజపతి రాజు గారి ఆస్థాన విద్వాంసునిగా ఉన్నప్పుడు ఒకసారి సభలో ఆయన దాసును ఏదో రాగం పాడమని అడిగాడట. కానీ ఆయన నేను పాడను అని సభలో నుండి వెళ్ళిపోయాడట. రాజు గారు కూడా దానికి ఏమి కోపం తెచ్చుకోలేదు. ఐతే తరువాత ఆయన వ్యాయామశాలలో వ్యాయామం చేస్తున్నప్పుడు, ఎందుకో ఆ రాగం గుర్తుకు వచ్చి, పాడడం మొదలుపెట్టారట. నిమిషాలు గడుస్తున్నాయి గంటలు గడుస్తున్నాయి. చుట్టూరా జనాలు ఉన్నారు. కానీ ఇవేవీ పట్టించుకొనే స్థితిలో లేడు నారాయణ దాసు చివరికి పాడడం అయిన తరువాత చూసుకుంటే ఒంటి మీద కేవలం గోచీ తప్ప ఏది లేదట. ఆ రాగం విన్న ప్రజలంతా ఆనందంతో ఇంటికి వెళ్ళిపొయారు. వెళ్ళిపోయిన ఆ జనంలో, ఆనంద గజపతి రాజు కూడా ఉన్నాడట
అయితే నారాయణ దాసుగారికి మాత్రమే ప్రత్యేకమైన హరికథని వెలుగులోకి తెచ్చింది మాత్రం జయంతి రామదాసు గారు అతని ప్రోద్బలంతో, మొదటి హరికథా కాలక్షేపానికి రంగం సిధ్ధమైంది. మొదటిది రాజమండ్రిలో ఏర్పాటు చేశారు. ఇప్పటిలా కరెంటు లేదు. మైకులు, సౌండ్ బాక్స్ లు లేవు. ఉన్నదల్లా, ఇసుక వేస్తే రాలనంత జనం, మధ్యలో వేదిక మీద నారాయణ దాసు. అంతే ఉన్నట్లుంది మ్రోగింది కంచు కంఠం . ఊరంతా ఉలిక్కిపడింది. గంభీరమైన ఆకారం, ఒక చేతిలో చిడతలు, కాళ్ళకి గజ్జెలు. అలా మొదటి హరికథకి అంకురార్పణ జరిగింది.ఇక ఆ తరువాత నారాయణ దాసు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అతని ఖ్యాతి వాడవాడలా వ్యాపించింది.. మైసూర్ మహారాజు గారి నుండి ఆహ్వానం అందింది. మైసూర్ రాజా హరికథకి ముగ్ధుడైపోయాడు. దీనితో పాటు, వీణాగానం కూడా అడిగి మరీ విన్నాడు. పెద్దయెత్తున బహుమతులు సమర్పించాడు. కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి నారాయణదాసు హరికథ అనే కళను అత్యున్నత శిఖరాలకు కొనిపోయాడు. ఈ మూడింటి కలయికకూ భక్తి అనే భావం ప్రాణంగా హరికథలు రచించాడు, చెప్పాడు నేర్పాడు ఆయన హరికథ వినడం ఒక గొప్ప అనుభూతిగా అప్పటివారు చెప్పుకొనేవారు. మొత్తం ఆయన తెలుగులో 17, సంస్కృతంలో 3, అచ్చతెలుగులో ఒకటి హరికథలను రచించాడు ఒకసారి నారాయణదాసు కలకత్తాలో శ్రీకృష్ణ జన్మ హరికథను సంస్కృతంలో గానం చేసి హిందీలో భావాన్ని వివరించాడు.హరికథా గిరికధా అని హేళనగా మాట్లాడినవాళ్లకు గిరి (కొండపై)హరికథ చెప్పి మెప్పించిన ఘనుడు నారాయణ దాసు గారు.
1919లో అప్పటి విజయనగరం మహారాజు స్థాపించిన శ్రీ విజయరామ గాన పాఠశాలకు మొదటి ప్రధానాధ్యాపకునిగా నారాయణ దాసును నియమించారు. ప్రసిద్ధ వయొలిన్ విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ఈయనకు సహాధ్యాపకునిగా ఉన్నాడు. ఎందరో ప్రముఖ కళాకారులు ఈ విద్యాసంస్థనుండి ఆంధ్రదేశానికి లభించారు. వారిలో ప్రముఖ నేపధ్య గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు ఒకడు. నారాయణ దాసు ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలో చదువుకొన్నామని చెప్పుకోవడం అప్పట్లో ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు నారాయణ దాసు హిందూస్థానీ భైరవి రాగాలాపనను గురుదేవులు రవీంద్రనాథ టాగూరు ఎంతగానో ప్రశంసించాడు. ఈ విజయనగరం కళాశాల పాఠ్యాంశాలు శాంతినికేతన్ లో ప్రవేశ పెట్ట బడ్డాయి ఈయన సకల కళా నైపుణ్యానికి ముచ్చటపడిన బ్రిటీష్ వారు ఆయనను నోబుల్ పురస్కారానికి నామినేట్ చేద్దామనుకున్నారట. కానీ నారాయణ దాసు ఒప్పుకోలేదట. తన జీవితం మొత్తం, తాను జన్మించిన తెలుగు గడ్డకి తన వంతు సేవ చేసి, 1945, జనవరి 2వ తేదీన మరణించాడు.
No comments:
Post a Comment