మారుతి శతకము - గోపీనాథ వేంకట కవి - అచ్చంగా తెలుగు

మారుతి శతకము - గోపీనాథ వేంకట కవి

Share This

మారుతి శతకము - గోపీనాథ వేంకట కవి

దేవరకొండ సుబ్రహ్మణ్యం 



కవి పరిచయం:

మారుతీ శతకకర్త శ్రీ గోపీనాథము వేంకటకవి క్రీ.శ. 1813 శ్రీముఖ నామ సంవత్సరమున జన్మించారు. తండ్రి గోపీనాథము పద్మనాభ శాస్త్రి. ఈశతకము కవి తన 16వ ఏట రచించినట్లు తెలుస్తున్నది. ఈశతకము సంపూర్ణ మారుతీ చరిత్రగా భావించవచ్చును. 116 శార్ధూల మత్తేభవృత్తాలలో రచించిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది.

ఈకవి తన ఇరవైయ్యో ఏట శ్రీమద్రామాయణ రచన ప్రారంభీంచి దాదాపు నాలుగు సంవత్సరములలో పూర్తిచేసెను తరువాత ఈ రచన 21 సంవత్సరములు దేవతార్చనలో పెట్టి పూజించుచుండిరి. తరువాత వేంకటాగిరిరాజులు ఈరామాయణ నకలు రాయించుకొని వారి వద్దాఉంచుకొని పూజించిరి. ఈరామాయణమును రెండుమార్లు శ్రీమద్రామాయణము పేరున ముద్రించిననూ వావిళ్ళవారు ఈ రామాయణాన్ని గోపీనాథ రామాయణముగా ముద్రించిరి. అప్పటి నుండి ఈరామాయణము గోపీనాథ రామాయణముగా ప్రసిద్ది చెందింది.

ఈకవి 1. శ్రీమద్రామాయణము, 2. శ్రీకృష్ణ జన్మఖండము, 3. భగద్గీతా శాస్త్రము, 4. శ్రీరామ స్థవము, 5. బ్రహ్మానంద శతకము, 6. శిశుపాలవధము (మాఘకావ్యము) 7. శ్రీరాధికా పరిణయము, 8. తిరునాళదండకము

ఈకవి క్రీ.శ. 1890 ప్రాంతాల పరమపదించినట్లు తెలుస్తున్నది.


శతక పరిచయం:

మారుతీశతకము ఆంజనేయిని చరిత్రము బాల్యముమాదిగా వర్ణితము. వీర రౌద్ర, భయానకములు ఇందలి రసములు.దీనికి అనుగుణముగా మత్తేభ, శార్ధూల వృత్తములలో 116 పద్యములలో కవి ఈశతకాన్ని వ్రాసినాడు. ఈశతకము నందు కావ్య లక్షణములు, కల్పనాచాతురి, ధారాశుద్ధి కలిగి దండక క్రియల భావములు పారాయణమున కనువుగా ఉండి స్వతంత్ర భావనా సముల్లాసితమై అలరారుతున్నది.


కొన్ని పద్యాలను చూద్దాము.


మ. అనఘా, నీవు జనించి నప్పుడె సముద్యద్భూరితేజంబునన్

వినివీథిం గనుపట్టు బాలరవి సద్బింబంబు నీక్షించి యె

ఱ్ఱని పందంచు గ్రసింప బత్రిపతిలీలన్ వేడ్క మున్నూరు యో

జబముల్ మింటికి దాటితౌఁ ద్రిభువనశ్లాఘుండవై మారుతీ!


మ. నిజగర్భస్థితశైవతేజము, సమున్నిద్రాత్మ తేజంబుఁ గూ

డ జగత్ప్రాణుఁ డమోఘ కేసరివనాటక్షేత్రమం దర్ధి నిం

చ జయశ్రీ మహిమాప్తి నయ్యుభయతేజంబుల్ రహిన్ మిశ్రమై

త్రిజగంబుల్ గొనియాడ బుట్టితివి గాదే నీ విలన్ మారుతీ!


మ. ఒక పాదంబు మహోదయాచలముపై నొప్పారఁగా నుంచి వే

ఱొక పాదం బపరాద్రి మీఁద నిడి యయ్యుష్ణాంశుచే బల్విడన్

సకలామ్నాయము లభ్యసించిన భవచ్చాతుర్య మే మందు దా

వక దివ్యోరుతర ప్రభావము నుతింపన్ శక్యమే? మారుతీ!


మ. తనపత్నిం దిలకింపుచున్ నిబిడకాంతారోర్వి వర్తించు రా

మ నరేంద్రోత్తము పాలి కర్కజుఁడు పంపం భిక్షు వేషంబునన్

జని, సుగ్రీవుని చందముం దెలిపి యాక్ష్మానాథు దోడ్తెచ్చి మె

ల్లన నయ్యిద్దఱకుం ధనంజయుని మ్రోలన్ సఖ్యసంబంధమున్

వినయంబొప్పఁ ఘటింప జేసినది నీవే కాదొకో మారుతీ!


శా. లేరా కీశులనేకులుం? ద్రిజగముల్ వీక్షించి రా నేర్పరుల్

గారా? రాముఁడు జానకిన్ వెదక వీకన్ గీశులం బంపుచో

నారూఢిన్ భవదీయ దివ్యమహిమ వ్యాపారముల్ సూచి కా

దా! రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్ మారుతీ!


సీతాన్వేషణ సంఘటనలు ఎంత మధురంగా అందరికి సులువుగా అర్థం అయ్యేట్లుగా చెప్పారో చూడండి.


మ. శరధిం గాంచి యలంఘనీయ మని తత్సంతారణాదక్షులై

వరుసన్ గీశులు భీతిచేఁ గళవళింపన్ వారి వారించి ని

న్నూరుపాథోధివిలంఘనక్షమునిఁగా నూహించి ధీమంతుఁడా

పరమేష్ఠిప్రియపుత్రుఁడంచితగతిన్  బ్రథింపడే మారుతీ!


శా. "ఏలా మీకు భయంబు నేఁ గలుగ మీ రిందుండుఁ డే నొక్కఁడన్

వాలాయంబు పయోధి దాటి యనువొందన్ లంకలో జానకిం

బోలం గన్గొని వత్తు నిత్తు బరమామోదంబు మీ" కంచు ధై

ర్యాలాపంబులు పల్కి తేర్చితివి గాదా కీశులన్ మారుతీ!


మ. స్థిరత్వంబున శైలరాజము ధరిత్రిం గ్రుంగఁ బాదంబు లూ

ది రహిన్ భూరిభుజోరు వేగమున ధాత్రిజాతముల్ పెల్లగి

ల్లి రయం బారఁగఁ దోడ రా గగనమున్ లీలగతిన్ మ్రింగ సు

స్థిరశక్తిం జనుమాడ్కి దాటితివి గాదే నింగికిన్ మారుతీ!


శా. చాయాగ్రాహణి నామరాక్షసి సరస్వ న్మధ్యమం దుండి నీ

కాయచ్చాయను బట్టి వేఁ దిగువం దద్గర్భంబు భేదించి త

త్కాయంబుం గలుగంగ వైచిన నినున్ వర్ణించెదన్ మారుతీ!


శా. మైనాకంబు నతిక్రమించి సురసన్ మన్నించి యాసింహికా

ఖ్యానన్ రాక్షసిఁ గీటడంచి నడుమన్ గాలూద కస్తాద్రికిం

భానుం డేగకమున్నె మారుతగతిన్ వారాశి నూఱామడన్

గ్లానిం జెందక దాటి తీవు సురసంఘం బెన్నఁగ మారుతీ!


ఈశతకములోని సుందరాకాండ పద్యములన్నీ అత్యంత మనోహరముగా ఉంటాయి.


మ. చలమొప్పన్ దశకంఠరాక్షసనివేశంబుం బ్రవేశించి యం

దు లతామందిరముల్ దివాగృహకముల్ తోరంపుక్రీడాగృహం

బులు చిత్రావసదంబులున్ మణిగృహంబులున్ చారుశ్య్యాగృహం

బులు వీక్షింపుచు నంతటన్ వెదకవే భూపుత్రికన్ మారుతీ!


మ. కమనీయోన్నత పుష్పతల్పముపయిం గన్మూసి గుర్వెట్టు పం

క్తిముఖున్ నీలఘనాభదేహు గని తత్తేజంబునన్ రత్నఁదీ

పంబులం దద్గృహ మెల్ల వెల్గు చునికిన్ భావంబునన్ మెచ్చుచున్

సముదంచద్గతి నచ్చటన్ వెదకవే క్ష్మాపుత్రికన్ మారుతీ!


మ.వనముఙ్మండలి జొచ్చు చంద్రుని గతిన్ బ్రచ్చన్నవేషంబుతో

వనముం జొచ్చి లతాగృహోత్కార తరువ్రాతంబులన్ దీర్ఘికల్

ఘనసౌధంబులు చూచుచున్ జని మరుత్కాల్పుండవై శింశుపా

ఖ్యనగారోహణ మాచరించితివి గదా నేర్పునన్ మారుతీ!


మ. కమనీయాకృతి శింశుపాఖ్యతరుశాఖాపర్ణలీనుండవై

యమరారాతి దశాస్యు డన్న కటుక్రూరాలాపముల్ రాక్షస

ప్రమదల్ వల్కు దురూక్తు లంత త్రిజటాస్వప్నప్రకారంబు న

య్యమ గావించు విలాపమంతయును నీ వాలించవే మారుతీ!


బ్రహ్మాస్త్రమునకు కట్టిబడి రావణ సభకు తేబడిన హనుమంతుడు రావణునితో పలికిన పలుకులు చూడండి.


శా. "ఓరి రావణ! నేను రామనృపవంశోత్తంనుదాసుండ నా

శూరాగ్రేసరుపత్ని నీవు వనిలో జోరుండవై తెచ్చి త

న్నారీరత్నము నిమ్ము రాఘవునకున్ గాకున్న నీ వింక త

ద్ఘోరాస్త్రంబులఁ జత్తు వాజి" నని నీతుల్ దెల్పవే మారుతీ!


శా. "బాలారత్నము సీతి మ్రుచ్చి లిటు నీ పాలింటికిన్ మృత్యు వం

చాలోచింపక దెచ్చి తింత కెపుడో తద్దేవి కోపానల

జ్వాలాళిం బడి భస్మమై చనక నిన్ జంపింప నిందాక ని

ట్లాలస్యం బొనరించె నం చనవె దేవారాతితో మారుతీ!


మ. శరధిం దాటి దశాస్యుప్రో లమరు లెంచం జొచ్చి సర్వంసహా

వరజం గాంచి యశోకకాననము విధ్వంసంబు గావించి కొం

దఱ దైతేయులఁ జంపి వెండి జలధిన్ లంఘించి శీఘ్రంబె యు

త్తరతీరస్ధ నగంబు జేరితివి గాదే బల్విదన్ మారుతీ!


రామరావణా సంగ్రామమునందు మారుతీ పాత్ర అమోఘ ము కదా!! అందునా సంజీవినీ పర్వతము తెచ్చి అందరిని బ్రతికించిన ఘట్టము మొదలైన సంఘటనలు ఈ కవి అత్యంత మనోహరం గా వర్ణించినాడు.


మ. హరివంశోత్తమ! నీవు చేసిన విచిత్రాచింత్యకార్యంబు లా

హరియైనన్ హరుఁడైన పంకజభవుఁడైనన్ దిగీశుల్ పురం

దరుఁడైనన్ నిఖిలాహిలోకపతులైనం జేయఁగా లేరు నీ

సరివారెవ్వరు లేరు ముజ్జగములం జర్చింపఁగా మారుతీ!


చివరి 16 పద్యములలో ఈకవి హనుమాన్ చాలీశా యందలి పద్యములకు అనువాదరూపముగా చక్కని కూర్పు చేసినాడు.


మనోహరమైన పద్యములతో, చక్కని భావగర్భితమైన పదములతో సంపూర్ణ మారుతీ చరిత్రని ఈ కవి ఈశతకంలో మనకు అందించాడు.


అద్భుతమైన ఈ శతకం అందరు తప్పక చదవవలసినది. మీరుకూడా చదవండి. మీ మిత్రులచే చదివించండి.

No comments:

Post a Comment

Pages