పురాణ కథలు - బసవ పురాణం - 18 - అచ్చంగా తెలుగు

పురాణ కథలు - బసవ పురాణం - 18

Share This

 పురాణ కథలు - బసవ పురాణం - 18 

 సేకరణ: పి.యస్.యమ్. లక్ష్మి


18.  శంకర దాసయ్య కథ

మాచయ్య బసవేశ్వరునికి అహంభావం వల్ల వాటిల్లే కష్టాలను గురించి చెప్తూ మరొక భక్తుడి గురించి ఇలా చెప్ప సాగాడు.  పూర్వం జడయ శంకరమనే స్ధలంలో శంకరదాసు అనే పేరుగల గొప్ప భక్తుడుండేవాడు.  అతడు వీర శైవుడు.  ప్రత్యక్ష ఫాల నేత్రము కలవాడు.  శివ పూజా దురంధరుడు.  అతను బొంతలు కుట్టి దుకాణంలో  అమ్మి వచ్చే పైకంతో ఐదు మానికల వడ్లు తెచ్చేవాడు. వాట్లతోనే అనేకమంది జంగమ భక్తులకు సంతర్పణ చేస్తూ వుండేవాడు.

ఈ శంకర దాసయ్యని పరీక్షించాలని ఒకసారి దేవరదానయ్య అనే మఠాధిపతి  అనేకమంది శిష్యులతో శంకర దాసయ్య దగ్గరకువచ్చి ఆయన ఆతిధ్యానికి మిగుల సంతసించి తన మఠమునకు వెళ్ళి ఆయన భక్తి, సంతర్పణల గురించి పొగిడి ఎంతో దయతో ఆయనకి సహాయం చేయబోయిన వాడివలె దుగ్గళ్ళవ్వ అనే ఆవిడని పిలిచి,  శంకర దాసయ్య ఇంట్లో కోడెకి తవుడు లేదు.  అందుకని నువ్వొక తట్టెడు తవుడు తీసుకెళ్ళి వాళ్ళింట్లో ఇచ్చిరా అని అప్పటికప్పుడు మండుటెండలో ఆవిడని పంపించాడు.  అది చూసి శంకర దాసయ్య చాలా సంతోషించినవాడివలె,
ఓహో, దేవర దానయ్యగారు నాయందు దయ తలచి గంపెడు తవుడు పంపించారు.  మమ్మల్నేమి కోర దలిచారో.  కూలివానికి కోక ఇచ్చి కొన్న తవుడిది అని ఒక చెయ్యి ఆ గంపలో పెట్టి తవుడు పైకి తియ్యగా, ఆ గంపలోని తవుడంతా అతని చేతికి వచ్చింది.  దానితో దేవర దానయ్య దగ్గర వున్న యావదాస్తి కనబడకుండా పోయింది. అంత శంకర దాసయ్య, అయ్యో, వీనింటిలో కొంచెమైనా లేదే.  వున్నది  ఒక్క గంపెడే. దానినీ మనకి పంపి వేశాడు.  ఇంకా అతని దగ్గరేమున్నది అని అన్నాడు.

దుగ్గళ్ళవ్వ తిరిగి మఠానికి వచ్చి ఆ విషయమంతా చెప్పగా, దేవరదానయ్య సిగ్గుచెంది తనకు జరిగిన అవమానానికి బాధపడుతుండగా దుగ్గళ్ళవ్వ అతనితో అన్నది,  దేవరదానయ్యగారూ, మీరిలా శివ దాసులను పరీక్షించుట తగునా?  ఏ పుట్టలో ఏ పామున్నదో!  ఎవరి మహిమ ఎట్లాంటిదో!  పెరుగక, తరుగక ఐదు మానికల గింజలతో కోట్ల కొలది జంగమ భక్తులనారాధించే ఆ మహానుభావుడికి తవుడు గంప పంపుట అతనిన  అవమానించటానికే కదా?  మీరాతనిని అవమానించబోయి మీరే అవమానం పాలయ్యారు.  శంకరదాసయ్య మహిమ మీరు వినలేదు కాబోలు   ఆయన చేసే జంగమార్చనకు ఈశ్వరుడు సంతసించి సాక్షాత్కరించి వరము కోరుమన కోరటానికి తనకే కోరికలు లేవనెను.  ఈశ్వరుడు వరము కోరమన్న కోరకుండా వుండటం అతనిని అవమానించుట అనుకొని ఆ సంగతే ఈశ్వరునికి తెలియజేసి తనకి కూడా మూడవ కన్ను దయచేయమనగా వెంటనే ఈశ్వరుడాయన లలాటమందొక కన్నును ఏర్పరిచాడు. దాని తర్వాత కూడా  శంకర దాసయ్య తన మామూలు రీతిలో శివ భక్తుల సేవలో రోజులు గడపసాగాడు అని చెప్పింది.

జగదేక మల్లుడనే రాజు శంకర దాసయ్య పేరు ప్రఖ్యాతులు విని ఓర్వలేక పోయాడు.  ఆయన తన నగరంలో ఒక విష్ణ్వాలయాన్ని నిర్మించి పంచ లోహములతో విగ్రహములను చేయించి ప్రతిష్టించి ఆరాధించసాగాడు.  ఆయన మీ శంకరదాసయ్య ఈశ్వరుని మెప్పించి ఫాల నేత్రాన్ని పొందిన మాటే నిజమైతే ఈ ఆలయంలోని అత్యుగ్ర జ్వాలా నరసింహస్వామిని దర్శించి భయం చెందక తిరిగి వచ్చిన చాలు నేనూ నమ్ముతాను అని శిష్యులతో శంకరదాసయ్యకు వార్త పంపించాడు. 

అది విని శంకరదాసయ్య చిరునవ్వుతో తన శిష్యగణాన్ని వెంటబెట్టుకుని లింగ పంచ రత్నములను జపించుచు కళ్ళు మూసుకుని దేవళము తలుపులు తెరిచి చూచునంతలో ఆ భీకర నరసింహమూర్తి శుధ్ద లింగాకారమై దర్శనమిచ్చాడు.  అది చూసి రాజు శంకరదాసయ్య పాదాలమీద పడి అనేక కానుకలిచ్చాడు.

ఇలా జగదేక మల్లుడు శంకరదాసుడిని పరీక్షించే సమయంలో దేవరదానయ్య అక్కడ వుండి తాను కూడా శంకర దాసుడికి సాష్టాంగ నమస్కారం చేసి తనని మన్నించి రక్షించమని వేడుకొన్నాడు.  అది విని శంకర దాసు ఏమీ ఎరగనివాడివలె,  వీరెవరు?  దేవరదానయ్యగారా!  మీరు మహానుభావులు.  శాంత మూర్తులు. నిరహంకారులు.  గర్వరాహిత్యులు.  దానచూడామణులు.  ఎప్పుడిచ్చటికి వచ్చారు?  మాకోసం ఏమి తెచ్చారు?  కూలివానికి కోక ఇచ్చి కొన్న తవుడేమైనా తెచ్చారా?  పోనీలెండి.  మీవంటి మహానుభావులు పూడ్చిపెట్టిన ధనమిందేమైన వుండవచ్చును.  త్రవ్వి చూడండి  అని దేవర దానయ్యచేతనట త్రవ్వించగా అక్కడ నేల అంతా బంగారు ఇసుకమయమయ్యెను.  అంత దుగ్గళ్ళవ్వ గూడా శంకరదాసయ్య పాదాక్రాంతయై లేవకున్న, మీరిచ్చిన గంపెడు తవుడుకు బదులు పది గంపల ఇసుక తీసుకెళ్ళండి.  పేదసాదలనాదరించండి.  ఈ ఇసుక నానబెట్టి యేకులు చేసి ఎండబెట్టి బంగరు నూలు దారములొడికి కనక చేలములం కట్టుకొండు. దాసుల కివ్వండి.  అని అనేక విధముల తృణీకరిస్తూ మాట్లాడుతూ వుండగా దేవర దానయ్య ఆయన పాదాలమీదనుంచి లేవకుండా నీ దాసులలో నేను వెయ్యి కాదు, పదివేల వంతు యోగ్యుడిని కూడా కాను అని పరి పరి విధాల ప్రార్ధించగా ఈశ్వరదాసయ్య వారిని లేవనెత్తి సగౌరవముగా సాగనంపాడు.

దేవరదానయ్య శరణాగతి చెందటంవల్ల అతని స్ధితి యధాతధమయ్యెనుగానీ, శంకర దాసయ్య అహంకారమును చూపించటంవల్ల అతని ఫాలమునందున్న మూడవ కన్ను అదృశ్యమయ్యెను.

***

No comments:

Post a Comment

Pages