పురాణ కథలు - బసవ పురాణం - 19 - అచ్చంగా తెలుగు

పురాణ కథలు - బసవ పురాణం - 19

Share This

 పురాణ కథలు - బసవ పురాణం - 19 

పి.ఎస్.ఎం.లక్ష్మి



19 -  సిరియాలు కధ

కాంచీ పురంలో సిరియాలు అనే ఒక వీర శైవ భక్తుడు వుండేవాడు.  ఆయన నిత్యమా ఐదుగురు జంగమయ్యలకు తృప్తికరంగా భోజనం పెట్టిన తర్వాతే తాను భోజనము చేసే వ్రతమున్నవాడు.  ఆ విధముగా రోజూ ఐదుగురు జంగమ దేవరలకు వారు కోరిన భోజనము పెట్టి, వారు కోరిన వస్తువులు ఇచ్చి తృప్తి పరచేవాడు.  


ఆ సిరియాలు భక్తి ఎంతటిదో కనుక్కోవాలనే జిజ్ఞాసతో పరమ శివుడు ఒకనాడు జంగమ దేవర వేషంలో సిరియాలుకి కనిపించాడు.   సిరియాలు ఆయనకి అర్ఘ్య, పాద్యాదులు ఇచ్చి, తమ ఇంటికి అతిధిగా భిక్ష స్వీకరించటానికి ఆహ్వానించాడు.   శివుడు సిరియాలు ఇచ్చే ఆతిధ్యానికి అంగీకరించే ముందు ఆయనని మాటలలో దింపి   నెమ్మదిగా విషయం బయటపెట్టాడు.  “నీ వ్రతం సంగతి విన్నాను.  దానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా వ్రత భంగం కాకుండా నిర్వర్తిస్తున్నావని విని సంతోషించాను.  అలాగే నాకూ ఒక వ్రతం వున్నది.  కానీ దానిని నెరవేర్చే గృహస్తులు ఎవరూ కనబడలేదు.  మాంసాలన్నిటిలో నర మాంసము చాలా రుచిగా వుంటుందంటారు.  అంతే కాదు.  మృగ మాంసాన్ని తినే పులి కూడా అదృష్టవశాత్తూ ఎప్పుడేని మనుష్య మాంసం తిన్నట్లయితే  అప్పటినుండి ఇంక మృగ మాంసాన్ని ఇష్టపడక నర మాంసం కోసమే దారి కాచి మనుష్యులను చంపుకు తింటుంది.  కనుక మాకు కూడా నర మాంసంతో భిక్ష ఇచ్చిన వారి ఇంటనే మేము భిక్ష స్వీకరిస్తాము.  లేకపోతే నీళ్ళు తాగి ఉపవాసం వుంటాము.  మేము వ్రతం పట్టినప్పటినుంచి మా కోరిక  ప్రకారం ఒక కోమల బాలకుని మాంసంమును మాకు వండి పెట్టువారు లేక అప్పటినుంచి ఇప్పటిదాకా భోజనము చేయకుండా ఉపవసిస్తున్నాము.  మా కోరిక తీర్చువారి కోసం వెతుక్కుంటూ ఊరూరూ తిరుగుతున్నాము.  నీకట్టి సామర్ధ్యముంటే మాకు భోజనము పెట్టు.  లేకపోతే వెళ్ళి వస్తాము” అన్నాడు.


లేవబోయిన జంగమదేవరనాపి,  “స్వామీ, దీనికోసం ఇంత విచారించటమెందుకు.  నాకు పన్నెండేళ్ళ పుత్రుడున్నాడు.  వాని మాంసంముతో మీకు భోజనము పెట్టి మిమ్మల్ని తృప్తి పరుస్తాను.  కొంచెం సేపు ఇక్కడే విశ్రమించండి”  అని సిరియాలు ఇంటికి వెళ్ళి భార్యతో విషయం చెప్పలేక తడబడుతూ నుంచుండి పోయాడు.  ఆమె బలవంతం మీద ఎలాగో జంగమ దేవర కోరిక చెప్పాడు.  ఆమె లేచి, “ఎందుకిలా బాధపడతారు.  కోరినవాడు మహేశ్వరుడు.  ఇచ్చువాడు నా హృదయేశ్వరుడు.  మీ పుత్రుని మీద నాకున్న స్వతంత్రము మీకు లేకుండా పోతుందా?  ఇంక ఆలస్యం చెయ్యవద్దు.”  అన్నది.  ఒక పరిచారికను పంపి పాఠశాలలో చదువుకుంటున్న కుమారుని పిలిపించారు. 


పాఠశాలనుంచి వచ్చిన కుమారుని తల్లి ఒడిలో కూర్చోబెట్టుకుని తల నిమురుతూ, మంచి మాటలు చెబుతూ మధ్యలో భర్తకి సంజ్ఞ చేసింది.  వెనకనుంచి కత్తితో కొడుకు తల తుంచమని.  భర్త అలాగే చెయ్యగా ఆమె, నమ్మక ద్రోహం చేసి తెగవేసిన కొడుకు తలని దాచి, శరీరంలోని మాంసం కండలను ముక్కలు కోసి రుచిగా వండి, మిగతా భక్ష్య, భోజ్య, లేహ్యాలతో భోజనం సిధ్ధం చేసింది.  శివ పూజ చేసుకున్న సిరియాలు జంగమ దేవరని పిలుచుకు వస్తానని బయల్దేరాడు.  ఒక చెట్టు కింది స్నానాద్యనుష్టానములు పూర్తి చేసుకుని, జపం చేసుకుంటున్న ఆ జంగమ దేవరని చూసి,  “స్వామీ, దయచెయ్యండి.  సర్వము సిధ్ధమయ్యాయి.  మీరెక్కడ వున్నారో అని వెతుకుతున్నాను” అని మర్యాదగా ఆహ్వానించాడు.  


అంత జంగమయ్య, “మాకోసం వెతకటం దేనికి?  ఇక్కడ, అక్కడ అని ఏమిటి?  ఎక్కడ చూసినా మేమే వుంటాము.  అయినా మాలాంటి జంగమాలకు మీవంటి గృహస్తులు పట్టు గొమ్మలు!”  అంటూ సిరియాలుని మెచ్చుకుంటూ అతనితో బయలుదేరాడు. 


ఇంటికి వచ్చిన అతిధిని శివ పూజ చేసుకొమ్మని సిరియాలు చెప్పినా వినని అతని చేత,  తానే కావలసిన పదార్ధాలన్నీ ఇచ్చి బలవంతంగా శివ పూజ చేయించాడు.  జంగమయ్య  తన కోసం వండిన పదార్ధాలు చూపించమని పట్టుబట్టగా, సిరియాలు భార్య ఒక పాత్రలో బాలకుని మాంసముతో వండిన కూర తీసుకువచ్చి ముందు పెట్టింది.  దానిని చూసిన జంగమయ్య “దీనిలో తలకాయ మాంసమేది?  అది చాలా రుచిగా వుంటుంది!  మాంసం తినేవాళ్ళు పట్టణాలలో మాంసం అమ్మే కటిక వాళ్ళనుంచి మేక తలలు మిక్కిలి ఆశగా కొనుక్కుపోవటం నేను చాలా సార్లు చూశాను.  అది లేని ఈ మాంసం నాకెందుకు?” అని లేచి పోబోయిన ఆతనిని బ్రతిమాలి ఆ శిశువు శిరస్సు తెచ్చి, “దేవా, ఇది కేశాలతో వున్నది.  పూర్వం అగస్త్య మహర్షికి ఒక ముని నర మాంసం పెట్టి అతనిచే శపించబడ్డాడు.  అందులకే ఇది చెయ్యలేదు.  ఇప్పుడే ఈ తల వండించి తెచ్చెద” నని చెప్పగా, అతని భార్య కూడా ఆ తలకాయని తొందరగా వండి తెచ్చింది.


ఆ కపట జంగమయ్య సిరియాలుతో, “శెట్టీ, నువ్వూ, నీ అర్ధాంగీ నా పట్ల కనబరుస్తున్న ధృఢ భక్తికి, మీరు చాలా వేగంగా సమకూరుస్తున్న పదార్ధాలకీ నేను చాలా సంతోషించాను.  కానీ ఇంకొక పని కావాలి.  నా కుడి పక్కన నువ్వు కూడా కూర్చుని, నీ అర్ధాంగి వడ్డిస్తూ వుండగా మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ, సంతోషంగా భుజించాలి.  అలా అయితే సరే, లేకపోతే నేను పోయి వస్తాను”  అని మళ్ళీ లేవబోయాడు.


నోట మాట రాక బాధపడుతున్న సిరియాలు దగ్గరకు వెళ్ళి అతని భార్య,  “ఎందుకు ఇలా బాధ పడతారు?  మన చేతులారా మనం చంపుకున్న కొడుకు మాంసం తినటం తప్పవుతుందా?  జంతు వధ చేయువారు ఆ జంతువు మాంసము తాము భుజించిన తప్పు లేదని పెద్దలు చెప్తారు కదా!”  అని అతనిని శాంత పరచి ఇద్దరికీ ఆసనాలు వేసి వెండి పళ్ళెరాలలో కుమారుని మాంసముతో సహా సకల పదార్ధములు వడ్డించి ఆరగించుడని చెప్పింది.  


ఈశ్వరుడు వారి భక్తిని మనస్సులో గొప్పగా మెచ్చుకుంటూ ఇతను దేనికీ వెనుకాడలేదు.  ఇతని భార్య ఇతనికన్నా సాహసిగా వున్నది.  స్త్రీలకున్న మనో నిబ్బరం పురుషులకుండదు కదా.  వీళ్ళని మోసం చెయ్యలేము.  అని ఆలోచించి సిరియాలుతో,  “ఔనోయి శెట్టీ, ఇంట్లో అన్నీ సమకూర్చారు.  ఇంక మనం భోజనం చెయ్యటమే తరువాయి.  కానీ ఇంకొక గొప్ప లోపముందోయి.  దానిని కూడా తీరిస్తే సుఖంగా నీతో విందారగించి, నా దోవన నేను పోతాను.  ప్రపంచంలో ఎవరైనా తమ ఇంట్లో విందు ఏర్పరచినప్పుడు, పుత్ర, మిత్ర, కళత్ర, దాస దాసీ జనాలతో ఆనందించాలి కదా.  నీకు కుమారుడున్నాడన్నావు కదా.  అతనిని కూడా పిలు.  వారితో విందారగిద్దాం”  అన్నాడు. 


సిరియాలు కన్నీళ్ళు ఉబికి వస్తుండగా, దీన స్వరంతో,  “మహేశా, నా స్ధితి మీకు తెలిసీ మీరిట్లా నన్ను తిప్పలు పెట్టటం తగునా?  నాకు ఒకడే కొడుకున్నాడని వాని మాంసము మీకు విందొనరుస్తానని ముందే చెప్పాను.  అదే చేశాను.  వాడెక్కడికన్నా వెళ్తే పిలిపించేవాడిని.  చనిపోయిన కొడుకుని ఎలా పిలవను?  పిలిచినా వాడెలా వస్తాడు?  ఈ ఆలోచనలు మాని మీరు భోజనం చెయ్యండి.”  అని చెప్పాడు.


దానికి ఆ జంగమయ్య మహోద్రేకంతో లేచి బాగా కోపగించుకున్నావాడిలా,  “ఛీ, ఛీ, నీవపుత్రకుండవు.  అపుత్రస్య గతిర్నాస్తి అంటారు కదా.  నీలాంటి గతిమాలినవారి ఇంట్లో భోజనం చెయ్యటంకన్నా ఇవాళ్టికి పస్తుండటం మేలు.”  అని విసుక్కునే జంగమయ్యకు సమాధానం చెప్పలేక సిరియాలు మౌనంగా వున్నాడు.


జంగమయ్య సిరియాలు భార్యని పిలిచి,  “తిరువెంగళాంబా, నీ మగడు ఎంత చెప్పినా వినకున్నాడు.  నువ్వయినా నా మాట మన్నించి నీ చిన్ని కుమారుడిని పేరు పెట్టి పిలువమ్మా.  తల్లి పిలిచిన రాని బిడ్డడుండడు కదా. బిడ్డలకు దేనికయిన అడ్డమున్నదిగాని, మాత్రాహ్వానమున కెచ్చటను అడ్డము లేదు.  జనని పిలిచిన పోయిన తనయుడు పరుగు పరుగున వచ్చును.”  అని ఆనతినిస్తున్న అతనికి మొక్కి, మహా ప్రసాదంబనుకొని తిరువెంగళాంబ ఇంట్లో అన్ని మూలలూ తిరుగుతూ కొడుకుని పిలువసాగింది. 


ఆ బాలకుడు సజీవుడై పరిగెత్తుకుని రాగా వానిని తీసుకుని జంగమయ్య వున్న ప్రదేశానికి వెళ్ళిందావిడ.  అక్కడ జంగమ దేవర బదులు సకల పరివారంతో సదా శివుడు ప్రత్యక్షమయ్యాడు.  వారి భక్తికి మెచ్చి  వారిని తన ప్రమధ గణంలో కలుపుకుని, కాంచీపురవాసులందరినీ కైలాసంలో స్ధానమిచ్చాడు.


ప్రమధగణంలో వున్నా సిరియాలు  గర్వాన్ని మాత్రం జయించలేక పోయాడు.  ఆ కధ తర్వాత తెలుసుకుందాము.

***

 

No comments:

Post a Comment

Pages