రాధాగోపాలం
(మాజొన్నవాడ కధలు)
టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)
సమయం ఉదయం 6 గంటలు కావస్తోంది. “రేయి
వీగినది వేళాయె పూజలకు.. మేలుకో కామాక్షి మేలుకో తల్లీ...మేలుకొని వేగ
మమ్మేలుకోవమ్మ” అన్న పాటతోబాటు దేవాలయ
ప్రాంగణంలో గంటలు నిర్విరామంగా మ్రోగుతున్నాయి. భక్తులు పెన్నానదిలో స్నానం చేస్తున్నారు. కొందరు
సూర్యనమస్కారాలు చేస్తున్నారు. ఉదయాద్రిన బాలభాస్కరుడు నారింజపండు వలె పసుపుపచ్చని
ఛాయతో బంగారు ముద్దలా మెరుస్తున్నాడు. ఆ కాంతి నదిలో పడి నది మొత్తం బంగారు రంగులో
ఉంది. పిల్లతెమ్మెరలు మెల్లగా వీస్తున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం. నది ఒడ్డున ఉన్న ఊడల మర్రి క్రింద గోపీనాధం పిల్లనగ్రోవిపై భూపాల
రాగం అద్భుతంగా వాయిస్తూ మరో లోకంలో విహరిస్తున్నాడు. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఆ
మధురనాదం సుదీరతీరాలకు వినిపిస్తున్నది. పిల్లలు మరికొంత మంది, స్నానంచేసి వస్తున్న ఆడా మొగా అలాగే నిలబడిపోయి తన్మయత్వంతో వింటున్నారు. వారిలో
రాధిక కూడా ఉంది. ఆమె చాలా కాలం దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉండి ఇటీవలే తండ్రి
ఉద్యోగం నెల్లూరుకు బదిలీ కావడంతో
తల్లిదండ్రులతో అమ్మణ్ణి దర్శనానికి వచ్చింది. వాళ్ళు స్నానాలు చేస్తున్నారు.
రాధికకు సంగీతం అంటే చిన్నతనం నుంచి పిచ్చి. మురళీనాదం
విని నదిలో నీళ్ళు గబ గబా నాలుగు చుక్కలు తలపై జల్లుకొని వచ్చి ఆనందంతో
వింటున్నది.
"రాధికా.. రా..
వెళ్ళాలి అని తల్లిదండ్రులు వచ్చి పెద్దగా పిలవడంతో ఈ లోకంలోకి వచ్చి అప్పటిదాకా
రికార్డు చేస్తున్న మొబైల్ ఆఫ్ చేసింది. అప్పుడే కళ్ళు తెరిచాడు గోపీనాధం. రాధికను
చూశాడు. రాధిక కళ్ళు సూటిగా గోపీ కళ్ళనే చూస్తున్నాయి. "ఇందాకటి నుండి
వెదకలేక ఛస్తున్నాం నిన్ను. ..రా..రా.. చాల్లే ఇంక. వీధిలో ముష్టోడు పాడినా..
రైళ్ళలో గుడ్డోళ్ళు పాడినా ఇంతేనా..వళ్ళు మర్చిపోవడమేనా” అని తీసుకెళ్ళిపోయారు.
"లేదమ్మా ఎవరో అద్భుతంగా వాయిస్తున్నాడు. నాకతని ఆలాపనలో ఒక గొప్ప కళాకారుడు కనిపిస్తున్నారు" అన్న మాట
విని నవ్విన తండ్రి "ఇంకా నయం.. అవన్నీ సంపాదనకోసం పాడే బజారు పాటలు. ఒకే పాట
ప్రతిరోజూ పాడితే ఎవరైనా అద్భుతంగానే పాడతారు. నడుద్దూ.. టైం అయింది.. మళ్ళీ నేను
ఆఫీసుకు వెళ్ళాలి" అని దేవళంలోకి తీసుకెళ్ళిపోయినా రాధిక మనసు మాత్రం అవి
బజారు పాటలు కావని స్పష్టంగా చెబుతోంది… ఇంకా ఆమె మనసు వేణూనాదాన్నే వింటున్నది.
సమయం ఏడు గంటలు దాటడంతో క్రిందికి దిగిన గోపి స్నేహితుడు వెంకన్నతో
"ఎవర్రా..ఆ అమ్మాయి? ఏమంటున్నది?" అన్నాడు. "కరణం కాంతారావు తమ్ముడు మరదలు అనుకుంటాన్రా!.. కరణాన్ని అన్నా.. అన్నా... అని పిలస్తా ఉంటాడు.
నెల్లూరులో ఏదో పెద్ద ఉద్యోగం. పడవ కార్లో వస్తా ఉంటారు అప్పుడప్పుడూ వాళ్ళింటికి.
ఏదో మొక్కై ఉంటుంది. పోయిన
పౌర్ణమికి కూడా దేవళానికి వచ్చారు. కూతురు కనబళ్ళేదని… ఇక్కడుందనీ వెదుక్కుంటూ
వచ్చారు. అదీ వాళ్ళ కోపం.. అరుస్తున్నారు… ఆ అమ్మిని.. " అన్న మాటకు
"ఇవాళ పౌర్ణమా? మళ్ళీ పౌర్ణమి ఎప్పుడో!" అని
మనసులో అనుకుని "సరేరా.. పద పోదాం..
ఇవాళ చేలో కలుపు దీయాలట. రెడ్డి గారు రమ్మన్నారు" అని చెప్పి "సాయంత్రం
రచ్చబండ దగ్గర కలువు వెంకన్నా.. వస్తా!" అని వెళ్ళిపోయాడు.
గోపీ ఆ అమ్మాయిని
మరచిపోలేక పోతున్నాడు. ఎంత సహజ సుందర స్వరూపం ఆ అమ్మాయిది! అందం ఆ అమ్మాయికి
ప్రకృతి ఇచ్చిన వరం. నెలవంక సైతం సిగ్గుపడే అందం తనది.. అలా చూస్తూ ఉండాలనే
అనిపిస్తున్నది. కళ్ళు తెరిచినా మూసినా ఆ అమ్మాయే గుర్తొస్తోంది. అదే విషయం ఆలోచిస్తూ
అన్యమనస్కంగా గడిపాడు. ఈ సారి వచ్చినప్పుడు తనతో ఎలాగైనా మాట్లాడాలి అనుకున్నాడు.
గోపీ తల్లిదండ్రులు
చిన్నతనంలో ఐదేళ్ళ వయసులోనే చనిపోవడంతో
సూరమ్మ పెద్దామె పెంచింది. గోపీ ఆరేళ్ళ క్రితం పదవతరగతి ఫస్ట్‌క్లాసులో పాసైనా
హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టంలేక బుచ్చికో.. నెల్లూరికో పొమ్మని వాళ్ళ
హెడ్మాస్టరు ఎన్ని సార్లు చెప్పినా వద్దని పొలం పనులు చేసుకుంటున్నాడు. లైబ్రరీలో
ఉన్న న్యూస్‌పేపర్లు..పుస్తకాలు అన్నీ చదువుతాడు. ఉదయాన్నే ఒక గంట మురళీ నాదం
చేయకపోతే మాత్రం ఆ రోజంతా ఏదో పోగొట్టుకున్న వాడిలా డల్‌గా ఉంటాడు.
“ఏంట్రా కంచంలో అన్నం
పెడితే తినకుండా ఏందో ఆలోచిస్తావున్నావే...
తగాదా ఏమైనా పడ్డావా పొలంలో ఎవరితోనైనా? నాకు చెప్పు...
నాలుగూ దులుపుతా వాళ్ళను...” అన్నా మౌనంగానే ఉండడంతో బుజం మీద చెయ్యేసి...
దిగులుగా ఉన్నావేందయ్యా.. ఏమైందో నాకు చెప్పు” అన్నది.
"ఏంలేదు పెద్దీ… ఇవాళ
నదొడ్డున ఒకమ్మిని చూశాను. ఆ అమ్మాయి కరణంగారి తమ్ముడి కూతురని వెంకన్న చెప్పాడు.
ఎంత అందంగా ఉందో తెలుసా పెద్దీ..పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే
చేసుకోవాలనిపించింది" అన్నమాట విన్న పెద్దమ్మ ఉలిక్కిపడి "ఓరి నీ
అసాధ్యం గూల.. అదా కథా... వాళ్ళు పెద్దింటోళ్ళురా.. కార్లల్లో తిరిగే వాళ్ళు...
మనమూ.. చెప్పుల్లేకుండా ఎండలో తిరిగే వాళ్ళం. సాపత్యముండొదయ్యా..చెప్పు..ప్రేమా
దోమా అనబాకయ్యా..ముందే చెప్తున్నా..మనలాంటోళ్ళకి అవన్నీ పడవు. చివరికి మనకి
ఏడుపునే మిగిలిస్తాయి. నీకు మంచి సంబందం చెల్లాయ్‌పాళెంలో
ఉందని… పిల్ల చామన ఛాయయినా అందంగా
ఉంటుందని.. పేదోళ్ళని….పనీ బాటా వచ్చి మాటినే అమ్మాయనీ... మొన్న సుబ్బన్న వచ్చి
చెప్పాడు. మనం తూగే సంబందం నే జూస్తా! నువ్వేం దిగులుపడమాక. మీ అయ్యా అమ్మా
పొయింతర్వాత గుండెల మీద బెట్టుకోని చూశా నిన్ను. ఏదో ఒక తకరాదు తేబాక. లోకం
ఉన్నోళ్ళ మాటే ఇంటుంది. చివరకు బాద పడాల్సింది మనమే! సినిమాల్లో జరిగేటివంతా నిజం
కాదు. ఆ అమ్మాయి గురించి ఆలోచించనని ఒట్టెయ్." అనగానే తింటున్న కంచంలో చెయ్యి
కడిగేసి "పెద్దీ.. మనసేం బావుళ్ళేదు. ఏమీ అనుకోబాక" అని లేచి
పోగానే.."అమ్మా కామాక్షమ్మ తల్లీ..నీదే భారం" అని దండం పెట్టుకుంది.
***
“రాధికా... స్నానం చెయ్యి
కాలేజీకి టైం అవుతోంది కదా! ఏమిటంత నీరసంగా ఉన్నావు. అస్తమానం..ఆ ఫోన్‌లో మ్యూజిక్
వింటూ గడపడం...వేరే పనీ పాటా లేదా?" అన్న తల్లి
పిలుపుకు అప్పటివరకూ వింటున్న గోపీనాధం మురళీనాదం ఆఫ్ చేసి ఇయర్‌ఫోన్సు తీసి
ప్రక్కన పడేసింది. ఇంకా వేణూ నాదం చెవిలో ప్రతిధ్వనిస్తూనే వుంది. యాంత్రికంగా
తప్పదన్నట్టు విసుగ్గా బాత్రూంలోకి దూరింది.
***
- ఆరోజు పౌర్ణమి. గోపీనాధం
తెల్లవారు ఝామునే నిద్రలేచి స్నానం చేసి మురళి పట్టుకుని పెన్న నది వైపు నడిచాడు.
- రాధిక కారెక్కబోతూ
ఇంట్లో దేవుడి ముందు "తల్లీ..అతను కనుపించేట్టు చెయి తల్లీ.." అని
మనసులో అనుకుని దండం పెట్టుకోవడం గమనించిన తల్లి "దీనికి భక్తి
ఎక్కువేనండోయ్!" అనింది. భర్త నవ్వుతూ "నీకేం తెలీదు… దీనికి అన్నీ
ఎక్కువే… జాగ్రత్తగా ఉండాలి నువ్వు" అని నవ్వాడు. పరధ్యాన్నంగా ఉన్న రాధిక
ఇదంతా గమనించలేదు. తల్లి ఎందుకు నవ్విందో అర్ధంకాక అయోమయంగా చూచింది.
టైం ఏడవుతున్నా రాధిక
రాకపోయే సరికి దిగులుగా చూస్తున్నాడు. అంతలో దూరంగా రాధిక వాళ్ళ అమ్మా నాన్నలతో
కనుపించేసరికి ఆనందంతో ఉక్కిరిబిక్కిరై పాట అందుకున్నాడు. ఆ నాదం దేవళంలో నుండి మైకులో వినబడే భక్తి గీతాలను
మించి వినిపిస్తోంది.
వాళ్ళు అటు స్నానానికి
వెళ్ళగానే మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది. మురళి వాయిస్తూనే తన్ను చూసి పలకరింపుగా
తలూచడం గమనించిన రాధిక సిగ్గు పడుతూ నిలబడింది. "నన్ను దోచుకుందువటే వన్నెల
దొరసాని" అనే పాట వినింది. "మీరు ఫ్లూట్ చాలా బాగా సాధన చేసినట్టున్నారు"
అంది.
"లేదు..
ఏవో ఉబుసుపోక గాలి పాటలు…. వినికిడి జ్ఞానం తప్ప.. శాస్త్ర ప్రకారం రాగాలు పాడూ…
తెలీవు నాకు" అన్నాడు.
"నేర్చుకుంటే
ఈ దేశం గర్వించదగ్గ కళాకారుడౌతారు"
"అంత
సీను లేదు లెండి...ఏదో ఆసక్తికొద్దీ సాధన చేశాను అంతే"
"లేదు..నేను
చెప్పేది నిజం. నేను ఇండియాలో చాలా చోట్ల కచేరీలు విన్నాను. నా మొబైల్లో ఎప్పుడూ
వింటూనే ఉంటాను. ఇంతకంటే తక్కువ స్థాయిలో పాడే వాళ్ళకు బయట బ్రహ్మ రథం
పడుతున్నారు. ఈ విద్య లక్ష మందిలో ఒకరికి కూడా పట్టుబడదని ముంబాయిలో ఒకాయన స్టేజ్
మీద హరిప్రసాద్ చౌరాసియా కచేరీ సందర్భంగా చెప్పారు"
"నిజమే
కావచ్చు కానీ..నాకంత స్థాయి ఉందని అనుకోవడంలేదు"
"మీరు
నేర్చుకుంటానంటే నెల్లూరులో ఒక గురువుగారున్నారు"
"నాకు
ఏరోజు కూలీ ఆరోజు వస్తేనే పూట గడిచేది. మా పెద్దమ్మకు ముసలితనం వచ్చేసింది"
"మీరు
నేర్చుకుంటానంటే నాకు ఫోన్ చేయండి.. నా నంబరు" అని ఒక కాగితం మీద రాసి
ఇచ్చింది.
కొంచెం సేపు
ఆలోచించాడు. ఏదో చెప్పాలని ఉంది మాట బయటకు రావడంలేదు. లోలోనే ముసిముసిగా
నవ్వుకుంటున్నాడు.
"ఏంటి?
ఆడ పిల్లలా సిగ్గు పడుతున్నారు"
"నాకు
మీరంటే చాలా ఇష్టం..." ఆ తర్వాత మాట పైకి పెగిలి రాలేదు.
"ఏంటి
ఈ రెండు సార్లు చూసినందుకే లవ్వా?.. ముందు జీవితంలో
స్థిరపడండి..చాలా లెక్కలు కుదరాలి.. ఆ విషయాలు ఇప్పుడు కాదు. మా నాన్నా వాళ్ళు
వస్తున్నారు. వచ్చే కార్తీక పౌర్ణమిలోపు తేల్చుకోండి. రెండు సంవత్సరాలు కష్టపడితే
మీ టాలెంటుకు లక్షలు కురుస్తాయి...నన్ను నమ్మండి…. నన్ను మీరు ఇష్టపడే మాట… ఆకర్షణ
కాకుండా.. నిజంగా నిజమైతే నాకు
ఆరోజు నాకు మీరిచ్చే నా పుట్టినరోజు కానుక! మీరు గురువు దగ్గర చేరడమే! బై"
అంటూ వెనుదిరిగింది. ఆ బ్రహ్మాస్త్ర ప్రయోగానికి తిరుగేముంది? వలపు బాణం గ్రుచ్చుకుని గిలగిలా తన్నుకుని నేలమీద పడ్డట్టయింది. తేరుకునే
సరికి రాధిక కనుమరుగయింది.
***
పెద్దితో గోపీ ఘర్షణపడ్డా
చివరకు ఒప్పించి నెల్లూరు చేరాడు. గోపీ ఏకసంధాగ్రాహతకు గురువు నివ్వెరపోయేవాడు.
రాగాల పేర్లు అవీ తెలియకపోయినా ఒకసారి వింటే అవలీలగా వాయించేవాడు. అదే విషయం
రాధికకు చెప్తూ ఉండేవాడు. ఒకరోజు
పేపర్లో పడ్డ న్యూస్ కటింగుతో గురువు వద్దకు వచ్చింది రాధిక.
"గురువుగారూ..ఇది
చూడండి..జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో జరిగే
పోటీలల్లో గోపీ నిలబడి గెల్చేట్టు
చేసే బాధ్యత మీదే! దానికి ఫీజు ఎంతైనా నేను మీకు ఇస్తాను"
"అమ్మా!
నీవు ఇంత చెప్పనక్కరలేదు గోపీ గెలిచి తీరుతాడు. పేరు ఇవ్వు. నేను మన వేళ్ళపాళెం వెదురుతో
వాయిద్యాన్ని అద్భుతంగా చేసే జిలానీ బాషాతో మాట్లాడి గోపీ చేతి వేళ్ళకు సరిపోయేట్టుగా ఒక డజను తయారు చెయ్యమని
చెప్తాను"
"ధన్యవాదాలు
గురువుగారూ.. ఇదంతా నేను చేస్తున్నానని చెప్పకండి. "
***
తను ఓనమాలు
నేర్చుకుంటున్నానని, తనకేమీ రాదని, మొదట
సంశయించినా చివరకు గురువు, తోడి శిష్యులు అందరూ కలిసి
ఒప్పించారు. జిల్లా స్థాయిలో జడ్జిలు అతని ప్రతిభకు ఆశ్చర్యపోయారు. రాష్ట్ర
స్థాయిలో కొంతమంది జడ్జీలను కొందరు పలుకుబడి ఉపయోగించి ప్రథములుగా నిలవాలని
యత్నించినా, ఎన్నో తర్జన భర్జనా నిర్వాహకులు దాన్ని త్రిప్పికొట్టి గోపీని ప్రథమ
స్థానంలో నిలిచేట్టు చేశారు.
***
ఇప్పుడు ఎక్కడవిన్నా
గోపీనాథ్ పేరే వినిపిస్తోంది. ఛానల్ వాళ్ళు, పేపర్ల వాళ్ళ
వలన తెలుగు రాష్ట్రాల్లో గోపీనాథ్ అనే గొప్ప కళాకారుడున్నాడని ప్రపంచానికి తెలియ
వచ్చింది. మరో రెండు నెలల్లో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీకి వెళ్ళడానికి
మాత్రం ససేమిరా కుదరదని తేల్చి చెప్పేశాడు. వచ్చిన పేరు చాలని హాయిగా జొన్నవాడ
వెళ్ళిపోయి తన బ్రతుకు తను హాయిగా బ్రతుకుతానని గొడవచేసి తన సామాను సర్దేసుకుని
వెళ్ళిపోడానికి సిద్ధమయ్యాడు. ఈవిషయం గ్రహించిన గురువుగారు వెంటనే ఫోన్ చేసి రాధికను
పిలిపించాడు.
సడన్‌గా ఆమె
రాకతో అవాక్కయ్యాడు.
"జొన్నవాడ
వెళ్ళిపోవడానికే సిద్ధమయ్యావా గోపీ!"
"క్షమించండి.
నాకు హిందీ రాదు. వాళ్ళు జాతీయ స్థాయిలో పోటీలో ఉండే నిబంధనలతో పాటూ.. దాదాపు వంద
రాగాల పేర్లు ఇచ్చారు. ఇంత తక్కువ సమయంలో ఇవన్నీ
నేర్చుకుని ఇంత కష్టపడి వెళ్ళడం అవసరమంటరా?"
"గోపీ
ఒక్కసారి అలా మిద్దెమీదకు వెళ్దాం పదా!"
"చెప్పండి"
"నేనంటే
నీకు ఇష్టమేనా?" గోపీ ఏం మాట్లాడలేదు.
"నువ్వు
జాతీయ స్థాయిలో గెలిస్తే తప్పక మనిద్దరి వివాహం జరుగుతుంది. మా ఇంట్లో ఎలాంటి
అభ్యంతరం చెప్పరు. నీకు సినిమాల్లోనూ ఛానల్స్లోనూ మంచి ఉద్యోగం వస్తుంది. వేలు
వేలు జీతం. మంచి జీతం. నువ్వు, నేను హాయిగా జీవితం అనుభవించవచ్చు. ఆలోచించు. లేదంటే వెళ్ళిపో! అసలు నిన్ను ఇక్కడికి పిలిచింది ఈ పోటీలకోసమే!”
"మిమ్మల్ని
చూసిన రోజునే మీరే నా జీవిత భాగస్వామి అనిపించింది. మీకోసం ఎన్ని కష్టాలను
ఎదుర్కోవడానికైనా నేను సిద్ధమే! నాకు
సంతోషమే! మీరు చెప్పినవన్నీ బాగున్నాయి... మంచి మాటలే...కానీ హైదరాబాదులో పోటీ
దారులు నన్ను వెళ్ళిపొమ్మని..లేకపోతే ప్రమాదమని రకరకాలుగా భయపెట్టారు. కూడా నా
స్నేహితున్నాడు గాబట్టి సరిపోయింది. వాడు భయపడకుండా నన్ను స్టేజ్ మీదకు పంపాడు. పోటీకి వచ్చినవాళ్ళను చూస్తుంటేనే భయమేస్తోంది.
వాళ్ళు కళాకారులా రౌడీలా అనిపిస్తోంది. ఇక ధిల్లీలో దేశం మొత్తమ్మీద ఎంత మంది
ఇలాంటి గ్యాంగు ఉంటారు? నేను గెలవగలనా?"
"మీకా
భయం వద్దు. మా పిన్ని కొడుకు అక్కడ మిలిటరీలో ఉన్నాడు. వాడు అన్నీ చూసుకుంటాడు.
భయపడకుండా పోటీలో పాల్గొను. విజయం తప్పకుండా నీదే!"
"అమ్మా!
ఏమైంది?" అంటూ గురువుగారు మేడమీదకు వచ్చాడు.
విషయం వివరించి
ఇక తర్ఫీదు ఇవ్వడం మీ వంతు మాస్టారూ!" అంది.
"నువ్వు
చెబితే వింటాడనే... నీకు ఫోన్ చేశాను తల్లీ!"
***
గోపీ ధిల్లీ స్టేషనులో దిగ్గానే రాధిక తాలూకు వాళ్ళొచ్చి తీసుకుని వెళ్ళారు. కూడా ఒక మనిషిని ఏర్పాటు చేశారు. తెలుగువాడైనా సోము ధిల్లీలో గత పది సంవత్సరాలనుండీ ఉండడం వల్ల రాటు దేలాడు. ఆడిటోరియంలో ప్రవేశించాక సోము సర్వ బాధ్యతలు తీసుకున్నాడు. అతని బ్యాగు పిల్లనగ్రోవులున్న సంచీ కూడా అతనికిచ్చి నిశ్చింతగా గాలి పీల్చుకున్నాడు గోపీ. ఇంక తన పేరు పిలవడానికి ముందు ముగ్గురు వున్నారు. అప్పటిదాకా అక్కడే ఉన్న సోము ఎవరో తెలిసిన వాళ్ళు కనబడితే బయటకు వచ్చాడు. వరండాలో అందరికి కూల్‌డ్రింకులు సరఫరా చేస్తున్నారు. సోము ఒక కూల్‌డ్రిక్ తాగేసరికి తలతిరిగినట్లై అక్కడ మెట్లమీద కూర్చుండిపోయాడు. అలాగే మెట్లమీద ఆనుకుని పరుండిపోయాడు.
తనముందు
కాండిడేట్ జడ్జీలడిగిన విధంగా ప్రదర్శన చేస్తున్నాడు. ఇంకో ఐదు నిముషాల్లో తనపేరు.
గోపీకి చెమటలు పట్టాయి. గోపీ పత్తా లేదు.
"గోపీనాథ్ ఫ్రం ఆంధ్రప్రదేశ్" అనౌన్సు చేశారు. గోపీ వద్ద పిల్లనగ్రోవులు లేవు. ఎలా? అర్ధం కాలేదు. ప్రక్కన వచ్చి కూర్చున్నతను తనకు రెండు ఫ్లూట్స్ ఇచ్చాడు. ధైర్యంగా ముందుకు కదిలి స్టేజ్ ఎక్కాడు.
పరిచయం అనంతరం వారడిగిన విధంగా ప్రదర్శన చెయ్యాలని ఫ్లూట్ అందుకున్నాడు. అంతే!
నివ్వెరపొయాడు. దానికి రంధ్రాలు చాలా దూరం దూరంగా ఉన్నాయి. వ్రేళ్ళకు ఏమాత్రం
అందటం లేదు. ఏమి చెయ్యాలి? వళ్ళంతా చెమటలు. జడ్జికి "ఏక్ మినిట్" అని సైగ చేశాడు. ఎదురుగా
దీనంగా రాధిక మొహం గోపీకి కనిపిస్తోంది. ఓడిపొయ్యావా
గోపీ అని పదే పదే వినిపిస్తోంది.
వెంటనే తన మొలలో ఉన్న చిన్న చాకు బయటికి తీశాడు. చేతివేళ్ళకు వేలు వేలుకు మధ్య ఉన్న చర్మాన్ని కత్తితో కోసి..ఆ
రంధ్రాలకు అనుగుణంగా చేతి
వేళ్ళను సర్దుబాటు చేసుకుని... టవల్‌తో రక్తం బయటికి చిమ్మకుండా అదిమిపట్టాడు.
ఇదంతా ఎవరికీ కనిపించకుండా ఎర్రటి షాల్‌ను అడ్డుపెట్టుకున్నాడు. గోపీ ప్రదర్శనకు
ఒక పదినిముషాలు సభ మొత్తం హోరెత్తింది. నిలబడి చప్పట్లు కొడుతున్నారందరూ.
పంచప్రాణాలు చేతి వేళ్ళలోకి తెచ్చుకుని వాయిస్తున్నాడు. చివరిగా బ్రీత్లెస్ గా ఒక
రాగం మూడు నిముషాలు వాయిస్తుండగా… స్టేజ్ పై రక్తం కాలువ కట్టి క్రిందికి
ప్రేక్షకుల వైపు సాగింది. ముందువరసలో కూర్చున్న అతిధులు భయపడి లేచి నిల్చున్నారు. జడ్జీలు ఆశ్చర్య పోయారు. అందరూ లేచి నిలబడ్డారు. గోపీ
స్టేజ్ పై ఒరిగి పడిపోయాడు. వళ్ళంతా రక్తం. వెంటనే అంబులన్సు రావడం ఎక్కించుకుని
హాస్పిటల్లో చేర్చడం క్షణాల్లో
జరిగిపోయింది.
***
సోముకు తెలివి వచ్చేసరికి, చేతిలో ఫ్లూట్స్‌పెట్టుకున్న సంచీ లేదు. స్టేజ్ మీద మూడు, రెండు ప్రైజులు ఎవరికో ఇచ్చినట్లు అనౌన్సు చేశారు. గోపీ ఎక్కడా లేడు. మెల్లిగా స్టేజ్ వద్దకు నడిచాడు. అక్కడ రక్తం కాలువ కట్టి ఉండగా అందరిని అడిగి విషయం తెలుసుకున్నాడు. ఒక్క సారి గుండె ఆగిపోయింది. ఇదంతా తన వల్ల జరిగింది. ఇంతలో "ఫస్ట్ ప్రైజు శ్రీగోపీనాథ్ ఫ్రం ఆంధ్రప్రదేశ్" అని అనౌన్సు చేశారు. ప్రైజులు నెల చివరివారంలో ఇస్తామని చెప్పి నిర్వాహకులు వెళ్ళిపోయారు. సభ ముగిసింది. సోము ఏడుస్తూ విషయం ఫోన్ చేసి మిలిటరీ మావయ్యకు చెప్పాడు.
***
రాధిక ఆమె
తండ్రి హుటాహుటిన ఫ్లైట్లో ధిల్లీ చేరుకుని హాస్పిటలుకు చేరారారు. హాస్పిటల్లో
అప్పుడే స్పృహ వస్తున్న గోపీకి విషయం మొత్తం మెల్లి మెల్లిగా గుర్తుకొచ్చింది.
ఉలిక్కిపడి లేచాడు. "నా ప్రైజు...నా ప్రైజు ఏమైంది?" అని
పెద్దగా అరిచాడు. నర్సు డాక్టరును తీసుకుని వచ్చింది. విషయం తెలుసుకున్న గోపీ "డాక్టర్! ఇక ఈ ప్రాణం పోయినా పర్వాలేదు.
నా రాధికను గెలిపించాను" అంటుండగా రాధిక వచ్చి గాయాలతో బాండేజు కట్టి ఉన్న
రెండు చేతులను పట్టుకుని భోరుమని ఏడ్చింది. డాక్టరు "ప్రాణానికి ఏమీ ముప్పు
లేదు వారంలో డిస్చార్జి చేస్తాం" అని చెప్పగానే డాక్టరు పాదాలపై పడి రాధిక
విలపిస్తుండగా.. తండ్రి అనునయించాడు. రాధిక మొబైల్లో వేణూనాదం వినిపిస్తోంది. అది
తను పోటీలో వాయించిన బ్రీత్లెస్ సాంగ్ అని తెలుసుకున్న గోపీ సంతోషంతో లేచి
నిలబడ్డానికి ప్రయత్నిస్తున్నాడు.
***
No comments:
Post a Comment