ఋణానుబంధ రూపేణా...
టేకుమళ్ల వేంకటప్పయ్య
సమయం రాత్రి మూడు గంటలు. తమ్ముడు మరదలు దిల్లీ వెళ్ళాలంటే ఎయిర్‌పోర్ట్‌లో దింపి తిరిగి వస్తున్నాడు శేఖర్. ఛలికాలం కావడం వల్ల మంచు దట్టంగా ఉంది. కారు గిండీ ఏరియా దాటి సైదాపేట వైపు సాగిపోతొంది. తమ్ముడు అన్న మాటలు గుర్తొచ్చి నవ్వుకున్నాడు. ఫ్లైట్ ఎక్కబోయే ముందు "అన్నయ్యా.. మేము దిల్లీ నుండి అమెరికా వెళ్తే మళ్ళీ నలుగైదు సంవత్సరాలకు గానీ తిరిగిరాము. ఈలోపు మీరు పిల్లల ప్రయత్నం చేయండి. ఇప్పటికే మీ పెళ్ళై ఆరేళ్ళు దాటింది. ఈరోజుల్లో సరోగసీ.. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ లాంటి ఎన్నో సదుపాయాలున్నాయి. ఏదీ కాదంటే ఎవరన్నా అనాథ అబ్బాయిని తెచ్చి పెంచుకోండి" అని గట్టిగా చెప్పాడు. కారు టర్నింగ్ తిరుగుతుండగా ఎదురుగా ఒక తెల్ల కారు నాలుగు తలుపులు బార్లా తెరిచుకొని రోడ్డు మీద అడ్డంగా తిరిగి ఉంది. సడన్ బ్రేక్ వెయ్యకపోతే ప్రమాదం జరిగేదే. పైగా "డేంజరస్ కర్వు" అన్న బోర్డు కూడా అక్కడ ఉంది.
సమయం మూడుంపావు. ఎక్కడా పిట్ట పురుగుకూడా రోడ్డు మీద లేదు. పైగా మంచు కురుస్తోంది. క్రిందికి దిగి చూసిన శేఖరుకు కాళ్ళు వణికాయి. డ్రైవర్ సీటు వైపునుండి ముందు డ్రైవర్, వెనుక వైపు ఒక స్త్రీ సగం నేల మీద సగం కార్లో ఉండి రక్తసిక్తమై ఉన్నారు. ప్రాణం ఎప్పుడో పోయినట్టుంది. ఎడమవైపు ముందు సీట్లో ఒక వ్యక్తి కార్లో భయంకర గాయాలతో మూలుగుతున్నాడు. కాలు ఇంజనులోపలికి వెళ్ళి నుజ్జు నుజ్జు అయింది. వెనుకవైపు సీటు నుండి ఒక ఐదారేళ్ళ పిల్లవాడు రోడ్డుమీద పడి పోయి ఉన్నాడు. తలపై గాయాల కారణంగా రక్తం కారిపోతున్నది. చేతులూ కాళ్ళూ ఆడిస్తున్నాడు.యాక్సిడెంటు జరిగి రెండు-మూడు గంటలయి ఉండవచ్చు. వెంటనే ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని తన కారు వెనుక సీట్లో పణుకోబెట్టాడు. అతని దగ్గరకు వెళితే జేబులోని పర్సు ఆధార్, పాన్ వంటివి నేలమీద పడి ఉన్నాయి.
వాకిట్లోనుంచే కంగారుగా "సీతా! సీతా!" అంటూ గావు కేకేలు పెట్టాడు. ఆమె బద్దకంగా వళ్ళు విరుచుకుంటూ తలుపు తీసి "ఏమిటా అరుపులు? ప్రక్క అపార్ట్మెంట్ వాళ్ళు కూడా లేచి ఉంటారు మీ అరుపులతో" అంటూ ఎత్తుకొన్న బిడ్డ రక్తం చారలను చూసి నివ్వెరపోయింది "ఏవరబ్బాయి వీడు? ఏమైంది? రక్తమేంటి?" అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.. శేఖర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా లోపలికి తీసుకుపోయి బెడ్ మీద పడుకోబెట్టి. "ష్..ష్..గొడవ చెయ్యకు!" అని సైగ చేసి జరిగినదంతా బెడ్రూములోకి తీసుకువెళ్ళి చెప్పాడు. సీత గుండెల మీద చేతులేసుకుని.."ఏమన్నాపోలీసు గొడవలు అవీ అవుతాయేమో! నాకు భయంగా ఉంది" “వీడు దేవుడిచ్చిన కొడుకుగా భావించు. కలిసొచ్చేవేళ నడిచొచ్చే కొడుకులు పుట్టడమంటే ఇదే! ఎంత అందంగా ఉన్నాడో చూడు" అని ఆమెకు తెలీకుండా మెడలో ఉన్న సిలువ గొలుసు తీసి జేబులో వేసుకున్నాండు. శేఖర్ ఫామిలీ డాక్టరును పిలిచి "మా చుట్టాలబ్బాయి. స్కూటరు మీదనుంచి పడిపొయ్యాడు" అని చెప్పి వైద్యం చేయించాడు. డాక్టరు ఏమీ అనకుండా చివరలో "దెబ్బ తగిలిన మూడు గంటలకా వైద్యం? ఈలోపు ఆ అబ్బాయికి ఏమైనా అయితే?" అని ఏక్సిడెంటు వలన కలిగిన షాక్ వల్ల ఇతనికి మాట రావడంలేదు. అందుకే అలా ఉన్నాడు. ఒకసారి ఎం.ఆర్.ఐ స్కానింగ్ తీయించండ”ని చెప్పి, పేరడిగాడు. శేఖర్ ఏమి చెప్పాలో తెలీక "దేవి ప్రసాద్" అనేశాడు. మధ్యాన్నం సమయంలో వచ్చి చూశాక “మెదడులో బ్లడ్ క్లాట్ అవడంవల్ల మాట రాలేదు. నిదానంగా వస్తుంది. భయం లేదు. స్పీచ్ దెరాపీ చెయ్యించండి." అన్నాడు.
* * *
ఆరోజు సాయంత్రం ఆఫీసునుంచీ వస్తూనే "సీతా.. మనకు హైదరబాదు ట్రాన్స్ఫర్ అయింది. నాలుగు రోజుల్లో అక్కడ రిపోర్ట్ చెయ్యాలి" అంటూ కాఫీ తాగుతూ పేపరు తెరిచాడు. “సైదాపేటలో ఘోర కారు ప్రమాదం” అని వివరాలు ఇచ్చారు. చనిపోయినవారి ఫోటోలు అవీ వేశారు. శేఖర్ ఆ పేపరును సీత కంట పడకుండా అత్యంత బధ్రంగా బీరువాలో పెడుతూ దానితో పాటూ పిల్లాడి మెళ్ళొ ఉన్న సిలువ గొలుసు తీసి లోపల జాగ్రత్తగా పెట్టాడు.
* * *
కాలచక్రం ఎవరికోసమూ ఆగదు. ఇరవై వసoతాలు గిర్రున తిరిగాయి. దేవి ప్రసాద్ ఎస్.బి.ఐ లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. "నాన్నా! నేను వచ్చే సోమవారం డ్యూటీలో చేరుతున్నాను. చెన్నైలో పోస్టింగ్ అన్న మాటకు ఉలిక్కిపడ్డాడు శేఖర్. "చాలా సంతోషం చెన్నైలో యే యేరియా బాబూ!" అన్న మాటకు "సైదాపేట నాన్నా" అన్నాడు. మరోసారి తెలీని భయం ఆవహించింది. "జాగ్రత్త బయట ఎక్కడా తిరక్కు. టైం కాగానే రూం కు వచ్చెయ్" అన్న జాగ్రత్తలకు దేవి నవ్వుకున్నాడు.
* * *
ఫ్రెండ్స్ సాయంతో పీ.జీ లో చేరిన దేవి, అక్కడి అన్నం…సాంబారు గొడవకు మొహం మొత్తి, వండుకొని తినడం ఉత్తమమని అనుకొని ఒక ఆదివారం ఇంటి వేటకై బయలుదేరాడు. తిరిగి తిరిగి అడయార్ యేరియా చేరుకున్నాడు. ఆనంద భవన్లో టిఫిన్ చేసి నిదానంగా ఎలాగైనా రూం సంపాయించాలని తిరుగుతున్నాడు. పద్మప్రియ హాస్పిటల్ ప్రక్కన పెద్ద పెద్ద ఇళ్ళుండడంతో ఆ లైనులో ఒక ఇంటి ముందు ఆగాడు. టులెట్ బోర్డ్ అయితే లేదు కాని చాల పెద్దదా ఇల్లు. లోపల ముందు భాగంలో చిన్న ఫౌంటెన్ లాంటిది ఉండడం చూసి కొంచెం తికమక పడ్డాడు. అక్కడి పరిసరాలు బాగా పరిచితం అన్నట్టు అనిపించి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. ఫౌంటెన్‌లో చేపలు ఉండడంతో ఒక చిన్న కర్ర ముక్క తీసుకుని దానితో నీళ్లను తిప్పుతూ ఆడుకుంటున్నాడు. ఇంతలో వీల్‌ఛైర్‌లో ఒక వ్యక్తి వచ్చాడు. వయసు షుమారు 55-60 ఉండొచ్చు. పెద్ద తెల్ల గడ్డం ఉంది. "ఎవరు కావాలి బాబూ!" అన్నాడు. వెంటనే పైకి మడచిన షర్టు చేతులను క్రిందికి దించి కర్చీఫ్‌తో తుడుచుకుంటూ, అతన్ని చూడగానే ఎప్పుడో చూసినట్టు పరిచయం ఉన్నట్టు అనిపించింది. తన గాబరాను దాచి "సార్! ఇక్కడ రెంటుకిచ్చే రూములు ఏవైనా ఉన్నాయా?" అందుకే వచ్చాను అని పరిచయం చేసుకున్నాడు. "అవును... కుడి చేయి మణికట్టు పైన ఆ చక్రం ఆకారంలో ఉన్న పచ్చబొట్టు ఏమిటి? ఎవరు వేయించారు" అన్న ప్రశ్నకు తెలీదంకుల్! చిన్నప్పటినుండి ఇలాగే ఉంది" అన్న సమాధానం విని కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నాడు."బాబూ! లంకంత కొంప! కానీ నావాళ్ళెవరూ లేరు. కారు ప్రమాదంలో పోయారు. అద్దెకివ్వాలన్న ఆలోచన లేదు… కానీ నిన్ను చూశాక ఇవ్వాలనిపిస్తోంది" అనగానే “ధ్యాంక్స్ అంకుల్. రూము చూడొచ్చా! అంటూ అతనితో హాల్లోకి వెళ్ళారు. హాల్లో తగిలించి ఉన్న ఫ్రేములు, పటాలు చూసి "అంకుల్! కుడి వైపు గదిలో మేరీమాత బొమ్మ ఉందా?" అనడగ్గానే "అవును నీకెలా తెల్సు?" అనడిగాడు. "ఏమో అంకుల్ అలా అనిపించింది అంతే..ఎందుకో తెలీదు. ఎప్పుడన్నా వచ్చానేమో అనిపిస్తున్నది" అన్నాడు. కుడి వైపు గదిలో అతను, భార్య చిన్న పిల్లాడు ఉన్న ఫొటో చూసి "ఈ అబ్బాయెవరు అంకుల్?" అనడిగాడు. నా భార్య కుసుమ మా బాబు డేవిడ్. ఇరవై సంవత్సరాల క్రితం పెద్ద కారు ఆక్సిడెంటులో పోయారు. అప్పటినుంచీ జీవచ్ఛవంలా బతుకుతున్నాను". "అయాం సారీ అంకుల్" అని అలాగే గదిలో ఉన్న వస్తువులను చూస్తూ.."మా ఇంట్లో కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేదనిపిస్తున్నది అంకుల్" అన్నాడు.
* * *
"నాన్నా! మొత్తానికి రూము సంపాయించాను" అని సంతోషంగా ఫోన్ చేసి "ఇంక మీరు అమ్మ రావచ్చు ఇక్కడికి అప్పుడప్పుడూ అన్నాడు. "ఎక్కడ రూము?" అన్న దానికి "అడయార్‌లో!... పెట్రోలు బంకు దగ్గర…. హవుసు ఓనర్ కృపావరం అంకుల్. చాలా మంచి ఆయన" అవునూ.. మీకు చెన్నై పరిచయమేనా?" అనాడు. "మేము అక్కడ ఏడేళ్ళు ఉన్నాం బాబూ!" అన్నాడు.
శేఖర్ ఫోను పెట్టాక సీత వంటపనిలో ఉండగా బీరువాలో పేపరు తీసి మళ్ళీ ఒక సారి చూశాడు. "యాక్సిడెంటు గురయిన వ్యక్తి అడయారుకు చెందిన కృపావరంగా, భార్య కరుణగా ఆధార్, పాన్ కార్డులద్వారా గుర్తించి ఇంటికి చేర్చారు. కరుణ అక్కడికక్కడే మరణించగా కృపావరం కోమాలో ఉన్నాడు" చదివి భృకుటి ముడివేశాడు. వెంటనే కాగితాలు లోపల పెట్టేసి వచ్చాడు.
* * *
ఆరోజు శనివారం. అమ్మానాన్నలను సెంట్రల్నుండి ఇంటికి టాక్సీలో తీసుకుని వచ్చి వీల్‌ఛైర్‌లో ఉన్న కృపావరంకు పరిచయం చేశాడు. చూడగానే ఆనాడు కారు ముందు సీట్లో కాళ్ళు ఇరుక్కుని మూలుగుతున్న దృశ్యం గుర్తొచ్చి ఏమీ తెలీనట్టు కామ్ గా ఉండిపోయాడు. సీతకివన్నీ తెలీదు కాబట్టి మామూలుగా మాట్లాడుతోంది.
"నాన్నా నీకో విషయం చెప్పాలి. అంకులుకు రేపు హార్ట్ ఆపరేషన్ అట. ఈరోజు మధ్యాన్నం హాస్పిటల్లో చేరుతున్నాడు. నువ్వూ నాతో వస్తావా? అంకులుకు కాస్త ధైర్యంగా ఉంటుంది" అనగానే ఆయన బంధువులు ఎవరూ లేరా? అన్న మాట విని హాల్లో వీల్‌ఛైర్‌లో తిరుగుతున్న అతను "సార్! మా తమ్ముడు గోవాలో ఉన్నాడు. ఒక పెద్ద చర్చి్లో పాస్టర్. చాలా బాధ్యతమైన ఉద్యోగం అందుకని.." అన్నాడు. "ఓకే సార్.. నేనూ వస్తాను ఎన్ని గంటలకు? అన్నాడు ఇంకేమీ అనలేక.
మధ్యాన్నం భోజనాలయాక "రెడీ అవండి అంకుల్" అన్నాడు. కృపావరం "నాయనా దేవీ ఒక్కసారి ఈ మందులు తెస్తావా?" అని ఒక చీటీ ఇచ్చాడు. "అక్కడే కొనుక్కుందాం అంకుల్" అన్న మాటకు "కాదు బాబూ..ఇక్కడ వేసుకుని బయలుదేరాలట" అన్నమాటకు చీటీ తీసుకుని రోడ్డు మీదకు వెళ్ళాడు. సీత వంటయ్యాక క్లీనింగు పని లో ఉంది. కృపావరం శేఖర్‌ను ఒక్కసారి లోపల గదిలోకి రమ్మని సైగ చేశాడు. బీరువా తెరచి కొన్ని పత్రాల కట్టను ఆయన వీలునామాను ఇచ్చి భోరుమని ఏడ్చాడు. "అయ్యో ఇదేమిటి సార్" అన్నాడు శేఖర్. నాకు తెలుసు శేఖర్గారూ నేనిక బతకను. ఆర్టెరీస్ అన్నీ ఘోరంగా డామేజీ అయ్యాయట. కేవలం నా రిక్వెస్టు మీద ఆపరేషన్ చేస్తున్నారు. ఒక్క విషయం చెప్పాలని పిలిచాను అని అటూ ఇటూ చూసి "దేవి నాకొడుకే అన్న విషయం నీకూ తెలుసు. నాకూ తెలుసు. కానీ ఇద్దరం ఇప్పటి వరకూ బయటపడలేదు. నేను ఇప్పుడు మధ్యలో వచ్చి మీ అనుబంధాన్ని దూరం చేసేంత చెడ్డవాణ్ణి కాదు. నా తదనంతర కార్యక్రమాలన్నీ ఎలా చేయాలి. ఎవరిని పిలవాలి అనేవి అన్నీ ఆ కాగితాల బొత్తిలో ఉన్నాయి. జరిపించే బాధ్యత మీకే అప్పజెప్పుతున్నాను". అని కాగితాల కట్టను దాచమని చెప్పాడు.
ఇంతలో దేవి ట్యాబ్లెట్లతో వచ్చేసరికి ఏడుపు దిగమింగుకుని ఒకసారి యేసుక్రీస్తుకు వారి పద్ధతిలో నమస్కరించి కారెక్కాడు. కారులో దిగులుగా ఉన్న కృపావరాన్ని, నాన్నని చూసి విషయం అర్ధంగాని దేవి హాస్పిటల్లో చేర్చి డబ్బులు కట్టాడు.
* * *
మూడురోజుల తర్వాత హాస్పిటల్ వాళ్ళిచ్చిన కృపావరం పార్ధివదేహంతో ఇంటికి చేరి కార్యక్రమాలు జరిపించారు. ఆ తర్వాతి రోజు గోవా నుండి వచ్చిన కృపావరం తమ్ముడు శేఖర్‌ను వెంటనే ఇళ్ళు ఖాళీ చేయమన్నాడు. తను స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటిచాడు అందరి ముందూ. వాళ్ళలో ఉన్న లాయర్ సుబ్రమణియన్ ఆయన్ను బయటికి తీసుకుని వెళ్ళి ఆస్తి దేవి పేర రాసిన విషయం చెప్పగా "ముప్పై కోట్ల ఆస్తి ఎలా వదులుకుంటామండీ.. ముక్కూ మొహం తెలియని వ్యక్తికి కట్టబెడితే చూస్తుండేంత వెర్రిబాగుల వాణ్ణా? కోర్టుకీడుస్తాను" అని పెద్దగా అరిచేసరికి అక్కడికి శేఖర్ వచ్చి.. "సార్.. కృపావరం కొడుకే దేవీ! ఆయనకు ఆవిషయం ఇన్నేళ్ళ తర్వాత బహిరంగంగా చెప్పడం ఇష్టంలేదు. దయచేసి గొడవ చెయ్యకండి" అన్నాడు. వెంటనే పాస్టరు దేవి వద్దకు వచ్చి కౌగలించుకుని ఒక్కసారి తనివితీరా వలవలా ఏడ్చి టాక్సీ ఎక్కి సాగిపోయాడు. ఇదేమీ అర్ధంకాని దేవి అవాక్కయి అలా చూస్తున్నాడు. దూరంగా ఎక్కడో మైకులో ""జననం ఒరువళి మరణం పలవళి...కాలయిల్ కెప్పదో పాసమేనుం తాయ్మొళి"" అన్నపాట వస్తూ ఉంది.
* * *
No comments:
Post a Comment