శ్రీధర మాధురి - 91 - అచ్చంగా తెలుగు

శ్రీధర మాధురి - 91

Share This

 శ్రీధర మాధురి - 91

(పూజ్యశ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ అమృత వాక్కులు)


ఒక నవరాత్రికి నేను అడవిలో ఉన్నాను. ఉదయం 10 గంటల సమయం, ఉజ్వలమైన సూర్యకాంతి అలముకున్నా, ఇంకా చల్లగా ఉంది. నాకు అప్పుడే గాజులు, పట్టీల శబ్దం విపించింది. నేను చుట్టూ చూసాను. నాకొక చెట్టు మీద ఒక జత గాజులు కనిపించాయి. కొంత సమయం తరువాత, తిరిగి అదే శబ్దం వినిపించింది. ఇంకో చెట్టుకి మరొక జత గాజులు కనిపించాయి. ఆ రెండు చెట్లు కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. రెండిటీ మొదళ్ళూ కలిసి జంటగా కనిపిస్తున్నాయి. కొంత సమయం తరువాత ఒక వృద్ధ స్త్రీ, అడవిలో అత్యంత ప్రయాసతో నడుస్తూ అక్కడకి వచ్చింది. ఆమె చాలా అలసి ఉంది. నా సంచిలో ఉన్న కాసిని నీళ్ళు, బిస్కట్లు, పళ్ళూ ఇచ్చాను. ఆమె సంతోషంగా తీసుకుని తింది.నేనామెకు చెట్టుకు వేలాడుతున్న పట్టీలు చూపించి, అవి ఏంటి అని అడిగాను. ఆమె, ఎవరో చెట్లని ప్రార్ధించి అవి కట్టి ఉంటారు అంది. నేను, 'నాకెందుకనో ఎవరో అవి వేసుకొని సమీపంలో పరిగెడుతున్నట్లు అనిపించింది ' అన్నాను. ఆమె, గాలికి చెట్లు ఊగుతుండడంతో నీకలా అనిపించి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోయింది. నేను కూడా అక్కడనుంచి బయలుదేరి, దాదాపు 5 గంటలు నడిచి చిన్న కాలువ వద్దకు చేరుకున్నాను. నేను స్నానం చేసి, బయటకు వచ్చి బట్టలు వేసుకుంటుండగా, మరొక సారి గజ్జల సవ్వడి వినిపించింది. నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. నేను అక్కడ గాజులూ, గజ్జలూ వేలాడుతూ చూసిన చెట్లకిందే మరలా నిల్చుని ఉన్నాను. మరల అదే వృద్ధ స్త్రీ అక్కడకు వచ్చింది. ఆమె నవ్వి, 'నిన్ను మరొక సారి కలుకోవడం నా అదృష్టంగా భావిస్తాను', అంది. నాకాశ్చర్యం వేసింది. సరిగ్గా నడవలేని స్త్రీ, ఇంత దూరం ప్రయాణించి, ఇక్కడకు ఎలా వచ్చింది. నేను మరొక్క సారి ఆమెకు చెట్లను చూపించి అవి ఇక్కడకు ఎలా వచ్చాయి అని అడిగాను. ఆమె నవ్వి అంతర్ధానం అయ్యింది. అప్పుడు నాకు ఆమె ఎవరో తెలిసింది. ఆమె 'చెట్టికులంకారై భగవతి '. చెట్లు, ఆమె స్వరూపాలు . ఆమెను 'వృక్ష భవాని ', 'వనదుర్గె ' అంటారు . ఇప్పటికీ నేను చాలా ప్రయోగాలు ఆ చెట్ల కింద చేస్తుంటాను. అంతా దైవానుగ్రహం.

No comments:

Post a Comment

Pages