తల్లియుదండ్రియు మరి దైవము నాతడే కాక - అచ్చంగా తెలుగు

తల్లియుదండ్రియు మరి దైవము నాతడే కాక

Share This
తల్లియుదండ్రియు మరి దైవము నాతడే కాక
డా. తాడేపల్లి పతంజలి 




రేకు: 0335-04  సం: 04-205


పల్లవి: 

తల్లియుదండ్రియు మరి దైవము నాతడే కాక


యెల్ల జీవులకు మరి యెవ్వరింక దిక్కు


చ.1: యీ సంసారమునకు యితడె దిక్కు నే-


జేసేటిచేతలకెల్ల శ్రీపతే లోను


పాసిపోడెప్పుడు నన్ను బందువుడితడే నాకు


దాసుడైనవాడు హరిదగదు దూరగను


చ.2: చావుబుట్టుగులవేళ సతము నీతడే


సావి భోగములకు నిచ్చకుడీతడే


భావములోపల నుండుప్రాణ మీతడే నాకు


దైవము దూరగనేల తనకేమి వచ్చినా


చ.3: తలపులోపలికి యీదైవమే తోడు


యిలగలిమిలేములు కీతడే తోడు


పలుకులోపల నుండుభాగ్య మీతడె నాకు


కొలిచి శ్రీవేంకటేశుగొసరగనేటికి


భావం

పల్లవి:

తల్లియు తండ్రియుదైవము ఆ విష్ణుమూర్తియే కదా !

ఎల్ల జీవులకు ఇక ఎవరు దిక్కుగా ఉన్నారు? (విష్ణువే దిక్కని భావం)

.1:

ఈ సంసారమునకు విష్ణువే దిక్కు.నేను చేసే అన్ని పనులకు  లక్ష్మీపతియే మొదలు.(అతనే మొదలుపెట్టిస్తాడనిఅతని పనులే మొదట చేస్తానని భావం)

నన్ను ఎప్పుడు  విడిచిపెట్టడు నాకు ఇతడే బంధువు.

దాసుడైనవాడు ఎప్పుడూ హరిని నిందించకూడదు.అది తగని పని.

.2:

నా చావు పుట్టువుల సందర్భంలో నిత్యము ఉండేవాడు ఇతడే.

భ్రాంతి కొలిపే  నా భోగములకు ఇంపైన మాటలాడువాడు ఇతడే.( మాయ కప్పుతాడని భావం)

నా భావములోపలనుండుప్రాణము ఇతడే .

తనకేమి వచ్చినా దైవమును నిందించుట ఎందుకు? (నిందించకూడదని భావం)

.3:

తలపులోపల  ఈ వేంకటేశ దైవమే నాకు తోడు.

ఈ భూమిలో సంపదలకుపేదరికానికి ఇతడే తోడు.

నా పలుకులోపల ఉండు భాగ్యము ఇతడే.

శ్రీవేంకటేశుని కొలిచి  మఱి కొంచెమిమ్మని యాచించుట ఎందుకు?

ఆయనను కొలిస్తే చాలుయాచించుట అనవసరమని మనకు కావలసినది ఆయనే ఇస్తాడని భావం)

 ***

No comments:

Post a Comment

Pages