శ్రీరుద్రంలో విశేషాలు - 7
ఆదిత్య శ్రీరామభట్ల
వందే మంగళరాజతాద్రినిలయం వందే సురాధీశ్వరం,
వందే శంకరమప్రమేయమతులం వందే యమద్వేషిణమ్ ।
వందే కుండలిరాజకుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్ ॥
తొమ్మిదవ అనువాకం:
'నమో ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ నమః.... ' అనే మంత్రంతో ఈ అనువాకం ప్రారంభం అవుతుంది. ఇందులో మొత్తం 19 మంత్రాలున్నాయి. వీటిని 'అన్యథా నమస్కార' మంత్రాలంటారు.
పరమేశ్వరుడు 'శుక్కభూముల'లో ఉండువాడని, మార్గదర్శిగా మనకు మార్గాన్ని అంటే 'మోక్షమార్గ'మును చూపువాడని, 'బీడు భూముల'లో నివసించువాడని, ఉత్తమమైన అంటే సారవంతమైన భూములలో పరమేశ్వరుడు ఉంటాడని ఈ అనువాకం చెబుతుంది. అంటే భగవంతుడు ఉత్తమస్థానము, అధమస్థానము అని చూడకుండా అన్నీ చోట్లా ఉంటాడని అంతరార్థము.
పరమేశ్వరుడు జటాజూటము కలవాడని, తన భక్తులను రక్షించే విషయంలో ముందుండువాడని, కొష్ఠము అంటే పశువుల కొట్టములో ఉండువాడని, గృహములలో ఉండువాడని, హంసతూలికాదితల్పములపై పడుకునేవాడని, అందమైన గృహములలో ఉండువాడని అలాగే ముళ్ళకంపలలోనూ, గుహలలోనూ పరమేశ్వరుడే ఉంటాడని ఈ అనువాకం చెప్తుంది.
అలాగే లోతైనా నీళ్ళల్లో, మంచు కణాలలో కూడా ఉంటాడని ఈ అనువాకం చెప్తుంది. దుమ్ముధూళి కణాలలోను ఉంటాడని అదేవిధంగా మట్టికణాలలోనూ ఉంటాడనీ, ఎండిన కర్రలలోనూ, నీటిశాతము ఎక్కవగా ఉన్న కర్రలలోనూ లేదా చెట్టుకాండాలలోనూ ఉంటాడని ఈ అనువాకం చెప్తుంది. దృఢమైననేలలలోను, మట్టిగడ్డలలోనూ ఉంటాడని అలాగే సమతలభూములలోను, నదులలోని అలల్లోనూ, ఆకుపచ్చని ఆకులు, ఎండిన ఆకులలోనూ ఉంటాడని, ఈ అనువాకం చెప్తుంది.
పరమేశ్వరుడు అస్త్రములు ధరించువాడని, శత్రువులను సహరించువాడని, తక్కవ బాధించువాడని, ఎక్కవగా బాధించువాడని అంటే తనను ఆశ్రయించినవారి బాధలు తగ్గించువాడని, తన భక్తలను కష్టపెట్టేవారిని ఎక్కువగా బాధిస్తాడని చెప్పుకోవచ్చు. తన భక్తలకు అష్టైశ్వర్యాలు ప్రసాదించువాడని, దేవతల హృదయాలలో నివసించువాడని, దేవతల హృదయాలయాలలో పరంజ్యోతిగా ఉంటూ తనను ఆశ్రయించినవారి కోరికలు తీరుస్తాడని, పాపాలను నశింపచేస్తాడని, అన్నీ క్షేత్రాలలో ఉంటాడని ఈ అనువాకం చెప్తుంది.
నమఃశివాయ
( ఇంకా ఉంది )
No comments:
Post a Comment