ఎల్లమంద - అచ్చంగా తెలుగు

ఎల్లమంద

(మాజొన్నవాడ కధలు)

- టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


ఉదయం ఆరు గంటల సమయం. దూరాన మైకులో వస్తున్న కామాక్షమ్మ భక్తి గీతాలు వింటూ ఊరి జనమంతా ఆనంద తన్మయత్వంలో మునుగుతూ ఎవరి పన్ల మీద వాళ్ళున్నారు.  జంగిడి గుంపులను మేతకు తోలుకొని పోతున్నారు సేద్యగాళ్ళు. వచ్చే నెలలో కరణంగారింట్లో పెళ్ళని  చెప్పడం వల్ల కుట్టమన్న చెప్పుల జతలు దీక్షగా కుడుతున్నాడు ఎల్లమంద.

"ఏయ్...మందా...రెడ్డిగారు బిలుస్తున్నారు.. గబాల్నొచ్చెయ్" అని చేతి కర్రను నేల మీద కొడుతూ నరిసిమ్మయ్య అన్న మాటలకు తలెత్తి చూశాడు.

"ఏం కొంపమునిగింది మళ్ళీ..."

"ఏమో నేను రోడ్డుమీదుంటే జెప్పారు. మందల తెలీదు.. గబాల్నెళ్ళు.. ఆయనకసలే ముక్కుమీద కోపం" అంటూ వెళ్ళిపోయాడు.

"ఈడికి తెలిసినా చెప్పడు. అన్నీ రహస్యమే ఈడికి. ...రెడ్డి కోపాలన్నీ మా మీదే! రెడ్డమ్మను ఒక్కమాటనమను...ఈడ్చి కొట్టుద్ది. పొయినప్పుడల్లా ఏదో ఒక అవమానం చేస్తుంటాడీ రెడ్డి. ఎంత మాదిగోళ్ళమైనా మాకూ కాస్త ఆత్మాభిమానం ఉందని అర్ధం చేసుకోడు. ఛీ..ఎదవ బతుకులైపొయినాయి" అని గొణుక్కుంటూ బయల్దేరుతుంటే భార్య "ఏడికయ్యా.. ఇంత పొద్ద పొద్దన్నే" అంది. "రెడ్డిగారు బిలిచారంట. తప్పుతుందా! హు!" అని భుజం మీదున్న  తుండుగుడ్డ ఇదిలించుకుని మీదేసుకుని  బయల్దేరాడు.

వెళ్ళేసరికి  రెడ్డి వరండాలోనే ఎవర్తోనో మాట్లాడుతున్నాడు.  "రారా మందా..రా.. ఏంలేదురా.. అట్ట గొడ్ల కొష్టాం కాడికి బదా.. చెప్తా..

ఈ బర్రెగోడ్డు మొన్నటిదాకా బాగనే ఉంది ఏమయిందో తెలవదు. నిన్నమద్దేళో.. సందేళప్పుడో.. అనుకుంటా.. పుటుక్కున చచ్చింది. పొద్దన తలమనిషి చెప్తే తెలిసింది. తీసుకొనిపో..అర్జెంటుగా.. వెయ్యిరూపాయలీ చాలు. ఎక్కువేం బల్లా నాకు"

"అయ్యా..యెయ్యి రూపాయలా..మామూలుగా ఇచ్చే ఆరొందలిస్తానయ్యా..పిల్లలు గలోణ్ణి. ఆంత లేవయా నా కాడ."

"ఏందీ.. నీ కాడ డబ్బుల్లేవా..ఆపరా..ముడ్డితో నవ్వతారు ఎవరన్నాఇన్నాగానీ...మందా! ఎదవ కబుర్లు జెప్పబాక. కొడుకుని దర్జాగా..నా కూతురు జదివే కాలేజీలోనే  ఇంజినీరింగు చదివిస్తున్నావు..అన్నిటికి మాత్రం బీదేడుపులేడస్తా ఉంటావు" మండిపడ్డాడు.

"అయ్యా..నేనేం వాడి చదువుకు పైసా బెట్టడంలా.. వాడే గవర్నమెంటు డబ్బుల్తో జదువుకుంటున్నాడు"

"అవన్నీ సరేలే గానీ బర్రెగొడ్డును వెయ్యిచ్చి తీసుకుపో వాసన గొడతా ఉండాది"

"అయ్యా..నాకాడ లేవయ్యా.. ఆరొందలైతే ఎట్నోట్టా జేసిస్తా. దాని చర్మం చెప్పులు గుట్టినా అంతకంటే గిట్టుబాటు గాదయ్యా..."

"రేయ్..నాకు కోపం దెప్పీబాక.. నెల్లూర్లో  ఉంటున్న కాముడి కొడుకు.. రాముడు గాడు.. వెయ్యిరూపాలిత్తాడంట గొడ్డుకు. నువ్వేదో మనూరోడివని… నీకిత్తా ఉండా! అర్ధం జేసుకో..అంత పైత్యం పనికిరాదు మందా!"

"సరేయ్యా. నాకాడంతలేదు..ఆడికే ఇవ్వండి. పనుండాది నే ఎల్తన్నా..దండాలు" 

ఎల్లమంద వెళ్ళిపోయాక ఏమనాలో అర్ధం కాలేదు రెడ్డికి. కాసేపు ఆగి చుట్ట వెలిగించి పొగ వదులుతూ.. "రేయ్..సుబ్బా..చూసినావురా.. ఈ మాదిగోడి గీర.."

"అంతే రెడ్డీ.. ఈళ్ళకు రెండుపూట్లా కడుపు  నిండా తిండి ఉంటే మనమాటేం ఇంటారు. గవర్నమెంటోళ్ళు కూచో బెట్టి మేపతా ఉండారు ఈళ్ళని. అన్నీ ఇంటికాడికి దీసుకొచ్చి ఇస్తా.." అని వత్తాసు పలికాడు.

"ఆ..రాముడిగాడికి ఫోన్ జెయ్యి గబాల్న. వాసనొస్తా ఉంది. కడుపులో తిప్పతా ఉంది. కూడు గూడా తినబుద్ధిగాదు నాకు"

రాముడు తొట్టి-ఆటో తీసుకుని రావడం బర్రెగొడ్డు శవాన్ని తీసుకొని పోవడం గంటలో అయిపొయింది. అనుకున్న వెయ్యిరూపాయలు ముట్టినందుకు పరమానంద పడ్డాడు రెడ్డి.

  

***


సమయం ఉదయం 10 గంటలు. నారయ్య మిలిటరీలో 15 సంవత్సరాలు పనిచేసి ఏడాది క్రితం సొంత ఊరైన జొన్నవాడకొచ్చి స్థిరపడ్డాడు. మాలాడ, మాదిగాడల్లో మంచి చెడ్డా చూస్తుంటాడు. చదువుకున్న మాల మాదిగ పిల్లలకు నెల్లూరులో వ్యాపారాలు పెట్టుకుని స్థిరపడ్డ తన మిలిటరీ స్నేహితుల దగ్గర పన్లకు పెట్టించడం, దేహదారుఢ్యం బాగున్న వాళ్ళను మిలిటరీకి పంపడానికి వ్యాయామాలు అవీ చేయించడం లాంటివి చేస్తుంటాడు. ఒకరకంగా ఏడాదినుండి అందరికి తల్లో నాలుకలా ఉన్నాడు. తన డబుల్ బారెల్ గన్నును ఆయిలేసి తుడుచుకుంటూ  ఎదురుగా నిలబడ్డ ఎల్లమంద చాయల చూస్తూ.. "ఏందిరా ఎల్లమందా..అట్టున్నావు ఏమైంది" అడిగిన ప్రశ్నకు ఏమీ లేదన్నట్టు తలూపి..నిదానంగా జరిగింది చెప్పి.. "ఎవరికైనా చెబితే కడుపులో ఉన్న బాధ తగ్గుతుందని నీకు చెప్పానయ్యా..            రెడ్డి సమత్సరానికి 4 బస్తాల వడ్లిస్తాడని  అడ్డమైన పన్లన్నీ చెయిపిచ్చుకుంటాడు. పైగా పొలాల్లో పన్లకి మనం బనికిరాము. వాళ్ళ తాలూకు వాళ్ళనే బిలిపిస్తాడు. మాలామాదిగా అంటే నీచంగా చూస్తాడు"

"నిజమేరా! మేము మిలట్రీలో ఎట్టా ఉండేవాళ్ళం. కులం గోత్రం మతం ఏమీ ఉండదాడ"  అని నిట్టూర్చి "మీరంతా బాగా చదువుకోవాల్రా! చదువుతోనే ఏమైనా చెయ్యగలిగేది" 

"ఆ..నా కొడుకు ఇంజినీరింగు చదువుతున్నాడని రోజూ ఏదో ఒక సూటి పోటి మాటలంటూనే ఉంటాడు"

"చూద్దాం. మా బెంగుళూరు స్నేహితుడొకడు, మొన్న ఫోన్‌జేసి.. తొందరలో నెల్లూరులో కరెంటు తయారు జేసే ఫాక్టరీ పెడుతున్నానన్నాడు. అక్కడికి వీలైనంత మందిని మంచి పనోళ్ళను చూడమన్నాడు. పింఛను గ్రాట్యుటీ ఉండే           పనన్నాడు. తొందరపడమాక! పెద్దోళ్ళతో యవ్వారం. ఎం.ఎల్.ఎ తో రాచుకోని పూసుకుని తిరగతా ఉంటాడు. పోలీసోళ్ళు.  ఇంకా అందరూ.. ఆళ్ళపక్కే ఉంటారు. స్వతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళయినా ఇదేందో… అర్ధం గావడంలా!"

"సరేనయ్యా"   

***


సమయం 2 గంటలయింది. ఎం.ఎల్.ఎ ను కలిసే పని మీద నెల్లూరొచ్చిన రెడ్డికి ఆకలి దంచేస్తున్నాది. ఎదురుగుండా బైపాస్ రోడ్డులో కనబడ్డ డవున్‌టవున్ హైక్లాస్ మిలిటరీ హోటల్ ముందు కారాపమని డ్రైవరు రెడ్డీ మాంసం తెగ లాగించేశారు. బ్రేవ్ మని తేంచుకుంటూ బయటికి వచ్చి కారెక్కుతుండగా రాముడు కనిపించాడు.

"మీరెప్పుడొచ్చారు? ఈడున్నారేందయ్యా!" ఆశ్చర్యం ప్రకటించాడు.

"11 గంటలకొచ్చాం రా రాముడూ... టైమా రెండాయింది. కడుపులో ఎలికలు పరుగెడుతుంటే…ఈడ మంచి మాంసం దిన్నాంరా ఇవాళ. అందరూ ఈ హోటల్ గురించి చెబుతుంటే ఏమో అనుకున్నా గానీ ఈ ఊళ్ళోనే సూపర్రా. వస్తా!" రాముడికి నోట మాటలు రాలేదు. ఏమి చెప్తే ఏమి తకరాదులొస్తాయోనని..నివ్వెరపోయి చూస్తుండగా..రెడ్డి త్వరగా కారెక్కి వెళ్ళిపోయాక,  తనకు రావలసిన డబ్బులకోసం హోటల్లోకి వెళ్ళాడు.


***


సాయంత్రం 6 గంటయింది. రెడ్డి కడుపులో బాగా మెలిపెడుతున్నాదని డ్రైవరును బిలిచి "నెల్లూరుకు పదా..కడుపులో ఏందో బాగలేదు. మధ్యాన్నుంచి వాంతులు, బేధులు. అక్కడ ఎక్కువ తిన్నామో ఏందో" అన్నాడు.

"నాగ్గూడనయ్యా! నేనూ జూపించుకోవాల. గబాల్నెక్కండి"

కారు బొల్లినేని హాస్పిటల్‌కు చేరే లోపు దారిలో ఇద్దరికీ విపరీతంగా వాంతులయ్యాయి.

డాక్టర్లు 10 వేలు కట్టించుకుని అన్ని పరీక్షలు చేసే సరికి రాత్రి 9 అయింది. ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి మధ్యాన్నం ఏం తిన్నారని డాక్టర్లు అడగ్గానే విషయం చెప్పాడు రెడ్డి.

అక్కడున్న పిల్లడాక్టరు మొబైల్లో ఒక వీడియో పెట్టి, డాక్టర్ ఇది చూడండి అంటూ.. పెద్ద డాక్టరుకు చూపిస్తున్నాడు. రెడ్డి గూడా చూస్తున్నాడు పక్కనుంచి ఓరకంటితో  ఆసక్తిగా.. ఏందా అని..

"నగరంలో డవున్‌టవున్ హోటల్లో ఈరోజు ఘోరం జరిగింది. పొట్టేలు మాంసంలో కుళ్ళిన బర్రెమాంసం కల్తీ జరిగింది. దాదాపు పాతిక మంది నగరవాసులు అస్వస్తులయ్యారు. వారంతా నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. రిపోర్ట్‌లు అందుకున్న డ్రగ్ఇన్స్పెక్టర్  నగరంలో మిలిటరీ హోటళ్ళపై ఆకస్మిక తనిఖీలు దాడులు నిర్వహించి  దానికి కారణమైన డవున్‌టవున్ హోటల్‌ను  సీల్ చేశారు. హోటెల్ యాజమానిని,  వాళ్ళకు నిత్యం బర్రె మాంసం సప్లై చేస్తున్న రామయ్య అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి  రిమాండులో ఉంచారు" అని వాయిస్ ఓవర్లో చెప్తున్న వీడియో, హోటెల్ లోని దృశ్యాలు చూస్తుండగానే… రెడ్డి అక్కడే పెద్ద వాంతి చేసుకున్నాడు.  

***

మరుసటిరోజు ఉదయం 10 గంటలు కావస్తోంది. నారయ్య ఇంటి ముందు జనం పోగయ్యారు. నారయ్య కుర్చీలో కూర్చుని అందరికి చెప్తున్నాడు.

"ఒరే చూడండ్రా.. ఏడంటే ఆడ తినబాకండి. టవున్లో ఎన్ని ఘోరాలు జరుగుతుండాయో.. మనూరోళ్ళు మనల్ని నమ్మరు. ఎక్కువ డబ్బులు గావాల… ఆశ!  ఎవరు దీసిన గోతిలో ఆళ్ళే పడడం అంటే ఇదే గదా! నాలుగొందలకోసం చూస్తే ఏమైంది చెప్పండి? ఆ రాముడుగాడు ఇంత ఎక్కువ ఎందుకిస్తున్నాడన్న ఆలోచనే లేకపాయె. ఆడికేమన్నా చెప్పుల షాపుందా! ఆడు జేసే పని అదీ ఆడ! అందుకనే పోలీసులు బొక్కలో ఏశారు. దొంగెదవ. ఛీ.. మనూరి పరువు దీశాడు. రెడ్డికి చావు బతుకుల మీదకొచ్చి ఆస్పత్రిలో చేరాడు. ఇరవై వేలు ఖర్చు. నా మాటమీద గౌరవం బెట్టి.. మీరంతా ఒక సారి నెల్లూరు బొల్లినేనికి బొయ్యి రెడ్డిని చూసి రాండి. ఎంతైనా మనకు కావల్సిన వాడే గదా!  అప్పుడైనా అర్ధమవుతుంది మంచేదో చెడేదో! మంచోళ్ళెవరో..మోసం జేసే వాళ్ళెవారో" అని ముగించాడు.


***

No comments:

Post a Comment

Pages