దైవంతో నా అనుభవాలు-2 సమీక్ష
కవర్ పేజీని తదేకంగా కన్నార్పకుండా కొంతసేపు చూసి మైమరచిన మనసును స్వాధీనంలోకి తెచ్చుకుని ఒక్క అనుభవాన్ని చదవడం మొదలెడితే చివరిదాకా పుస్తకం విడవలేము. ఒక్కో కథ చదువుతుంటే, హృదయ పీఠంపై స్వామి కొలువుదీరినట్టనిపించి శరీరం రోమాంచిత మవుతుంది. కళ్లు ఆనందాశ్రుపూరితాలవుతాయి. మళ్లీ, మళ్ళీ..మళ్లీ పుస్తకం చదవడానికి మనసు ఉవ్విళ్లూరుతుంది.
కోరి మరణాన్ని తెచ్చుకున్న సింహాచల
సాహును గురించి చదివినప్పుడు కళ్లలో నీళ్లు తిరిగినా, అది ‘దైవ లిఖితం’
ఎలా అయిందో మొదటి కథలో అర్థమవుతుంది. అసంపూర్తిగా అనిపించిన దేవీ భాగవతంలోని ఒక
కథకు రచయిత కలలో సాక్షాత్కరించిన కొనసాగింపు అందమైన ముగింపు ఎలా అయిందో ‘నర
నారాయణులు’ తెలియజేస్తుంది. కాలం వెనక్కు రాదని, జరిగిన
సంఘటన పునరావృతం కాదనీ మనకు తెలిసిందే, కాని ‘రైలు ప్రయాణం’
కథలో ఈ రెండూ జరిగి మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. వినాయక వ్రతకల్పంలో చదివే
నీలాపనింద నిజజీవితంలో ఎలా అనుభవంలోకి వస్తుందో, దాన్నుంచి
రచయిత ఎలా బైట పడ్డాడో ‘నీలాపనిందలు’లో చదివితీరాలి. అపర కర్మలు చేయిస్తున్నప్పుడు
అందరి మనసుల్లో మెదిలే ప్రశ్న చనిపోయాక ఆత్మ అనేది ఉంటుందా? అని
జీవుడి ఆత్మకు మోక్షం ఎలా కలిగిందో ‘నాన్నగారి మోక్షప్రాప్తి’లో అనుభవపూర్వక వివరణ
ఇచ్చారు రచయిత. మూగ పిల్లవాడు మాట్లాడడం ఎలా జరిగిందో ‘అవిఘ్నాయనమస్తు-2’ చదివి
విస్తుబోతాం. ఢిల్లీకి దగ్గరగా ఉండే రింగస్ ప్రాంతంలోని ‘ఖాటు శ్యామ్’ ఆలయం
వివరాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ అధ్యాయంలోని ఘటోత్కచుడి కొడుకు బర్బరీకుడి కథ
అలరిస్తుంది. ఫ్రాస్ట్ బైట్ కి గురై కాలి నొప్పితో నడవలేకపోయిన రచయిత అరుణాచల
దర్శనం చేసుకుని, అలాగే బాధతో గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత
కాలినొప్పి ఎలా మాయమైందన్నది భగవద్ కృపకు పరిపూర్ణ నిదర్శనం ఇది ‘అరుణాచల
అనుభవం’లో అనుభూతిస్తాం. కుటుంబ సభ్యుల మాటలతో తిరుమల పునః దర్శనాలు సాధ్యం కాదేమో
అనుకున్న రచయితకు ఎలాంటి సమాధానం లభించిందన్నది ‘తిరుమల దర్శనం నాకిక లేదా?’
లో చదవాలి. ‘అభిరామి’ అనుగ్రహాన్ని, దర్శనాన్ని
పొందిన రచయితతో పాటు మనమూ అమ్మను మనసారా వీక్షిస్తాం. కమనీయ అనుభూతిని పొందుతాం.
తిరుమల వేంకటేశ్వరుడికి మనస్ఫూర్తిగా ఇవ్వని దక్షిణలు తీసుకోడన్న వైనం ‘ఋణ
విముక్తి’లో స్పష్టమవుతుంది. ఎవరూ లేని సమయంలో కోనేటి స్నానానికి వెళ్ళి కాలుజారి
మునిగిపోతున్న రచయితను స్వామి రక్షించిన తీరు, శ్రీమన్నారాయణుడు
గజేంద్రుణ్ని రక్షించిన ఘట్టం జ్ఞప్తికి తెచ్చి ‘తిరునల్లార్ లో ఒక అనుభవం’ రచనగా
మైమరపిస్తుంది. బాబా ఉనికిని ‘షిరిడీ సాయిబాబా’ కళ్లకు కడుతుంది. ఇంట్లోకి శ్రీరామచంద్రుని ఆగమనాన్ని
తెలియజేస్తూ ఇల్లంతా అలుముకున్న సుగంధం ‘పోతనగారి సరస్వతీ కటాక్షం’తో మన నాసికల
వరకూ చేరుతుంది. ఇవి కాక అనుకున్నది, ఊహించింది ఎదురుపడే
‘దివ్య సంకేతాలు’, తిరుమల శ్రీనివాసుడితోడి రచయిత అనుభవాలు,
స్వామివారి సేవాబాగ్యంలో పొందిన అనిర్వచనీయ అనుభూతులు చదువుతూంటే
మనసు అలౌకిక ఆనందంతో మూగబోతుంది. నల్లనయ్య కృష్ణయ్య, ఎర్రనమ్మ
రాధమ్మల దివ్య ప్రణయానికి ‘అర్థం’పడుతూ సాగిన ‘సావిరహే తవ దీనా’ రచనకు
సాక్షీభూతంగా రచయిత ఇంట్లోని తులసి రెండు రంగుల్లో కనిపించడం, ఆ తులసిమొక్క ఫోటోని రచయిత మనకోసం పుస్తకం చివర్లో అందించడం మన హృదయాన్ని
ఆనందపారవశ్యంతో ఓలలాడిస్తుంది. రచయిత ఇలాగే భవిష్యత్తులో తనకు ఎదురయ్యే ఇటువంటి
మరిన్ని అనుభవాలు మనతో పంచుకోవాలని కోరుకోవడం ఈ సందర్భంలో సముచితంగా
భావిస్తున్నాను.
సదాశివుడి గంభీరమైన వెనుకభాగంతో
చివరి అట్ట అద్భుతంగా అలంకరించుకుని పుస్తకం పూర్తవుతుంది.
***
ఈ పుస్తకాలను దిగువ లింక్ ల ద్వారా కొనుగోలు చెయ్యవచ్చు. లేదా 8558899478 అన్న నెంబర్ కు వాట్స్ ఆప్ చెయ్యవచ్చు.
https://offers.acchamgatelugu.com/venkatavinodparimi.html
No comments:
Post a Comment