నాన్నా..బుద్ధొచ్చింది!
ప్రతాప వెంకట సుబ్బారాయుడు
ఆరో తరగతి చదివే రాజేష్ ఒకప్పుడు చెడు స్నేహాల జోలికి పోకుండా చక్కగా చదువుకొంటూ ఇంట్లోను, బడిలోను మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు అతని తరగతిలో విక్కీ అనే ఒక పిల్లాడు చేరాడు. ఆ పిల్లాడి అమ్మానాన్నలు పెద్ద ఉద్యోగస్థులవడం, డబ్బుకు కొదవలేకపోవడం వల్ల అతణ్ని గారాబంగా పెంచారు. విక్కీ చేతిలో ఖరీదైన సెల్ ఫోన్ తో పాటు, మరెన్నో కొత్త వస్తువులు ఉండేవి. వాటి ఆకర్షణకు లోనైన పిల్లలు అతడితో స్నేహం చేయడానికి ఉవ్విళ్ళూరేవారు. రాజేష్ వస్తువుల వ్యామోహంలో పడకుండా, విక్కీతో స్నేహం చేయకుండా చాలాకాలం బెట్టుగా ఉన్నాడు.ఒకరోజు రాజేష్ సైకిల్ తొక్కుకుంటూ వెళుతుంటే, పొరపాటున ముందు చక్రం రాయిమీద పడి జారి కింద పడిపోయాడు. అటుగా మరో సైకిల్ మీద వస్తున్న విక్కీ రాజేష్ ను లేపి, అతడి కాలికి, చేతికి గాయమయి రక్తం కారడం చూసి ఆందోళనపడుతూ దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్ళి ప్రథమ చికిత్స చేయించాడు. ఆ రోజు నుంచి విక్కీ అంటే రాజేష్ కి అభిమానం ఏర్పడింది. విక్కీకూడా ఏది తెచ్చినా ముందు రాజేష్ కే చూపించేవాడు. ఇచ్చేవాడు.ఒకనాడు నెలలోని మొదటి తారీకున "రాజేష్, ఇదిగో నువ్వు ఈ నెల చివర్లో కట్టాల్సిన స్కూల్ ఫీజు, పరీక్ష ఫీజులు. నా దగ్గర ఉంటే కర్చయిపోతాయని ఇప్పుడే నీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా దాచుకో" అన్నాడు రాజేష్ తండ్రి విరాట్.మరుసటిరోజు ఆ విషయం విక్కీతో సహా స్నేహితులందరితో చెబితే, 'మీ నాన్న చాలా మంచివాడురా ముందే కట్టాల్సిన ఫీజులు ఇచ్చేశాడు. విక్కీ జేబులో ఎప్పుడూ డబ్బు ఉంటుంది, వాడికి ఇబ్బంది ఉండదు. ఎటొచ్చీ మా నాన్నలే వాళ్ళకున్న బాధలతో అసలు మా ఫీజులు కడతారో, లేదో' అన్నారు బాధగా.ఇది జరిగిన రెండురోజులకు విక్కీ 'అందరం కలసి సినిమాకు వెళదాం, అందరికీ డబ్బు నేనే పెట్టుకుంటా' అన్నాడు.విక్కీ తన జేబులోంచి డబ్బులు తీసి లెక్కేస్తే, ఒకరికి తక్కువ పడ్డాయి. 'అయ్యో, ఇలా జరిగిందేమిటి' అని బాధపడ్డాడు.ఎవరికి వారు తాము సినిమాకి రామని అన్నారు.'అదేం కుదరదు. అందరం వెళ్ళాల్సిందే' అని 'పోనీ ఒకపని చెయ్ రాజేష్, నెలాఖరులో కట్టాల్సిన ఫీజు మీనాన్న నీకు మొన్ననే ఇచ్చేశాడుగా, అందులోంచి ఒక వంద తీసి టికెట్టు తీసుకో. నేను రేపు ఇచ్చేస్తాను' అన్నాడు.రాజేష్ ముందు కొంత తటపటాయించాడు. తర్వాత 'అప్పటికల్లా విక్కీ ఇచ్చేస్తాడులే' అని సరిపెట్టుకొని వాళ్ళతో వెళ్ళాడు.ఆ మరుసటిరోజు నుంచి 'విక్కీ డబ్బు ఇస్తాడేమో' అని ఎదురుచూడ్డం, విక్కీ ఇవ్వకపోవడం, రాజేష్ అడగడానికి మొహమాట పడడం, 'ఆ సమయానికి ఇస్తాడులే' అని సమాధానపడడంతో రోజులు గిర్రున తిరిగిపోయాయి.సరిగ్గా ఫీజు కట్టడానికి రెండు రోజుల ముందు నుంచి విక్కీ బడికి రావడం లేదు. కారణం తెలియదు. 'ఫీజులు ఎలాకట్టాలి' అన్న ఆలోచనతో రాజేష్ బుర్ర వేడెక్కిపోయింది.అంతకుముందు ఒకసారి విక్కీ 'మా అమ్మానాన్నలు నాకు ఎప్పుడు పడితే అప్పుడు డబ్బు ఇవ్వరు. నెలలో ఒకసారే ఇస్తారు. నేనే అప్పుడప్పుడు నాన్న జేబులోంచి, అమ్మ బ్యాగులోంచి డబ్బులు తీసుకుంటాను. మా అమ్మానాన్నలే కాబట్టి అది తప్పేం కాదు' అన్నాడు.రాజేష్ కి ఇప్పుడు ఆ విషయం గుర్తొచ్చింది.ఆ రోజు రాత్రి భయంతో, వణికే చేతులతో తండ్రి పర్సు తీసాడు. అందులో పది వంద రూపాయల నోట్లు ఉన్నాయి. ఒక వంద తీసుకొని మిగతావి పర్సులో పెట్టేసి, అదిరే గుండెతో వెళ్ళి పడుకున్నాడు. ఆ రాత్రి నిద్రపట్టలేదు.మరుసటిరోజు ఉదయం రాజేష్ బడికి సిద్ధం అవుతుంటే, ఒకాయన వచ్చాడు.విరాట్ ఆయనతో "రండి రంగారావుగారూ, ఈ నెల రెండు ముఖ్యమైన కర్చులండి. ఒకటి మా అబ్బాయి ఫీజులు అవి నెల మొదట్లోనే వాడికిచ్చేశాను. ఇహ మిగిలింది మీరు. డబ్బు సర్దుబాటు అవక మూడు నెలల నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అందుకే ఈసారి మీకు ఇవ్వాల్సింది ముందే పక్కన పెట్టాను. ఉండండి ఇప్పుడే తెచ్చి ఇస్తాను" అని లోపలికెళ్ళి పర్సు తెచ్చి అందులోంచి వంద నోట్లు తీసిచ్చి "ఇదిగోండి వెయ్యి" అన్నాడు.ఆ మాట విన్న రాజేష్ గుండెల్లో రాయిపడింది.ఆయన డబ్బు లెక్కపెట్టి "ఇవి తొమ్మిది వందలే ఉన్నాయి"అన్నాడు."లేదండి. నెల మొదట్లోనే మీ కోసం పర్సులో డబ్బు వేరేగా ఉంచాను. ఎంత అవసరం వచ్చినా ముట్టలేదు" అని నోట్లు లెక్కపెట్టాడు. ఆయన చెప్పినట్టే తొమ్మిదే ఉన్నాయి."ఏంటయ్యా, వంద తక్కువుంది కదూ. నేను లెక్క పెట్టకుండా జేబులో పెట్టుకుంటాను అనుకున్నావు. మూడు నెలల క్రితం ఇవ్వాల్సిన బాకీ, పోనిలే ఇన్నాళ్ళకన్నా ఇస్తున్నావనుకుంటే, వంద బొక్క పెడతావా.."ఇలా చాలా మాటలు అని వెళ్ళిపోయాడు.రాజేష్ తండ్రి ముఖం పాలిపోయింది. 'ఎప్పటికప్పుడు అన్నీ సరిగ్గా చూసుకునే నాన్న, ఫీజు డబ్బులు కర్చవుతాయని తనకు ముందే ఇచ్చిన నాన్న, ఈరోజు తన మూలంగా తిట్లు తిన్నాడు' అని రాజేష్ కి ఏడుపొచ్చింది.ఆయన దగ్గరకి వెళ్ళి వెక్కుతూ జరిగింది చెప్పాడు.ఆయన రాజేష్ తల నిమురుతూ "చూశావా, నువ్వు చేసిన తప్పు నన్ను పరాయి వాళ్ళచేత నన్ను ఎన్ని మాటలనిపించిందో. మంచివాళ్ళతో స్నేహం చెయ్యాలి. చక్కటి నడవడిక అలవరచుకోవాలి. మంచి, చెడు రెంటికీ కారణం డబ్బే. అందువల్ల డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిత్వం అనే భవనం నైతిక విలువల పునాది మీద నిర్మించబడాలి. అప్పుడే మన జీవితం బాగుంటుంది. లేదంటే ఎప్పటికైనా కుప్పకూలుతుంది. ఇలాంటి సంఘటన నీ జీవితంలో మళ్ళీ జరగకూడదు. సరేనా"అన్నాడు రాజేష్ కన్నీళ్ళు తుడుస్తూ.'సరే' అన్నట్టుగా తలూపాడు రాజేష్.***
No comments:
Post a Comment