నెత్తుటి పువ్వు - 37 - అచ్చంగా తెలుగు

                                           నెత్తుటి పువ్వు - 37 

మహీధర శేషారత్నం


(జరిగిన కధ : రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో బాగా తాగి, స్పృహ తప్పి పడిపోయిన సరోజ అనే అమ్మాయిని తన స్నేహితుడి గదికి తీసుకువస్తాడు రాజు. మాట వినకుండా మొరాయిస్తున్న ఆమెను, వెనక్కి దింపేస్తానని బెదిరిస్తాడు. రాజు ఆ అమ్మాయిని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తారు  అతడి శ్రేయోభిలాషులు. ఆమెను బట్టల కోటలో పనిలో పెడతాడు రాజు. రాజు చెల్లెలు వసంత అతని ఇంటికి వచ్చి వెళ్తుంది. జ్వరంతో ఉన్న సరోజకు సపర్యలు చేస్తాడు రాజు. బట్టల కొట్లో పనిచెయ్యనని చెప్పేస్తుంది సరోజ. ఒకరోజు లక్ష్మి రాజును సరోజ గురించి నిలదీస్తుంది. ఆమెను ఏమార్చి, సరోజ ఇంటికి వెళ్తుంటాడు రాజు.  కడుపుతో  ఉంటుంది సరోజ. ఆమెను మారేడుమిల్లి అడవులకు  తీసుకు వెళ్తాడు రాజు. బావమరిది వెటకారంతో బాధపడ్డ రాజు శంకర్ కు ఫోన్ చేస్తాడు... శంకరం, పార్వతి దంపతుల పంచన చేరుతుంది సరోజ.) 

అన్నట్టుగానే శంకరం సరోజని కొద్దిపాటి సామానుతోటి తన ఇంటికి చేర్చేసాడు. తన జీవితాన్ని మలుపు తిప్పిన ఆ గదిని వదిలి వెడుతుంటే సరోజకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సరోజనీ, సామానునీ ఆటోలో సర్ది తాను కొంచెం సామాను టి.వి.ఎస్. మీద పెట్టుకుని బయల్దేరాడు. వెడుతుంటే అయ్యో! రాములమ్మ అక్కకి చెప్పలేదే అనుకుంది. అదేమాట అంది శంకరంతో ఈసారి కలిసి చెప్పచ్చులే నేను నిన్ను దింపి స్టేషన్ కి వెళ్ళాలి అన్నాడు.

అలా సరోజ శంకరం ఇంట్లో గదిలోకి చేరింది.

సరోజ గర్భవతి అని పసిగట్టినప్పుడు పార్వతి శంకరంతో అంది.

ఈ విషయంలో మన జోక్యం అవసరమా?” తప్పుడు పనికి సహకరించడం తప్పుకాదా? అంటూ.

నిజమే! కాని నాగరాజు చేసిన తప్పుకు ఇద్దరాడవాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతో తీసుకువచ్చాను. ఎంతైనా నాగరాజు నాకు ఆత్మీయుడు. వాడు ఇంతవరకు ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు. చూద్దాం. సమస్య పరిష్కరించగలమేమో! పార్వతికి ఇష్టం లేకపోయినా మారు మాట్లాడలేదు. పైగా సరోజ మీద మనసులో ఏమూలో జాలి కలిగింది.

పార్వతి రెండు రోజులు తమతో పాటే వంట చేసి సరోజని భోజనానికి పిలిచింది.

రెండోరోజు సరోజ ముఖమాట పడింది.

నా దగ్గర సరుకులన్నీ ఉన్నాయి. వదినా! నేను వండుకొంటానుఅంది చిన్నగా.

నీకు నా వంట నచ్చలేదేమోఅంది పార్వతి చిన్నబుచ్చుకుని

అలా అనకు వదినా! నాకు మీరు తప్ప ఎవరున్నారు?” అంటూ కళ్ళు తుడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది సరోజ.

ఎవరి స్పేస్ వాళ్ళకి ఉండాలి పార్వతీ! నీకయినా రోజు అంటే విసుగు పుడుతుంది. నాలుగురోజులు బాగుంటుంది. ఏదైనా మంచి పదార్ధం చేసినప్పుడో, ఆ అమ్మాయికి నలతగా ఉందనుకున్నప్పుడో ఏదో ఒకటి ఇస్తూండు. అది మంచి పద్ధతిఅన్నాడు శంకరం.

అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఎవరైనా వండి పెడితే బాగుండు అనిపిస్తుంది అనుకొన్నాను.

నిజమే! తను అలా ఫీలయినప్పుడు తప్పకుండా చేసి పెట్టు ఎవరి స్వేచ్ఛ వాళ్ళకుండాలి. ఎదుటి వాళ్ళ జీవితాల్లోకి ఎక్కువగా చొచ్చుకుపోకూడదు.అన్నాడు శంకరం.

పార్వతి మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది అప్పుడే సరోజ శంకరం వాళ్ళింటికి వచ్చి పదిరోజులయింది. ఈ పదిరోజులలో నాగరాజు రాలేదు. ఫోన్ కూడా చెయ్యలేదు. సరోజ మనసు స్థిమితంగా లేకపోయింది. చివరికి ఒకరోజు పార్వతి స్నానానికి వెళ్ళగా చూసి చిన్నగా శంకరం దగ్గర కెళ్ళి నుంచుంది.

శంకరం పేపర్లోంచి తలెత్తి ఏం కావాలన్నట్టు చూసాడు.

సరోజ తల వంచుకుని చిన్నగారాజుబాబు బాగున్నాడా?” అని అడిగింది.

ఊఁ!అని శంకరం పేపర్లో తలదూర్చేశాడు. సరోజ ఇంక మాట్లాడే ధైర్యం చెయ్యలేక వెనక్కి తన గదిలోకి వెళ్ళిపోయింది.

కళ్ళవార నుంచి సరోజను గమనిస్తున్న శంకరం తనలో తను నవ్వుకున్నాడు.

ఎంత ధైర్యం ఈ పిల్లకి? అనికూడా అనుకొన్నాడు మనసులో.

అన్నం తింటూపార్వతీ! నీ కిష్టమైన మహేష్ బాబు సినిమాకు వెడదాంఅన్నాడు.

పార్వతి ముఖం వికసించింది. ఉత్సాహంగా లేస్తూ ఉండండి సరోజకి కూడా చెప్పొస్తానుఅంది.

నీ తెలివి తెల్లారినట్టే ఉంది, మనిద్దరం సరదాగా వెడదామంటే ఆ పిల్లెందుకు మధ్యలోవిసుక్కున్నాడు.

అసలే వట్టి మనిషి కూడా కాదు, పాపం చిన్నపిల్ల సరదాలుండవా? సినిమాహాల్లో మనిద్దరమే ఉండం కదండీ!అంది..

చెయ్యి పట్టి ఆపాడు శంకరం.

మాటకి ముందొకసారి వట్టి మనిషికాదు, వెనకొకసారి వట్టి మనిషికాదు, ప్రపంచంలో ఎవరూ పిల్లల్ని కనటం లేదన్నట్టు, ఇదో విడ్డూరమన్నట్టు మాట్లాడకువిసుక్కున్నాడు.

నిజమే! నాకా అదృష్టం లేదు కనుక నాకు అపురూపమే.పార్వతి కన్నీళ్ళతో అంది. శంకరం బాధపడ్డాడు అది చూసి.

పిచ్చి పార్వతీ! మాతృత్వము గొప్పదే. కాని అదే జీవితము కాదు. జీవితంలో అదొక భాగము మాత్రమే. భగవంతుడు ఎప్పుడు ఇవ్వదలచుకుంటే అప్పుడే మనింట్లో పసిపిల్లలు పారాడతారు. నువ్వు అతిగా ఆలోచించి బాధపడకుఅనునయంగా అన్నాడు.

అంతే లెండి!కళ్ళు తుడుచుకుంటూ అంది, “అందుకేనోయ్! మనలో మనమే సంతోషంగా ఉండాలి. ఆ క్షణంలో జీవించడమే మంచిది. మరి సంతోషంగా సాయంత్రానికి రెడీ అవు. నేను అన్నంతిని టిక్కెట్లు తెస్తాను.

(సశేషం)

No comments:

Post a Comment

Pages