రామం సందిగ్ధం
శారదా తనయ
తను ఎక్కడ దెబ్బతిన్నాడో అర్థం కావడం లేదు రామానికి. రామం అన్నది అనేక తెలుగువాళ్ళ ముద్దు పేరులలాగా రామచంద్రరావు అన్న అతడి పేరుకి ముద్దు పేరు. వాళ్ళమ్మ తమ ఊళ్ళో ఉన్న రాములవారి గుడికి నిత్యమూ వెళ్ళే భక్తకోటిలో ఒకర్తి కావడంతో ఆ శ్రీరామచంద్రుడి పేరే కొడుకుకు పెట్టాలి అనుకుని అదే పేరు వాళ్ళయనకు చెప్పిందట. ఆయన కూడా శ్రీరామ భక్తుడే. కానీ పాత పేరు కదా, కొంచెం కొత్తదిగా ఏదైనా పెడదాం అనుకున్నాడట. కానీ, ఆయన మాటలు సాగనివ్వలేదట ఆవిడ. ఎందుకంటే ఇతడి కంటె ముందు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలకీ పట్టుబట్టి ఆయనకు నచ్చిన ఆధునిక పేర్లే పెట్టాడట శ్రావణి, స్రవంతి అని. ఒక అమ్మాయికైనా సీతా మహాలక్ష్మి అనే పేరు పెట్టాలనుకున్న రామం వాళ్ళమ్మ కల నెరవేలేదు కాబట్టి అబ్బాయి పేరు రాముడిది పెట్టి తీరాలని పట్టుబట్టి నెగ్గించుకుందట వాళ్ళమ్మ. తన చిన్నప్పుడు వాళ్ళమ్మ చెప్పిన ఈ విషయాన్ని తలచుకుని మళ్ళీ విరక్తిగా నవ్వుకున్నాడు రామం.
రామానికి సందిగ్ధం రావడం మొదలయ్యి చాలా సంవత్సరాలే అయింది. తను స్కూల్లో చదివేటప్పుడు తన తండ్రి చెప్పినట్లు బుద్దిగా చదువుకునేవాడు. అమ్మ కానీ, అక్కలు కానీ చెప్పిన పనులు చేసేవాడు. ఏవో చిన్నా చితకా అల్లర్లు తప్ప పెంకిఘటంగా తయారవలేదు. వాళ్ళ నాన్న కూడా తన స్నేహితులతో తన గురించి చెప్పేటప్పుడు “ మా వాడు బుద్దిమంతుడండీ “ అని చెప్పేవాడు. దాంతో రామం కి తను వెడుతున్నదారి సరైందే అనిపించేది. అప్పుడప్పుడు అక్కలే వాణ్ణి “ ఒరే నువ్వు ఇంత మంచివాడవవుతే ఎలాగరా సన్నాసీ !” అని ముద్దుగా తిట్టేవారు. అమ్మ మాత్రం వెనకేసుకుని వచ్చేది. కానీ, వాడికి అర్థం కానిదీ, సందిగ్ధంగా మిగిలిందీ ఒక్కటే. తమ స్కూల్లో ఏమాత్రం చదవని కోటేశుగాడు స్కూల్లో జరిగిన ఆటల పోటీలలో ఛాంపియన్ అయినప్పుడు వాడిని నాన్న వాడిని మెచ్చుకోవడం.
“మగ పిల్లవాడంటే వాడు రా కోటేశు గాడు . ఎన్ని కప్పులు వాడికి. చివరికి ఛాంపియన్ కూడా వాడే “ అన్నప్పుడు మరి తనలాగా చదువుకోని, మార్కులు రాని వాడిని నాన్నగారు ఎలా మెచ్చుకున్నారు అని వాడికి పెద్ద అనుమానం కలిగింది. అలా అని తను ఒక రోజు స్నేహితులతో ఆడుతూ ఇంటికి ఆలస్యంగా వెళితే కోప్పడేసరికి వాడి సందేహం ఇంకా ఎక్కువయింది. కానీ ఇంటి వాతావరణం ఉత్త సందేహాన్ని మిగిల్చింది తప్ప వాడి నుండి ఏ విప్లవాత్మకమైన మార్పూ తేలేకపోయింది.
మరో సారి ఇలాంటి సంఘటనే జరిగింది. రామం ఇద్దరి అక్కల్లో చిన్నది కొంచెం తుంటరి. చాలా చురుకైనది కూడా. మామూలుగానే ఆమె వెంట పడే కుర్రకారు కూడా ఎక్కువే. ఒక అబ్బాయి రోజూ ఇంటి దాకా వచ్చి దిగబెట్టి వెళ్ళేవాడు. తోటి ఆడ స్నేహితులతో ఎంత అల్లరి చేసినా, అబ్బాయి ఇలా వెంట వచ్చేసరికి ఏం చేయాలో తెలియకుండా తలకాయ వంచుకుని బెరుకు బెరుకుగా ఇంటికి వచ్చేసేది. ఇలా కొన్ని రోజులు కొనసాగేసరికి ఒక రోజు ఇంట్లో చెప్పుకుని ఏడ్చింది. వాళ్ళమ్మ భర్తతో చెప్పింది. ఆయన మరుసటి రోజు కాపు కాసి వాడిని పట్టుకుని ఆ చెంపా ఈ చెంపా వాయించి, ఇంకోసారి ఇంటి దగ్గర కనిపిస్తే పాతేస్తానని వార్నింగ్ ఇచ్చి పంపించాడు. కానీ తరువాత వాళ్ళు ఊహించనిది జరిగింది. ఆ కుర్రవాడు ఆయన ఇంట్లో లేనప్పుడు తనతోపాటు ఇంకో నలుగుర్ని వెంటేసుకుని వచ్చి ఇంటివద్ద నానా యాగీ చేశాడు. రామం వాడితో తల పడబోతే వాళ్ళంతా కలసి నాలుగు తన్నారు. అప్పుడు పక్కింటి శేఖర్ సహాయంగా వచ్చి వాళ్ళతో తలపడి వాళ్ళల్లో ఒకడిని పట్టుకుని కొట్టేసరికి అంతా పారిపోయారు. రామం కూడా ఒకడిని తన్నినా, శేఖరే హీరో అయిపోయాడు. రామం నాన్న ఇంటికి వచ్చాక అంతా తెలుసుకుని పక్కింటికి వెళ్ళి శేఖర్ కు థ్యాంక్స్ చెప్పి వచ్చాడు. ఇంటికి వచ్చి “ శేఖరం రాకపోతే ఈ రోజేమయ్యేదో ? తలచుకుంటే భయం వేస్తుంది. ఒకవేళ ఆ వెధవ మళ్ళీ ఇంటిమీద వచ్చాడనుకో. శేఖరాన్నే కేకెయ్యి “ అని తల్లితో అన్నాడు. తనుకూడా వాళ్ళను ఎదురించాడన్నసంగతి నాన్న ఎందుకు మరచిపోయాడో తనను కూడా ఎందుకు అభినందించలేదో అర్థం కాలేదు రామంకి.
మంచి సంస్కారమున్న ఇల్లు, చదువుకు ప్రాముఖ్యతనిచ్చే తలిదండ్రులు, మార్గదర్శకులుగా ఇద్దరు అక్కల మధ్య జన్మరీత్యా ఉన్న కొన్ని అల్లరి చేష్టలు తప్పనిస్తే రామం బాగానే చదువుకున్నాడు. అప్పటికింకా ఇంజనీరింగ్ చదివి తీరాలన్న పిచ్చి లేదు. అక్కలిద్దరు కూడా తమ ఊళ్ళో ఉన్న కాలేజీలో ఒకరు బిఎస్సి, ఒకరు బికాం చదివారు. ఇద్దరూ అందగత్తెలే కాబట్టి ఇద్దరికీ మంచి సంబంధాలే వచ్చాయి. వియ్యాల వారు కొంత కొండెక్కారని అనిపించినా ఎలాగోలాగా కష్టపడి వాళ్ళిద్దరి పెళ్ళిళ్ళు కానిచ్చేశారు రామం తలిదండ్రులు. ఇక మిగిలిన ఒక్క కొడుకునీ ఎలాగోలా చదివించి వాడో ఉద్యోగం సంపాయించి, పెళ్ళి చేసుకుంటే తాము వాడి దగ్గర కాలం వెళ్ళదీయవచ్చు అన్న సాధారణ మధ్య తరగతి కుటుంబ ఆలోచనా తీరుతోనే రామాన్నిబాగా చదువుకోమని ప్రోత్సహించారు. అప్పటికి ఇంటర్లో ఫస్ట్ క్లాస్ వస్తే అదే పదివేలు. రామానికి వచ్చింది. కానీ, అప్పటికి ఆర్థికంగా చితికిపోయిన రామం కుటుంబానికి ఇతడిని పెద్ద చదువులకని వేరే ఊరికి పంపడానికి వీలు లేకపోయింది. “అవన్నీ మన వల్ల కాదులేరా ! నువ్వు ఈ ఊళ్ళోనే ఉంటూ డిగ్రీ పాసై పోస్ట్ గ్రాజుయేషన్ చేద్దువుగానీ !” అన్నారు వాళ్ళ నాన్న. సరేనని బుర్రూపాడు మన మంచి బాలుడు. డిగ్రీ అవగానే ఉద్యోగానికి అప్లై చేయమనడం, చేయడం, వచ్చేయడం కూడా జరిగిపోయాయి. నిట్టూర్చారు తలిదండ్రులు. ఇరవైరెండేళ్ళకే ఉద్యోగస్తుడయ్యి, ఇంటిని పోషించేవాడయ్యాడు. వాళ్ళ నాన్న వాగ్దానం చేసిన పోస్ట్ గ్రాజుయేషన్ గురించి రొక్కించి అడగలేకపోయాడు. అన్నీ నాన్న చెప్పినట్టే చేసి ఉద్యోగం సంపాయించుకుని నాన్న దృష్టిలో ప్రయోజకుడనిపించుకున్నా, తన తోపాటు చదువుకున్న కృష్ణారావు ఐ ఎ ఎస్ ప్యాసయి కలెక్టరయ్యాడని చెప్తే నాన్న కళ్ళలో కనిపించిన మెరుపుకు అర్థం చెప్పుకోలేక పోయాడు రామం. తను కలెక్టరు ఎందుకు కాలేకపోయాడో, కనీసం పోస్టు గ్రాజుయేషన్ కూడా ఎందుకు చదవలేకపోయాడో కూడా నాన్నకు తెలిసినా కృష్ణారావును ఎందుకు మెచ్చుకున్నాడో, తను సాధించలేనిది వాడు సాధించాడని ఎలా అనుకున్నాడో అర్థం కాలేదు రామానికి.
ఆఫీసులో కూడా రామానికి మంచి పేరుండేది. పన్లో పర్ ఫెక్టు, పై ఆఫీసరుకు తలలో నాలుక, సహోద్యోగులకు రోల్ మోడెల్ అనిపించుకున్నాడు. అతడి వెనుక అతడికి మగవాళ్ళ సర్కిల్ లో చవట, చేతకాని దద్దమ్మ అన్న పేర్లూ, ఆడవాళ్ళ గుంపులో బుద్ధావతారం, దద్దోజనం అన్ననామధేయాలూ ఉన్నాఅతడికి తెలిసేలా ఏదీ అనేవారు కాదు. అటెండర్లు కూడా మిగతా వాళ్ళతో ఉన్నప్పుడు ఇతడి గురించి తమాషాగా మాట్లాడినా అతడి ముందు మాత్రం అణకువగా ఉండేవారు. వాళ్ళకు ఆఫీసు రూల్సు తెలుసుకోవడంలో చాలా సహాయ పడేవాడు. వాళ్ళకి కావలసినప్పుడు కరెస్పాండెన్స్ చేసి పెట్టేవాడు. వాళ్ళకు ఆఫీసు నుండి రావలసిన బెనిఫిట్స్ గురించి చెప్పి అవి తనే వారి తరుఫున రాసి తెప్పించి పెట్టేవాడు. తెలియని విషయాలు తెలియజెప్పేవాడు. దాంతో రామానికి “ మోస్ట్ రిలయబల్ మేన్” అన్న బిరుదు తగిలిస్తూనే వెనక మాత్రం అతడి గురించి మాట్లాడుకుని నవ్వుకునేవాళ్ళు. అది తెలిసిన రామానికి తన పైన తనకే జాలి కలిగేది. కానీ ఇప్పుడెలా మారడం !
ఇదిలా ఉండగా అమాయకులు, మంచి బాలురు కూడా ఈడుకు వస్తారు కదా ! రామం కూడా పెళ్ళి వయసుకు వచ్చాడు. తండ్రి స్నేహితుడెవరో తనకా ఫ్యామిలీ తెలుసంటూ తెచ్చిన సంబంధం అన్ని విధాల కుదిరి విశాలితో పెళ్ళి నిశ్చయం అయింది రామానికి. తన పెళ్ళి విషయంలో ఏ మాత్రం పట్టింపులు చూపకుండా అవతలి వాళ్ళు చెప్పినవాటన్నిటికీ ఒప్పేసుకుని తయారయిన తండ్రి ప్రవర్తన మళ్ళీ అర్థంకాలేదు రామానికి. తన అక్కల పెళ్ళిళ్ళలో తను ఎంత తిరిగాడనీ. అవతలి వాళ్ళ పట్టింపులు విసుగు, బాధ కలిగించినా తండ్రి “ మనం ఆడ పెళ్ళివాళ్ళం కదా “ అన్న ఒక్క మాట వల్ల తను పెదాలు బిగబట్టి అన్ని పనులు చేశాడు. కానీ తన పెళ్ళి దాకా వచ్చేటప్పటికి ఇంట్లో ఎవరూ తనకు ఏమి కావాలని కానీ, ఇదైతే ఎలా ఉంటుందని కానీ అడగనే లేదు. అంతా తామే నిర్ణయించేశారు. అవతలి వైపు వాళ్ళు ఆడ పెళ్ళివారు అనే విషయం ఎందుకు మరచి పోయారో అంతు పట్టలేదు. ఈ డబల్ స్టాండర్డ్స్డ్ అర్థం కాలేదు రామానికి.
విశాలి వచ్చిన కొన్ని రోజులకే ఇంట్లో తన భర్త స్థానం ఏమిటో అర్థం చేసుకుంది. రామానిది అవసరానికి మించిన మంచితనం అనిపించసాగింది. అందరూ అతనిని ఉపయోగించుకోవడమో లేదా అతన్ని నిర్లక్ష్యపరచడమో చేయడాన్ని గమనించసాగింది విశాలి. అతని పైన జాలి, కోపం రెండూ వచ్చేవి. ఇంత బుద్ధావతారమా అనిపించేది. కొత్త కాబట్టి అతనితో ఏమీ అనేది కాదు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఏకాంతంలో హితవు చెప్పసాగింది. మెల్లగా అతడికి ధైర్యం నూరి పోయసాగింది. మరీ అంత మంచివాడుగా ఉండనవసరం లేదు అని చెప్పసాగింది. “ మీ గురించి మీరు లేనప్పుడు ఎలా మాట్లాడుకుంటారన్నది నాకు తెలుసండీ ! ఆ మాటలు వింటుంటే నాకు చాలా బాధేస్తుంది. ! నేను అది సహించలేకున్నాను. “ అన్నదో సారి. అప్పుడు రామానికి కలిగింది ఒక క్లాసిక్ సందిగ్ధం. “ నన్ను అవమానిస్తే నీకేమిటట ? “ అని ఆడిగాడు విశాలిని. “ అలా అయితే మీరు చవట, దద్దమ్మ, దద్దోజనం అని అనిపించుకుంటూ గడిపెయ్యండి నాకేం?” అని కసురుకుంది. ఇంతవరకు ఇవే పదాలు తనను అంటున్నారని వినున్నా తన మొహం మీద ఎవరూ అనింది లేదు రామానికి. విశాలి అలా అనేప్పటికి చర్రున మండుకొచ్చింది. “ ఏంటి! నేను ఊరకుంటానని ఏమేమో అంటున్నావు ?” అని గద్దించాడు. విశాలికి కూడా తనను నిలదీసేసరికి అభిమానం అడ్డొచ్చి “ అందరూ అన్న మాటల్నే నేనూ అన్నాను. తప్పేమిటి? అదీగాక నేను మీ మంచికేగా చెప్తుంట!” అన్నది. అది తన మంచికే అని అర్థమయినా రామానికి తన భార్య అలా అనడం ఏ మాత్రం మింగుడు పడలేదు. “ అలా అని ఇప్పటిదాకా మంచి పేరు తెచ్చుకున్న నేను స్వార్థంతో ఉండమంటావా? “ అన్నాడు.
అప్పుడు విశాలి రామం దగ్గరగా కూర్చుని “ చూడండి. మిమ్మల్ని మంచివాడని పొగుడుతూ మీ చేత తమ పనులు చేయించుకునే వీళ్ళే మిమ్మల్ని చాటుగా ఏమేం అనుకుంటున్నారో మీకు తెలుసు. వాళ్ళల్లో ఎవరు ఇలా మిమ్మల్ని గేలి చేస్తారో కూడా మీకు తెలుసు. అలాంటప్పుడు మీరు మళ్ళీ వాళ్ళకు ఎందుకు సహాయ పడాలి చెప్పండి. మీరు ఎన్ని మంచి పనులు చేసినా వారడిగింది ఒక్కటి చెయ్యకపోతే వాళ్ళ దృష్టిలో మీరు చెడ్డవారవుతారు. కావలిస్తే రేపు మీ పెద్ద అక్కయ్య వస్తోంది కదా ! ఆమె తన బాబుని ఇక్కడే ఇంటర్ చేర్చాలని ఉందని చెప్పింది. దానికి మీరు తన కూడా వచ్చి బాబును జాయిన్ చేయించాలని అన్నంది. గుర్తుందా ? ఈ రోజు ఆమెకు ఫోన్ చేసి చెప్పండి. ఆఫీసులో చాలా పనుంది, బావను తీసుకొచ్చి బాబు చేర్చమని. మీకు వీలుకాదని చెప్పండి. తరువాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో గమనించండి. అదేదో పాము, ఋషి కథ మీకు తెలిసే ఉంటుంది. ఆయన తపస్సు నుండి తిరిగి వచ్చేసరికి పాము కొన ఊపిరితో ఉండడం చూసి ఇదేమని అడిగితే “ మీరే చెప్పారు కదా కరవ వద్దని ! అందుకే కరవడం మానేసినప్పటినుండి ఇలా అందరికీ చులకనై పోయాను. రాళ్ళతో కొడుతున్నారు” అందట. అందుకాయన “నేను కరవ వద్దన్నాను కానీ, బుసకొట్టద్దు అనలేదు కదా! నిన్ను నువ్వు రక్షించుకోక పోతే ఎలా?" అని హితవు చెప్పాడట. అలాగే నేను కూడా మీకు చెపుతున్నాను. మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీ పైన ఆధారపడిన నన్నూ, పుట్టబోయే పిల్లలకూ ఆధారం కావాలి. అందుకే రేపే మీ అక్కయ్యకు ఫోన్ చెయ్యడం ద్వారా దీనికి నాంది పలకండి." అని ముగించింది విశాలి. రామం తన సంధిగ్ధాన్ని వదిలి కర్తవ్యం వైపు అడుగు వేశాడు.
No comments:
Post a Comment