శివముకుంద శతకము - పరమానంద యతీంద్రులు - అచ్చంగా తెలుగు

శివముకుంద శతకము - పరమానంద యతీంద్రులు

Share This

శివముకుంద శతకము - పరమానంద యతీంద్రులు

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 




కవిపరిచయం:

శివముకుంద శతకకర్త పరమానంద్ర యతీంద్రులను గురించి మనము గువ్వల చెన్న శతక పరిచయం లో తెలుసుకున్నాము. శివముకుంద శతకము బహుశా ఈకవి ప్రథమ ప్రయత్నం కావచ్చునేమో అని ఈ పద్యాల శైలిని బట్టి అనిపిస్తున్నది. ఈకవి గురించి ఇంకా తెలుసుకోదలచినవారు గువ్వలచెన్న శతకమును చూడవలసినదిగా మనవి.

శతక పరిచయం:

"ఏకోదేవః" అను శృతి అనుసరించి హరి హరులను అబేధముగా చూపిస్తూ ఈకవి హరునకు ముకుందునకు నంకితముగా ఈశతకము రచించినట్లు తోచుచున్నది.
శివముకుంద శతకము నూటపదకొండు కందపద్యములలో రచింపబడిన శతకము.
ఇందలి శైలి మృదుమధురముగా నుండి పఠనీయముగా సుబోధముగా ఉన్నది.

కొన్ని పద్యాలను చూద్దాము.

క. శ్రీవరగిరిజానాయక
గోవింద లలాటనేత్ర గోకులతిలకా
భావజసంహార హరిహర
భావాత్మక శివముకుంద పరమానందా!

క. దైవము లిద్దఱు నేకో
దేవాది శ్రుతులవలనఁ దెలియఁగ నొకటే
భావించెద మిము నేకీ
భావంబుగ శివముకుంద పరమానందా!

వేదాంతాభ్యాసమునకు ప్రధమమున చెప్పవలసిన సగుణ నిర్గుణ రూపములు, మాయ ప్రకృతి మొదలైనవి ఈశతకములో ఉన్నవి.
ముక్తి సాధనలో మానవునికి గురువుపాత్ర ఎంత ముఖ్యమైనదో తెలిపే ఈ పద్యాలు గమనించండి. 

క. తనుఁదాఁ దెలిసెడి మార్గం
బనువుగ సద్గురులవలన నతి సులభంబౌ
తనయుక్తుల శాస్త్రంబులఁ
బనిగిన దది శివముకుంద పరమానందా!

క, గురువాక్యము శాస్త్రార్థము
గురుతుగఁ తనయనుభవంబుఁ గుదురుగ నొకటై
మఱి నిల్చునేనియదిగా
పరమార్థము శివముకుంద పరమానందా!

క. అలతత్త్వము గురుకృపచే
నలవడునని నమ్మి మిగుల నాసక్తుండై
తలపడవలె గురుభజనకు
బలుమాఱును శివముకుంద పరమానందా!

క. తాటాకులు ద్రిప్పుచుఁ బది
కోటులు చదువంగ నేమి గురువాక్యంబుల్
పాటించి తెకియ కది యే
ర్పాటౌనా శివముకుంద పరమానందా!

క. నిజమైనముక్తి కొఱకై
సుజనుఁడు సద్గురుని వెదకి సుస్థిరమతియై
భజియింపక గలదే గతి
ప్రజలకు నిఁక శివముకుంద పరమానందా!

మాయలో కొట్టుమిట్టాడే జనులకు

క. ఏయెడఁ బెద్దలసంగతి
సేయంగా నిత్యసుఖము చేకొనవచ్చున్
మాయాభూతము తొలఁగును
పాయంబిది శివముకుంద పరమానందా!

క. తానే పరదైవంబని
కానక తనకన్న వేఱుగాఁ దలఁచేదే
యూనినమాయారూపము
భానుసుతా శివముకుంద పరమానందా!

క. పోషించి తత్త్వరచనల
భాసించినఁ దెలియలేక పామరమయులై
దూషణ చేతురుకొందరు
పాషాండులు శివముకుంద పరమానందా!

క. వేషములవలన జనులఁ బ్ర
మోషించి మనీషివరుల మోదము జెఱిచే
దూషకులఁ గూడి పెద్దలు
భాషింపరు శివముకుంద పరమానందా!

క. అసమానరాజయోగా
భ్యాసమునఁ పడమటింటఁ బదిలుండైతే
దొసఁ గేమిలేనిముక్తికిఁ
బసవట్టిది శివముకుంద పరమానందా!

చివరిగా ఈకవి తన శతకం గూరించి ఏమి అన్నారో చూడండి.

క. పరతత్త్వం బిది శతకము
పరమరహశ్యంబు ముక్తిభాజన మిలలో
పరమయోగీవిలాసంబిది
పరమాత్మా శివముకుంద పరమానందా!

ఇంతచక్కని ముక్తిప్రదాయకమైన శాతకము అందరు తప్పక చదవవలసినది. మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి.

***

No comments:

Post a Comment

Pages