'ఉయ్యాల పండుగ 'అట్లతద్ది'నోము!
-సుజాత.పి.వి.ఎల్.సైనిక్ పురి, సికిందరాబాద్.
అట్ల తద్ది లేదా అట్ల తదియ తెలుగువారి ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది ఆశ్వయుజ బహుళ తదియ నాడు జరుపుకొంటారు. "అట్లతద్దోయ్.. ఆరట్లోయ్ ముద్దపప్పోయ్..మూడట్లయ్" అంటూ పాడుకొంటూ కన్నెపిల్లలు మంచి వరుడి కోసం..పెళ్లైన మహిళలు సౌభాగ్యం కోసం కలిసి భక్తి శ్రద్ధలతో చేసుకొనే నోము.
పురాణ కథల ప్రకారం, శివుడిని భర్తగా పొందాలని గౌరీదేవి కోరుకుంది. అందుకు మార్గం చెప్పాలని నారద మహర్షిని కోరగా, ‘అట్ల తదియ’ వ్రతాన్ని ఆచరించాలని సూచించాడని పురాణాల మాట. అట్లతద్దె నోము నోచిన గౌరీదేవి పరమేశ్వరుడిని పతిగా పొందడంతో పాటు, ఆయనలో అర్ధభాగంగా స్థానం సంపాదించుకుంది. సాక్షాత్తూ జగన్మాత చేసిన ఈ నోమును ఆచరించి, ఆమెను పూజించడం సకల శుభప్రదమనీ, ఈ వ్రతం సౌభాగ్యదాయకం, కుటుంబ సౌఖ్య ప్రదాయిని అనీ పెద్దలు చెబుతారు.
అట్లతద్దె పండుగ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి, రెండు చేతులకి గోరింటాకు పెట్టుకోవాలి.
ఇంట్లో తూర్పుదిక్కున మంటపము ఏర్పాటు చేసి గౌరీదేవి పూజ చేయాలి. సాయంత్రం చంద్రదర్శనం అనంతరం మరలా గౌరీపూజ చేసి, పది అట్లు నైవేద్యంగా పెట్టాలి. పది సార్లు ఉయ్యాలలూగి తర్వాత ముత్తయిదువులకు పది అట్లు, పది రకాల పండ్లు వాయనం ఇస్తూ అక్షింతలు శిరస్సుపై వేయించుకొని అమ్మవారి దీవెనలు పొందాలి. ఈ నోమును పది సంవత్సరాలు వరుసగా చేసి అప్పుడు ఉద్యాపన చేయాలి. ఈ నోము ప్రధాన విశేషం 'పది' సంఖ్యకు ప్రాధాన్యం.
"దేవి త్వదీయ చరణాంబుజ రేణుగౌరీం
భాలస్థలీం వహతి యః ప్రణతి ప్రవీణః।
జన్మాంతరేపి రజనీకరచారులేఖా
తాం గౌరయ త్యతితరాం కిల తస్య పుంసః॥
***
No comments:
Post a Comment