విడువ విడువ నింక విష్ణుడ నీపాదములు
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0335-05 సం: 04-206
పల్లవి: విడువ విడువ నింక విష్ణుడ నీపాదములు
కడగి సంసారవార్ధి కడుముంచుకొనిన
చ.1: పరమాత్మ నీవెందో పరాకైయున్నాను
పరగ నన్నింద్రియాలు పరచినాను
ధరణిపైజెలరేగి తనువు వేసరినాను
దురితాలు నలువంకదొడికి తీసినను
చ.2: పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ
వట్టి ముదిమైన రానీ వయసే రానీ
చుట్టుకొన్నబంధములు చూడనీ వీడనీ
నెట్టుకొన్నయంతరాత్మ నీకు నాకుబోదు
చ.3: యీదేహమే యయిన ఇక నొకటైనాను
కాదు గూడదని ముక్తి కడకేగినా
శ్రీదేవుడవైన శ్రీవేంకటేశ నీకు
సోదించి నీశరణమె చొచ్చితి నే నికను
భావం
పల్లవి:
ఓ విష్ణుడ ! సంసార సముద్రము నన్ను బాగా ఆక్రమించినప్పటికి నీపాదములు విడువను విడువను.
చ.1:
పరమాత్మ! నన్ను పట్టించుకోకుండా నీవు ఎక్కడో పరాకై ఉన్నప్పటికి, నన్ను ఇంద్రియాలు పడగొట్టినప్పటికి,
ఈ భూమిపై చెలరేగి నా శరీరం బాధపడినప్పటికి,పాపాలు నాలుగు దిక్కులా నలువంకలకు పట్టుకొని తీసుకుపోయినప్పటికి- ఓ విష్ణుడ ! నీపాదములు నేను విడువను విడువను.
చ.2:
ఓ విష్ణుడ ! ఎన్నో జన్మలు ఇలా రానీ ! భూమిలో జన్మే లేకుండా పోనీ!!ప్రయోజనం లేని ముసలి వయస్సు రానీ ! యౌవనంలో ఉండనీ !నన్ను చుట్టుకొన్నబంధములు నన్ను చూసినా, నన్ను వీడిపోయినా-అతిశయించు అంతరాత్మ నీకు నాకు పోదు.(అనగా అంతరాత్మలో ఎప్పుడు పరమాత్మ ఉంటాడని భావం)
చ.3:
శ్రీవేంకటేశ ! ఈ శరీరమే నాకు ఉన్నప్పటికి లేదా నీలో కలిసి పోయి ఒకటయినప్పటికి,కాదు కూడదని ముక్తి పొందినప్పటికి ,శ్రీదేవుడవైన నిన్ను నా అణువణువున శోధించి నీశరణము కోరాను.(ఎప్పుడు నిన్ను విడవనని భావం)
***
No comments:
Post a Comment