మానసవీణ-28 - అచ్చంగా తెలుగు

మానసవీణ-28

దాసరి పద్మ, అడ్వకేట్ 


 

కారులో ప్రయాణిస్తున్నంతసేపు  రఘురాం ఆలోచనలు ఇలా ఉన్నాయి. ఎంతో భారంతో మూలుగుతున్న తన గుండె తేలిక అయినట్లుగా ఉంది. క్షణం ముందు వరకు తన చుట్టూ ఉన్న పరిస్థితులు వికటాట్టహాసం చేస్తుంటే, ఆ... పరిస్థితుల మధ్యలో తన పాప, తన మూడేళ్ళ పాప బోసి నవ్వులు అలలా కనిపిస్తూ తన ఒంటిని పులకింప చేస్తోంది. ఆ అనుభూతి లో తనకు తెలియకుండానే తన పాప నవ్వుతో జత కలిపినట్లుగా చాన్నాళ్ల తరువాత తన పెదవులపై చిరునవ్వు విరిసింది. తన మనస్సు ఎందుకో గాలిలో తేలి ఆడినట్లుగా ఉంది. ‘ఎన్నాళ్ళయింది నాలో ఈ సహజమైన నన్ను నేను చూసుకుని నా సిక్స్త్ సెన్స్ చెబుతుంది నాకు మంచి రోజులు రాబోతున్నాయని’ అని మనసులో అనుకున్నాడు రఘురాం. మానస విషయాలు జన్మ రహస్యం ఎంతోకొంత వరకు జి టి ఆర్ గారి కి తెలిసే ఉంటుంది ఆయన్ను కలిసి అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు. మానసని చూశాక తను ప్రేమించే రోజులలో శ్రావణి గుర్తుకొచ్చింది. తలుచుకుంటూ కారుని జోరుగా హుషారుగా ముందుకు దూసుకు పోనిచ్చాడు రఘురాం.

***

అందమైనది, ప్రేమామృతం అయినది, మరల రానిది, మరిచిపోలేనిది, ఏమిటి.? అని అంటే ప్రపంచమంతా ఏకకంఠంతో చెప్పేది ఒక్కటే “బాల్యం” అని, కానీ  దినేష్ ఐపీఎస్  విషయంలో బాల్యం గుండెను చెరువు చేసే ఒక భయానక దృశ్యం. దానికి కారణం భూషణం గారు. ఆడవారి పట్ల చులకన భావం ఉన్నవాడు. పదవిపై వ్యామోహంతో ఓట్ల కోసం ప్రజా సేవకుడనని, ప్రజా నాయకుడినని, ఆడపిల్లలకు అండగా ఉంటానని, ఆడపిల్లలను ఆదుకుంటానని, ఇలా భూషణం ఎన్నో వాగ్దానాలు చేశాడు. ‘ఆడపడుచులు నా అక్కచెల్లెళ్ళు, వారి శ్రేయస్సు కోసం నా జీవితాన్ని ధారపోస్తాను’ అంటూ రాజకీయ లబ్ధి కోసం ఆడవారి పట్ల ఆడిన సానుభూతి మాటలు అన్ని ఉత్తివే. రాజకీయ బంధుత్వం కలుపుకొన్న ఈ భూషణం గురించి ప్రపంచానికి తెలియజేయాలి అనుకున్నాడు దినేష్. ఈనాడు తన కోడలికి ఆడపిల్ల పుట్టేసరికి మానవత్వం మరిచి పసికందు గొంతు నులిమి వేయాలని చూసినవాడు, ఆడవారి పట్ల జరిగిన అన్యాయాలను ఎలా అరికడతాడు?  సొంత మనవరాలిని మట్టుపెట్టాలని చూసిన వాడు దేశంలో ఉన్న ఆడ పిల్లల భవిష్యత్తుని ఏం కాపాడి ఉంటాడు? పుట్టిన మనవరాలిని దురుద్దేశముతో వదిలించుకోటానికి చూసిన వాడికి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 317 ప్రకారము ఏడేళ్ల కు తక్కువ కాకుండ జైలు శిక్ష పడుతుంది. అంతేకాక పుట్టిన శిశువును దాచిపెట్టినందుకుగాను IPC Sec. 318 ప్రకారం రెండేండ్ల శిక్ష పడుతుంది, అన్నిటి కంటే పుట్టిన మనవరాలిని చంపించాలనే ఘోరమైన చర్యకు గాను IPC Sec 315  ప్రకారము జీవిత ఖైదీ గా శిక్ష భూషణానికి తప్పదు. ఎలాగైనా ఈ... వార్త మీడియా ద్వారా మరింతగా ప్రజల్లోకి దూసుకు వెళ్లాలి. భూషణం నిజస్వరూపం బయటపెట్టి తగిన బుద్ధి చెప్పాలి, వెంటనే మీడియా టీం కి, క్రైమ్ బ్రాంచ్ కి, ఫోన్ చేసి ప్రజానాయకుడి పైశాచికత్వం గురించి సంచలనం సృష్టించే వార్త త్వరలో మీకు అందించబోతున్నాం అని చెప్పాడు. భూషణం ఎటువంటి వాడైనా, తన మనవరాలు మానసకి, శ్రావణికి  డిఎన్ఏ పరీక్షలు చేసి, దాని ద్వారా ఆ తల్లి కూతుర్ని కలిపాలి.  భూషణాన్ని రుజువులతో సహా  క్రిమినల్ అని నిర్ధారించాలి, ఈ డీఎన్ఏ పరీక్ష ద్వారా ఒక రాజకీయ నాయకుని రహస్యం బట్ట బయలు కాబోతుంది. జన్యు పరమైన పరీక్షల కోసం ల్యాబ్ కి ఫోన్ చేసి డాక్టర్తో మాట్లాడాడు. లోకం కళ్ళు కప్పి ఏ పని చేసినా, విధిని తప్పించుకొనుట ఎవరి తరం కాదు అని భూషణం కి తెలియజేయాలి. పాప పుణ్యాలు బేరీజు చేసిన దేవుడు వాటి ఫలితాన్ని కూడా వెంటనే చవి చూపుతాడు. ఏ రకంగా అయినా భూషణం కి బుద్ధి చెప్పాలి, అనే భావ పరంపర దినేష్ మస్తిష్కం లో సుడులు తిరుగుతోంది. ఉత్కంఠభరితంగా సంచలనం సృష్టించే ఆ వార్త కోసం ఆ రహస్యం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. భూషణం పట్టులో కోడి పెట్టలా దినేష్ కి దొరికాడు. భూషణం కృషివలరావుకి ఎంత అన్యాయం చేసినా, జరిగినది మరిచిపోయి శ్రావణికి రఘురాం కి మంచి చేయాలని మానసని వాళ్లతో కలపాలని కృషీ చూస్తున్నాడు. నా ఆలోచన అయినా, కృషీ ఆలోచన అయినా, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణే మా ఇరువురి కర్తవ్యం. ఇటువంటి టైం లో ఈ “రహస్యాన్ని” బట్టబయలు చేయాలనే నా... ఆలోచనని కృషివల్రావు సమర్థిస్తాడా.???” అనే ఆలోచనలో పడ్డాడు దినేష్.  

***

No comments:

Post a Comment

Pages