ఈ దారి మనసైనది -45
అంగులూరి అంజనీదేవి
మౌనంగా వున్న మన్విత వైపు చూస్తూ ...
“మన్వితా ! ఒక వేళ నేను అనురాగ్ని వదిలి బ్రతకలేక... ఎంగిలి పడిన మనసుతో మింగిలి రాలేక నేను చనిపోతే ... ఎవరితో తిరిగి చనిపోయిందోనని లోకం కోడైకూసి నా తల్లి దండ్రుల్ని చంపేస్తుంది వాళ్లను బ్రతికించుకోవటం కోసమైనా నేను నా మనసును చంపుకొని అనురాగ్ని వదులుకోవాలి .. ఇలా ప్రేమించిన వాళ్లను వదులుకోవాలంటే బాధగా వుంది.” అంది దీక్షిత బాధగా.
దీక్షిత ఇప్పుడు పడున్న బాధంతా మన్విత ఒకప్పుడు అనుభవించిందే ... ఈ బాధకి వాళ్లూ, వీళ్లూ అనే తారతమ్యం వుండదు. ఏ గుండెనైనా ఒకే దృష్టితో చూస్తుంది. ఒకే జ్వాలతో రగిలిస్తుంది.
దీక్షిత చేతిమీద చేయివేసి మెల్లగా తట్టింది మన్విత. ఆ స్పర్శలో ... " నువ్వు డాక్టర్ వి... ఏది ఎలా చెయ్యాలో నువ్వు తెలుసుకోగలవు. దేన్ని కోల్పోయినా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు” అన్న అర్థం స్పురించింది దీక్షితకి.
అందుకే ఇంకేం మాట్లాడలేదు దీక్షిత.
" మరి అనురాగ్ కాల్ చేస్తే ఏంచెబుతావు దీక్షితా ?” అంది. మన్విత.
“ అదే అలోచిస్తున్నా ... ఇది చెబితే అతను తట్టుకోలేడు. అతను చేస్తున్న రీసెర్చి పట్ల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అతను ఏ ఎయిమ్తో అంత దూరం వెళ్లాడో నాకు తెలుసు. కనీసం అతని కల అయినా ఫలించాలి. రేపు నా మొబైల్ కి వున్నా సిమ్ తీసేస్తాను.” అంది దీక్షిత.
మౌనంగా వింటూ ఇంకా ఏం చెబుతుందా అని ఎదురు చూస్తోంది మన్విత.
“ నా నుండి రెస్పాన్స్ లేకపోతే వెంటనే మీ నెంబర్ కి కాల్ చేస్తాడు. అప్పుడు మీరిక్కడ పని చెయ్యట్లేదని చెప్పండి! డా|| ధీరజ్ రెడ్డి హెల్ప్ కూడా తీసుకుందాం ... అయన ఎలాగోల మేనేజ్ చేస్తారు. ఇలా కొద్ది రోజులు జరిగితే ... అలాగే అలవాటై కాల్ చెయ్యటం మరిచిపోతాడు. ఇంతకన్నా దీనికింకో సొల్యూషన్ లేదు. ఏంచేద్దాం చెప్పు ? ఒకటి కావాలనుకున్నప్పుడు ఇంకొకటి వదులుకోక తప్పదు కదా!” అంది దీక్షిత.
మన్విత అశ్చర్చపోలేదు. దిగ్ర్బాంది చెందలేదు. జీవితాన్ని చూస్తోంది.
ప్రపంచాన్నే ఓ కొలిక్కి తెస్తున్న లెవల్లో ప్రేమించుకున్న వాళ్లు కూడా చివరికిలా చల్లబడి ఎందుకు కాంప్రమైజ్ అవుతారో ఇప్పుడర్థమైంది మన్వితకి... వీళ్ల బాధ ముందు నా బాధ ఎంత అనుకొంది. కానీ అలా అనుకోటానికి లేదు. ఎందుకంటే ప్రేమ ప్రేమే ! అది గుడిసెలో వుండే వాళ్ల గుండెలో ఎలా పుడ్తుందో అపార్టమెంట్స్లో వుండేవాళ్ల గుండెలో కూడా అలాగే పుడుతుంది. పేదవాడికో బాధ, ఉ న్నవాడితో బాధ అనేది లేదు. ఏ గుండె బాధ ఆ గుండేది. ఏ గుండె సంతోషం ఆ గుండెది... దీన్ని తేలిక చేసి మాట్లాడే అధికారం ఎవరికి లేదు. అదొక అగ్ని, అంటుకోమంటే అంటుకోదు. ఆరిపోమంటే ఆరిపోదు. అదెంత దూరంలో వున్నా వేడిగా, వాడిగా బాణాలను వేస్తూ గాయపరుస్తూనే వుంటుంది.
ఎప్పుడైనా దేవుని దగ్గర ...“ ఈ సంతోషాన్ని నా కింత వరకే ఇవ్వు ... అలాగే ఈ బాధను కూడా ఇంత వరకే యివ్వు... ” అని ఎవ్వరూకోరుకోరు. ఏది ఎంత వరకు ఇవ్వాలో ఆ దేవునికి తెలిసే జరుగుతుంది. అందుకే ఆ దేవుడు ఏగాయాన్నైనా ఎక్కువసేపు సలపనివ్వకుండా కాలం అనే డాక్టర్ చేత మరిచిపోవడం అనే వైద్యం చేయిస్తుంటాడు.
* * *
సూర్యోదయం అవుతుండగా...
మొబైల్ కి మెసేజ్ వచ్చిన చప్పుడువిని కళ్లు విప్పింది దీక్షిత. ఎప్పటిలాగే తన అరచేతుల్ని కళ్లకి అద్దుకొని, మొబైల్ అందుకొని మెసేజ్ చూసింది. ఆ మెసేజ్ అనురాగ్ది.
“దీక్షితా ! నీ ఆలోచనలతో నిద్రరాని నేను నా కళ్ల ఎర్రదనాన్ని సూర్యుని తొలికిరణాలకి ఇచ్చి ... నీకు శుభోదయం చెప్పమన్నాను. అందిందా” అని పంపాడు.
మళ్లీ వెంటనే ఇంకో మెసేజ్ పంపాడు. అదెలావుందంటే ?
‘తొలకరి చినుకులను పుడమితల్లి ఎంత సంతోషంగా ఇముడ్చుకుంటుందో అలా నువ్వూ, నీ జ్ఞాపకాలు నాలో నిండిపోయాయి... నీ అనురాగ్.” అని వుంది.
ఎప్పుడైనా అతని మెసేజ్లు చదువుతుంటే కనుపు, కనుపుకి చిప్పిళ్లే మధురరసం తాగినట్లు, ఉరకలై గోదావరి వురికి, వురికి మది నిండినట్లు, కొండ లోయల్లోకి దుమికే జలపాతం క్రింద స్నానం చేసినట్లు, ఆ తర్వాత అతని ప్రేమటవల్తో ఒళ్లంతా తుడుచుకున్నట్లు అనుభూతి చెందేది.
ఇప్పుడు అలాంటి భావాలేం కలగటంలేదు. మనసుని అలా ప్రిపేర్ చేసుకొంది అదెలా అంటే ?
ఎప్పుడైనా మెసేజ్లను ఫ్రెండ్స్ అని కొడితే అన్ని మొబైల్స్ కి వెళ్లినట్లే ఇప్పుడీ మెసేజ్ లను కూడా లవర్సెవరో పంపుకుంటుంటే ఆన్లైన్లో చూసి అనురాగ్ కూడా తన మొబైకి పంపివుంటాడు. అంతే ! ఇందులో తనకంటూ ప్రత్యేకం ఏం లేదు. తన కోసమే పంపినటు ఫీలవనవసరం లేదు అని అనుకొని వెంటనే నిమ్ చేంజ్ చేసింది దీక్షిత.
కాలం ఎంత మారినా మానవునికి అంతు చిక్కని రహస్యాలు ఎన్నోవున్నట్లు ... ఎందరో పరిశోధకులు విజృంభించి పరిశోధనలు జరుపుతున్నారు కానీ ... మనసులోతుల్ని శోధించే పరిశోధకులు లేరు. ఒక వేళ వుంటే ... ?
ఎన్నో అద్భుతాలను సృష్టించి సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటున్న కొంతమంది సైంటిస్టులు, రచయితలు, సైనికులు, డాక్టర్లు, ఇంజనీర్లు తమ మనసులో వుండే గదుల్లో ఓ గదిని రహస్యంగా వుంచుకొని, తలుపు తెరవకుండా లాక్ చేసిపెట్టుకొని వుంటారని ఆ గదిలో ప్రేమకి సంబందించిన అందమైన డైరి వుంటుందని ... ఆ డైరీని బయటకి తీసి పరిశోధన జరపాలని చూసే వాళ్లేమో ...
దీక్షిత స్నానం చేశాక - తల్లి దగ్గరకి వెళ్లి ... జడవెయ్యమన్నట్లు తల్లి చేతిలో దువ్వెన పెట్టి జుట్టు ముడి విప్పింది. ఒక్కసారిగా జుట్టంతా జారి దట్టమైనా చెట్టు పొదలా నడుం దాటింది.
ఆ జుట్టుని పాయలుగా విడదీసి - నెమ్మదిగా దువ్వుతూ
“దీక్షితా !” అంటూ ప్రేమగా పిలిచింది రామలక్ష్మి,
'ఊ ... ' అంటూ పలికింది దీక్షిత.
“ కార్పొరేట్ కాలేజిలో కోచింగ్ ఇప్పించండి నాన్నా ! అని నువ్వు అడిగినప్పుడు ఏం చేయాలో నాకూ - మీ నాన్నకి తోచలేదు. ఏదీ అడగని నువ్వు ... డాక్టర్ ని కావాలని ఎంత బలంగా వుంటే అడిగావోనని మేము అర్థం చేసుకున్నాం. నీ కోరిక తీర్చడం కోసం శారద వదినకి వాళ్లబ్బాయికి నిన్నిస్తామని మాటిచ్చాం. అలా అని విజయేంద్ర నీకు తగిన భర్త కాదని కాదు. కానీ ... నీకు తెలియకుండా మాట ఇచ్చామని ...” అంటున్న తల్లి వైపు తిరిగి, చప్పును ఆమె నోటిపై చేయిపెట్టింది దీక్షిత.
" ఇంకెప్పుడూ అలా అనొద్దమ్మా! మీరేది చేసినా నా మంచికే చేస్తారు. మిరప్పుడలా మాట ఇవ్వక పోయి వుంటే నా చదువు ఇంటర్లోనే ఆగిపోయివుండేది ... ఇదే ఊరిలో పొలం పనులు చేసుకుంటుండే దాన్ని ... డాక్టర్ని అయ్యేదాన్ని కాదు. మనం నడిచే దారిలో ఎన్నో ఎదురువుతుంటాయి. దాటుకొని ఎలా వెళ్తుంటామో అలాంటిదే ఈ జీవన ప్రయాణం కూడా ... మీరు మాట ఇచ్చి మంచి పనే చేశారు. తప్పు చెయ్య లేదు.” అంది దీక్షిత.
ఆ మాటలకి తేలికైన మనసుతో - దీక్షిత బుగ్గమీద ముద్దు పెట్టుకొంది రామలక్ష్మి తల్లికి పిల్లలెప్పుడూ పసిపిల్లలే ...
ఆడపిల్లలకి వుండే పరిదుల్ని దాటి తల్లి దండ్రుల్ని దూరం చేసుకోని వాళ్లలో దీక్షిత ఒకటి.
దీక్షిత చదువు ఇంటర్తో ఆగిపోయి వుంటే అనురాగ్ అనే వ్యక్తి వున్నాడని ఆమెకు తెలిసివుండేది కాదు. అందుకే తన తల్లి దండ్రులమీద ఆమెకున్న ప్రేమను కాపాడుకోవాలని ... పాకాల ప్రజలకి తన తల్లి దండ్రులపై గౌరవం తగ్గకుండా వుండాలని ... అన్నయ్య తలెత్తుకొని తిరిగాలని ... తను మెడిసిన్ చదవకుండా ఇంటర్ తోనే ఆగిపోయానని మనసును మభ్య పెట్టుకుంది దీక్షిత.
దీక్షితకి జడ అల్లడం పూర్తి చేసింది రామలక్ష్మి
వెంటనే అక్కడ నుండి కదిలి శారద దగ్గరకి వెళ్లింది దీక్షిత.
“నాకు విజయేంద్రబావను చేసుకోవడం ఇష్టమే అత్తయ్యా ...” అంది దీక్షిత.
దీక్షిత నుదుటిపై ముద్దు పెట్టుకొంది శారద.
*****
ఓ శుభ ముహూర్తాన ...
విజయేంద్రతో దీక్షిత పెళ్లి జరిగింది.
సోమన్న, రామలక్ష్మి, మహధీర్ల ఆనందానికి ఆకాశమే హద్దు అయింది.
పాకాలలో పుట్టిన ఆడపిల్లల పెళ్లిళ్లు అయ్యాక ... ఏ విధంగా అత్తవారింటికి వెళ్తారో ... అదే విధంగా దీక్షిత కూడా చీరె, సారె, పసుపు, కుంకుమలతో, విజయేంద్ర చేయి అందుకొని ... అత్తగారి ఊరైన ఢిల్లీ వెళ్లింది.
ఆమె వెళ్తున్నప్పుడు ఆమెతో వాళ్లబందువులు అతి ఘనంగా, గౌరవంగా కదిలారు ... బస్ వరకు.
* * * *
కాలం నిరంతరం పనిచేస్తూ అరిగిపోని యంత్రంలా తిరుగుతోంది.
పెళ్లయ్యాక ఢిల్లీకి వెళ్లిన దీక్షితకి మంచం మీద బోర్లా పడుకొని, మోచేతి వంపులో ముఖం దాచుకొని పడుకునేంత తీరిక, గతంలోకి వెళ్లి జరిగింది గుర్తు చేసుకునేంత ఓపిక కూడా లేకుండా అయింది.
కారణం... ఢిల్లీలో ఒక పేరున్న డాక్టర్ దగ్గర జూనియర్ డాక్టర్గా వుండి తన జీవితాశయాన్ని నెరవేర్చుకుంటోంది.
ఆమె భర్త విజయేంద్ర బాధ్యత గల మిలటరీ అఫీసర్. ఇంటా, బయట అయనంటే గౌరవమూ, భయము, ఇంట్లో కూడా డిసిప్లిన్ వాతావరణంలో ఒక రకమైనా ప్రశాంతత అన్పిస్తుంది. అతను మిగతటైంలో ఎంత గంభీరంగా వున్నా... భార్య దీక్షిత దగ్గర మాత్రం చిన్న పిల్లాడైపోతాడు. అనుక్షణం అమెకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఆమె సంతోషంలో తన సంతోషాన్ని వెతుక్కుంటూ చైతన్య స్రవంతిలా వుంటాడు.
ఇకపోతే అత్త, మామల అప్యాయత, ఆదరణ గొప్పగా వుంది.
తన జీవితం ఇంత గొప్పగా వుంటుందని ఊహించని దీక్షిత ప్రతి రోజు తల్లి దండ్రులకి కాల్ చేసి తనెలావుందో చెప్పి వాళ్ల ఆనందంలో తన జీవితాన్ని తడుపుకుంటోంది.
* * * *
అర్ధరాత్రి హాస్పిటల్ ముందు గోల గోలగా విన్పిస్తున్న అరుపులకి, ఏడుపులకి - లోపల పడుకొని వున్న నర్స్ కి నిద్రా భంగం కలిగింది. వెంటనే లేచి, నిద్రకళ్లతోనే ఏం జరిగిందన్నట్లుగా వెళ్లి గేటు తీసింది.
రోడ్డు మీద నిలబడి వున్న ట్రాక్టర్ లోంచి రక్తసిక్తమైవున్న ఆడవాళ్లను దింపుతుంటే నిద్ర మత్తు ఎగిరిపోయి కంగారుగా చూస్తూ...
“ ఏం జరిగింది ?” అని అడిగింది నర్స్. ”
పెళ్లికి వెళ్తున్న జీపుకి నర్సంపేట దాటుతుండగా యాక్సిడెంట్ అయిందని చెప్పారు.
వాళ్లని లోపలకి తీసుకు రావటానికి వీలుగా గేటును పూర్తిగా తెరిచి, వెంటనే డా||మన్విత కోసం పై కెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది నర్స్..
గాఢ నిద్రలో వున్న వర్ణనమ్మ దిగ్గున లేచి తలుపు తీసింది. వర్థనమ్మను చూడగానే ...
“ యాక్సిడెంట్ కేసమ్మా ! పరిస్థితి చాలా ఘోరంగా వుంది.” అంటూ నర్స్ చెప్పడంతో
" అయ్యో !” అనుకుంటూ వెళ్లి మన్వితను నిద్రలేపింది వర్ధనమ్మ.
విషయం వినగానే మన్విత లేచి కిందకి దిగింది. మన్విత వెనకాల వర్ణనమ్మ కూడా దిగింది.
అప్పటికే డ్రైవర్ సాయంతో ఐదుమంది ఆడవాళ్లను లోపలకి చేర వేసింది నర్స్.
ఒళ్లంతా గాయాల వల్ల రక్తంతో తడిసి ఎవరు, ఏంటో అర్థం కాకుండా వుంది.
గాయాల బాధను ఓర్చుకోలేక - మూలుగులు, అరుపులు హాస్పిటలంతా దద్దరిల్లుతోంది. ఒకరిద్దరు సృహకోల్పోయి వున్నారు.
డా|| ధీరజ్ రెడ్డి ఇంటికి కాల్చేసి విషయం చెప్పి, అయన్ని వెంటనే రమ్మంది మన్విత.
నర్స్ సాయంతో ట్రీటిమెంట్ మొదలు పెట్టింది
వాళ్లలో కొంత మందికి దెబ్బలు బాగా తగిలాయి. కాళ్లూ, చేతులు, విరిగాయి. ఒంటి మీద వున్న బట్టలు మట్టితో, రక్తంతో ఏకమై చూడటానికి భయంకరంగా కన్పిస్తున్నారు.
పెళ్లి కెళ్తూ పట్టు చీరల్లో వున్న వాళ్లు అంతలోపలే ఇలా మారటం విధి వైపరీత్యం కాకపోతే ఇంకేమిటి అన్నట్లు చూస్తోంది వర్ధనమ్మ.
దారిన పోయే వాళ్లకి దాహార్తిని తీర్చే సలివేంద్రంలా ఎందరో రోగులకి ప్రాణదాత అయిన ఆ హాస్పిటల్ ఏడ్చే పిల్లల్ని ఓదార్చే తల్లిలా వాళ్లని తన ఒడిలోకి చేర్చుకొంది.
అప్పటి వరకు ఆ క్షతగాత్రులకి వైద్యం చేస్తున్న మన్విత
“నానమ్మా !” అంటూ గట్టిగా పిలిచింది.
అది పిలుపుకాదు అరుపు.
ఆ అరుపు విని కంగారు పడ్డూ మనవరాలి వైపు వెళ్లింది.
“ ఏంటి మన్వితా ?” అంది మనవరాలినే చూస్తూ ...
" ఈ ముఖం ఎవరిదో చూడు. మమ్మీ లాగుంది కదూ ! అంది.
కృష్ణవేణమ్మ సృహలో లేదు. కాటన్ తో తల్లి ముఖాన్ని తుడుస్తుంటే మన్విత చేయివణికింది. వెంటనే మనవరాలి చేయిపట్టుకుంటూ ...
“ఏదీ చూడనీ ..” అంటూ కోడల్ని చూసి ఆశ్చర్యపోతూ అవేదన అపుకోలేక...
“ఆ ... ఎంతపని జరిగింది ?నా కోడలికి ఇన్ని దెబ్బలా ? సృహకూడా లేనట్లుందే , ఇప్పుడెలా?” అంటూ ఉద్వేగంతో ఒళ్లంతా తడిమి కళ్ల నీళ్లు పెట్టుకొంది వర్ధనమ్మ.
నానమ్మ ముఖంలో భయాందోళన చూసి ధైర్యం చెబుతున్నట్లు వీపు మీద చేయి వేసి నిమిరింది.
డా|| ధీరజ్ రెడ్డి వచ్చాడు.
అయన రాగానే సీరియస్గా వున్న ఒకర్ని ఎం.జి. ఎమ్ హాస్పటల్ కి పంపాడు.
నలుగురికి ట్రీట్ మెంట్ జరుగుతోంది.
వాళ్లలో - కృష్ణవేణమ్మ తలకి పెద్ద గాయమై రక్తం పోవటంతో రక్తం ఎక్కించాల్సి వచ్చింది. .
ఆమె గ్రూప్ రక్తం స్టోర్లో లేకపోవడంతో కంగారు పడ్డారు. ఆమె తన తల్లి అని డా|| ధీరజ్ రెడ్డితో చెప్పింది మన్విత.
" మరి నీ బ్లెడ్ సరిపోతుందేమో చూద్దాం ...” అన్నాడు ధీరజ్ వెంటనే మన్విత బ్లేడ్ టెస్ట్ చేసి, ఇద్దరి బ్లేడ్ గ్రూప్ ఒకటే కావడంతో వెంటనే మన్విత బ్లేడ్ని కృష్ణవేణమ్మకి ఎక్కించారు.
సమయానికి రక్తం ఎక్కించకపోయివుంటే కృష్ణవేణి బ్రతికి వుండేది కాదు.
తండ్రికి ఫోన్ చెయ్యడంతో రాత్రికి రాత్రే వచ్చాడు.
తమ్ముడికి ఫోన్ చేద్దామని ... చేస్తే కంగారు పడతాడని ఆగింది.హైదరాబాదులో నారాయణ కాలేజిలో జూనియర్ ఇంటర్ చదువు తున్నాడు. వరంగల్లో ఆ చదువు లేదా అని అందరు అంటే వినకుండా తన కొడుకు ఐ.ఐ.టి కొట్టాలి అని భర్తతో పోరు పెట్టుకొని అక్కడ చేర్చుకొంది. డబ్బులు సరిపోవని భర్త అంటే రక్తం ధారపోసైనా చదివిస్తానంది. ఏదో ఆవేశంలో అలా అన్నదే కాని, ఇప్పటి చదువులు రక్తం ధారపోసి కొనగలిగే చదువులా ? తల్లికి రక్తం ఇస్తున్న కూతుర్ని చూసి విశ్వనాథ్ మనసు సిగ్గుతో చితికి పోయింది.
ఎప్పుడైనా కొడుకును బాగా చూసుకోవాలి కాని కూతుర్ని ఎంత చూసినా, ఎంత చదివించినా ...బురదలో పోసిన పన్నీరులా ఏమిటి ప్రయోజనం? అత్తగారింటికి పోయి అణకువగా గిన్నెలు తోముతుంటే వచ్చే గౌరవం ఇలాంటి చదువులు ఎన్ని చదివితే వస్తుంది అని పెదవి విరిచి వ్యాఖ్యానించబడిన ఆ కూతురే డాక్టర్ రూపంలో వుండి కూడా రక్త దానం చేస్తుంటే చాటుకెళ్లి మౌనంగా రోదిస్తూ తలబాదుకున్నాడు విశ్వనాద్.
కృష్ణవేణమ్మకి బాధతెలియకుండా మందులు వాడుతున్నారు. ఆమె ఇంకా స్పృహలోకి రాలేదు.
కాలు విరిగి నడవ లేని స్థితిలో వున్న కోడలి అవసరాలను దగ్గరుండి చూసుకుంటోంది వర్ధనమ్మ.
పక్కవున్న రోగులకి వాళ్ల బందువులొచ్చి చూసుకుంటున్నారు.
అక్కడ రోగులకి ఒకరు మంచి నీళ్లు యిస్తే, ఒకరు టాబ్లెట్ ఇవ్వటం ... ఇప్పుడెలావుంది?' అంటూ ఐదునిముషాలకోసారి పరామర్శించుకోవటం చూస్తుంటే అది హాస్పిటల్లా కాకుండా అందమైనా ఇల్లులా అన్పిస్తుంది. రోగుల మధ్య అనుబంధాలు, రోగులకి - రోగులకి మధ్య ఆత్మీయతలు అక్కడ చూడాలేకాని వర్ణించలేం ...
గండం గడిచి పిండం బయటపడ్డట్లు వైద్యం చెయ్యగా, చెయ్యగా ప్రాణాపాయ స్థితి నుండి బయటపడింది కృష్ణవేణి.
కృష్ణవేణి సృహలోకి రాగానే అత్తగారిని, మన్వితని చూసి షాకై శతృరాజ్యంలోకి వచ్చినట్లు విలవిల్లాడింది.
యాక్సిడెంట్లో తనతో పాటే గాయాల పాలైనా తన వీధిలోని ఆడవాళ్లు విషయం మొత్తం ఏడుస్తూ చెప్పారు.
అత్యవసర పరిస్థితిలో మన్విత బ్లెడ్ ఇచ్చిందని కూడా చెప్పారు. నోట మాట రాని దానిలా అయింది కృష్ణవేణి.
మానవత్వంతో కూడిన ఆ సహాయాన్ని చూస్తుంటే ఇన్నాళ్లు కూతురిపట్ల తను చూపిన నిరాదరణ గుర్తొచ్చి కుంచించుకు పోయింది.
వర్ధనమ్మ వంట చెయ్యడం పూర్తవగానే ... ముందుగా రోగులుండే రూముల్లో వున్న కోడలికి పెట్టి, ఆమె తినడం అయ్యాక అక్కడే కూర్చుని వున్న విశ్వనాద్ ని పైకి తీసికెళ్లి అయనకి కూడా అన్నం పెట్టింది వర్ధనమ్మ.
అన్నం ముందు కూర్చున్న విశ్వనాద్ కి అది మింగుడు పడక చాలా సేపు కష్టపడ్డాడు. కారణం మన్విత ఒకప్పుడు తనకి కాల్ చేసి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చాయి. .
“ నాన్నా ! ఇక్కడ మా హౌస్ సర్జన్ల హాస్టల్లో నానమ్మని ఎక్కువ రోజులు వుంచుకోవటానికి లేదు... నువ్వు తప్ప నానమ్మకి ఎవరున్నారు చెప్పు! మమ్మీని ఆ మాత్రం కన్విన్స్ చెయ్యలేవా? నానమ్మేమైనా టెర్రరిస్టా మీకు హాని చేస్తుందని భయపడటానికి ? చిన్న చిన్న సమస్యల్ని పెద్దవిగా భావించి వున్న నలుగురం ఇలా శత్రువుల్లా బేధాలు పెంచుకోవడం దేనికి? మానవ సంబంధాలను ఇంత తేలిగ్గా వదిలించుకొంటే మనశ్శాంతిగా ఎలా వుండగలగుతాం? ప్లీజ్! నాన్నా ! నువ్వొచ్చి నానమ్మను తీసుకెళ్లు ... లేకుంటే చచ్చిపోతుంది.” అన్న కూతురు మాటలు సూదులై పొడుస్తున్నాయి.
కన్న తల్లి చచ్చిపోతుందని తెలిసినా బాధ్యత వదులుతుందని రాయిలా వున్నాడే కాని మమకారంతో ఆలోచించి తల్లిని ఇంటికి తీసికెళ్లలేదు.
అలాంటి తనకి 'అమ్మా అని పిలిచే అర్హత కాని, అమ్మ చేతి తిండి తినే యోగ్యత కాని వున్నాయా ? కన్నీళ్లు కన్పించకుండా చేయి అడ్డుపెట్టుకున్నాడు.
“కంట్లో నలక పడితే తీసుకోవాలి కాని నలపకూడదు. కన్ను పోతుంది విశ్వనాధం. ఏదీ చూడనీ...” అంటూ కంటి వైపు చూడబోయింది వర్థనమ్మ " అమ్మా !” అంటూ ఏడ్చాడు విశ్వనాధం
******
హాస్పిటలని డా || మన్వితకి వదిలి హైదారాబాద్ వెళ్లాడు డా|| ధీరజ్ రెడ్డి. ఆయన ఎక్కువగా ఈ మధ్యన హైదరాబాదులోనే గడుపుతున్నాడు. అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నాడు.
అతనికి మన్విత సిన్సియారిటి, డెడికేషన్ మీద నమ్మకం ఎక్కువ.
మన్విత ఇచ్చే ట్రీట్ మెంట్తో, అత్తగారు చూపే ఆదరణతో కృష్ణవేణి కొద్దికొద్దిగా కోలుకుంటోంది. .
వాళ్ల వీధిలోని ఆడవాళ్లు కూడా కోలుకుంటున్నారు.
డా|| మన్విత కన్పించినప్పుడల్లా రెండు చేతులెత్తి దండం పెట్టి,కళ్లనీళ్లు తుడుచుకుంటున్నారు. కృతజ్ఞతగా చూస్తున్నారు. “ఈ దేవతనా తాము అన్ని మాటలు అని బాధపెట్టింది” అని బాధపడ్తున్నారు.
వాళ్ల చూపుల్ని, వాళ్లు పడే బాధని గమనించే స్థితిలో లేదు మన్విత. ఆమె పేషంట్ల బిజీలో ఆమె వుంది.
గదులన్నీ పేషంట్లతో నిండి వున్నాయి. ఎవరి బందువులు వాళ్లని కనిపెట్టుకొని వున్నారు. ఏ అవసరం వచ్చినా క్యాబిన్ దగ్గరికి వెళ్లి నర్స్తో చెబుతున్నారు అక్కడ ఇద్దరు నర్స్లు వుంటారు.. ఒకరికి నైట్ డ్యూటీ వుంటే - ఒకరికి డే డ్యూటీ వుంటుంది.
పేషంట్లకి పెట్టిన సెలైన్ బాటిల్స్ని, చూసుకోవడం, అవసరమైన ఇంజక్షన్స్ ని వెయ్యటం ఓ.పి లో వున్న పేషంట్లని డాక్టర్ దగ్గరికి పంపటం చేస్తుంటారు. ఎప్పుడు చూసినా హడావుడిగా తిరుగుతూనే వుంటారు.
కృష్ణవేణి బాత్రూంకి వెళ్లాలని ప్రయత్నం చేస్తూ-మంచం దిగి నడవలేక చాలా సేపటి నుండి ఇబ్బంది పడ్తోంది.
నర్స్ ని పిలుద్దామంటే అక్కడెవరూలేరు. ఏంచేయాలో తోచక పక్కబట్టల్ని పాడు చేసుకోలేక అటు వైపే వస్తున్న వర్ధనమ్మని చూసి ప్రాణం లేచివచ్చినట్లే..
“ అత్తయ్యా !” అంటూ పిలిచింది కృష్ణవేణి.“ ఏమిటి కృష్ణవేణి !” అంటూ వచ్చింది వర్ధనమ్మ ఈ ఒకసారి నర్స్ ని పిలుస్తారా ? అర్జంట్ !” అంది అర్థం చేసుకొంది వర్ధనమ్మ ఆ చుట్టు పక్కలెక్కడ నర్స్ లేదు. కోడలి వాలకం చూస్తుంటే ఎమర్జంట్లా వుంది. ఇప్పుడెలా అనుకుంటూ ....
పక్కన వున్న 'పాన్' ని చేతిలోకి తీసుకొని కృష్ణవేణమ్మ అవసరం తీర్చి ... దాన్ని తీసికెళ్లి టాయిలెట్లో పోసి, దాన్ని మళ్లీ కడిగి తీసుకొచ్చి కృష్ణవేణమ్మ బెడ్ పక్కన పెట్టింది వర్దినమ్మ..
ఇంకేమైనా అవసరం వుంటే చెప్పు అన్నట్లుగా కోడలి వైపు చూసింది.
అత్తగారి ముఖంలోకి చూసి ... ఆమె కాళ్లను తన చేతులతో తాకాలని కిందకి వంగే ప్రయత్నంలో బ్యాలెన్స్ తప్పి చూస్తుండగానే కిందకి జారి దబ్బున పడింది కృష్ణవేణి.
తృటిలో జరిగిన ఆ చర్యకి వర్ధనమ్మ గుండె జల్లు మంది. వెంటనే క్రిందకి వంగి కోడల్ని బెడ్ పై పడుకో బెట్టే ప్రయత్నం చేసింది. ఆమె ప్రయత్నం ఫలించక నిస్సహాయంగా అటు, ఇటూ చూసింది. అక్కడెవరూ కన్పించలేదు. నర్స్ కూడా కన్పించలేదు.
వెంటనే మన్వితను పిలిచింది వర్ధనమ్మ
నానమ్మ పిలుపు వినగానే మన్విత కృష్ణవేణమ్మ దగ్గరికి వస్తుంటే అది గమనించిన నర్స్ డాక్టర్ కన్నా ముందు వెళ్లి కృష్ణవేణమ్మను లేపి బెడ్ పై పడుకో బెట్టింది.
తల్లిలో కాల్షియం లోపం ఎక్కువగా వున్నందు వల్ల జాగ్రత్తగా వుండటం మంచిదని ఒక డాక్టర్గా మన్విత గమనించింది.
అదే విషయం తల్లితో చెప్పింది.
కూతురు మాట్లాడుతుంటే మాటలు కరువైన దానిలా తడినిండిన కళ్లతో చూడటం తప్ప ఇంకేం చెయ్యలేక పోతోంది కృష్ణవేణి
మన్విత వెళ్లిపోతుంటే-తన బిడ్డ ఇంకా కొద్ది సేపు తనతో మాట్లాడితే బావుండని అశించింది. కానీ ... అమె ఇప్పుడు తన ఒక్కదానికే బిడ్డకాదు. ఎందరో తల్లులకి సేద దీర్చే బిడ్డ ... ఎందరో బిడ్డల్ని అక్కున చేర్చుకునే తల్లి ....
ఇప్పుడు అర్థమైంది మన్విత అంటే ఏమిటో కృష్ణవేణికి. కూతురి ఔనత్యానికి గర్వంగా ఫీలయింది.
*****
No comments:
Post a Comment