పద్ధతులకు నాంది
ఆండ్ర లలిత
ఏమిటో పొద్దున్నే లేస్తూనే ఆనంది మనసులో మా ఇంటి పద్ధతులంటే మా ఇంటి పద్ధతులు అనుకుంటూ మనం పిల్లలి జీవితాలతో చలగాటాలు ఆడుతున్నామా అని కలవర పడుతోంది. ఒక పక్కన మంచి కోడలు వస్తోంది. కొడుకుకి తొందరగా పెళ్ళి కుదిరిందని ఆనందంతో మనసున సంతోషం ఎందుకు లేదు తనకి! ఎందుకు ఇంత బెంగ తనకి! ఏమిటో ఈ మాయ… ఏమిటో ఈ పంతాలు పట్టింపులు! అసలు ఎవరు వీటికి నాంది పలికారు అనే ఆలోచనలలో మునిగి అటూ ఇటూ కాలు కాలిన పిల్లిలా తిరుగుతోంది. ఈ మధ్యన ఎవరి సెల్‌ఫోన్ వారి చేతిలోనో, అందుబాటులోనో ఉండాల్సిందే. చార్జింగ్‌లో ఉన్నప్పుడు తప్ప. ఇంక దానికి కూడా సమయం లేదంటే పవర్ బ్యాంక్‌లు ఎలాగూ ఉండనే ఉన్నాయి కాదా. అలాంటి సమయంలో, ఆనంది చేతిలో ఉన్న సెల్ ఫోన్ మ్రోగింది. ఎవరా అని చూసేటప్పటికి వనజగారు. లేప్‌టాప్‌లో నిమగ్నమై సావిట్లో కాఫీ ఆస్వాదిస్తూ సోఫాలో కూర్చున్న భర్త ప్రహ్లాదరావుతో అంది ఆనంది “ఏవండి వనజగారు”, అని తన ఫోన్ చూపించి, ఎత్తనా అని సైగ చేసింది. మళ్ళీ ఏం ప్రశ్నలు వస్తాయో! మళ్ళీ ఏమి అవాక్కులు చవాక్కులు విసురుకుంటామో మనమిద్దరం ఫోన్ తరువాత!” ఏదో పని చేసుకుంటున్న ప్రహ్లాదరావు ఆ మాటలకి, మళ్ళీనా అప్పుడేనా అనే నిట్టూర్పుతో లాప్టాప్నుంచి తొంగి చూసాడు.
“హు…మరి అదే!! స్తితప్రజ్ఞతతో మాట్లాడు” అంటూ ఒక చిరునవ్వు విసిరారు ఆయన. అది ఎలా ఉందంటే తప్పులు చేయటం నీ నైజం. అవి కలసి అనుభవిద్దాంలే…భర్త అన్నాక తప్పుతుందా అన్నట్టుంది.
భర్త అన్న ధీమాతో “ఎత్తు మ్రోగిపోతోంది ఫోను. బావుండదు” అని సైగచేసాడు, భగవంతుడా దీనికి కాస్త మాట చాతుర్యం నేర్పు అన్నట్టు చూరుకేసి చూసాడు ప్రహ్లాదరావు.
“ఊహు నాకు భయమేస్తోందండి. ఆదిలోనే హంసపాదంల్లా రోజు మొదట్లోనే మనసు పాడౌతుంది. తరువాత చేస్తాను. నావల్లకాదు ఇవాళ చాలా పనులున్నాయండి” అంది ఆనంది .
“అదిగో రెండొవసారి మ్రోగటం మొదలైంది.. ఎత్తు” అని ఆనందిని గదమాయిస్తు కుర్చిలోంచి లేచి, తన దగ్గరికి వచ్చి, నేను నీతోనే ఉన్నానని చిరునవ్వుతో చెప్తూ.. అన్నాడు ప్రహ్లాద రావు… ఏమిటో ఈ గోల, పిచ్చి సంత సణుక్కుంటూ సెల్‌ఫోన్ ఎత్తి “హలో వదినగారు నమస్కారం” అంది ఆనంది నాభిలోంచి వస్తున్న కంఠంతో.
“నమస్కారం శుభోదయాలు…పనులు ఎంతవరుకు వచ్చాయండీ..ఏమిటీ, మాట నీరసంగా ఉంది… పనిలో ఉన్నారా…ఇంత ఆలస్యం చేసారు. కులాసానా… మా అత్తగారు మాట్లాడతారండి” అన్నారు కాబోయే వియ్యపురాలు వనజ.
“సరేనండి. దేనిగురించండి వనజగారు”
“ఏమో నాకేమీ తెలీయదండి” అని సణిగారు వనజగారు
“సరే ఇవ్వండి” అంది ఆనంది
‘పనిలో ఉన్నావా అమ్మా!”
“ఆ…ఏమిలేదండి…చెప్పండీ పెద్దమ్మగారు”
“వంటైందా అమ్మలూ…ఏమి చేసావు ఇవాళ” అన్నారు పెద్దమ్మ కమలాంబగారు.
“ఇంకా ఏమి అనుకోలేదు పెద్దమ్మగారు”
“మా కోడలికి బయటపనులే సరిపోతున్నాయి. మరి వంట ఏమి చేస్తుందో. నిన్ననైతే బయటనుంచే తెప్పించేసింది. ఇవాళా అంతే కాబోలు, నాకా ఓపిక లేదు. ఏదో మాటసాయం చేస్తా ఆ…అంతే “
“బావుందండి పెద్దమ్మగారు”
“అన్నట్టు నిన్నన మా అక్కయ్య ఫోన్ చేసి, ఓసేయ్ కమలా మన పద్దతి చెప్పావా వనజ కాబోయే వియ్యపురాలకి అని అడిగింది”
“ఏమిటండి పెద్దమ్మగారు అది?”
“ఏమి లేదు, కెంపుల హారం మీరు పెట్టాలనీ. నీ మనవరాలు మార్గశిర మాసంలో పుట్టింది కనుక మన అమ్మాయికి కెంపుల హారం పెట్టి వాళ్ళు మన ఇంటినుంచి తీసుకెళ్ళాలని మన పద్ధతి” అంది కమలాంబగారు ఠీవిగా
“అవునాండి ….” తటపటాయించింది ఆనంది.
“ అమ్మలు ఉన్నావా?”
“హా..హా..ఉన్నానండి”
“ఏమీ లేదమ్మా, ఇవన్ని చిన్న చిన్న వేడుకలంతే. మా కాలం వేరు. ఇప్పుడు అందరికీ ఒకళ్ళూ, ఇద్దరేగా చేసుకోవచ్చు. మరి ఇప్పుడు Reception ఒకటుంది కదా. దానిలో మీ కోడలికి కట్టే చీర ఏ కలరనుకుంటున్నావమ్మా?
మొన్న పెళ్ళికి పెట్టుడు బట్టలు కొందామని, మాకోడలు మనవరాలు వెళ్ళారు. అక్కడ గులాబి కలర్ పట్టచీర చూసారు, CMR shopping mall లో. మా మనవరాలికి చాలా నచ్చింది. అసలు దానికి ఎప్పుడూ గులాబి రంగంటే పరమ ఇష్టమనుకో అమ్మలూ. ఎంతో కాదులే 1లక్షరూపాయులంతే. నేనన్నాను మీ వియ్యపురాలికి అదో లెక్కకాదులేయనీ. చాలా బాగుంది. అన్నట్టు మీరు కెంపుల నక్లేస్ పెడుతున్నారు కదా. కొనేసేయి. మళ్ళీ ఆమావాస్య వచ్చేస్తుంది. ఆ చీర మీద చాలా బాగుంటుంది. మా కోడలి స్నేహితురాలి అమ్మాయి పెళ్ళిలో ఆకు పచ్చ చీర కట్టుకుని వాళ్ళ అత్తగారు వాళ్ళు పెట్టిన పచ్చల నక్లెస్ పెట్టుకుందట. అలా తయారవ్వాలి.. ఏమంటావమ్మా. ఫొటోల్లో బాగా వస్తాయి” అన్నారు కమలాంబగారు.
“అవునండి. చూద్దాము పెద్దమ్మగారు మా వారితో మాట్లాడుతానమ్మా” అంది ఆనంది
“మా కోడలికి ఇస్తున్నానమ్మా. వనజా ఇదిగో ఫోన్”
“హల్లో! మా అత్తగారు మాట్లాడారు కదా. అదండి సంగతి.ఇంకా మీ పక్కనుంచి ఏమన్నా నేను చేయవలసి ఉంటే చెప్పండి వదినగారు. మనం మనం ఒకటే. ఏమి మొహమాట పడద్దు సరేనా” అన్న వనజగారి మాటలకి కాస్త తమాయించుకొని “మా కేమి వద్దండి. మీరు ఎలా చేసినా మాకు సమ్మతమేనండి”అని గట్టిగా ఊపిరి పీల్చుకొని ఫోన్ పెట్టేసి ప్రహ్లాదరావుగారి పక్క సోఫాలో చతికిల పడింది ఆనంది. అది చూసి,
“ఏమైందే అంతా బావుందా? ఏక పదాలతో లాగించేసావు మాటల బండి ”అన్నారు ప్రహ్లాదరావు.
“ఏమీలేదు. మీకు PF loanవస్తుందా?ఎన్నిరోజులలో వస్తుంది”
“ఈ ఆరాలన్నీ ఎందుకు” అన్నారు ప్రహ్లాదరావు. ఏదో ఉపద్రవం వస్తోందని సంకోచిస్తూ ఆనందితో.
“అయినా అసలు సంగతి ఏమిటీ? ఏమి మాట్లాడారు వాళ్ళు”
“కెంపుల హారం పెట్టమని అడిగారు. మార్గశిర మాసంలో పుట్టిందట వాళ్ళ అమ్మాయి. అందుకని మనం పెళ్ళి తరువాత మన కోడలిని కెంపుల హారంతో అలంకరించి మనింటికి తెచ్చుకోవాలట. మన ఆర్థిక పరిస్థితి, వాళ్ళకి ఎలా చెప్పను. బావుండదు”అని తన కళ్ళుతుడుచుకుంది చీర కొంగుతో.
“ఆ…ఇది మరీ బాగుంది. కాసులపేరు ఇద్దాం”
“లేదు బాగుండదు”
“నేనేమి చేయను. పిచ్చా వెఱ్ఱా ఏదో వాళ్ళ మాట విని మోయలేని మోత మోస్తూ రోడ్డున పడతామా? ఇలా చేస్తే సంసారాలు ఎత్తరిల్లవు. మనుషులను రోడ్డుకు ఈడ్చే పద్ధతులు పద్ధతులే కావు ”
“అంతేలేండి నా మాట ఎప్పుడు లెక్కచేసారుకనుక…పోనీ మన ఇంటి మీద లోన్ తీసుకుందాం”
“లేదమ్మా మన దగ్గర అంత లేదు. అదీ కాకుండా నేను ఇంకొక మూడు నెలలలో పదవీ విరమణ చేస్తాను. మనకి లోన్ రాదమ్మా”మూతి బిగించిన ఆనంది,
“నా కాసులపేరు మీద మీకేమి హక్కులేదు. అది మార్చేస్తాను. అది మీరు పెట్టింది కాదులేండి. ఆరు తరాలనుంచి వస్తున్న ఎకైక వారసత్వపు నగ. పదండి తనిష్కకి వెళ్ళి అది మార్చి కెంపుల హారం కొందాము”
“నువ్వు వెళ్ళి కొనుక్కో. నాతో చెప్పకు”
“అలా కుదరదు. మీరే చెప్పాలి సలహా..అంతే…”
“దాని బదులు అదేదో వారసత్వపు నగ నీచేతులతో నీవే వేయచ్చుకదా. మన కోడలి మెడలో”
“ఏమిటో మాయ సంత. లేనిపోని ఆర్భాటాలకి వెళ్ళద్దమ్మా. మనకున్నది పెట్దామంతే. వినమ్మా మాట. పుర్వోత్తరపు నగ విలువ చాలా ఎక్కవ. దానిలో ఎన్నో ఆప్యాయతలు అనురాగాలు దాగి ఉన్నాయి. పెళ్ళంటే రెండు నిండు జీవితాల కలయక. అంతేగాని photo sessions, ఆర్భాటాలు కాదమ్మా“ అని దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదరావు ఆనందిని.
“ఇప్పుడే ఫోన్‌చేసి వనజగారితో చెప్పేసేయి. నేను కెంపుల హారం పెట్టలేను. కాసులపేరు పెట్తానని”
“సరే” అని ఆనంది ఫోన్‌చేసి వనజగారుతో చెప్పేసింది. దానితో తన మనసు శాంతించింది. ఆనంది మనసు శాంతించిందని నెమ్మదించి మౌనంగా ఉండిపోయారు ప్రహ్లాదరావు.
అది చూసి ఆనంది ”ఏమిటండి అలా ఉన్నారు. అంతా బావుంది కదా”
“ఏమి బావుంది. అన్నీ వైపరిత్యాలు. ముందు కాలంలో ఆడపిల్ల బలి అయ్యేది. ఇప్పుడు మగపిల్లలు కూడా. సంఘసంస్కర్తలు పూనుకోవాలి, మార్పులు చేర్పులు అవ్వాలి”
“అవునండీ, కాలంతో పద్ధతులు మారాలి” అంది ఆనంది.
ఆడంబరాలు, మెహర్బాణీలు, false prestige లు కాదు. పెళ్ళంటే ధర్మాలు నియమాలకి కట్టుబడ్డ జీవితాలకు నాంది. ఆనురాగాలు ఆత్మీయతలు, అనుబంధాలను పెంపొందించేవే సరైన పద్ధతులని మన కొడుకూ కోడలికి చూపిద్దాం. ఇప్పుడు మన మనసులు కష్టపడ్డాయి. మనని కష్టపెట్టే పద్ధతులు సరికావు. గుట్టుచప్పుడు కాకుండా మూడోకంటికి తెలీయకుండా సంసారం కలిసికట్టుగా పైకి తీసుకురావాలి. ఇదే మన ఇంటి పద్ధతి ఆనంది. మన ఇంట్లోనే దానికి నాంది పలకాలి.
***
No comments:
Post a Comment