'సంకటాలను' తీర్చే సంకష్టహర చతుర్ధి!
-సుజాత.పి.వి.ఎల్
ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత మూడు, నాలుగు రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాల సమయమునకు అంటే సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు వస్తుందో ఆ రోజును సంకష్టహర చవితి అంటారు. అయితే రెండు ప్రదోషకాలంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే మిగులు రోజు అంటే రెండోరోజు మాత్రమే సంకటహర చవితిగా పరిగణించాలి. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి. అయితే ఇందులో మొదటిది వరద చతుర్థి, రెండోది సంకష్టహర చతుర్థి.. అమావాస్య తరువాత వచ్చే చతుర్థి వరద చతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి అంటారు. ఇందులో వరదచతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను పౌర్ణమి తరువాత చవితి తిధినాడు ఆచరిస్తూ ఉంటారు.
కష్టాలను తొలగించమని వినాయకుడిని భక్తి శ్రద్ధలతో వేడుకుంటూ..ఈ వ్రతాన్ని చేయువారు ఆ రోజు అంతా ఉపవాసం ఉండి సాయంకాలం సంకట గణేశ పూజ చేసి చంద్రోదయం తరువాత పూర్ణచంద్రుణ్ణి దర్శించుకుని ధూప దీప నైవేద్యాలు సమర్పించిన పిదప ఆహారం భుజించాలి. సూర్యాస్తమయం వరకు ఉడికించిన వంటకాలుగానీ, ఉప్పు కలిపిన పదార్థాలు కానీ తినకూడదు. పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి.
ఈ వ్రతం ఆచరించిన వారు వ్రత కథ వినిన వారు 'స్వనంద' అనే గణనాధుని లోకానికి వెళతారని పెద్దలు చెబుతుంటారు. అంతేకాక తొలిపూజలందుకునే ఆదిపూజ్యుని ఆశీస్సులు పొంది కష్టాలన్నీ తొలగిపోయి సకల సౌభాగ్యాలతో తులతూగుతారని పురాణాల ద్వారా తెలుపబడింది.
***
No comments:
Post a Comment