శ్రీరుద్రంలో విశేషాలు - 8
శ్రీరామభట్ల ఆదిత్య
వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూతగణేశమవ్యయమహం వందేఽర్ధరాజ్యప్రదమ్ ౹
వందే సుందరసౌరభేయగమనం వందే త్రిశూలంధరం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్॥
పదవ అనువాకం:
'ద్రాపే అంధసస్పతే దరిద్రన్ నీలలోహిత...' అనే మంత్రంతో ఈ అనువాకం ప్రారంభం అవుతుంది. ఇందులో మొత్తం 13 మంత్రాలున్నాయి. ఈ అనువాకంలో రుద్రంయొక్క ముగింపు మంత్రాలున్నాయి. 9 అనువాకాలలో పరమేశ్వరుడిని కీర్తించిన భక్తుడు, ఈ అనువాకంలో తనను ఎల్లప్పుడూ కాపాడమని ప్రార్థిస్తాడు. 'ద్రాపే', 'అంధసస్పతి', 'దరిద్రత్', 'నీలలోహిత' అనే నాలుగు నామాలతో ఈ అనువాకం మొదలౌతుంది.
పరమేశ్వరుడు పాపులను శిక్షించువాడని, ఆహారప్రదాత అని, కాంతిరూపంలో ఉండువాడని, నల్లనిగొంతు, ఎర్రనిశరీరం కలవాడని అర్థము. తమను రక్షించమని, మృత్యువు నుండి కాపాడమని, వ్యాధులనుండి కాపాడమని భక్తుడు ప్రార్థిస్తాడు.
"ఓ రుద్రుడా! ఓ జగత్పతే! శక్తిసమేతుడవైన నీవు జననమరణమనే రోగానికి దివ్యౌషధం వంటివాడవయ్యా! అందరిలోనూ ఉండి ఆనందాన్ని ప్రసాదించేవాడవయ్యా! మమ్మల్ని అదే రూపంలో కరుణించవయ్యా! జటాజూటాన్ని ధరించువాడా! శతృవులను సంహరించువాడా! నీపై అచంచలభక్తిని ప్రసాదించి మా గోసంపదతో సహా అందరినీ ఎటువంటి వ్యాధులూ లేకుండా పరిపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి రక్షించు తండ్రి! మోక్షమార్గంలో మమ్ములను నడిపించి, పాపులను శిక్షించు. నీకు నా అనేకానేక నమస్కారాలు. ఇహలోకంలో సకలసుఖాలను ప్రసాదించి, అటుపైన లోకంలో కైవల్యాన్ని ప్రసాదించు! నీవే ప్రజాపతివై మమ్ములను రక్షించు." అని ప్రార్థిస్తారు.
" హే లోకనాయకా! మాలో ఉన్న పెద్దవాళ్ళను, చిన్నవాళ్ళను, యువకులను, తల్లిగర్భంలో ఉన్న పిండముతో సహా మా తల్లులను, తండ్రులను అందరినీ రక్షించు! మా శరీరములకు కూడా ఎటువంటి కష్టములు కలుగకుండా చూడు! మా సంతానానికి ఎప్పుడూ బాధలు, కష్టాలు రాకుండా చూడు! అకాలమృత్యువును హరించు! మా గోవులను, గుర్రాలను కాపాడి, మా సేవకులను కూడా రక్షించు భగవన్! నీకు అనేకానేక నమస్కారాలు సమర్పిస్తున్నాను" అని భక్తులు ప్రార్థిస్తారు.
నమఃశివాయ
( ఇంకా ఉంది )
No comments:
Post a Comment