అనసూయ ఆరాటం - 8
చెన్నూరి సుదర్శన్
(శాలోల్ల దుకాణం కిరాయికి తీసుకుంటారు సమ్మయ్య, బుచ్చయ్య. లింగారెడ్డి కి టి.బి. వస్తుంది. అతనికి పెళ్లి సంబంధాలు చూస్తుంటారు. ఆ సంగతి పిల్లను చూడడానికి వెళ్ళినప్పుడు నిజాయితీగా చెబుతారు.)
“ఏదైనా పెండ్లి పిల్లకు సుత తెల్వాలె.. నిజం దాపెట్టి పెండ్లి చేసిండ్లని అ తరువాత పిల్ల బదునాం చెయ్యొచ్చు” బుచ్చయ్య అంటాంటే అనసూయ కొంచెం తల్కాయెత్తి సూసింది. ఆమె కాటుక కండ్లల్ల కాంతి కానత్తాంది.
అనసూయ సుత ఇంటాందని బుచ్చయ్య మల్ల చెప్పబట్టిండు.
“లింగారెడ్డి శాన తెలివిగల్ల పిలగాడు.. బుధ్ధిమంతుడు. మేము ఇయ్యాల గిట్ల పచ్చగ ఉన్నమంటే లింగారెడ్డే కారకుడు. మేము ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్సుకోలేము. కాని..” అని ఆగిండు.
అసలు నిజం చెప్తడని రామిరెడ్డి ఆలకిచ్చి వినబట్టిండు.
“లింగారెడ్డికి ఈ సందుల పానం సుస్తి చేసింది. దవకాన్ల పరీచ్చలు చేయించినం. టీ.బి. అన్నరు. మందులు వాడుతానం. డాక్టర్లు ఏం ఫికరు లేదన్నరు. మందులు వాడితే తగ్గిపోతదని.. పెండ్లి సుత చేసుకోవచ్చని భరోసా ఇచ్చిండ్లు. రెన్నెల్లు మందులు వాడి మల్ల పరీచ్చలు చేయించినం.. పురంగ తగ్గిందన్నరు. కొన్ని మందులు బలానికి రాసిచ్చి కొన్నాల్లు వాడుమన్నరు. మంచి కురాకు తినమన్నరు. మీకందరికి నచ్చితెనే సంబంధం ఖాయం చేసుకుందాం. పిలగానికి తల్లీ.. తండ్రి లేరు. ఒక తమ్ముడున్నడు. అంతా మా సమ్మయ్య చేతుల మీదుగ నా చేతుల మీదుగ పెండ్లి తతంగమంతా జర్పిత్తం”
రామిరెడ్డి సోంచాయించుకుంట అనసూయ దిక్కు సూసిండు.
“రామిరెడ్డీ నువ్వైతే పిలగాన్ని చూసినవ్ కదా..! నీ కెట్లనిపిచ్చిండు” అని అడిగిండు వెంకటయ్య.
“పిలగాడు నచ్చబట్టే కదా మిమ్మల్ని రమ్మన్నది.. నాకైతే ఏ రోగం రొట్టు ఉన్నట్లనిపియ్యలేదు. పిలగాడు కొంచెం బక్కగున్నట్టే గాని మరీ బొక్కలెల్లి ఏమీ లేడు.. మా పిల్లనే కొంచెం పెయ్యి చేసింది.. మీకు సుత నచ్చితేనే మిగిలిన పెట్టుబోతల సంగతి మాట్లాడుకుందాం” అన్నడు రామిరెడ్డి.
“రామిరెడ్డీ.. నువ్వు పెట్టుబోతల సంగతి అటు పక్కకు పెట్టు. ముందుగాల పిల్ల మన్సుల ఏమున్నదో.. తెల్సుకో.. మాకు కాని కట్నం అఖ్ఖర లేదు. పెండ్లి కర్సంతా మేము పెట్టుకుంటం.. మాకైతే పిల్ల నచ్చింది” అని సమ్మయ్య తేల్సి చెప్పిండు.
“పిల్ల గుణం పధానం గాని పైసలేంది.. ఇయ్యాలుంటై.. రేపు పోతై. మందులు వాడే పిలగాడు కదా.. లింగారెడ్డిని సంటి పిలగాని లెక్క అనసూయ అర్సుకుంటే సాలు” అని వెంకటయ్య సదిరి చెప్పిండు.
“నాయ్నా.. ఓ పాలి లోపల్కి రా..” అన్కుంట అనసూయ లేచి ఇంట్లకు పోయింది. రామిరెడ్డి, సీతమ్మ ఇంకా ముసలవ్వ అంతా బిక్కు బిక్కు మనుకుంట అనసూయ ఎన్కాల పిల్లి కూనల్లెక్క పోయిండ్లు.
రవీందర్.. సురేందర్‌లు ఒకల మొకం ఒకలు సూసుకున్నరు. బుచ్చయ్య, సమ్మయ్య సేట్లు ఫరాగత్‌గ ఉన్నరు. ఎట్లైతే.. గట్లైతదన్నట్టు.
వాకిట్లకు లేచి పోయి బుచ్చయ్య దోస్త్ బీడి.. సమ్మయ్య గంట సుట్ట ముట్టిచ్చి అటూ.. ఇటూ తిరుక్కుంట ఊద బట్టిండ్లు. సురేందర్.. రవీందర్ నీళ్ళు తెచ్చిన పిల్లను దగ్గరికి పిల్చి ఆమె పేరూ.. నాయ్న పేరు.. అడుగ బట్టిండ్లు.
వెంకటయ్య ఒంటెల్కు పోతనని లేచి ఆవలకు పోయిండు.
జరంత సేపటికి రామిరెడ్డి ఇంట్లకెల్లి బైటికచ్చుడు చూసి బుచ్చయ్య, సమ్మయ్యలు లోపలికచ్చిండ్లు. వాల్ల ఎన్కనే వెంకటయ్య పనికానిచ్చుకొని వచ్చి మంచాల కూకున్నడు.
“సేట్లూ.. నా బిడ్డ అనసూయ తోటి మాట్లాడిన. పెండ్లైనంక పిలగానికి రోగమత్తే ఏం చేసెటోల్లం నాయ్నా. నా నసీబుల ఎట్ల రాసిపెట్టుంటే అట్ల జర్గుతది.. కానియ్యన్నది.. పెండ్లికొప్పుకున్నది. నా బిడ్డ ఇట్టమే నా ఇట్టం” అన్నడు రామిరెడ్డి.
తన నాయ్న గుండెల మీద కుంపటి దించాలనే బిడ్డ ఈ పెండ్లికి ఒప్పుకుంటాదని రామిరెడ్డి మన్సుల లేక పోలేదు. అడుక్క తిన్నా మంచిదే కాని నా బిడ్డ పెండ్లి నేను సయంగ చెయ్యాలె.. అని మన్సులనుకున్నడు.
“బుచ్చయ్య సేటూ.. నా బిడ్డ పెండ్లి మా ఇంటి ముందల చేసి మీ ఇంటికి సాగనంపుత.. గాయింత కర్సు నేను పెట్టుకోనా.. కాదనకుండ్లి” అని గుడ్ల నీళ్ళు కుక్కుకున్నడు.
“అయ్యో.. రామిరెడ్డి బాధ పడకు. గట్లనే కానియ్యి.. మాకు సంతోసమే..” అన్నడు బుచ్చయ్య.
“మల్లో మంచి రోజు చూస్కోని వత్తం. లగ్గం కోటేసు కుందాం” అన్కుంట లేసిండు సమ్మయ్య.
ఆయన ఎన్కాల్నే అందరు లేసి రామిరెడ్డి దగ్గర సెలవు తీస్కోని ములుగుకు తిరిగి సైకిల్ల మీద పయానమయ్యిండ్లు.
***
జంగాలపల్లి రాముని గుల్లె పెద్దల సమచ్చంల అనసూయ, లింగారెడ్డిల పెండ్లి మూర్తాలు పెట్టిండు అయ్యగారు. శ్రీరామచంద్రుని దేవుని సాచ్చిగా ఇడెం పెట్టుకున్నరు.
పెండ్లి రేపనంగ పిలగాన్ని తీస్కపోతమని ఐదుగురు పెద్దమన్సులు పెండ్లిపిల్ల ఊరి నుండి సవారి కచ్చురం కట్టుకొని వచ్చిండ్లు. ఆనాత్రి వచ్చిన పెద్ద మన్సులకు మర్యాదలు రెడ్డి కులపోల్ల ఆచారం లెక్కనే చేసిండు బుచ్చయ్య. ములుగు దగ్గర సుద్దనపల్లిల లంబాడోల్లు గుడుంబసారా తయారు చేత్తాంటరు. ఎనిమిది రూపాయలు పెడితే శేరు గుడుంబ సార.. రెండు శేర్ల గుడుంబా.. రెండు కోళ్ళు తెగినై.. వచ్చిన పెద్దమనుషులు తుర్తిగ తిన్నరు తాగిండ్లు.
సుక్కపొద్దుకు లేచి సప్పుల్లతోటి లింగారెడ్డి మైలపోలు తీసి పెండ్లిపిలగాన్ని తయారు చేసిండ్లు. సురేందర్‌ను తోటిపెండ్లి కొడుకు. మాదిగ సప్పుల్ల తోటి అదే పిలగాని సవారి కచ్చురం ఎన్కాల మరో ఐదు ఎడ్ల బండ్లల్ల సుట్టాలు.. పక్కాలంతా బైలెల్లిండ్లు.
జంగాలపల్లి చేరేటాల్లకు పదైంది. అదే రామునిగుల్లె విడిది చేసిండ్లు. పెండ్లి పిలగాన్ని తీస్కపోనచ్చిన ఒక పెద్దమనిషి పోయి కబర్ చేసిండు. పదకొండింటికి పెండ్లాయె.. ఏగిరపెట్టిండు.
రామిరెడ్డి సుట్టాలు కొందరని పదురుకొని సప్పుల్ల తోటి ఎదురుకోను వచ్చిండు.
ముందుగాల పెండ్లి పిలగానికి కుంకుమ బొట్టు పెట్టిండు రామిరెడ్డి. బాసింగం కట్టిచ్చిండు. బిందెల బెల్లం కలుపుకచ్చిన గిలాసెడు పానకం నీల్లిచ్చిండు. ఆతరువాత తోటి పెడ్లికొడుకు సురేందర్‌కిచ్చిండు.
పెండ్లికచ్చిన మొగోల్లకు పానకం పంచుకుంట చేతుల్ల బెల్లం ముక్కలు పెట్తాబోయిండు రామిరెడ్డి. సావిత్రమ్మ సుత అదే పధ్ధతిల ఆడోల్లను అర్సుకున్నది. సమ్మయ్య, బుచ్చయ్య సేట్లు రామిరెడ్డి మీద సంబురంగ గులాల్ సల్లిండ్లు. రామిరెడ్డి ఎదురు గులాల్ సల్లిండ్లు. ఎదురుకోల్ల సంబురం సూసెడానికి పస్ర ఊరి పోరగాండ్లంత పోగై సప్పుల్లకు సంకలెగురేసుకుంట డాన్సులు చెయ్యబట్టిండ్లు.
పెండ్లి పందిట్లకు చేరెటాల్లకు పావుతక్కువ పదకొండయ్యింది. సొప్ప పందిరేసి.. మామిడాకు తోరణాలు కట్తిండ్లు. పందిరి గుంజలకు రంగు, రంగు కాయితాలు కత్తిరిచ్చి సుట్టిండ్లు. అవే రంగు కాయితాల తోటి జాలార్లు కత్తిరిచ్చి సుత్లి తాడుకు అంటిచ్చి ఇంటి సూరు సుట్టు ముట్టు.. కొట్టంల నాలుగు మూలలల్ల యాల్లాడ దీసిండ్లు.
ఇద్దరయ్యగార్లు వచ్చి మంత్రాలు సదువుకుంట పెండ్లి తతంగం సురువు చేసిండ్లు. లగ్గం.. నాగబెల్లి ఒక్క పోలు మీదనే చేసిండ్లు. కట్నాలు సదిచ్చుడైనంక రామిరెడ్డి భోజనాలకు లేవండని సెలవిచ్చిండు.
ఎడ్ల కొట్టంల బంతి భోజనాలు.
సురేందర్ తింటాంటే ఇత్తార్ల సూర్లకెల్లి చెప్పు జారి పడ్డది. గోకర్ణం తోటి పప్పుచారు పోసుకుంట వచ్చే ఆసామి..
“సారూ ఇది నాతప్పే.. చెప్పులు తారుమారైతయని సూర్ల చెక్కిన. బాంచెను.. నీకాల్మొక్కుత. ఇంకో ఇత్తారేసి వడ్డిత్త.. నారాజ్ గాకు” అన్కుంట గజ్జ, గజ్జ వన్కబట్టిండు. పక్కకు తినెటోల్లంత నవ్వబట్టిండ్లు. సురేందర్ బిక్క మొకమేసిండు.
పొద్దుమూకి పెండ్లిపిల్ల అప్పగింతలైనంక సింగల్ బ్యాండుమేలం.. ఊరేగింపుతోటి ములుగుకు సాగనంపిండ్లు.
No comments:
Post a Comment