అందలం... అనుభవం - అచ్చంగా తెలుగు

అందలం... అనుభవం

సాలిగ్రామ లక్ష్మణ్ 


  ఒక కంపెనీ లోని ఉద్యోగులు సరదాగా ప్రస్తుత యువ నాయకుల   ప్రవర్తన, వారి వాక్పటిమల గురించి మాట్లాడుకుంటున్నారు. తడబడుతూ  తప్పులు మాట్లాడుతూ నవ్వులు పాలు అవుతున్న  నాయకుల గురించి చర్చ రసవత్తరంగా సాగుతోంది. ఉద్యోగులలో మృదు స్వభావి అయిన  సత్యం మాట్లాడుతూ, కొత్తగా వస్తున్న ప్రజా ప్రతినిధులయిన నాయకులకి బొత్తిగా మాట్లాడటం కూడా రావడం లేదు,చాలా పదాలు తడబడుతూ తప్పులుగా ఉచ్చరిస్తున్నారు అని వాపోయాడు.ఆ సంస్థలో కొత్తగా చేరిన  వామన రావు  అందుకుని అదేమిటి సత్యం గారూ అలా అంటారు,కొత్తలో ఎవరికి మాత్రం ఏమి వస్తుంది. కొన్నాళ్ళు మనం ప్రోత్సహిస్తే వాళ్లే అన్నీ నేర్చుకుంటారు.చూడండి,మన కంపెనీ లో సీనియర్లు అయిన వినోద్,సంపత్ ల యొక్క నైపుణ్యం,అనుభవం ముందు మనమెంత?


వారిలా ఏ విషయమైనా వివరంగా సులభంగా  అర్ధమయ్యేలా చెప్పమంటే నేను చెప్పగలనా!


అలా చెప్పాలంటే నాకు కొంత సమయం పడుతుంది కదా! అని వాదించాడు.అంతలో వామన రావు కి   ఫోను రావడంతో బయటకు వెళ్ళాడు.అప్పుడు సంపత్ మాట్లాడుతూ 'సత్యం గారూ , అతని తో ఎందుకు  వాదన  మీరు  చెబుతున్న నాయకుడు  వారి బంధువే ,అందుకే అలా సమర్ధిస్తూన్నాడు' అని సర్దిచెప్పాడు.


కాసేపటికి వామన రావు  రావడంతో సత్యం  అతనితో మాట్లాడుతూ "బావుందండీ వామనరావు గారూ మీరన్నది నిజమే కొత్తవారిని ప్రోత్సహించక పోతే వారికి అనుభవం ఎలా వస్తుంది" అంటూ మిగతా రంగాల లో కూడా కొత్త వారిని ఎదగనివ్వాలన్న  మీ  ఆలోచన బాగుంది అనడం తో అతను నేను చెప్పింది   కరెక్ట్ అన్నట్లు గర్వంగా అందరి కేసి చూసాడు. కొన్ని రోజులు గడిచిన తరువాత........ఒకరోజు ఆఫీసులో వామనరావు  ఫోన్ లో  ఆందోళన గా  మాట్లాడుతున్నాడు.వాళ్ళ ఇంటిదగ్గర ఎవరికో ఆరోగ్యం బాగా లేకపోవడంతో డాక్టర్ గారికి చూపించడానికి అడుగుతున్నారు. ,ఇంటిదగ్గర్లో కొత్తగా వచ్చిన డాక్టర్ బాగానే చూస్తూన్నాడు ఆ డాక్టర్ దగ్గరకు వెళతామని వారు అంటుంటే, వామన  రావు అక్కడకి వద్దని కొంచెం దూరమైనా సిటీ కి తీసుకెళ్లి సీనియర్ డాక్టర్ కి చూపించమని సలహా ఇస్తున్నాడు. 


ఆ సంభాషణ వింటూనే, డాక్టర్ బాగా చూస్తూన్నా కొత్త వాడు కాబట్టి, ఆరోగ్యం విషయంలో అయితే సీనియర్ కావాలన్నమాట  అని అనుకుని కామ్ గా ఉండిపోయాడు సత్యం కొన్ని రోజులకు వామన రావు రెండో కొడుకుని స్కూల్లో వేస్తున్నప్పుడు ఆ స్కూల్ వారు అబ్బాయిని కొత్తగా వచ్చిన టీచర్ సెక్షన్లో  వేయడంతో ,  వామన రావు స్కూల్ వారితో గొడవపడి మరీ సీనియర్ టీచర్ సెక్షన్ లో వేయించాడు.శిక్షణ పొందిన మంచి టీచర్ అయినా సరే ఆవిడ కొత్త కాబట్టి  అబ్బాయి చదువుకు మాత్రం  పనికిరాదు  సీనియర్ టీచర్ కావాలన్నమాట అని  సత్యం అనుకున్నాడు.


 మరి కొన్ని రోజుల తరువాత.....


ఒకరోజు సాయంత్రం ఆఫీస్ లో కొలీగ్ పంక్షన్ కి పిలవడంతో    అందరూ అక్కడ కలుసుకున్నారు. అక్కడికి బాగా చదువుకొని విద్యా రంగం లో స్థిర పడాలనుకున్న  వేణు వచ్చి , తను కొత్తగా ఇంటర్ కాలేజ్ పెట్టానని, విద్యార్థులని అందులో చేర్పించి తనని ప్రోత్సహించమని అందరినీ అభ్యర్ధించాడు.అలాగే  చూద్దామని వారు చెప్పారు.


ఫంక్షన్ అయిన తరువాత ఎవరి ఇళ్ళకి వారు వెళ్లిపోయారు.


కొన్నిరోజులకి  పదవ తరగతి     ఫలితాలు వచ్చాయి.మరలా వేణు అందరినీ కలిసాడు.విద్యార్థుల్ని చేర్చి తనను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు అందిస్తామని అభ్యర్ధించాడు.అపుడు కొంతమంది తమ పిల్లల్ని చేరుస్తామని అతను ఇచ్చిన అడ్మిషన్  కాగితాల  మీద సంతకం పెట్టడం తో  వేణు సంతోషంగా వారికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు.


వేణు వెళ్లిన తరువాత   వామనరావు  మాట్లాడుతూ "అరే, మీరు ఇక్కడెందుకు చేరుస్తున్నారు? కొత్తగా వచ్చిన కాలేజీలో చేర్చి పిల్లల భవిష్యత్తుని రిస్క్ లో పెడుతున్నారు? ఆలోచించండి  అంటూ,తన పెద్ద కొడుకును రాజధాని లోని గొప్ప కాలేజ్ లో చేరుస్తున్నట్లు చెప్పాడు. 


విన్న వారందరు మౌనంగా ఉండిపోయారు.


కానీ సత్యం వామనరావు కేసి చూసి, మనసా వాచా కర్మణా అన్నారు.... దీనికి విరుద్దంగా  మీకు   నచ్చిన నాయకుడు అయితే కొత్తవారిని ప్రోత్సహించాలంటూ ఒక వాదనతో మాట్లాడుతూ, స్వ విషయమైతే అనుభవజ్ఞులు కావాలంటూ మనసులో ఒకటి పైకి ఒకటి చెబుతున్నారు.


"ఆ  రోజు నాయకుల గురించి మాట్లాడినప్పుడు, కొత్తవారిని ప్రోత్సహించాలి అంటే మీరు చాలా మంచిగా ఆలోచిస్తున్నారు అనుకున్నా కానీ అడుగడునా జీవితంలో ప్రతీచోట అనుభవం కావాలంటూ కొత్తవారిని ప్రోత్సహించడానికి మాత్రం ముందుకు రావడంలేదు. చెప్పేటందుకే మాత్రం చాలా మంచి మాటలు అందరినీ ఆకట్టుకునేలా చెబుతారు కానీ ఆచరణలో మాత్రం వాటిని పాటించరు.. ఇంకెప్పుడూ ఆచరించనివి చెప్పకండి." 


 "కొత్తగా ఉన్న వారు అనుభవజ్ఞులతో వుంటూ వారి నుండి మెలకువలు నేర్చుకుంటూ ఎదుగుతారు. అంతే కానీ వచ్చీ రాగానే అందలం ఎక్కాలనుకుంటే మాత్రం చతికిల పడతారు. కష్టపడే తత్వం ఉన్న వారిని గుర్తించి వారిని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి అంతే కానీ మీ వారిని మాత్రమే పైకి తీసుకురావాలని అనుకోకండి." అనడంతో వామనరావు సిగ్గు పడిపోయాడు. అతనికి అర్ధమయ్యేలా చెప్పిన సత్యాన్ని అందరూ మెచ్చుకోలుగా చూసారు.


***

No comments:

Post a Comment

Pages