క్షణికం - అచ్చంగా తెలుగు

క్షణికం 

తాటిశెట్టి రాజు 

 

మోహమే కాదు,

దాని వెనక ...

జీవితమూ క్షణికమే.,


"క్షణికం" అని పలికే లోగా

విడాకులిచ్చి పోతుంది

నీ తొలి ప్రేయసి - "జీవితం".


అస్థులే కాదు,

ఆస్థులూ ఆవిరైపోతాయి.,

కాస్త ముందూ వెనక...

కలకాలం కరగనిదంటూ ఉంటే

అసలంటూ 'లేని' కాలమే.


భౌతికంగా మనిషి

ఆయుష్షు తీరి విడిచిపోతే.,

మన అనుకునే మనుషులు

అవసరం తీరాక వదిలిపోతారు.


పట్టలేని ఉక్రోషంలో చంపేసేది శత్రువే

కానక్కర్లేదు.,

అహం పోసి పెంచిన మనసు కూడా

అనుకూలం లేనపుడు..,

ఆత్మహత్య పేరుతో నిన్ను చంపేస్తుంది.


ఇంక బంధాలంటావా..?

బంధాలన్నీ వీధి చివర వరకే.,

రక్తసంబంధం కూడా

చెయ్యి చురుక్కుమనే వరకే

పట్టుకునేది కొరివిని.


రా!

రాత్రి చీకట్లో నిన్ను ఒంటర్ని చేసి

మాయమయ్యే నీడని కూడా వదిలేసి,

నీలోకి మునకేద్దువు గానీ.


 ***

No comments:

Post a Comment

Pages