రంగవల్లి - అచ్చంగా తెలుగు

రంగవల్లి

లంకా సాగర్


శంకరయ్య తాత ఆశ్రమంలో నుండి ఓం నమశ్శివాయ అనే పంచాక్షరీ మంత్రం గంభీరంగా వినిపిస్తున్నది. తర్వాత ఓంకార శబ్దం, శంఖనాదంలా  ఆసూర్యోదయాన  మంచు తెరలను చీల్చుకుంటూ ఆ మురికివాడల్లోని గల్లీలలో జనాభాకు మేలుకొలుపు పాట పాడుతున్నది. పక్క పక్కనే ఉన్న రేకుల షెడ్లు లాంటి ఇళ్ళల్లో ఉన్న వాళ్లంతా అలారం కొడితే లేచి కూర్చున్నట్టు లేచి కిర్రు మంటూ రేకుల తలుపులు తెరుచుకుని ఆరుబయట ,దంతధావనం  మొదలుపెట్టారు. ఆ ఇళ్ల మధ్య అప్పటి దాకా ప్రశాతంగా నిద్ర పోతున్న మురుక్కాలువ దానికి ఇరుపక్కల ఉన్న జనాభా తమ మురికి నీటితో మరింత మురికి చేస్తున్న జనాభా మీద అలిగి గుర్రుగా పారిపోవడం మొదలుపెట్టింది.

         మోకాళ్ల దాకా కట్టిన కాషాయ లుంగీ, మోకాళ్ళు దాటి ధరించిన  లాల్చి ,నుదుట తెల్లని త్రిపుండ్రాలు ,మధ్యలో శివుని మూడో కన్నులాఎర్రని బొట్టుతో, చినిగిన స్లిప్పర్లు,చంకన జోలెలో రంగురంగుల చాక్పీసులు,రంగుతుడిచే పాత గుడ్డ ,తలకు సాయిబాబాలా కట్టుకున్న కాషాయ గుడ్డ కట్టుకొని శంకర్ తాత షెడ్డు నుంచి బయటకు వచ్చాడు.

       "వల్లెమ్మా" అని పిలిచాడు. ఇంటి ముందు రంగవల్లి దిద్దుతున్న వల్లెమ్మ నడ్డిన చేతులు పెట్టుకుని ఒక చేత్తో మొహం మీద పడుతున్న జుట్టు సర్దుకుంటూ అప్పుడే పూర్తిచేసిన ముగ్గు వంక చూసి, శంకర్ తాత వైపు చూసింది. సంక్రాంతి ముగ్గులు మొదలెట్టేశావా అమ్మా!. నేను బేగి పోవాలా.కూసింత ఎదుర్రా.జనాలు రోడ్డుమీదకి వచ్చే  పాలికి శంకరయ్యను దించాలా. లేకపోతే పాన్  నమలటం ఊయటం మొదలెడ్తరు ."

  "అవును తాత .ముగ్గు మోజులో రోజువారీ పనికి వెళ్ళటం జాగయింది. అపార్ట్మెంట్ వాళ్ళు ఎగిరెగిరి పడతారు. బట్ట మార్చు కోస్తా," అంటూ లోనికి వెళ్ళింది వల్లమ్మ అని పిలవబడే వల్లి. లోపల్నుంచి గట్టిగా "ఇట్టాగే ముసుగెట్టి  పడుకుంటే బేరాలు పోతాయి అనేక జ్ఞానం కూడా  లేదు. లెగు లెగు"అంటూ అరుపు.వెంటనే బొగ్గుతొ ముఖం తోముకుంటూ రంగడు బయటకొచ్చాడు. శంకర్ తాత ను చూసి గబగబా ముఖం కడిగి లోనికి వెళ్ళి" చాల్చాల్లే సింగారం ఇహ నడు" అంటూ నవ్వుకుంటూ బయటకు వస్తున్న  ఆ దంపతులను చూచి, శంకర్ తాత కళ్ళు ఆనందంతో చమరిస్తుండగా,మనసులో, "మీరిట్టానే నవ్వుతూ  కలకాలం బతకాలని "దీవించి ముందుకు కదిలాడు. అతని బుర్రలో గతస్మృతులు మెదలసాగాయి.

  *****************
        విజయవాడ బీసెంట్ రోడ్డులో శంకర్ తాత బొమ్మలు వేస్తున్నాడు .హఠాత్తుగా కలకలం చెలరేగింది. రెండు వర్గాలవారు ఘర్షణకు దిగారు. రోడ్డులోని షాపుల షట్టర్లు దించేసారు. తనువేస్తున్న గీతోపదేశం బొమ్మ పూర్తిగాకుండానే భయంతో పక్క సందులోకి పరిగెత్తాడు శంకర్ తాత.

    ఇవేమీ తెలియని ఒక నాలుగైదేళ్ళ పాప ఆ సందులో ఐస్ క్రీమ్ తింటూ తన చినిగిన లంగా మీద పడ్డ ఐస్క్రీమ్ ని తినాలా వద్దా అంటూ  తపటా ఇస్తూ చూస్తున్నది. ఇంతలో పోలీసులు ఫైరింగ్ ,లాఠీచార్జికి ఆర్డర్లు ఇవ్వటంతో ఎక్కడి వాళ్ళు అక్కడ కాళ్లకు బుద్ధి చెప్పారు. తుపాకీ మోతలతో, అరుపులు కేకలతో ఆ ప్రదేశం దద్దరిల్లు తుంటే, బిక్క మొహంతో ఆ పాప శంకరయ్య తాత ను వాటేసుకుంది. పాపని ఎత్తుకొని పరిగెత్తుతున్న శంకరయ్య తాత రొప్పొచ్చి  ఆగేసరికి రైల్వే పార్సెల్ ఆఫీసుకు కనబడింది. చంక లో ఉన్న పాపను దింపి సిగ్నల్  దగ్గర ఆగివున్న రైలు వైపు కదిలాడు. రైలు ఎక్కబోతూ వెనుదిరిగి చూస్తే ఆ పాప తన వైపే, ఏడుస్తూ చేతులు జాపి వస్తున్నది. వెంటనే రైలు దిగి వెళ్లి పాపని ఎత్తుకొని రైలెక్కాడు శంకర్ తాత.రైలు కదిలింది.పాపను గుండెలకు హత్తుకున్నాడు శంకర్ తాత.రైలు ఆగేసరికి హైదరాబాదు వచ్చింది.పాపతో కొత్త జీవితం మొదలయింది శంకర్ తాత కు ఒక మురికి వాడలో. రోజూ తనకు వచ్చిన పనికి వెళ్తూ తనువుండే గల్లీ చివరున్న కోవెలముందు ఆగి దణ్ణంపెట్టకోవడం శంకర్ తాతకు అలవాటు. పంతులుగారిని"ఈ సామి ఎవరు సామి"అని అడిగాడు."కుమారస్వామి" "ఆ యమ్మ". "వల్లీదేవి,ఆ పక్కావిడ దేవసేన. సామి ఇల్లాళ్ళు.దేముడు బొమ్మలేస్తావు, ఆ మాత్రం తెలీదా," అన్నాడు పంతులుగారు.

వల్లీదేవి, ఆ పే‌రు తన బుల్లి తల్లికి బాగుందని పించింది శంకర్ తాతకు.వల్లెమ్మ పదే పదే అనుకుంటూ  ఆపేరే ఖరారు చేశాడు. కళ నచ్చిందో దేవుడి మీద భక్తి హెచ్చిందొ శంకర్ తాతకు హైదరాబాదు అచ్చొచ్చింది. వల్లెమ్మకు కూడా ముగ్గులేయడం వచ్చింది. పాపను పక్కన పెట్టుకొని బతుకు బండి లాగడం మొదలు పెట్టాడు శంకర్ తాత. తను సంపాదిస్తున్న దానితో ఇద్దరి కడుపులు నింపుకుంటూ ఈ మురికివాడలో ఒక షెడ్డులో వుంటున్నాడు. పాప పెద్దదవ సాగింది. శంకర్ తాతకు ఖర్చు పెరిగింది. చుట్టుపక్కల అపార్ట్మెంట్లలో పని చేసే వారి సాయంతో వల్లెమ్మ గూడా 2ఇళ్లలో పనిచేయటం మొదలు పెట్టింది.

     కాలం మారింది దేశం మారింది. ప్రకృతి మారలేదు. తనపని తను చేసుకు పోతుంది. పెద్ద పెద్ద కళ్ళు, ఆకట్టుకునే చూపులు, వయసొచ్చిన తాలూకు వంటితో వల్లికి పెళ్లీడు వచ్చింది. తను ముగ్గులతో బొమ్మలు వేస్తుంటే ,పక్కనే ఐస్ క్రీమ్ బండి పెట్టుకొని శంకర్ తాత వేసిన బొమ్మను ఎండలో నిలబడి   చూసేవారికి, చల్లని ఐస్ క్రీమ్ అమ్ముకునే రంగడు కూడా  నచ్చాడు. ఐస్క్రీమంటే ఇష్టపడే వల్లెమ్మ తాతమాట కాదనలేదు. నచ్చిన వాళ్ళిద్దరికీ మనువు చేసి మురిసి పోయాడు శంకర్ తాత. ముచ్చటగా వాళ్ల చేత  ఎదురు షెడ్డులో కాపురం పెట్టించాడు. వల్లి గూడ తనను పెంచిన తాతను ,తాను పెంచిన లతలను చూసుకుంటూ మురిసిపోతున్న ది. ఒక  ముగ్గు వేసేది కాస్త రెండు ముగ్గులు వేయ సాగింది. రెండు ఇళ్లలో పని నాలుగిళ్ళుగా  మారింది.అలా సాగిపోతున్న ఆ చిన్న కుటుంబాలలో చింత ఒకటి మొదలయింది...

       ఉదయం ఎవరిపనులు వారు అందుకోవటానికి శంకర్ తాత శంఖనాదం, వల్లి  రంగవల్లులు, ఐస్ క్రీమ్ గంట మ్రోగు చుండగా, పోలీసు వారు కోవిడ్ హెచ్చరికలు లౌడ్ స్పీకర్ లో పెద్దగా వినిపిస్తున్నారు. దానితో పాటుగా మర్నాటి నుండి లాక్డౌను విధిస్తున్నట్టు ప్రకటించారు.
           
    అంతకు, కొన్ని రోజుల క్రితం వల్లి , తాను పనిచేస్తున్న ఇంట్లో,  ఇల్లంతా శుభ్రం చేస్తూ కుండీలలో మొక్కలకు నీళ్ల పోస్తుంటే , "మొక్కలన్నీ కట్ చేసి బయట పారేయి వల్లీ ,దోమలు ఎక్కువైపోతున్నాయి".అంది ఇంటావిడ. అక్కడి తీగలు మొక్కలు కట్ చేసి కింద ఉన్న కచడా డ్రమ్ముల్లో పారేసింది వల్లీ. అప్పుడే అటుగా వచ్చిన  తోటి పని మనిషి గబగబా వచ్చి దాంట్లో వున్న మనీ ప్లాంట్ తీసుకొని సంచీలో పెట్టుకుంది. ఎందుకని ఆరాతీస్తే  దొంగతనంగా తీసుకెళ్లి ఇంట్లో పెంచితే డబ్బు బాగా వస్తుంది అంది.వల్లీ తను కూడా మిగిలిన తీగను తీసుకెళ్ళి తాత షెడ్డు ముందు నాటింది .రోజు దానికి ప్రత్యేకంగా నీళ్ళుపోసి సాకుతున్నది. తీగ నేవళంగా బలంగా పాకుతూ ఉన్నది.

" దేముడు ఇటువంటి పరిస్థితి వస్తుందని మనీ ప్లాంట్ ను ఇంటి ముందు నాటించాడేమే.  ముందు ముందు పని లేక ఈ పరిస్థితుల్లో డబ్బు వస్తుందేమో అని ఆశగా తీగ వైపు చూసింది వల్లి.కరోనా లాక్ డౌనును తలుస్తూ తను పనిచేసే ఎపార్టుమెంటు కి వెళ్ళింది. అక్కడ తనలాగే పనిచేసే వాళ్ళు క్యూలో నిలబడి ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు మాస్కులు కట్టుకొనీ చేతులు శానిటైజ్ చేసుకున్న వాళ్లని లోనికి పంపుతూ, లేని వాళ్ళని వెనక్కి పంపేస్తున్నారు. షాపులో 3 మాస్కులు కొని ఒకటి తను ధరించి లోనికి వెళ్ళింది వల్లి.. తను పనిచేసే ఇళ్ళ వాళ్ళు , వాళ్ళందరూఇవ్వవలసిన డబ్బులు ఇచ్చి పనికి కొన్ని రోజులు రావద్దనే సరికి వల్లీ గుండె గుభేల్ మంది. వెల్ఫేర్ వాళ్ళు చెప్పిన ప్రకారం ఇలా చేస్తున్నాము. ముందు ఎలా చెప్తే అలాగే చేస్తాము అని చెప్పారు. దిగులు ముఖంతో ఇంటిదారి పట్టింది .ఇంటికి వచ్చేసరికి శంకర్ తాత, రంగడు దిగాలుగా పోలీసువారి లాఠీ దెబ్బలు నిమురుకుంటూ కూర్చున్నారు.వల్లి తాత  ఇంటిముందు  మనీప్లాంట్ వైపు చూసింది. ఆరోగ్యంగా గాలికి రెపరెపలాడుతూ ఊగుతున్న దాన్ని చూసి నిరాశతో నవ్వుకుంది.
గవర్నమెంట్ వాళ్ళు లాక్ డౌన్ కఠినంగా అమలు చేయటం మొదలుపెట్టారు .చేతిలో ఉన్న డబ్బులు జాగ్రత్తగా ఒక రోజు తిని తినక వాడుకుంటూ వల్లీ వాళ్ళు రోజులు నెట్టుకొస్తున్నారు. మునిసిపాలిటీ వాళ్ళు రోజు విడిచి రోజు శానిటైజర్ కొడుతూ,మురికి వాడలను శుభ్రం చేస్తున్నారు. సేవా సంస్థలు ,ప్రభుత్వం , నిత్యావసర సరుకులు పంపుతున్నారు.. రోజులు భారంగా గడుస్తున్నాయి .

   ఒకరోజు వల్లీ నీ‌‍‌‍టికొళాయి దగ్గరకు బిందెతో బయలుదేరేసరికి మనీ ప్లాంట్ ఆకులు రంగుమారినట్టు కనిపించింది. దగ్గరగా పోయి చూసింది. పచ్చగా నిగనిగలాడే ఆకులు కొద్దిగా బూడిద రంగుకు మారుతున్నట్టు కనిపించింది. వెంటనే బిందెలో వున్న అడుగుబొడుగు నీళ్ళని, ఆ  ఆకుల మీదగుమ్మరించింది. ఆకులమీదనున్న  బ్లీచింగ్ పౌడరు ఆ నీళ్లకు కరిగి కిందికి కారి ఆకులు కొద్ది కొద్దిగా మళ్ళీ ఆకుపచ్చ రంగుతో మెరవ సాగాయి.వల్లీ బొడ్లో ఉన్న చిన్న మొబైల్ మోగ సాగింది.బిందె కింద పెట్టి వినసాగింది వల్లీ.ఒక్కసారి గా వెయ్యి క్యాండిల్ బల్బులా ఆమె ముఖం వెలగసాగింది."అట్టాగేనక్కా.  అక్కా, తప్పకుండా వస్తా ,ఎన్నో నెల, అట్టనా!ఇదో ఇప్పుడే బయల్దేరుతుండా. నే దగ్గిరుండి పురుడోస్తా.సరేనా!" అంటూ బిందె నింపుకొని ఇంటికి వచ్చింది. కాళ్ళు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని ముఖానికి మాస్కు ధరించి బయటికి వచ్చింది .మనీ ప్లాంట్ వైపు ప్రేమగా చూసింది. ఎపార్టమెంటు వైపు నడిచింది .తను పని చేసిన ఒక ఇంటావిడకు డెలివరీటైం .వెల్ఫేర్వాళ్ళు అనుమతితో తమ పనిమనిషిని వుంచటానికి అనుమతి దొరకటంతో వల్లిని పిలిపించుకుంది.భోజనం, డబుల్ జీతంతో ఇంట్లో సాయంత్రం దాకా ఉండే షరతులతో వప్పుకుంది వల్లి. ఎపార్టుమెంటుదగ్గర సెక్యూరిటీ వాళ్ళు అన్ని కోవిడ్ పరీక్షలు చేసి  లోనికి పంపారు. వల్లికి మనీ ప్లాంట్  దేవతలా అనిపించింది. మనసులోనే దండం పెట్టుకుని పనికి వెళ్ళసాగింది. రోజులు గడుస్తున్నయి. అమ్మగారికి డెలివరీ డేట్ దగ్గర పడింది. వల్లి పని కూడా పెరిగింది .దాంతో రోజూ సాయంత్రం అయ్యే సరికి నిస్త్రాణగా ,వళ్ళు వేడివేడిగా నొప్పులుగా అనిపిస్తున్నది.రంగడికి, శంకర్ తాతకు తెలిస్తే పనికి వెళ్ళనివ్వరని దా‍చింది. రోజురోజుకు చిక్కిపోతున్న వల్లెమ్మని కారణం అడిగితే, అమ్మగారికి కాన్పు టైము  వచ్చినందున పని ఎక్కువైందని, తప్పుకుంది. అమ్మగారికి కాన్పు అయిపోయింది.వల్లికి దిగులు పట్టుకుంది, ముందు ముందు పని ఉంటుందా ఉండదా అని? అమ్మగారు  పిల్లవాడికి పాలన పోషణకు తోడు ఉండమంది.ఆనందంతో, సాయంత్రం ఇంటికి వచ్చి మనీ ప్లాంట్ వంక  చూసింది వల్లి. తీగపాదు మళ్ళీ బూడిద రంగుకు మారడమే కాకుండా సగందాకా వున్న ఆకులు వడిలి రాలి పోయాయి.  శరీరం నిస్త్రాణగా  కాళ్లు లాగుతున్నట్లు, కళ్లు తిరుగుతున్నట్టు అనిపించింది వల్లికి. కాసేపు మంచం మీద పడుకుంది. రాత్రికి, కూరగాయలు అమ్ముకొని రంగడు ,శంకర్ తాత తిరిగి వచ్చి కదలకుండా పడుకొని ఉన్న వల్లెమ్మను చూసి కంగారు పడ్డారు. వల్లెమ్మా,  అంటూ వాళ్ళు కంగారుగా తట్టిలేపే సరికి బద్దకంగా ఒళ్ళు విరుచుకుంటూ లేచింది వల్లెమ్మ. '"ఏమైంది "అంటూ వళ్ళు పట్టుకు చూసేసరికి వేడిగా  ఉందని అనిపించింది వాళ్ళకి.

         వాళ్ళ మధ్య ఉంటూ గోలి ముందులిస్తూ బతుకుతున్న డాక్టర్ కాని డాక్టర్ దగ్గరకు పరిగెట్టాడు రంగడు. రెండు క్రోసిను గోలీలిచ్చి రెండు పూటలు వేసుకోమన్నాడు. రంగడు పొద్దున మిగిలిన అన్నంలో పచ్చడి కలిపి తినిపించి గోలి వేశాడు. శంకర్ తాత కంగారు చూసి, భయపడొద్దు అంది వల్లెమ్మ .జాగ్రత్తలు చెప్పి తన షెడ్ కి వెళ్ళాడు శంకర్ తాత. వెళ్తూ వెళ్తూ మనీప్లాంట్ ని తడిమాడు.ఇంకో రెండు ఆకులు రాలి పడ్డాయి.వాటిని పట్టుకొని నలిపొడు. పొడిగా మారిన దాన్ని  వూదుతే వాటిలో నుండి  బ్లీచింగ్ పౌడర్ లాంటిది గాలిలోకి లేచింది.బయట నీళ్ళు, రేకులడబ్బాతో తీసుకొని మొహం కాళ్ళు కడుక్కొని మొక్కకు నీళ్ళు పోశాడు.      వల్లీ , అమ్మగారికి ,పిల్లాడికి పని  చేయలేకమపోతున్నది.

రోజూ నిక్కాకగా, కళ్ళు తిరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు పనికి బయలుదేరింది. కళ్ళు తిరిగి పెద్దగావాంతి అయింది. రంగడు కంగారుగా, అదంతా కడిగి మంచం మీద వల్లిని పడుకో బెట్టాడు. ఒళ్ళంతా చెమటలు పట్టగా, గాలి కోసం కిటికీ పక్కగా వల్లి మంచాన్ని లాగాడు.వల్లీ కిటికీలో నుండి బయటకు చూసింది.మనీప్లాంటు  చివరి రెండు ఆకులతో ఎండిపోతూ కనిపించింది." ఏమయ్యా! ఈ రెండాకులు ఊడి పోయేసరికి నేను ఉంటానా" అని అడిగింది. "ఛ ఛ ఊరుకో! ఏం మాటలవి. అయి పడి పోతయి,ఊడిపోతయి.దానికి మారాకు తొడగదా. మళ్ళీ పెరగదా!దానికీ నీకు పోలికేంది? మాటలాపి  తొంగో. డాక్టర్ ని తీసుకు వస్తా" అంటూ బయటకు వెళుతూ శంకర్ తాత తో" "తాతా! నీ వల్లమ్మ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతుంది. కాస్త ధైర్యం చెప్పు,అన్నాడు. వల్లమ్మ  మాటలు విన్న శంకర్ తాత "ఏంటమ్మా! ఏంమాటలు  తల్లీ. అమ్మా,అవీ వుంటాయ్, నువ్వు ఉంటావ్.నాలాటి వాళ్ళు అనవలసిన మాటలు నువ్వనచ్చా? ఇంకా ఎన్ని కొత్త ఆకులు చూస్తావో. నేనున్నాగా, అనవసరంగా భయంతో పిచ్చి మాటలు మాట్లాడవద్దు"అన్నాడు.

      రంగడితో వచ్చిన డాక్టర్ వల్లిని పరీక్షించి  రెండు పరీక్షలు చేయించు అన్నాడు రంగడితో.వల్లి తో   రంగడు పరీక్షలను గురించి చెప్తే,"ఛీ! అయేం పరీచ్చలు "అని సిగ్గు పడింది. డాక్టర్ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు.రంగడు బతిమాలగా వల్లి పరీక్షలు చేయించుకుంది.  కాలం గడిచి పోతున్నది .మనీ ప్లాంటు మిగిలిన ఆకుల్లో రెండాకులు వాడి కిందపడినట్టు,ఒక ఆకు రంగువెలిసినట్లు కనిపించింది,వల్లెమ్మకు.రోజు రోజుకు జ్వరం తగ్గక పోగా వాంతులు నీరసం పెరిగాయి.వల్లికి గుండె దడ దడ లాడటం మొదలయింది. ఇహ తనకు నూకలు చెల్లాయి అనిపించసాగింది. పదే పదే ఆ ఆకు కేసి చూడసాగింది.రోజూ వచ్చి ధైర్యం చెప్పే శంకర తాత రెండు రోజులుగా కనబడటంలేదు. తనకోసం ఏ దేముడిని కొలుస్తున్నాడో.

      ఆకు మాత్రం వాడడం మొదలు పెట్టింది. వల్లి పదే పదే ఆ మొక్క వేపు చూడసాగింది. ఎప్పుడూ తెల్లారేసరికి  వచ్చే శంకర్ తాత ఆరోజు కూడా  రాలేదు. రంగడు మళ్ళీ డాక్టర్ను వెంటబెట్టుకుని వచ్చాడు.రిపోర్టు డాక్టరుకిచ్చాడు. వాడు  ఆందోళనగా కనిపిస్తున్నాడు. మాటిమాటికీ డాక్టర్ వైపు చూస్తున్నాడు. వల్లి కూడా ఆతృతగా డాక్టర్ వైపు చూస్తున్నది. డాక్టర్ రిపోర్టులు పరిశీలించి వల్లి నాడి గుండె పరీక్షించి రిపోర్టులు చూస్తున్నాడు. వల్లి మనసులో దేవుడికి దండం పెట్టుకుంది. అది ఆ ఆకు వైపు చూస్తున్నది. దానికీ తనకు ఏదోసంబంధం వున్నదని నిశ్చయించుకుంది. డాక్టరు సైగచేచేసి బయటికి వెళ్లాడు. రంగడు కంగారుగా ఆయన వెనకే వెళ్లాడు. వల్లీ మళ్ళీ ఆకు వైపుచూస్తూ దేముడికి దండముపెట్టుకొని మళ్ళీ ఆకును చూస్తుండగా, చల్లటిగాలి కిటికీలో నుండి విసురుగా ఆమె మొహం మీద కొట్టింది. ఆ గాలి వేగానికి కళ్ళు చీకిరించి ఆకును మార్చి మర్చి చూస్తున్న వల్లి చీకిరించిన కళ్ళకు ఆఖరాకు గూడా గాలి విసురుకు తునిగి కిందపడటం మసకగా కనిపించింది.వల్లీకి గుండె ఆగిపోయినట్టనిపించింది. భయంతో కళ్ళు మూసుకొని  తాతా తాతా అని పిలవ సాగింది. అలా ఎంత సేపు అయిందో... చేతిలో మందుల  పట్టుకొనివచ్చిన రంగుడు, 'వల్లి వల్లి' అంటూ  తట్టి లేపుతుంటే నెమ్మదిగా కళ్ళు తెరిచింది.  మనీ ప్లాంట్ ని, రంగణ్ణి తేరిపారి చూడసాగింది.

      ఆఖరాకు గాలికి రాలింది.కాని ..కాని...రాలిన ఆకుకింద బుల్లిబుల్లి, పచ్చటి చిన్న మారుటాకు లీలగా కనిపించింది వల్లికి.
 రంగడి మొహంలో ఆనందం తాండవిస్తుంటే, నీరసంతో
వాలిపోతున్న కళ్ళతోనే "ఏంటని" అడిగిందివల్లి..   రంగడు ప్రేమతో, ఆమెను దగ్గరకు తీసుకొని ఆప్యాయంగా ఆమె నుదుట ముద్దు పెట్టుకొని  ఆనందంతో ఆమె అమ్మకడుపు  నిమిరాడు. వల్లెమ్మ కళ్ళు ఆనందాశ్చర్యాలతో వెలిగి పోయాయి.  కళ్ళలోనుండి నీరు కారుతుండగా లేని ఓపిక కూడగట్టుకొని లేచి రంగడి సాయంతో "తాత,తాతా"అంటూ తాత షెడ్డువైపు నడిచింది. కాదు ఆమె పరిగెత్తాననుకుంటూ నడిచింది." తాత ,తాతా! నువ్వు తాతైనా వయ్యా"!అంటున్న ఆమె అవాక్కయ గుమ్మంలోనే ఆగిపోయింది. నోరు తెరిచి వెల్లికిలా పడుకొన్న తాతను చూసి ఒక్కసారికుప్పకూలిపోయింది.తేరుకున్న రంగడు,తాత ముఖం మీద నీళ్ళు చల్లుదామని వెతికితే ఇంట్లో నీళ్ళ కనబడలేదు. పక్కనే ఉన్న డబ్బాతో బయటవున్న నీళ్ల తీసుకొస్తుంటే చేతులు ఒణికి సగంనీళ్ళు ఒలికి మనీ ప్లాంట్ మీద పడ్డాయి.వణుకుతున్న చేతులతో లోనికొచ్చిన రంగడు మిగిలిన నీళ్ళను తాత మెహం మీద పోసాడు.  నోట్లో పోసిన నీళ్ళు బయటకు వచ్చాయి.

నీరసించి వేళాడి పోతున్న సొమ్మసిల్లుతున్న వల్లిని రంగడు చంకలో చేతులువేసి ఇంటికితీసుకొస్తుండగా,
నీరసంతో మూసుకు పోతున్న వల్లెమ్మ కళ్ళుకు,శంకర్ తాత రంగులతో వేసిన మారాకు, ఆమెకు రంగుకారి లీలగా కనిపించింది.....
  మరునాడు ...
  శంకర్ తాత ఇంటి ముందు.. ఓం నమశ్శివాయ మంత్రం గంభీరంగా వినిపిస్తున్నది. ఓంకార శబ్దం శంఖాలనుండి ఆగకుండ వినిపిస్తుంది. అదనంగా గంటా నాదాలు
 ఆచుట్టుపక్కలప్రతిధ్వనిస్తున్నాయి.

   శంకర్ తాత కైలాసానికి  సాగిపోతున్నాడు.
  ఓం శాంతి శాంతి శాంతిః

***

No comments:

Post a Comment

Pages