ఏమని విన్నవించేను యెన్నెని కాచేవు నీవు - అచ్చంగా తెలుగు

ఏమని విన్నవించేను యెన్నెని కాచేవు నీవు

Share This

ఏమని విన్నవించేను యెన్నెని కాచేవు నీవు

డా.తాడేపల్లి పతంజలి 




రేకు: 0336-01  సం: 04-208

పల్లవి:

ఏమని విన్నవించేను యెన్నెని కాచేవు నీవు

శ్రీమాధవుడ నీకుజేతికి లోనయ్య


.1: 

పుట్టినదె వొకతప్పు భువిమీద నటమీద

నెట్టన సంసారినౌటే నిజము రెండోతప్పు

రట్టుకెక్కి దొరనౌటే నెట్టన మూడోతప్పు

యిట్టె కావు కావకుండు మిదివో నాతప్పు


.2: 

అన్నపానములు గోరినదియే మొదలి బందె

యెన్నగగాంతల గూడుటిదివో రాతిటిబందె

కన్నవారి వేడేది కడితొడుకుబందె

కొన్నిట నేమి గొనేవు కొనవయ్య బందె


.3: 

కొనబుణ్యపాపాలే గొడియకట్లు రెండు

కొనిరి నీదాసులే కోరిన తప్పుదండము

వినవయ్య యిదివో శ్రీ వేంకటేశ నామనవి

మనుగాపు జేసితివి మన్నించవయ్య


భావం

పల్లవి:

శ్రీమాధవుడ!  ఏమని విన్నవించేనుఎన్ని విషయాలలో నువ్వు నన్ను  రక్షిస్తావు  (చాలా విషయాలలో రక్షించావని భావం)

నీకు సులభంగా లభ్యమయ్యేవాడిని.(నిరంతరం నీ సన్నిహితుడనని భావం)


.1:

భూమి మీద పుట్టినది ఒకతప్పు .

ఆమీద  సంసారిగా మారుట నిజంగా రెండోతప్పు

 అల్లరిచేయు దొరగా మారుట మూడోతప్పు

నన్ను రక్షించునన్ను రక్షించకపోతే అది నాతప్పు.


.2:

 అన్నపానములు కోరుటయే మొదటి నిర్బంధం.

కాంతలతో సుఖాలు అనుభవించుట  రాత్రికి సంబంధించిన నిర్బంధం.

కన్నవారిని  వేడేది అన్నపు ముద్దను గ్రహించే నిర్బంధం.(జీవికి కొంతవయస్సు వచ్చేవరకు తల్లిదండ్రులను అన్నం కోసం వేడుకొంటారుఇది ఆత్మీయతా నేపథ్యంలో జరుగవచ్చును కాని – తల్లిదండ్రులకు బిడ్డకు ఆహారము పెట్టుట తప్పని నిర్బంధమని కవి భావం)

కొన్నివిషయాలలోనే నా నిర్బంధాన్ని  ఏమి స్వీకరిస్తావు? అసలయిన నా నిర్బంధాన్ని గ్రహించు. (నన్ను నీలో కదలనీయకుండా చేసే నిర్బంధాన్ని-మోక్షాన్ని అనుగ్రహించమని భావం)


.3:

పుణ్యపాపాలనేవి  నేరం చేసినవాని చేతులకు వేసే రెండు బంధనసాధనాలు,  

కోరిన తప్పుదండముతో(తప్పు చేసాను నన్ను క్షమించు అను నమస్కారముతోనీదాసులే వీటిని(పుణ్యపాపాలను) స్వీకరించారు.

శ్రీ వేంకటేశ నామనవి వినవయ్య!

రక్షించితివినా తప్పులు మన్నించవయ్య!

***

No comments:

Post a Comment

Pages