ఆలోచిస్తున్నామా? - అచ్చంగా తెలుగు

 ఆలోచిస్తున్నామా?

 భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు.




అమ్మా నాన్నల దగ్గర మనం ఉన్నప్పుడు

ఆ అమూల్యమైన దశలో 

ప్రతిక్షణం ఎంత హాయిగా గడిచేదో!

మరి ఆమ్మానాన్నలుమనదగ్గరకు వచ్చినప్పుడు

వారి అవసాన దశలో

ప్రతిక్షణం వారికెంత భారంగా గడుస్తుందో గమనించేమా? 


అమ్మ చేతి ముద్దలు తిన్నప్పుడు

ఆమె చూపే ఆప్యాయతతో 

మన కడుపు ఎంత సంతృప్తిగా నిండేదో!

అమ్మానాన్నలకు అన్నం పెడుతున్నప్పుడు 

మన లో లోపించిన ఆప్యాయత ను అవలోకించేమా? 


నాన్న మెడచుట్టూ చేయివేసి పడుకునేటప్పుడు

నాన్నతో పెనవేసుకున్న అనుబంధంలో

మన బ్రతుకు ఎంత పూర్ణమై పండెదో! 

అమ్మానాన్నల పడక గదివైపు మధ్యలో చూడనివ్వని

మన అసహాయ స్థితి గురించి ఆలోచించేమా?


 అప్పటి వారిశిక్షణలో,ఆ రక్షణలో

కాలం ఎంత కమనీయమైన కావ్యమై సాగేదో!

మరి మన నిర్లక్ష్యంలో,అలక్ష్యంలో 

వారికిప్పుడు కాలం ఎంత భారంగా గడుస్తుందో?


అమ్ముంటే చాలు,నాన్నే పదివేలు 

అని అనిపించే అప్పటి ఆ భావనలో 

మనసు  ఎంత నిశ్చింతగా నిలిచేదో!

అమ్మానాన్నలుంటే ఆడ్డు అనుకునే ఈ కాలం 

ఎంత నిర్ధయగా మనని ఏమార్చిందో?


అమ్మా నన్నల అండలో ప్రతి ఇష్టాన్ని 

మన  మనసు ఎంతగా గెలిచేదో!

అమ్మానాన్నలకు ఇవ్వలేని కనీస అండ

మన మనసుని ఎంతగా ఇప్పుడు గాయం చేస్తుందో?

 ***

No comments:

Post a Comment

Pages