అనసూయ ఆరాటం - 9
చెన్నూరి సుదర్శన్
లింగారెడ్డి, అనసూయల పెండ్లి సాదా సీదాగ జరిగింది.
పద్మనగర్ కాలనీల బుచ్చయ్య ఇచ్చిన ఇంట్లనే కాపురం పెట్టిండ్లు.
ఏ మాటకామాటే చెప్పుకోవాలి. అనసూయ నిజంగా అసూయ లేని మనిషి. పల్లెటూరి అమాయకత్వం ఆమె కండ్లల్ల కొట్టచ్చినట్టు కనబడ్తది. లింగారెడ్డి పొద్దుగాల ఎనిమిదింటికి తయారై దుకాన్లకు పోతడు. రమేషు, లింగారెడ్డిలు కలిసి దుకాణం తెరుత్తరు. సేట్లు పదింటికల్ల తయారై బువ్వ తినే దుకాణం దారి పడ్తరు.
రమేషు పగటీలి బువ్వ తినడానికి ఒక్కడే ఇంటికత్తడు. లింగారెడ్డి కోసరం అనసూయ కట్టిచ్చిన సద్ది పట్టుకొని పోతడు.
అనసూయ వంటపని చేసుకొని తానం చేసి తయరై కాలనీల ఒక చక్కరు కొట్టత్తది. బుచ్చయ్య ఇల్లు, పోలీసు రాజయ్య ఇల్లు ఇంకా లింగారెడ్డి ఇల్లు దగ్గర దగ్గర ఉంటై. సమ్మయ్య ఇల్లేమో అవతల వాడలుంటది. ఆడికి పోవుడు అనసూయ ఎంతకంతే..
అందరినీ వావి వరుసలు పెట్టి పిల్తాంటది. తోడెం రోజులకే కాలనీల అందరి నోట్లె నాల్కె లెక్క ఆడబట్టింది.
పోలీసు రాజయ్య ఇంట్ల ఎక్కువ సేపుంటది. రాజయ్యను నాయ్నా అని.. బతుకమ్మను అవ్వా అని.. సురేందర్‌ను తమ్ముడూ అని నోరారా పిలుస్తది. సొంత బిడ్డ లెక్క సకలం పనులల్ల ఆసరైతాంటది.
పండుగలు పబ్బాలు వచ్చినయంటే.. ఎవ్వలైనా అవ్వగారింటికి పోతరు. కాని అనసూయ మొగణ్ణి ఇడ్సి పోయేది కాదు. లింగారెడ్డి అయ్యా.. అవ్వలేనోడని.. పండుగలకు మరిది పుల్లారెడ్డిని పిల్సుకునేది.
పుల్లారెడ్డికి వదినె అంటే తల్లితో సమానం. ఊరి నుండి వచ్చినప్పు డల్లా పల్లికాయె, జాంపండ్లు, చెరుకుగడలు ఏవి వీలైతే అవి తెత్తాంటడు.
సంకురాత్రి పండుగ వచ్చిందంటే.. అనసూయకు గడియ రికాం ఉండక పోయేది. వాడకట్టోల్లందరికి అప్పాలు చేసుడు వంతులు పెట్టేది. ఒక రోజు ఒకింట్ల, ఇంకో రోజు ఇంకో ఇంట్ల.. అని సకినాల పిండి.. అరిసెల పిండి రోటి మీద కుందెన పెట్టి రోకండ్ల తోటి దంచుట్ల సాయ పడేది.
‘కోడలా.. కోడలా.. నాకొడుకు పెండ్లామా..
దంచుతానవా.. బియ్యం బుక్కుతానవా.. ఆహ్హా.. ఓహ్హో..
అత్తా.. మేనత్తో.. నామొగని కన్నవ్వా..
నీ కండ్లు నా నోటి మీదనా.. లేక రోటి మీదనా.. ఆహ్హా.. ఓహ్హో.. ’ అని పాటలు సుత పాడేది.
సకినాలు సుట్టుట్ల అనసూయను మించినోల్లు ఆ వాడల ఎవలూ లేరు. అరిసెలు, గరిజెలు, మురుకులు ఇంటింటా చేసేది. కొందరిండ్లల్ల బోంది కొట్టి లడ్డూలు సుత చేసేది. అనసూయ చెయ్యి పడంది అప్పాలు చేసుడు మా వల్ల కాదని.. వాడోల్లంత ఆమె వచ్చేదాకా ఎదురి సూసేటోల్లు.
***
కాలానికి గొప్ప మహత్యమున్నది. ఎన్నో.. ఎన్నెన్నో భూమ్మీద జరిగే మంచైనా.. చెడైనా తన కడుపులనే దాసుకుంటది. లోకంమ్మీద బతికి బట్టకట్టినోల్లకు అవే తీపి, చేదు గురుతులు. అసోంటిదే ‘జై తెలంగాణ’ , ‘జై ఆంధ్ర’ అనే టైకు మొదలైనై.
ఎందరో పానాలు పోగొట్టుకున్నరు. తప్పకుంట తెలంగాణ, ఆంధ్ర విడిపోతయను కున్నరు. కాని కొందరు రాజకీయ నాయకులు వెన్ను పోటు పొడిచిండ్లు. టైకు ఆగిపోయింది.
మల్ల బల్లు షురువైనై.
రవీందర్ పట్నం పోయిండు. సురేందర్ ఎచ్చెస్సి పరీచ్చలు రాసి పాసై కాలేజీ సదువులకు వరంగల్లు పోయిండు.
***
యాడాది పురంగ తిరక్క ముందే అనసూయ నీళ్ళు పోసుకున్నది.
లింగారెడ్డికి ఎక్కడలేని సంబురమయ్యింది. సత్తనో.. బతుకతనో.. అన్న పానానికి పెండ్లగుడు.. అనసూయ అసోంటి అర్సుకునే పెండ్లాం దొరుకుడు.. పిల్లో.. పిలగాడో రాబోవుడు.. అంతా ఒక కల లెక్క కనబడ్తాంది. నిజమని నమ్మబుధ్ధైత లేదు. పానం గాలిల దూది పుంజం లెక్క ఎగురబట్టింది. ఎప్పుడు.. నా బిడ్డ ఎప్పుడు.. అని ఎదురి సూడబట్టిండు లింగారెడ్డి.
ఆడపిల్ల అమాసనాడు.. మొగపిలగాడు పున్నంనాడు పుడ్తే మంచిదంటరు. కాని లింగారెడ్డికి అసోంటి మాటలు నమ్మడు. ఎవ్వలైనా సరే.. ఎప్పుడైనా సరే.. తల్లీ, పిల్లా సల్లంగ ఉంటే సాలనుకునేటోడు. ఏది ఏమైనా లింగారెడ్డికి మాత్రం పున్నమి నాడే కొడుకు పుట్టిండు. అనసూయ చామన చాయ రంగుతోటి బబ్బుడం లెక్కున్నడు. తల్లి పోలికలే ఎక్కువ. కొడుక్కు తల్లి పోలికలు.. బిడ్డకు తండ్రి పోలికలుంటే అదృట్టమంటరు.
తొలుసూరు కొడుకని అడక్కలంతా కలిసి లింగారెడ్డి కొడుక్కు ‘ఆది రెడ్డి’ అని పేరు పెట్టిండ్లు. లింగారెడ్డి నాయ్న పేరు సుత అదే పేరు. మా కట్ట సుకాలు సూడందే పైకి పాయె.. కొడుక్కు సాయపడ్తనని మా నాయ్న మల్ల పుట్టిండని సంబురపడబట్టిండు లింగారెడ్డి.
సంబురంల సంబురం.. మల్ల రెండేండ్లకే ఇంకో కొడుకు పుట్టిండు. ‘అనిమిరెడ్డి’ అని లింగారెడ్డి తాత పేరు పెట్టుకున్నరు. అనిమిరెడ్డి అచ్చం తండ్రి పోలిక.
ఇద్దరు కొడుకులేనా.. ఒక బిడ్డ అయితే బాగుండేదని మిడ్కకుంట ఇంకో రెండేండ్లకు బిడ్డ పుట్టింది. బిడ్డ పేరు ‘జయమ్మ’ అని తన తల్లి పేరు పెట్టుకున్నడు లింగారెడ్డి.
No comments:
Post a Comment