చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 14 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 14

Share This

 చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల)  - 14

అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ) 

ఆంగ్ల మూలం :  The Moonstone Castle Mystery

నవలా రచయిత : Carolyn Keene

 


"ఆ మనిషి యొక్క స్వరం కోటలోంచి వచ్చిందా, లేక బయటినుంచా?" జార్జ్ అడిగింది.


  "నిజాయితీగా చెప్పాలంటే నాకు తెలియదు" నాన్సీ బదులిచ్చింది.  "మనం కొద్దిగా జాగ్రత్త తీసుకొంటే, కోట లోపల పరిశోధించటం నీకు యిష్టమేనా?"


  "నేను ఆడుకొంటాను" అంది జార్జ్.  "అయితే మనతో ఫ్లాష్ లైట్లను ఎందుకు తీసుకురాలేదు?"


  ఇద్దరు అమ్మాయిలు కమాను ఉన్న ద్వారం గుండా లోనికి ప్రవేశించారు.  అక్కడనుంచి వారు తిన్నగా రాతి కోట సావిట్లోకి చేరుకొన్నారు. వారికి ముందు ఒక పొడవైన వసారా, దానిలో యిరుపక్కలా తలుపులు తెరిచి ఉన్న గదులు కనిపించాయి.  ఆ ప్రాంతమంతా సాలెగూళ్ళు తోరణాలుగా వేలాడుతున్నాయి. తమ వెనక్కి అప్పుడప్పుడు తిరిగి చూస్తూ, ఎడమవైపు ఉన్న గదుల్లోకి తొంగి చూడమని జార్జ్ కి సూచించింది నాన్సీ.  తను ముందుకు చూస్తూ, కుడి వైపు గదులను పరిశీలిస్తానని చెప్పింది.      


  "ఇది నిజంగా భయానకం," జార్జ్ అంది. "ఇది పాత కాలపు చెరసాలలా కనిపిస్తోంది."  


   చూడటానికి కాంతి ఉన్నంతవరకు యిద్దరు గూఢచారులు నడిచారు.  కానీ వాళ్ళు లోనికి చొచ్చుకుపోతున్నకొద్దీ క్రమేపీ కాంతి తగ్గి దృష్టి మందగిస్తోంది.  చాలా గదులకు కిటికీలు లేవు, మిగిలిన వాటికి బాగా ఎత్తులో ఊచలు బిగించి, బయటకు తెరచి ఉన్న చిన్న చిన్న వెంటిలేటర్ల మాదిరి ఉన్నాయి.  


  ఒక్కటి మినహాయించి మిగిలిన గదులన్నీ ఖాళీగా ఉన్నాయి.  ఆ గది ఒకప్పుడూ వంటగది అయి ఉండవచ్చు.  దానిలో పెద్ద పొయ్యి, బూజు బాగా పేరుకొన్న ఒక చెక్క టేబులు, తుప్పు పట్టిన యినుప గిన్నెలు ఉన్నాయి. 

 

  "ఇది ఖచ్చితంగా అద్భుతమైన మరుగుప్రాంతం అవుతుంది"జార్జ్ వ్యాఖ్యానించింది.  "నాన్సీ! చేపట్టిన పనిని మధ్యలో వదిలేసి పోయే దానిలా కనిపించదలుచుకోలేదు.  కానీ మనకు దారి చూపించే వెలుతురు లేకుండా యింకా ముందుకు వెళ్ళాలని నేను అనుకోవటం లేదు." 


  నాన్సీ సమ్మతించింది. ఆమె కూడా ఆ తేమ ప్రాతంలో తగినంత జాగరూకతతో  మెలగాలని అనుకోసాగింది.


  ఇద్దరు అమ్మాయిలు ప్రహారీ ఉన్న తోటలోకి తిరిగి వచ్చారు.  వారు అక్కడకు చేరుకోగానే, కోట బయటనుంచి కారు శబ్దం వినిపించింది.  ప్రహారీ బయటకు పరుగున వెళ్ళిన వాళ్ళకు, కందకం అవతలి వైపున కనుమరుగవుతున్న సెడాన్ కనిపించింది.  కందకం  పైన వంతెన పైకి ఎత్తే ఉంది.  తాము కోట సావిట్లో ఉండగా, వంతెనను కిందకు దించి, దానిపైనుంచి కారు వెళ్ళిందా?  లేక ఆ వాహనం కందకం దగ్గరగా రాగలిగినంత వరకూ వచ్చి, వెనక్కి తిరిగి వెళ్ళిపోయిందా?  


  "ఆ కారు నేను సీమన్ని వెంబడించిన రాత్రి, అతన్ని తీసుకుపోయిన కారులా ఉంది!" జార్జ్ ఆశ్చర్యపోయింది.  "తృటికాలం దాని డ్రయివర్ని నేను చూసాను.  అదె!  ఆ వెళ్తున్నది సీమనే కావచ్చు!"


  "బహుశా మనని హెచ్చరించింది అతనే అయి ఉంటాడు" నాన్సీ చెప్పింది.


తామిద్దరూ కోట ముందు ప్రాంతమంతా గాలించి, ఆ కారు కోట గోడ పక్కన ఆపి ఉంచబడిందో, లేదో నిర్ధారించుకొనే ప్రయత్నం చేద్దామని ఆమె సూచించింది.  


  వాళ్ళు ఆత్రుతగా కోట ముందుకు వెళ్ళిన కొద్ది క్షణాల్లోనే, "ఈ టైరు గుర్తులు చూడు జార్జ్!  కారు యిక్కడ ఉందనటానికి యివే నిజమైన సాక్ష్యం" అని ఆశ్చర్యంతో అరిచింది నాన్సీ.  


   ఆమె గోడకి ముందున్న రోడ్డుపై బురద అంటిన సన్నని కారు వెళ్ళిన జాడను వేలితో చూపించింది.  ట్రీడ్ గుర్తులు చాలా భిన్నంగా కనిపించాయి.  వాటిలో మూడు సరిగ్గా ఒకేలా ఉన్నాయి .... వాటి టైర్లకు సమాంతర రేఖలు ఉన్నాయి. 


  "కానీ కుడివైపు వెనుక చక్రాన్ని చూడు" అంది నాన్సీ.  "ఈ టైరు గుర్తులు డైమండ్ ఆకారంలో ఉన్నాయి."


  జార్జ్ ముసిముసిగా నవ్వింది.  "మన తరువాత పని డీప్ రివర్ వీధుల్లో అటూ, యిటూ తిరుగుతూ, ఆ కారుని కనుక్కోవటమే అనుకొంటాను."  


  "సరె! నీకు యిష్టమొచ్చినట్లు నన్ను ఏడిపించు, కానీ అదొక అద్భుతమైన ఆలోచన అని నేను అనుకొంటున్నాను."


  తాము అక్కడ ఉండగానే, ఆ కందకపు వంతెన ఎలా పనిచేసిందో తెలుసుకోవటానికి ప్రయత్నిద్దామని ఆమె ప్రతిపాదించింది.  గళ్ళ డిజైనులో తయారు చేయించిన తలుపు కోట గోడలో గట్టిగా బిగిసిపోయి ఉంది. 


  "కానీ వంతెన ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మనం ఆ గోడ వెనక్కి ఎలా వెళ్తాము?" జార్జ్ అడిగింది.


  "ఆ కనిపిస్తున్న చిన్న కన్నంలో దూరి నేను లోపలకు వెళ్ళటానికి ప్రయత్నిస్తాను" అంటూ నాన్సీ అటు చూపించింది.  


  వారికి పది అడుగుల పైన పల్చగా ఉన్న రాతిగోడలో ఒక దీర్ఘచతురస్రాకారపు కన్నం ఉంది.  అది పురాతకాలంలో ఫిరంగి గుండు చొచ్చుకుపోవటం వల్ల ఏర్పడి ఉండవచ్చు.  నాన్సీ జార్జ్ భుజాలపైకి ఎక్కి కన్నంలోంచి చూసింది.  లోపల, ఒక పెద్ద పెరడు కోటను చుట్టి ఉంది.  కోట ముందుభాగంలో పల్చని గోడ మాత్రమే ఉంది, కానీ మిగిలిన మూడుపక్కలా  విశాలమైన రాతి మంటపాలు ఉన్నాయి.  అక్కడ నుంచి వరుసలో తెరిచి ఉన్న గదులు, వరండాలు ఉన్నాయి.  కందకపు వంతెన కోట ముందు గోడకు ఆనించి రెండు బలమైన గొలుసులతో కట్టబడి ఉంది.  వాటిని వెనక్కు లాగటానికి, లేదా ముందుకు వదలటానికి కోట గోడ లోపల ఎవరో ఉండాలి.  


   యువ గూఢచారి ఆ కన్నంలో దూరి మెల్లిగా కదులుతూ అవతలవైపు జారాల్సి ఉంటుంది. ఆమె ధైర్యం చేస్తుందా?


  "నేను ప్రయత్నించబోతున్నా!" నాన్సీ నిశ్చయించుకొంది.


  జార్జ్ ఊపిరి బిగబట్టుకొని నిలబడగా నాన్సీ మాయమయ్యింది.  నాన్సీకి ఏమైనా జరిగితే, తాను ఆమెకు ఎలా సాయపడగలదు?  అకస్మాత్తుగా గొలుసు దేనినో ఒరుసుకొంటున్నట్లు చప్పుడైంది. 


వంతెన మెల్లిగా కిందకు దిగింది.  కొన్ని సెకన్లలో సురక్షితంగా ఉన్న నాన్సీ గోడకు అవతల వైపున కనిపించి, జార్జ్ ఊపిరి పీల్చుకొంది.


   ఆమె దీర్ఘంగా నిట్టూర్పు వదులుతూ, "వంతెన ఎలా పని చేస్తోందో కనుక్కొన్నావు.  అద్భుతం!" అంది.


  "ప్రశ్న ఏమిటంటే, ఎవరైనా దాన్ని తిరిగి పైకి లాగటానికి ముందే మనం దాన్ని దాటిపోగలమా?" నాన్సీ ఆలోచిస్తూ అంది.  


  ఇద్దరమ్మాయిలు ఒక సముద్రపు అల తమను విసరికొడుతున్నట్లు వేగంగా వంతెనపై అవతలి వైపుకు దూసుకుపోయారు. వాళ్ళకు ఏమీ జరగకుండానే అవతలివైపుకు చేరుకొన్నారు. 


  "ఇప్పుడు మనం రోడ్డు పక్కన నడుస్తూ నేను చెప్పిన సిద్ధాంతంలో ఏమైనా నిజం ఉందా అన్నది చూద్దాం" అని జార్జ్ చెప్పింది.  "అదేమిటంటే, ఒక వ్యక్తి ఈ రోడ్డు మీద ఒక నిర్దిష్టమైన ప్రాంతంపై కాలు మోపగానే, కిందకు ఉన్న వంతెన దానంతటదే పైకి లేస్తుంది."


  "ఆగు" నాన్సీ పిలిచింది.  "ఒకవేళ నువ్వు చెప్పేదే నిజం అయితే, కందకంలో ఈత కొట్టకుండా మనం మళ్ళీ యిటు పక్కకు రావాలంటే, వంతెన కిందకే ఉండేలా, దాని యీ చివరను దేనికో కట్టేయటానికి మనం ఎందుకు ప్రయత్నించకూడదు?"


  "ఇది మంచి ఆలోచన" జార్జ్ అంగీకరించింది.  "నేను యిక్కడ రాళ్ళను పోగేస్తాను.  నువ్వు కట్టడానికి కారులో ఏదైనా తీగ దొరుకుతుందేమో చూడు."


  నాన్సీ తిరిగివచ్చే సమయానికి, జార్జ్ అనేక బరువైన రాళ్ళను మోసుకొచ్చి కందకపు వంతెనకు రెండు పక్కలా ఉంచింది.


    "బాగుంది" అంది నాన్సీ.  "నేను ఈ తీగను కనుగొన్నాను.  "మనం దీన్ని జోడించగలమని అనుకొంటున్నావా?"


  "చివరల్లో యినుప కొక్కాలు బిగించిన కొన్ని స్థంభాలు అక్కడ భూమిలో ఉన్నాయి"జార్జ్ బదులిచ్చింది.  "వాటిని ఈ అవసరానికే వాడారని నేను పందెం వేసి చెబుతాను."


   ఆమె మరియు నాన్సీ వంతెన అంచున ఉన్న దృఢమైన కొక్కాలను కూడా గమనించారు.  ఇద్దరు అమ్మాయిలు కలిసి తీగలో ఉన్న పోగులను కొక్కాలకు ముడివేసి, వంతెనను సురక్షితంగా నేలకు నొక్కిపట్టి ఉండేలా బిగించారు.


(సశేషం)

No comments:

Post a Comment

Pages