దొంగోడు
సత్యవతి కొంపలంటుకు పోతున్నట్టు హడావిడిగా బయటకొచ్చింది.వాకిట్లో నిలబడి ఓసారి అటూ ఇటూ చూసి చీరకుచ్చెళ్ళు పైకెత్తి ఎగదోపింది. పైట చెంగును చుట్టూతిప్పి బొడ్లో దోపింది.. అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా ఇంట్లోకి పరుగుపరుగునవెళ్లి చేతిలో చీపురుతో తిరిగొచ్చింది.ఆనక టివిలో వచ్చేడైలీ సీరియళ్లు చూసి,చూసి, ఏడ్చి,ఏడ్చి దిగులుతో, బాధతో ఎంత తింటుందో చూసుకోకుండానే 'సీరియల్ చిరుతిళ్ళు' తినేసి పెంచుకున్న తన భారీ కాయాన్ని వంచడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలమైంది.ఇక లాభం లేదనుకుని ఒళ్ళు సహకరించినంతమేర ఏటవాలుగా వంగి బరబరా వాకిలి ఊడ్చడం ప్రారంభించింది.ఆయాసంతో ఏదో అయిందనిపించి ఇంట్లోకెళ్లింది.ఒకచేత నీళ్ల బకెట్ మరోచేత మగ్ తో వేగంగా వస్తున్నదల్లా వాకిలి మెట్లమీద కాలు జారడంతో 'ఢాం... మ్మ'ని బొక్కబోర్లా పడిపోయింది.ఆ పడటం కూడా బక్కెట్ మీద పడటంతో అది కాస్తా 'అప్పచ్చి' అయిపోయింది. భారీకాయం కావడంతో పడినచోటనే ఆగక,వాకిట మెట్ల మీద దొర్లుకుంటూ క్రిందికిపోయిగానీ ఆగలేదు. ప్రహరిగోడ పక్కనజేరి ఈ సీనంతా తిలకించిన పక్కింటి ప్రేమలత, పరమేశ్వర్రావులు కిసుక్కున నవ్వేరు.
టీవిలో వచ్చే కామెడీ సీరియల్స్ ఎన్ని చూసినా ఏనాడూ నవ్వినపాపానపోని ప్రేమలత పరమేశ్వర్రావులు కూడా నవ్వడంతో గిరుక్కున ఇటుతిరిగి 'గుర్రు'గా చూసేసరికి తుర్రుమన్నారింట్లోకి.నాకు సమయం లేదు కాబట్టి మీకు చావుతప్పిందని ఇద్దర్నీ తిట్టిపోస్తూ అతికష్టమ్మీద పైకిలేచి నీళ్లుతెచ్చి కళ్లాపి జల్లే ఓపికలేక వాకిలంతా గుమ్మరించేసింది. సీరియళ్లు సాగదీసిన చందాన తనపనులుకూడా సాగతీతకు కారణమైన మతిమరుపును తిట్టుకుంటూ మళ్ళీ ఇంట్లోకెళ్లి ముగ్గుచిప్పతో తిరిగొచ్చింది. ఇంట్లో టీవి కంట్లో మెదులుతుండగా ఒంట్లో శక్తిని కూడదీసుకుని, గొంతుక్కూర్చుని ముగ్గులేయడం ప్రారంభించింది.మధ్య మధ్యలో ఊపిరాడక అవస్థ పడుతూనే వాకిటనిండుగా ముగ్గులేసేసింది. ధనుర్మాసం ప్రారంభం నుండి సంక్రాంతి వరకు రాత్రిపూటనే ముగ్గులేసుకోవడం ఆంధ్రా ఇల్లాళ్లకు అలవాటే. టీవిలొచ్చాక సీరియళ్ల పిచ్చిగల సత్యవతి లాంటి వారికి అదే ఆనవాయితీ అయినా ఆశ్చర్యమేముంటుంది? రాత్రంతా సిరియళ్లుచూసి,ఏ తెల్లవారుజామునో పడుకుని తెల్లారి పదిగంటలవరకు గుర్రుపెట్టి నిద్రపోయే సత్యవతికి పొద్దున వాకిలిఊడ్చి కళ్ళాపిజల్లే సంగతి దేవుడెరుగు.పతిదేవుడికి ఆఫీసుటైమ్ కి టిఫిన్ పెడితే అది గిన్నిస్ రికార్డే. అందుకే రాత్రిపూట సీరియల్స్ ప్రారంభానికి ముందుగానే పనులన్నీ చక్కబెట్టేసుకుంటుంది.
ఆరోజు శనివారం. సంక్రాంతికి ఇక రెండురోజులే ఉండడం తో టీవిలో
తొమ్మిదిన్నరకు 'కోవై సరళ బ్రహ్మానందం' లు మొగుడు పెళ్లాలుగా నటించిన సినిమా
వేస్తున్నారు. ఆజంట నటించిన సినిమాలంటే సత్యవతికి సచ్చేంత ఇష్టం.అసలే ఫెమినిస్టు
ఆపైన ఓ చిన్నసైజు మహిళా సంఘానిక్కూడా ప్రెసిడెంటైన సత్యవతికి ఆ మధ్య కాలంలో
'అపరసత్యభామ'లా విజృంభిస్తూ తెలుగు
దేశాన్ని ఒక ప్రభంజనంలా ఊపేసిన
కోవైసరళ తన ఆశయాలకు ప్రతి రూపంగా కన్పించింది.మొగుళ్లపై తిరగబడి పోరాడే కేరక్టర్లంటే సత్యవతికి
ఎక్కడలేని ఇష్టం.అందుకే 'మగ గృహహింస' పెరిగిపోతోందని మహిళా మణులంతా మొత్తుకుంటుంటే,'ఆడ గృహహింస'
పెరగాలంటూ గోల చేయడం సత్యవతి వంతైంది.తన ఆశయాలకనుగుణంగా సినిమాలు, సీరియళ్లు తీసే, నటించే వారందరికీ అభినందనలు
తెలుపుతూంటుంది కూడా. మహిళలకు కావాల్సింది సమానత్వం కాదని, మహిళాధిక్యతనీ,అలాంటి
సమాజంరావాలంటే 'వీరనారీమణుల్లా తిరగబడి తన్నగలిగే' స్త్రీవాద సిన్మాలు
సీరియళ్లు మరిన్ని రావాల్సిన అవసరముందని
చెప్పడమేకాదు యావత్ మగ జాతి మహిళలకు అణిగిమణిగి ఉండాలని, అందుకనుగుణంగా అబలలు మంచి
దేహ ధారుడ్యాన్ని కలిగివుండాలనికూడా చెపుతుంది. అందుకు తానే ఓ 'రోలు' మోడలు గా
ఉండాలనే కాబోలు బాడి భారీగా పెరుగుతున్నా బాధపడలేదు.గ్లామర్ తగ్గిపోతోంది
మొర్రోమని మొగుడు మొత్తుకున్నా
వినలేదు.సరికదా టీవి సీరియళ్ళలో నటిస్తున్న ఒకరిద్దరు 'మాజీ సినీ
హీరోయిన్ల' తో పోల్చుకొని తానే నయమని మురిసిపోతూ నోరేలేని మొగుడి నోరు కూడా మూయించింది.అలాంటి
సత్యవతి హడావిడిగానే అన్నీ అయ్యాయనిపించి,సిన్మా స్టార్టయ్యేసరికల్లా
తనకిష్టమైనవన్నీ ముందేసుకొని ఆవురావురుమని ఆరగిస్తూ ఆనందంగా సిన్మా చూడసాగింది.
శీతాకాలం కావడంతో మరి కాసేపటికే వీధంతా నిర్మానుష్యంగా మారింది.సరిగ్గా అప్పుడే ఆ వీధిలోకి ప్రవేశించాడో అజానుబాహుడైన వ్యక్తి. రింగులు తిరిగినజుట్టు ,కోరమీసాలతో, మంచి కండపుష్టి తో ఉన్న అవ్యక్తి నేరుగా సత్యవతి ఇంటిముందుకొచ్చి వాకిట్లోని ముగ్గులను పరిశీలనగా చూసేడు. ఆ తర్వాత తల పంకించి ఇంటి వెనుకవైపుగా కదిలేడు. ఇంటి పెరటి తలుపులు ఓరగా వేసి ఉన్నాయి. 'ఇక తన పని ఈజీ' అనుకుంటూ ప్రహరీ గోడను ఒక్క ఉదుటున అవలీలగా ఎక్కేశాడు. ఓసారి అటూ ఇటూ చూసి తననెవరూ చూడటం లేదని గట్టిగాఊపిరి పీల్చుకుని లోపలి వైపు దూకబోతుండగా అప్పుడు జరిగిందా సంఘటన.అదే టైం కు బాత్రూమ్ కని బయటకొచ్చిన ఎనకింటి ఏడుకొండలు గోడ మీద ఉన్నవ్యక్తి ని చూసి "దొంగ.. దొంగ.. గోడదూకేస్తున్నాడు. పట్టుకోండి.. పట్టుకోండి..! అంటూ గావు కేకలు పెట్టడం ప్రారంభించేడు. ఊహించని విధంగా తన ప్లాన్ భగ్నం కావడంతో తత్తరపడి బిత్తరపోయిన ఆగంతకుడు లోపలకు దూకబోయిన వాడల్లా కంగారులో బయటకు దూకేసి చీకట్లోకి పరుగెత్తాడు.
కానీ అప్పటికే ఆలస్యమైంది. ఏడుకొండల అరుపులకి అందరూ ఇళ్లలోంచి బయటకొచ్చి అన్ని వైపులా చుట్టుముట్టడంతో దొంగోడు కాస్త దొరికిపోయాడు.ఈ గోలకి "సినిమా మాంచి రసపట్టులో ఉంటే ఈ డిస్టర్బ్ ఏందహే..." అని విసుక్కుంటూ బయటకు వచ్చిన సత్యవతికి దొంగను దొరికిన చోట దొరకబుచ్చుకుని పిడి గుద్దులు గుద్దుతున్న జనం కంట పడ్డారు. ఆ సీన్ చూడగానే సత్యవతి విసుగంతా పోయి ఆనందంతో ముఖం వెలిగిపోయింది. ఆమెకెప్పటినుంచో ఓ' దారుణమైన తీరని కోరిక' ఉంది. అదేంటంటే దొంగోడు ఎలా ఉంటాడో చూడాలని, చూసేక వీలైతే తన చేతి దెబ్బోకటి రుచి చూపించాలని. సినిమాల్లో, టీవీల్లో చూడటమే కాని ఒరిజినల్ దొంగని ఇంతవరకు చూడలేదు. ఇప్పుడా అవకాశం వచ్చిందనే ఆమె సంతోషం. 'ఎన్నాళ్ళకెన్నాళ్ళకెన్నాళ్లకు..' అని పాడుతూ డాన్స్ చేయాలనిపించింది సత్యవతికి. కానీ బాగుండదని నిగ్రహించుకుంది. "ఈ దొంగ వెధవలు మరీ బరి తెగించి పోతున్నారొదినా..! లేకపోతే అన్నయ్య లేని సమయం చూసి మీ ఇంట్లోనే దూరబోతాడా..? ఇదేదో 'పకడ్బందీ ప్లాన్' ప్రకారమే జరిగిన పనిలాగుంది.. మొన్నటికి మొన్న నిండు ప్రాణాన్ని నిలువునా తీసేసి మరీ నగలు,నట్రా దోచుకుపోయారట.నీ రాత బాగుండబట్టి, సమయానికి మేము చూడబట్టి సరిపోయింది గాని...లేకపోతే ఏమైయ్యుండేదో ఏమో..."అంటూ వచ్చింది ప్రేమలత.
"ఎవరూ చూడకపోతే ఎవరింట్లో ఏమేం దోచుకు పోయేవాడో ..లేవకుండా చితక తన్నండి వాడ్ని." అంటున్నారెవరో. "పోలీసులకు ఫోన్ చేయండి వాళ్లే బుద్ధి చెప్తారు". గుంపులోంచి అరిచారెవరో. "నో..నో.. పోలీసుల కప్పగిస్తే మామూళ్లు తీసుకొని దొంగ వెధవలక్కూడా 'ఫైవ్ స్టార్ వసతులు' కల్పిస్తారు. అవి తిని కండలు పెంచుకునే మళ్ళీ మళ్ళీ దొంగతనాలు చేస్తున్నారు. ఈ సంస్కృతికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలంటే మనమే వీడికి బుద్ధి చెప్పాలి.ఇక జన్మలో దొంగతనాలకు వెళ్ళకుండా ఏ కాలో కీలో విరిచేస్తే సరి." అన్నాడు పోలీసుల గురించి బాగా తెలిసిన ప్రసాదరావు.
"ముందు ఆ దొంగ వెధవను ఇలా తీసుకురండి అసలు వాడేవడో..ఏ అంతర్ జిల్లా దొంగల ముఠావాడో.. లేక అంతర్రాష్ట్ర బందిపోటు ముఠాకు చెందినవాడో.. ఆరాతీయాలి. వాడితో ఇంకా ఎందరొచ్చారో.. వాళ్ళు ఎక్కడెక్కడ పాగా వేసున్నారో ..వాడి చేతనే కక్కిద్దాం.ఆలస్యం చేస్తే వాడి ముఠా వాళ్ళు ఎక్కడెక్కడ దోపిడీ చేస్తారో.. ఎందర్నీ బలి తీసుకుంటారో.. వెంటనే సమాచారాన్ని పోలీసులకు చేరవేసి నరమేధాన్ని నిలుపుదాం.ఊ... తీసుకురండి..హరియప్..." అంటూ తొందరపెట్టాడు ఈ మధ్యనే అంతర్ జిల్లా బదిలీ మీద వచ్చిన ఆనందరావు. తను పేపర్ లో చూసిన బందిపోట్ల బీభత్సాలు గుర్తు చేసుకుంటూ. అప్పటికే చావు దెబ్బలు తిని మూర్ఛపోయిన దొంగోడ్ని పీలికలైపోయిన చొక్కా కాలర్ పుచ్చుకుని వీధి లైటు కిందకు ఈడ్చుకు రాసాగారు.
దొంగోడు దగ్గరయ్యేకొద్దీ ఆమె లో 'థ్రిల్లింగ్'ఎక్కువ కాసాగింది. కానీ వీధి లైటు వెలుతురులో దొంగను చూసి "అరే.. వీడేమిటి.. ఇలా ఉన్నాడు? దొంగోడి 'ఫీచర్స్' ఒక్కటీ లేకుండా సాదాగా తెలిసిన శాల్తీ లాగే వున్నాడు ఎవరబ్బా..?" అనుకుంటూ దగ్గరకెళ్లగానే, దొంగని చూడాలని కోరిక ఆవిరైపోగా, ఒక్కసారిగా కెవ్వుమని కేకేసి విరుచుకు పడి పోయింది సత్యవతి.గోవిందరాజుల్ని గుర్తు పట్టి గతుక్కుమన్నారంతా. అంతలోనే కర్తవ్యం గుర్తుకొచ్చిన వారిలా నీళ్ళు తెచ్చి ఇద్దరి మొహాన చల్లేరు. సత్యవతి దిగ్గున లేచి కూర్చుంది. గోవిందరాజులుకి మత్తు వదిలింది.
"యావండీ.. మీకేమైందండీ..!" అంటూ రాగాలు తీయడం ప్రారంభించింది. "ఊర్కో వదినా ఇప్పుడు ఏడ్చిఏమి లాభం.అసలు అన్నయ్య గారు ఈ టైంలో గోడమీద కెక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఏం జరిగింది?" అని ఓదారుస్తూనే కూపీ లాగింది ప్రేమలత. "ఏమో వదినా రేపు సంక్రాంతి పండుగని ఫ్రెండ్స్ తో పార్టీ ఉందని రాత్రికి లేటుగా వస్తానని చెప్పి వెళ్లారు. ఇప్పుడిలా ప్రత్యక్షమయ్యారు. మందు కొట్టి కిక్కు ఎక్కువయ్యిందో ఏం పాడో.." అంది దీర్ఘాలు తీస్తూ."పార్టీలో దొరికింది కదాని ఊటుగా తాగడ మెందుకు? తాగింది చాలదన్నట్టు కమల్ హాసన్ లా గోడ మీదకెక్కి చిందులు వేయడమెందుకు? ఇదేమన్నా సినిమా నా..! శుభమాని సంక్రాంతి పండుగ సమయంలో ఇలా ఒళ్ళు హూనం చేసుకోవడం ఏం బాగోలేదోయ్ గోవిందరాజులు" మందలింపుగా అన్నాడు ప్రసాదరావు. నిజానికి గోవిందరాజులు తాగే మనిషి కాడు. తనున్న స్థితికి సిగ్గు పడి తన బాధను ఎవరికి ఎలా చెప్పుకోవాలో తెలీక ఎందరు ఎన్ని రకాలుగా అడిగినా భార్యకు భయపడి కిక్కురుమన కుండా కుక్కిన పేనులా పడి ఉన్నాడు. తాగిన వాడిలా నటిస్తున్నాడు.
"అయ్యిందేదో అయింది. ఇక పద బావ ఇంట్లో దిగబెడతాం" అంటూ పరమేశ్వరరావు, ఏడుకొండలు చెరోపక్క పట్టుకుని గోవిందరాజుల్ని పైకి లేపేరు. నానా అవస్థలు పడుతూ అలా వాకిట దాకా చేర్చారో లేదో "ఆగండీ....!" అంటూ భువనభోళాంతరాలు దద్దరిల్లేలా, సత్యవతి వెనుక నుండిఅరిచిన అరుపుకు వారి చెవులు చిల్లులు పడినై. ఆమె అరుపులకే 'సగం సచ్చిన' ఏడుకొండలు, పరమేశ్వరరావులు గోవిందరాజుల్ని అమాంతం వదిలేసి గుడ్లు తేలేసారు. ఇంకేముంది అసలే లేవలేని స్థితిలో ఉన్న గోవిందరాజులు 'ధభీ..' మనీ కిందపడిపోయాడు. ఆ దెబ్బతో గోవిందరాజులుకు అంతో ఇంతో మిగిలి ఉన్న నడుములు కూడా పూర్తిగా విరిగినై. "అన్నయ్య గారు రెక్కలు ముక్కలు చేసుకుని వేసుకున్న ముగ్గులు పాడు చేయొద్దు. నామీద దయవుంచి కాస్త జాగ్రత్తగా ముగ్గులు తొక్కకుండా తీసుకెళ్లండి చచ్చి మీ కడుపున పుడతానం"టూ ప్రాధేయ పడింది. తాను పడిన సంగతి గుర్తు చేసుకుంటూ. ఇక గతిలేక గోవిందరాజులు చెరో రెక్క పట్టుకుని పైకి లేపారు. గోవిందరాజులు రెక్కలు తెగిన పక్షిలా విలవిల్లాడేడు. కానీ వాళ్లు ఇదేమీ పట్టించుకోకుండా అతన్నలా పట్టుకొని ముగ్గులు తొక్క కుండా సందు చూసుకుంటూ పోయి, ఎత్తి సోఫాలో కుదేశారు.
గోవిందరాజులు కి 'యమపురి దరిదాపుల'కి వెళ్లొచ్చినంత పనైంది. "ఇదిగో
గోవిందం బావా నీ యవ్వారం ఏం బాగోలేదు. ఇంకోసారి నువ్విలా మందు కొట్టి గోడ మీదెక్కి
పిల్లి మొగ్గలేస్తే తన్నడానికి వాళ్ళూ
ఉండరు మోసుకు రావడానికి మేమూ ఉండం జాగ్రత్త.
ఆ..చెల్లాయ్ కాస్త కాపడం పెట్టు
నొప్పి తగ్గిపోతుంది ఇక వస్తా"నంటూ సలహా ఇచ్చి మరీ వెళ్ళాడు పరమేశ్వరరావు.
వాళ్ళలా వెళ్ళారో లేదో 'ధడేల్...' మంటూ
తలుపు వేసేసింది సత్యవతి. ఆ శబ్దంలోని అర్థాన్ని గ్రహించిన గోవింద రాజులు ఇక తనకు
'ఆపదమొక్కులవాడే దిక్కు' అనుకుంటూ గజగజ లాడి పోయాడు. జరిగిన అవమానానికి రగిలిపోతూ
కసి కొద్దీ గోవిందరాజులు డొక్కలో ఒక్క తాపు
తన్నింది.ఆ తన్ను కు సోఫా విరిగి ముక్కలైంది.గోవింద రాజులకైతే 'అంతరిక్ష
పరిశోధనలతో అమెరికా వాళ్ళు అష్ట కష్టాలు పడ్డా ఆనవాళ్లు కూడా దొరకని అంగారక
గ్రహం'కళ్ళముందు కనిపించి,కనువిందు చేసింది.కళ్ళు బైర్లు కమ్మడంతో
భార్య స్థానంలో తెలంగాణ శకుంతల ఉన్నట్లనిపించింది భార్యా బాధితుడయిన
గోవిందరాజులుకు.గత సంక్రాంతి నాడు పొరపాటున సత్యవతి వేసిన ముగ్గులు తొక్కి పాడు
చేసినందుకు గాను ఒళ్లు హూనమయ్యేలా తన్నడంతో ఒక కాలు ఇప్పటికీ సరిగ్గా పనిచేయడం
లేదు.అందుకే ఈ సారన్నా అలా జరగకుండా జాగ్రత్తగా, ముగ్గులు తొక్క కుండా పెరటి
గోడదూకి సీక్రెట్ గా వెళ్లి సర్ ప్రైజ్
చేద్దామ'నుకున్నాడు.కానీ సత్యవతికి ఇవేమీ తెలీక పోవడంవల్ల,గోవిందరాజులు
చెప్పినా వినిపించుకునే స్థితిలో లేకపోవడం
వల్లా,ఈసారి రెండుసార్లు తన్నులు తినాల్సి వచ్చింది.'పాపం గోవిందరాజులు...' ఊహూ...
"దొంగోడు."
***
No comments:
Post a Comment