ఈ దారి మనసైనది - 47 (చివరి భాగం) - అచ్చంగా తెలుగు

ఈ దారి మనసైనది - 47 (చివరి భాగం)

Share This

ఈ దారి మనసైనది - 47 (చివరి భాగం)

అంగులూరి అంజనీదేవి 


“కాలం, కెరటం ఎవరికోసం ఆగవు అనురాగ్ ! వాటి పని అవి చేసుకుపోతుంటాయి. ఎప్పుడైనా మనం అపార్థం చేసుకున్నంత బాగా అర్థం చేసుకోలేం ... పైగా అర్థం చేసుకోవటం ఎదుటివారి బాధ్యతగా అనుకుంటాం. అపార్థం అనర్ధం... అర్ధం ఆనందం... బాధలో వున్నా ప్రశాంతంగా ఆలోచించాలి. అప్పుడే మనమేంటో మనకో క్లారిటీదొరుకుతుంది. ప్రేమనేది ఎక్కడో లేదు. ఒక 'పని' పట్ల మన ప్రయత్నంలో వుంది. పట్టుదలలో వుంది. గెలుపులో వుంది...” అంటూ ఆగింది.

ఎందుకు ఆగిందా అని తలెత్తి ఆమెవైపుచూశాడు

“ఒకప్పుడు నన్నందరు ప్రేమిస్తే బావుండని అ ప్రేమకోసం ఎదుటివాళ్ల మీద ఆధారపడేదాన్ని ... నన్నెవరూ ప్రేమించలేదు. ప్రేమనేది ఆశిస్తే, అడిగితే, లాక్కుంటే దొరికేది కాదని తెలుసుకోటానికి నాకు చాలా టైం పట్టింది. అది తెలిశాక అశించటం మరిచిపోయి అందించటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు నా ప్రేమను అందరికి పంచుతున్నాను. ఒకప్పుడు ఎవరికీ అవసరం లేని నేను ఇప్పుడు అందరికి అవసరమయ్యాను. నన్ను చూడగానే ఆ రోగుల కళ్లలో కన్పించే చెమ్మలోని అత్మీయత, వాళ్ల మాటల స్పర్శలో పుట్టే ప్రేమ ఒకప్పుడు నేను ఆశించిన దానికన్నా ఎక్కువ తృప్తిని ఇస్తున్నాయి ...” అంది.

ఆమెలో సంతోషం కన్నా త్యాగం, తెగింపు, పట్టుదల వున్నాయి. ముఖ్యంగా సాటివారి జీవితంలో వెలుగునింపే చైతన్యం వుంది.

అంతలో తన మొబైల్ మోగడంతో ...

“ఎక్స్ క్యూజ్మి  ...” అంటూ డా|| ధీరజ్ రెడ్డి కాలని రిసీవ్ చేసుకొంది.

కాల్ మాట్లాడాక ... అనురాగ్ వైపు చూస్తూ ...

“డా|| ధీరజ్ ఇప్పుడే పాకాల వచ్చారట ... ఓ.పి లో కూర్చుంటూ నాకు కాల్ చేశారు...” అంది మన్విత. 

ప్రియబాంధవి పంపిన కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్లింది పని మనిషి.

కొద్దిసేపు వాళ్లిద్దరి మధ్యన నిశ్శబ్దం ఆవరించింది.

మన్విత తన చేతి వేళ్ల వైపు దీక్షగా చూసుకుంటూ, ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ...

“డా|| ధీరజ్ రెడ్డి ఇక ముందు పాకాలలో వుంటాడన్న నమ్మకం లేదు అనురాగ్ ! అతని అవసరం పాకాలలో చాలా వుంది. ఎందుకంటే చుట్టు పక్కల ప్రజలంతా రకరకాల వ్యాధులతో వస్తున్నారు. అతను లేకుంటే వాళ్లను సిటీకి పంపాల్సి వస్తుంది. అలా పంపే ప్రాసెస్లో దారి మధ్యలో వాళ్లకేమైనా జరిగే సందర్భాలు కూడా వున్నాయి. అదే నా బాధ ...” అంది మన్విత

ఆ హాస్పిటల్, ఆ రోగులు మన్విత ఆలోచనలలో ఎంతగా కలిసిపోయారో ... క్షణం కూడా ఆమెను విడిపోకుండా ఎంతగా ఆక్రమించుకున్నారో అర్థమవుతోంది అనురాగ్ కి ...

కింద ప్రియబాంధవిని పరామర్శించి అప్పుడే పైకొచ్చింది. సంజన.

సంజనను చూడగానే నవ్వుతూ రిసీవ్ చేసుకొని ...

“కూర్చో సంజనా !” అంది మన్విత. 

అనురాగ్ని విష్ చేస్తూ కూర్చుంది సంజన. 

కూర్చున్న వెంటనే మన్విత వైపు తిరిగి ...

“ ఇక్కడ తీరిగ్గా నువ్వు కూర్చుంటే ... అక్కడ పాకాల హాస్పిటల్లో నీ ఓ.పి... ఓ.పి...” అంది చేయి చాపి దూరంగా చూపిస్తూ ... వర్షం పస్తుంది వడియాలు ఎత్తుపో అన్నట్లు...

నవ్వింది మన్విత వెన్నెల్లో తడుస్తూ, పిల్ల గాలికి కదిలే తెల్ల గులాబీలా .....

సంజన చేతి వైపు, ముఖం వైపు చూసి అనురాగ్ కూడా నవ్వాడు.

“మీరు వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రండి ! కాఫీ తాగుదాం !” అంది మన్విత, అనురాగ్ను ఉద్దేశించి .... 

అనురాగ్ లేచి బాల్కనీలో వున్న వాష్ బేసిన్ దగ్గర నిలబడి ఫేస్ వాష్ చేసుకుంటున్నాడు.

వాళ్లకి అనురాగ్ ట్యాప్ తిప్పినట్లు నీళ్ల చప్పుడు స్పష్టంగా విన్పిస్తోంది.

మౌనంగా కూర్చుని వున్న మన్విత వైపు చూస్తూ ... “వెనకటికెవరో మజ్జిగ పోయించుకోటానికి పోయిగేదెను బేరం చేసినట్టు డా|| ధీరజ్ రెడ్డి మా నాన్న గారి దగ్గరికి ఎక్స్పీరియన్స్ కోసం వచ్చి, డాక్టర్ వృత్తిలో మెలకువల్ని నేర్చుకుని అంతటితో ఆగకుండా ఇంకా ఆశ ఎక్కువై, ఆయన కూతుర్ని అయిన నన్నే పెళ్లి చేసుకుంటానంటున్నాడు...” అంది సంజన. అయితే తప్పేంటి అన్నట్లుగా చూసింది మన్విత

“ప్రయోజనం పొందిన వారి పట్ల కృతజ్ఞత చూపాలి కాని, నిన్ను ప్రేమించి, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ... ఇలా మనిద్దర్ని మోసం చెయ్యొచ్చా ?ఆ ధీరజ్ రెడ్డికి ఇది తగునా ...”అంది సంజన ఎంత నెమ్మదిగామాట్లాడదామనుకున్నా ఆవేశంలో వున్న ఆమె గొంతు గట్టిగా విన్పించింది.

“ధీరజ్ రెడ్డి నన్ను ప్రేమించడమేంటి సంజనా? ఎంత చెప్పినా వినకుండా నువ్వు నన్ను మిస్ అండర్ స్టాండ్ చేసుకుంటున్నావు. నీకు నువ్వు అలా వూహించుకుంటే సరిపోతుందా? అబద్ధం నిజమవుతుందా? ఇంకెప్పుడూ ఇలా మాట్లాడకు ... ఎందుకంటే ధీరజిరెడ్డి నాకు మంచి గైడ్. అయన గైడెన్సీలో నన్ను నేను మలుచుకున్నాను. ఒక డాక్టర్గా ఎదిగాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ లైఫ్ నాకు ఆయన ఇచ్చిందే ...” అంది డా|| మన్విత. 

అంతేనా అన్నట్లుగా చూసి, అయినా నేను నమ్మను అన్నట్లుగా ముఖాన్ని పక్కకి తిప్పుకొంది.

" నువ్వు నమ్మినా నమ్మక పోయినా మా ఇద్దరి మధ్యన వున్న రిలేషన్ అదే”అన్నట్లు మౌన గంభీరంగా కూర్చుంది మన్విత.

“మరి నువ్వు డా|| ధీరజ్ రెడ్డిని ప్రేమించలేదా?” అంటూ తలతిప్పి మన్విత వైపు చూసింది సంజన. 

ఒక రకంగా నవ్వింది మన్విత. ఆ నవ్వు చాలా పేలవంగా వుంది.

ఇప్పుడెందుకో ... మన్వితకి విశ్వజనీనమైన ప్రేమ గురించి తప్ప మామూలు ప్రేమ గురించి ఎవరు మాట్లాడినా విన బుద్ది కావటం లేదు. అంత ఎదిగింది ఆమె... 

ప్రేమలో విశాలత్వం కాదు. వెరైటీ కాదు. ఇన్ టెన్సిటీ ముఖ్యం అంటాడు చలం ... అలాంటి ప్రేమ దొరకటం చాలా కష్టం. దొరికినా అది ఒక అగ్ని, అది ఒక తపస్సు. ప్రేమను జీవితం నుండి పొంది తిరిగి అదే ప్రేమను జీవితానికి అందించటానికి సాహసం కావాలి. అది ఎవరి వల్ల కాదు.

“ ఏమిటి మన్విత మాట్లాడవు ” అన్నట్లుగా ‘హలో ‘అంటూ ఆమె భుజాన్ని తట్టింది సంజన.

అప్పటి వరకు మౌనంగా వున్న మన్విత ఉలిక్కిపడ్డట్లే ...

" నేను అనురాగ్ ని ప్రేమించాను సంజనా! ”అంది మన్విత ఈ వాస్తవాన్ని చెప్పక పోతే సంజన ధీరజరెడ్డిని భర్తగా స్వీకరించదని, చెప్పాలని పించకపోయినా చెప్పింది మన్విత.

సంజన ఏదో మాట్లాడే లోపలే ... టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు అనురాగ్.

సంజన ఇంకేం మాట్లాడు లేదు. 

అనురాగ్ వచ్చి కూర్చుంటూ ...

ప్లాస్కులో వున్న కాఫీని కప్పుల్లో పోసి వాళ్లిద్దరికి ఇచ్చి, తనొకటి తీసుకున్నాడు.

కాఫీ తాగుతూ ప్రియబాంధవి తీసుకుంటున్న మందుల గురించి, ట్రీట్ మెంట్ గురించి, కేర్ గురించి చెప్పాడు అనురాగ్.

వాళ్లిద్దరు వింటూ కూర్చున్నారు.

“ఇక మేము వెళ్లిస్తాము అనురాగ్ !” అంటూ ఇద్దరు ఒకే సారి లేచి కిందికి దిగారు.

“ నిన్ను నా కార్లో ... పాకాలలో డ్రాప్ చేసి నేను హైదరాబాదు వెళ్తాను.” అంది సంజన.

“సరే ! ” అంటూ కారెక్కింది మన్విత.

డ్రైవర్ పాకాల పోనియ్ అంటూ కార్లో కూర్చుని సంజన చెప్పగానే కారు కదిలింది.

వాళ్లిద్దరు మాట్లాడుకుంటుండగానే పాకాల వచ్చింది. 

కారు వెళ్లి హాస్పిటల్ ముందు ఆగింది 

మన్విత కారు దిగి సంజన వైపు చూస్తూ ...

ధీరజ్ రెడ్డితో మాట్లాడి వెళ్లు సంజనా! ఎలాగూ ఇంత వరకు వచ్చావు కదా!” అంది.

“ నేను దిగను ... రేపు మా ఎంగేజ్మంట్ కోసం ధీరజ్ వాళ్లు హైదరాబాద్ వస్తున్నారు. ఇప్పుడు నేను పెళ్లి కూతుర్ని ... ఈ చుట్టు పక్కల కన్పించకూడదు. బై ...” అంది సంజన.

వెంటనే కారు కదిలింది..

*****

కాలం అనంతంగా కదిలి సాగుతోంది.

డా|| ధీరజ్ రెడ్డి - డా|| సంజనను పెళ్లి చేసుకొని హైదరాబాదులో సెటిలయ్యాడు. .

పాకాలలో వుండే హాస్పిటలని డా|| మన్విత చూసుకుంటోంది. 

డా|| దీక్షిత ఢిల్లీలో హ్యాఫీగా వుంది..

డా|| అనురాగ్ స్టేట్స్లో తన చదువు పూర్తి చేసుకొని వచ్చి, గత పదిరోజులుగా ఇండియాలోనే వున్నాడు.

*****

తలస్నానం చేశాక ... జుట్టు తడిని తుడుచుకుంటూ వెళ్లి టవలని తీగపై ఆర వేసి ముందున్న బాల్కనీలో కూర్చుంది మన్విత.

రాత్రంతా సముద్రం పై కురిసిన వెన్నెల్ని కెరటాలు నెమరేసుకుని తిరిగి అ వెన్నెల్ని తెల్లని నురగ రూపంలో ఒడ్డుకి చేర్చినట్లు ... మన్విత తనలో నురగలై పొంగుతున్న ఆలోచనల్ని అధిగమిస్తూ మనసు అంచులకి వాటిని చేరవేస్తుండగా ...

ఆమె మొబైల్ రింగయింది. రింగవుతున్న మొబైల్ ని అందుకొని ఆన్ చేసి ...  

“హలో ... చెప్పు సంజనా? ” అంది మన్విత.

“రేపు నా కొడుకు పుట్టిన రోజు మన్వితా ! వీలు చూసుకొని తప్పకుండా రా! కారు పంపుతా! ” అంది సంజన.

" సరే !” అంది మన్విత.

“ రోజులు ఎంత త్వరగా గడచిపోతున్నాయి మన్వితా! దీక్షితకి కవల పిల్లలు పుట్టారట. వాళ్లను చూసుకుంటూ దీక్షిత వాళ్ల అమ్మా, నాన్నా డిల్లీలో వున్నారట ... అన్నట్లు ! అనురాగ్ ఇండియా వచ్చాడు తెలుసా ?” అంది డా|| సంజన.

" ప్రొద్దున లేచి రోగుల్ని చూసుకుంటూ - అలిసిపోయి నిద్ర పోవటం తప్ప ఇంకేం తెలియటం లేదు సంజనా !” అంది మన్విత.

" మరీ అంత ఇదవ్వకు ... నాకంతా తెలుసు.” అంది సంజన.

“ ఏం తెలుసు నీకు ?” అంది ఒక చేత్తో సెల్ పట్టుకొని, ఇంకో చేతి వేళ్లతో జుట్టుని పాయలుగా విడదీస్తూ...

“అనురాగ్ నాతో మాట్లాడాడు మన్వితా! మీ ఇద్దరు వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పటి నుండి ఫ్రెండ్సట కదా! ఎలా ఫ్రెండ్స్ అయ్యారో, ఆ తర్వాత ఏం జరిగిందో అంతా చెప్పాడు. అను బంధాలు, ఆత్మీయతలు జన్మాంతర బంధాలు. ఏది ఎవరితో ఎంత వరకు కొనసాగాలో అంతవరకు కొనసాగుతుంది.”

హైజంప్ చెయ్యాలన్నా , లాంగ్ జంప్ చెయ్యాలన్నా వున్న చోటు నుండి సాధ్యం కాదు. కొంత దూరం వెనక్కి వెళ్లాల్సిందే అలాగే నువ్వు కూడా నీ మనసును ఒక్కసారి వెనక్కి నడిపించుకొని ఆలోచించు ....” అంది సంజన.

సంజన చెప్పినట్లు ఒక్కసారి తన మనసును వెనక్కి నడిపిస్తే ? అక్కడ తన 'ప్రేమ ...

గులాబి రెమ్మను, వెన్నెల కొమ్మను కలిపి, ప్రకృతి చిత్రకారుడు ప్రాణం పోసిన అపూరూప చిత్రంలా ప్రత్యక్షం కావటానికి... అదేమైనా యండమూరి లాంటివాళ్లు ఒక నక్షత్రం ఓరగా భూమ్మీదకి వంగి రహస్యం చెబుతున్న వేళ ఒంటరిగా తన గదిలో మేల్కొని ... బయట వెన్నెల్లో ఆడుకునే అక్షరాలను తన కలంలో బంధించి, వాటిని కాగితాలపై ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ భావుకత్వమూ, సెంటిమెంటూ, కవిత్వమూ కలగలిపి రాసిన మధురకావ్యమా?

“ ఏముంది సంజనా ఆలోచించటానికి?” అంది మన్విత.

" దీక్షిత వల్ల అతనెంతబాధ పడ్డాడో అతని వల్ల నువ్వు కూడా అంతే బాధపడి వుంటావని అతని బాధ. ఈ బాధే అతన్నెక్కువగా క్రుంగ దీస్తోంది ... నువ్వు అంగీకరిస్తే అతను నిన్ను పెళ్లి చేసుకుంటా నంటున్నాడు. అతను కూడా నీతో మాట్లాడతాడట...” అంది సంజన.

" నేను ఒకప్పుడు అతన్ని ప్రేమించానేకాని ఇప్పుడు పెళ్లి చేసుకోటానికి సిద్దంగా లేను ... నువ్వున్నట్లు నా మనసుని వెనక్కి నడిపించుకొని ఆలోచించాలంటే నాకు ఏకాంతం కావాలి... అది ఎలాంటి ఏకాంతమంటే నాలో నేను చూసుకోగలిగేంత ఏకాంతం... నాకంత తీరిక ఎక్కడుంది?” అంది మన్విత.

" అలాంటప్పుడు ఎందుకు ప్రేమించావ్?” అంది కోపంగా సంజన

“ నీ కెలా చెప్పాలో నాకర్థం కావటం లేదు సంజనా ? చరిత్రలో ప్రేమించిన వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకున్నారా? చేసుకోవాలనేమైనా రూలుందా? అయినా టైమ్  వేస్ట్ చేసుకుంటూ ... మానసికంగా ఆధారపడూ, మనసును చిద్రం చేసుకునే ఆ 'ప్రేమ గురించి ఆలోచించేంత ఆసక్తి ఇప్పుడు నాకు లేదు. నాదృష్టి అంతా పేషంట్ల మీదనే వుంది. వాళ్లకి నేను కావాలి... అదే నాకు కావాలి... నేను ఆశించేది కూడా అదే ..” అంది మన్విత.

" చూడు మన్వితా ! మనిషిని గెలుపు వరించినంత సులభంగా ప్రేమ' వరించదు. అది వరించాలంటే దాని ముందు మోకరిల్లాలి ... ప్రాధేయపడాలి ... నిరీక్షించాలి ... ఏ మాత్రం అవకాశం దొరికినా దాన్ని గెలుచుకోవాలే కాని ... తృణీకరించ కూడదు. సృష్టి రహస్యమంతా దాని చుట్టే తిరుగుతోంది. బైదిబై అతని మెంటల్ కండిషన్ కూడా నీ స్థాయిలోనే ఎదిగి వుంది కాబట్టి నీ పేషంట్లకి వచ్చే నష్టమేం లేదు... ఆ సేవేదో ఇద్దరు కలిసి చేయండి !” అంది సంజన.

“ప్లీజ్! సంజనా ! నా అభిప్రాయాలు, నీ అభిప్రాయాలు ఇప్పట్లో కలవ్వు ... ఈ టాపికని ఇంతటితో వదిలేద్దాం ...” అంది మన్విత

" మరి తోడు లేకుండా ఈ వయసులో ... ఎంత కాలం ఇలా ఈ ఒంటరి ప్రయాణం ?మేమంతా ఇలా వుంటే నువ్వులా వుండటం మాకు బాధగా వుంది.” అంది సంజన.

“వివేకానందుడు, మదర్ థెరిస్సా అలా అనుకోలేదేమో సంజనా! అందుకే ఒంటరి వాళ్లమన్న అలోచన వాళ్లకి వచ్చి వుండదు.” అంది మన్విత.

ఆ మాటతో ... నిజంగానే తమ అభిప్రాయాలు కలవ్వేమో ననిపించి 'బై చెప్పి కాల్ కట్ చేసింది సంజన

*****

వివేకానందరెడ్డి పాకాలలో వున్న అస్తుల్ని అమ్ముకొని, భార్యతో సహా హైదరాబాద్ చేరుకున్నాడు.

పల్లెటూర్లలో బోర్ కొట్టి సిటీకెళ్లిన వాళ్లలో వాళ్ళు ఒకరు. 

ఇక ఆయనకి పాకాలలో మిగిలింది ఆ హాస్పిటల్ ఒక్కటే. 

అది కూడా అమ్మే ఆలోచనలో వున్నాడు.

పెద్దవాళ్ల ఆశయాలకు తిలోదకాలు ఇవ్వాలని కాకపోయినా తను చేయబోయే పనులకి కొంత డబ్బు కావలిసి రావటంతో అతని నిర్ణయం తీసుకున్నాడు.

డా|| ధీరజిరెడ్డి సిటీకి వెళ్లాక అక్కడ పేషంట్ల బిజీలో పడిపోయాడు. డా|| సంజన పరిస్థితి కూడా అలాగే వుంది.

అందుకే వాళ్లు పాకాలలో వుండే హాస్పిటల్స్ వివేకానందరెడ్డి ఇష్టానికే వదిలేశారు.

మన్వితకి విషయం తెలిసి ఏం చేయాలో అర్థం కాని స్థితిలో వుంది. వర్ధనమ్మ కూడా అయోమయంలో పడిపోయింది.

ఇన్నాళ్లూ ... వాళ్లు పేషంట్లకు దయను పంచారే కాని, ధనార్జనను లక్ష్యంగా పెట్టుకోలేదు.

మనిషికి ధనం కన్నా విలువైనవి ఎన్నో వున్నాయి. అయితే వాటిల్లో దేనిని అందుకోవాలన్నా మనిషికి కావలసింది ధనమే అని అర్థమై బాధపడ్డారు..

జీవితం మళ్లీ వాళ్లను భయ పెట్టడం మొదలు పెట్టింది.

*****

డాక్టర్స్ అసోసియేషన్ వాళ్లు ఓ కాన్ఫ్ రెన్స్  పెట్టడంతో ఆ సందర్భంగా డా|| మన్విత హైదరాబాదు వెళ్లింది.

కాన్ఫ రెన్స్  అయిన వెంటనే డా|| మన్వితను డా|| సంజన తన కార్లో తన ఇంటికి తీసికెళ్లింది.

“ నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు మన్వితా ! హైదరాబాద్ వచ్చెయ్య రాదూ! అందరం ఒకే చోట వుండొచ్చు ... మా హస్పిటల్లో నీకో సీటు ఎప్పటికి వుంటుంది...” అంది డా|| సంజన. అక్కడే కూర్చుని బాబుని ఆడిస్తున్న సత్యాదేవికి కోడలి మాటలు సమంజసంగా అన్పించాయి.

మాట్లాడలేదు డా || మన్విత.

బయట కారు దిగిన వివేకానందరెడ్డి, డా|| అనురాగ్ మాట్లాడు కుంటూ నేరుగా లోపలకి వచ్చారు.

“సత్యా ! పాకాలలో వుండే మన హాస్పిటలని డా|| అనురాగ్ కొన్నారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఎవరి పేరు మీదనో తెలుసా? డా|| మన్విత పేరు మీద ...” అన్నాడు వివేకానందరెడ్డి

షాక్ తిన్నది డా|| సంజనతోపాటు డా|| మన్విత

షాక్ లోంచి మన్విత తేరుకునే లోపలే అమెను చదవాలని చూస్తున్నాడు అనురాగ్.

నన్ను చదివే చాన్స్ నేనెవరికి ఇవ్వను అన్నట్లుగా వుందామె ఫేస్ చూస్తుంటే... నిండు గోదావరికి ఆమెకి పెద్ద తేడా కన్పించటం లేదు. నిశ్చలమైన, ప్రశాంతమైన మనస్సే మనిషికి గొప్ప భాగ్యమేమోనని ఆమె నలా చూస్తుంటే అన్పిస్తోంది..

డా|| అనురాగికి మాత్రం ఇప్పుడు చాలా తృప్తిగా వుంది.

ఎంతసారవంతమైన భూమినైనా దున్నక పోతే ముళ్ల పొదలే మొలుస్తాయి. మనసు కూడా అంతే ! అందులో దయ అనే బీజాన్ని వేసి దాన్ని బ్రతికించుకోవాలి... వ్యక్తి ఔన్నత్యానికి కొలబద్ద మేధస్సు కాదు. దయగల హృదయం ... అది డా|| అనురాగ్ లో  కన్పిస్తూ అక్కడున్న అందర్ని కదిలించింది.

వివేకానందరెడ్డి తన ఆఫీసు రూంలోకి వెళ్లాడు.

డా|| అనురాగ్ కార్లో ఏదో మరచిపోయి అప్పుడే గుర్తొచ్చినట్లు కారు దగ్గరకి వెళ్లాడు అతనలా వెళ్లగానే ....

“ నాకిదేం నచ్చలేదు సంజనా!” అంది మన్విత సీరియస్గా. అర్థం కానట్లు చూసింది సంజన..

“ అంత పెద్ద ప్రాపర్టీని అతను నా పేరు మీద కొనటం ఏమిటి ? ఇది మీకెలా అన్పిస్తుందోకాని నాకయితే నచ్చలేదు. ఇలాంటివి ఎక్కడైనా తల్లి పేరుతో, భార్య, పిల్లల పేరుతో చేస్తారు...” అంది మన్విత.

" అది నీ పేరుతో కొనటమే బాగుంది. ఎందుకంటే ఫ్యూచర్లో డా|| అనురాగ్ కూడా ధీరజ్ లాగే బయటకెళ్లిపోవచ్చు ... అప్పుడు ఈ ప్రాబ్లమ్ మళ్లీ మొదటికి వస్తుంది. అలా జరక్కూడదన్న మంచి ఉద్దేశ్యంతోనే అతను నీ పేరుతో పెట్టాడు. వ్యాధిగ్రస్తులైన పల్లె ప్రజల పట్ల నీ సిన్సియారిటీని, డెడికేషన్ని అందరు అర్థం చేసుకుంటారు. కానీ ... దానివల్ల ఉపయోగం లేదు. దాన్ని బ్రతికించాలని చూస్తున్నాడుఅనురాగ్. దాన్ని నువ్వు అర్థం చేసుకో ... చరిత్రలో ప్రేమ పేరుతో సమాదులు కట్టించిన వాళ్లున్నారు... ఇలా హాస్పిటల్ బహుమతిగా ఇచ్చిన వాళ్లు లేరు...” అంది సంజన.

డా|| అనురాగ్ లోపలకి వచ్చాడు.

రాగానే హాస్పిటలకి సంబందించిన డాక్యుమెంట్స్ ని డా|| మన్విత చేతిలో వుంచుతూ ...“డా|| ధీరజ్ లేక పోవడం వల్ల నీలో కలిగిన బాధను నేను అర్థం చేసుకున్నాను. ఈ క్షణం నుండి అయన ప్లేసులో నేనుంటున్నాను.” అన్నాడు డా|| అనురాగ్. 

కదిలిపోయింది డా|| మన్విత డా||అనురాగ్ వ్యక్తిత్వం ఆమెకు ఎంతో ఎత్తులో కన్పించింది. 

అమూల్యమైన వస్తువుని చూసినట్లు ఆ డాక్యుమెంట్లని చూస్తున్న ఆమెకు అందులో డా|| అనురాగ్ అభిమానంతోపాటు ఎందరో పేషంట్ల శారీరక అవస్థల్ని తీర్చే ధన్వంతరి కన్పించింది ... అనురాగ్ కి మాత్రం ఆమె కళ్లలోని సన్నటి కన్నీటి చెమ్మ కన్పించింది.

జీవితాన్ని మృదువుగా నిమిరే చాతుర్యం గల డా|| అనురాగ్ తను ఏ ఉద్దేశ్యంతో స్టేట్స్ వెళ్లి చదివాడో.. ఆ చదువుకి సార్ధకత దొరికినట్లు డా|| మన్విత వైపు చూశాడు.

ఒక్కక్షణం ...“తానోడినేగెలిచానా లేక నేనోడి తను గెలిచిందా!” అని మనసులో అనుకుంటూ ... ఇద్దరి గెలుపు పేషంట్లలో చూసుకోవాలనుకొని...

" రండి డా||మన్వితా ! పాకాల వెళ్లాం...” అంటూ కారు వైపున నడిచాడు. అనురాగ్

“ ఓ.కే...బై ఆంటీ! బై సంజనా! ” అంటూ అక్కడే ఆడుతున్న బాబు బుగ్గ గిల్లి డా|| అనురాగ్ ని ఫాలో అయింది డా|| మన్విత.

**అయిపోయింది**


No comments:

Post a Comment

Pages