మానసవీణ - 31 - అచ్చంగా తెలుగు

మానసవీణ 31 

భాగవతుల‌ సునంద


గణగణ మ్రోగింది బడి గంట. జే గంటలా బిలబిల పిల్లలంతా బడివైపు పరుగులు తీసారు. బడి తొలిమెట్టు ఎక్కుతుంది మానస, ఆ శారదా దేవిలా ధవళకాంతి శోభిత అయిన మానసను అచ్చెరువుతో గమనించసాగారు అంతా. విశాల నయనాలతో నెమ్మదిగా రాయంచలా నడచి ప్రధానోపాధ్యాయుల గదిలోకి వచ్చి నిలిచింది. ఐదు పదులు దాటిన ప్రధానోపాధ్యాయులు కళ్ళజోడు సరిచేసుకుంటూ కుర్చీలో కదులుతున్న అతని ఎదుటకి వచ్చిన మానసను ఆపాదమస్తకం చూసి “అమ్మాయి, నీవేనా క్రొత్తగా వచ్చిన టీచర్వి? నీకు ఈ ఊరు కోరుకోమని ఎవరు చెప్పారమ్మ? ఇంతదూరం ఈ అడవుల మధ్యకి వచ్చావు. ఈ ఊరు గురించి నీకు తెలియక పొరపాటుగా కోరినట్లు ఉన్నావు. పెద్దవారు, తెలిసినవారు నీకు చెప్పలేదా తల్లి, జాగ్రత్త ఇక్కడ చాలా ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. చూడబోతే నీవు ఇంకా అవివాహితపు అనుకుంటాను".

"సార్ అవునండి ఇంకా నాకు వివాహం కాలేదు. నాకు ఇక్కడి ఇబ్బందులు గురించి కొంతమంది చెప్పారు. కానీ ఇక్కడి గిరిజనులకి నాకు తోచిన రీతిలో సహాయపడాలని నా ఆశ," "సరే అమ్మా! ఆదర్శాలు బాగా ఉన్నా, ఇక్కడ ఏవి సాగవు. కొంతమంది కామంధుల చేతిలో కీలు బొమ్మలాగా వారు చెప్పిన వాటికి 'గంగిరెద్దులా' సాగిపోవలసిందే. అందువలనే ఇక్కడికి వచ్చిన ఏ ఉపాధ్యాయులైనా ఒక సంవత్సరం కానీ రెండు సంవత్సరాలకి కానీ ట్రాన్స్ఫర్, డెప్యుటేషన్తో వేరే ఊరుకి వెళ్ళిపోతారు. లేకుంటే ఇక్కడ పెద్దలు వారికి సానుకూలంగా మనని పంపి వేస్తారు. ఆలోచించి సంతకం పెట్టండి."

"పద మానస, నేను ముందుగానే చెప్పానుగా డిప్లమాలో ఫస్ట్ రాంక్ వచ్చి, కౌన్సిలింగ్లో మంచి ప్లేసు వచ్చిన నీవు ఇక్కడికి ఇంతగా పట్టుపట్టి వచ్చావు. నాన్నగారికి కృషీవలరావుగారికి కానీ చెప్పి మరో ప్రదేశానికి బదిలీ చేయించుకుందాము" అంటూ అనిరుధ్ తొందర పెట్టసాగాడు. ఊరికి దూరంగా గుబురు మొక్కలు, పిచ్చిచెట్ల నడుమ పాడుపడినట్లు ఉన్న ఆ పాఠశాల భయం గొలుపుతున్నది. 

"నీవు ఒక్కతివే ఈ ఊరిలో ఎలా ఉండగలవు. ఈరోజు జాయినింగ్ రిపోర్టు ఇచ్చి వెనుకకి వెళ్ళిపోదాం. పద" అంటూ మానసను తొందర పెట్టాడు. 

"ఆగు అనిరుధ్, చూద్దాం మనవలన కాస్త ఈ ఊరు మార్చటం సాధ్యపడుతుందేమో. నా ఆశయం నాకు తెలుసుకదా. ఈ మారుమూల గ్రామంలో పిల్లల్ని తీర్చిదిద్ది భావిభారత పౌరులుగా తీర్చిదిద్దగలిగితే నాకు ఆనందం. సమస్యలున్నాయి కదా అని అందరూ పారిపోతే ఎలా? సమస్యలు ఎదుర్కొని వీలైతే పరిష్కరించాలి కానీ ఇలా అర్ధాంతరంగా వెళ్ళకూడదు. నీవు నాకు ఉండేందుకు ఒక గది చూచి వెళ్లు,” అంది మానస స్థిరంగా.

"సరే మానస నీ మాటను తోసిపుచ్చను. కానీ నా అభ్యర్ధన నేను కూడా నీ వెంట నాతోనే ఉంటాను. నేను నిన్ను ఒక్కదాన్ని ఈ అడవిలో వదలి వెళ్ళలేను, కాదనకు (ప్లీజ్) దయచేసి." 

"అరే నాకు ఏం భయంలేదు. అక్కడ మీ అమ్మ, నాన్నగారు ఎదురు చూస్తుంటారు. నీ కెరియర్ నా గురించి పాడుచేసుకోకు."

"లేదు మానసా, ఒంటరి అడపిల్లవి ఈ తోడేళ్ళ నడుమ మనలేవు. నాకు విన్ని ఒంటరిగా వదిలి వెళ్ళే వాహనం లేదు. నీ దారికి, సేవకి నేను అడ్డురాను. కానీ విడిచి వెళ్ళమనకు." 

"సరే నీ ఇష్టం. చెప్తే వినవుగా, అంకుల్, ఆంటీ కంగారుపడి కబురు చేస్తే నీవే పరుగు పెడతావు." అంటూ తర్జనీ చూపింది.

విశాలమైన ఆవరణలో కొబ్బరి, అరటి మొక్కల నడువు పొందికగా ఉన్న పెంకుటిల్లు, రెండు గదుల హాలు, వంటగదితో చూడముచ్చటగా ఉంది. ఆ ఇంటివారు వేరే ఊరుకి వెళ్ళిపోవటం వల్ల తెలుగు మాష్టారు  చుట్టాలు కాబట్టి వారు ఈ ఇంటిని మానన, అనిరుధ్ లు ఉండటానికి అనుమతించారు. మానసకు ఆ ఇల్లు బాగా నచ్చింది. చుట్టుతా పెద్ద అరుగులు, పూలమొక్కలు సంరక్షణ లేక ఎండిపోయాయి. మానస వెంటనే తన సామాను అంతా తీసుకువచ్చేయమని సమీరకు ఫోను చేసి చెప్పింది. సమీర "అక్క, శ్రావణిగారు నీకోసం రోజూ ఆలయానికి వస్తున్నారు. రెండుసార్లు రఘురాం గారు కూడా ఇక్కడికి వచ్చి వివరాలు అడిగారు. పాపం శ్రావణిగారు నీకోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి వచ్చి అందర్నీ కలిసి వెళ్ళు. నేను కూడా నిన్ను మిస్ అవుతున్నాను" "అలాగేలే" అంటూ ఫోను కట్ చేసింది. మానస "అనిరుధ్ ఈ రెండవ శనివారం, ఆదివారం వెళ్ళి అందర్నీ కలసి వద్దాం అనుకుంటున్నాను. ఏమంటావు" అంటూ వచ్చిన మానస వనకన్యలా అనిపించింది అనిరుధ్ కి. ఆకుపచ్చని లంగా ఓణిలో విరబూసిన గులాబీలా సుకుమారంగా ఉన్న ఆ కావ్యకన్యక వైపు కన్నార్పకుండా చూడసాగేడు అనిరుధ్.

"ఏం, మాట్లాడవు? ఏం చూస్తున్నావు? ఈ ఛాయ్ త్రాగు నిద్దరమత్తు వదులుతుంది" అంటూ చాయ్ ఇచ్చింది. ఒకసారిగా కల నుండి ఇలకి వచ్చినట్లు లేచి రాయ్ అందుకుని త్రాగుతూ "అలాగే వెళ్ళదాం పద" అంటూ లేచాడు. సరే లేడికి లేచిందే పరుగా... ఈరోజు బడికి వెళ్ళాలి. బాబు ఈరోజు ఇంతా గురువారం, మరచిపోయావా? అందుకే నిద్ర తగ్గించి ఆ మొక్కల పని చూడమనేది. వాటిని చక్కగా కత్తిరించి మంచి మంచి మొక్కలు, పూలమొక్కలు దగ్గరుండి నాటించు. లైబ్రరి నుండి తెచ్చిన పుస్తకాలు ఈరోజు ఇచ్చేయాలి. ఆర్డర్లు జారీ చేసింది మానస. "అలాగే మేడంగారు మీ ఆజ్ఞ" అనిరుధ్ మది మోహనరాగం ఆలపించసాగింది.

బడికి బయలుదేరి వస్తూ ఉంటే వెనుక నుండి ఒకరాయి వచ్చి తగిలింది. హఠాత్తుగా దానితో పక్కకు ఒరిగింది మానస. పై నుండి రాళ్ళ వర్షం పడడంతో విస్తుపోయి నిలిచింది మానస. సర్రున కారు దూసుకు వచ్చింది దుమ్ము రేపుతూ, కారు నుండి శ్రావణి, రఘురాం దిగి వచ్చి మాననను పొదవి పట్టుకున్నారు. “ఏమిటి తల్లి ఇది? ఈ నరకం కోసమా మా నుండి ఇంతదూరం పరుగున వచ్చావు. నా చిట్టి తల్లికి కీడు తలపెట్టిన వారిని విడువకూడదు. చూడండి వాళ్ళవరో” అంటూ కళ్ళెర్రజేస్తూ చూసింది శ్రావణి. దూరంగా గుట్టమీద నుండి ఎవరో రాళ్ళు రువ్వుతున్నారు. తనలోకి పొదువుకుంటూ, మానస చుట్టూ చేతులు వేసి కారులోనికి తీసుకువెళ్ళి కూర్చుండ పెట్టింది. నుదుటికి తగిలిన గాయానికి తన కర్చీఫ్తో గట్టిగా కట్టుకట్టి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ నుండి అయోడిన్, పట్టి తీసి కట్టు కట్టింది. రఘురాం డోర్ క్లోజ్ చేసి తొందరగా కారును ఇంటివైపుకు తీసుకువెళ్ళారు. ఇంటికి వచ్చిన తరువాత శ్రావణి చేసిన హడావిడి ఇంతా అంతా కాదు. శ్రావణి మమకారానికి మానస మనసు కరిగి నీరైంది. ఇంత చిన్న ఘటనకే ఇంత చలించిన 'తల్లి' తనను ఎలా విడిచిపెట్టగలిగిందా అన్న సందేహం మనస్సును కలచివేసింది. "అమ్మా మానసా, నిన్ను విడిచి ఇక నేను ఉండలేను తల్లి. నీవు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను. నన్ను కాదనకు తల్లి నిన్ను విడిచి నేను ఉండలేను. నీకు కీడు జరిగితే మనజాలను. నీ దారికి నేను అడ్డురాను. కానీ నా బాధ అర్ధం చేసుకో, నీ కూడా నేను ఇక్కడే ఉంటాను" అంటూ తల్లడిల్లిపోయింది. ఆమె ఆరాటం చూసి మానస మది కరిగి నీరైంది. ఆమె అనురాగ వల్లరిలో ఓలలాడింది, లాలిత్యంగా.

(సశేషం)

No comments:

Post a Comment

Pages