మనశ్శాంతి - అచ్చంగా తెలుగు

                                             మనశ్శాంతి

(మా జొన్నవాడ కథలు)

                           - డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


          సుప్రభాతవేళ. తెల్లవారడానికి ఇంకా కొంత సమయం ఉంది. ఆకాశం హృద్యంగా ఉంది. అంత చీకటీ అంత వెలుతురులేని పెన్నానదీ తీరంలో ఆలయ ప్రధానార్చకుడైన పరమేశ్వర సోమయాజులు గారు స్నానం చేసి ఒడ్డున సంధ్యావందనం ఆచారిస్తూ ఉన్నారు. దాదాపు అదే సమయానికి ఆలయ ధర్మకర్త ధర్మారెడ్డి కూడా ప్రతి దినం లాగే   స్నానం ఆచరించడానికి వచ్చారు. మొదటి హారతి ధర్మారెడ్డిగారిదే. ఇది కొన్ని దశాబ్దాలుగా వస్తున్న ఆచారం. యాజులుగారికి వందనం ఆచరించి స్నానం అయ్యాక తడిబట్టలతో,  సంధ్యావందనం అయేవరకూ ఛలిలో అలాగే నిలబడ్డారు. ఇద్దరూ కలిసి దేవళంలోకి నడక సాగిస్తున్నారు.

"యాజులుగారూ మధ్య నాకు మనశ్శాంతి బొత్తిగా నశించిందండీ! ఏవో పీడ కలలు. నిద్దర పట్టడంలేదు. నాలో ఏదో నిర్లిప్తత, నైరాశ్యం చోటు జేసుకున్నది" . యాజులు ఒక్కసారి ఆయన వంక చూసి ప్రక్కన ఉన్న నాలుగ్గాళ్ళ మండంపంలో కూర్చోమని సైగ చేశాడు. రెండు నిముషాలు మౌనంగా ఉండి, రెడ్డిగారి జీవితంలో చోటుచేసుకున్న విషాద సంఘటనలన్నీ వరుసగా నెమరువేసుకున్నాక...మెల్లిగా ఇలా అన్నారు. "మనిషికి ఎంత ధనం, ఎంత అంగబలం ఉన్నా  ఏవో బాధలు ఉంటూనే ఉంటాయి. భగవంతుడు ఏవో ఒక బాధ పెడుతూనే ఉంటాడు. ఇంకో నెలరోజుల్లో దసరా రాబోతున్నది. అమ్మవారికి ప్రతిరోజూ ఉభయ పూజలు చేయించండి. ప్రసాదాలు పంచిపెట్టే ఏర్పాటు చేయండి. నేను నా శక్తిమేరకు మీ తరఫున పూజలు చేస్తాను. అమ్మణ్ణి దయవలన అన్నీ సర్దుకుంటాయి. దిగులు పడకండి. రండి" అని ఆలయంలోకి తీసుకుని వెళ్ళాడు.  రెడ్డిగారు ఏమీ మాట్లాడలేదు. మాట్లాడడానికి ఏమీ లేదు కూడా. మౌనంగా యాజులుగారిని అనుసరించారు.

- నాలుగురోజుల అనంతరం

          యాజులుగారు ఒకరోజు ఉదయాన్నే తీర్ధం ఇస్తూ "రెడ్డిగారూ..నెల్లూరికి విశ్వనాథ స్వామీజీ వచ్చారు. పూర్వాశ్రమంలో నేను ఆయనతో కలిసి వారణాశిలో 10రోజులు ఒక కార్యక్రమంలో కలిసి పనిచేశాను. చాలా మంచి సలహాలిస్తారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఆయన దగ్గర సలహాలు తీసుకుంటారు. ఆయన్ను రేపు అమ్మణ్ణి దర్శనానికి పిలుస్తాను. వచ్చాక మీరు కూడా మీ సమస్య అడగవచ్చు"

"చాలా సంతోషం యాజులు గారూ.. ఆయన ఇక్కడి సందర్శనానికి అయే ఖర్చు మొత్తం నేను భరిస్తాను. మా ఇంట్లో విడిది ఏర్పాటు చేస్తాను. మీ వాళ్ళను పెట్టి విడిగా వంటలు చేయించి పెట్టండి"

"అలాగే.. మీ ఉప్పు తిని బ్రతికిన శరీరం…. మీకేదైనా సహాయం చెయ్యగలిగితే అంతకంటే సంతోషం ఏముంటుంది" అన్నాడు శఠగోపం పెడుతూ.

          విశ్వనాథ స్వామీజీకి సకల ఏర్పాట్లూ జరిగాయి. ఆయన దేవళంలో అనుగ్రహ భాషణం చేసింతర్వాత , గుడిలో ఒక మారేడు చెట్టు నాటించి, స్వామీజీ గుర్తుగా శిలాఫలకం వేయించారు. మధ్యాహ్నం విడిదిలో విశ్రాంతి తీసుకున్నారు. సాయంత్రం నాలుగున్నర గంటలకు స్వామీజీ బయటికి వచ్చారు. స్వామీజీ మంచినీరు తాగి ఒక ఆసనంపై కూర్చున్నారు. యాజులు గారు ప్రక్క గదిలో ఉన్న రెడ్డిగారిని పిలిచి మాట్లాడమన్నారు. రెడ్డిగారు స్వామీజీ ఎదురుగా క్రింద కూర్చున్నారు. స్వామీజీ యాజులు వంక చూశారు. యాజులు “నాకు గుడిలో పని ఉంది. కాసేపాగి వస్తాను. మీరు ఏకాంతంగా మాట్లాడండి” అని వెళ్ళిపోయారు.

"చెప్పండి" నవ్వుతూ అన్న స్వామీజీ మాటలకు రెడ్డిగారు "నాకు మనశ్శాంతికి ఏదైనా మార్గం ప్రసాదించండి. మంత్రోపదేశం, పరిష్కారం లాంటిదేదైనా సరే.. మీ అనుజ్ఞ శిరసావహిస్తాను, అని పాద నమస్కారంచేశారు, ఉబికి వస్తున్న కన్నీళ్ళను అదుపుజేసుకుంటూ.

"మంత్రానికైనా, యంత్రానికైనా..అసలు మీ సమస్య ఏమిటో నాకు అర్ధంకావాలి కదా! మీ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలు చెప్పండి. యాజులుగారు మీరు ఒంటరి అని మాత్రమే చెప్పారు. మీరు ఒంటరి ఎలా అయ్యారు?"

"మా నాయనకు ఇద్దరు భార్యలు. నేను రెండో భార్య కొడుకును. మా అన్న మొదటి భార్యకు పుట్టాడు. నాకు మా అన్నకు ఆరేళ్ళు తేడా. మొదటి భార్య పురిటిలోనే కన్ను మూయగా మా అమ్మను చేసుకున్నాడు. మా అమ్మ కొడుకును సరిగా చూడలేదని లోకులు, బంధువులు అభాండం వేస్తారన్న భయంతో ఐదేళ్ళు గడిపింది. మా మావ బ్రహ్మరెడ్డిగారు నాన్నను, అమ్మను ఒప్పించి, పెంపకంలో ఏమీ తేడా ఉండదని భరోసా ఇవ్వడంతో నేను పుట్టానట. మా అన్న మొదటినుండి దూకుడు స్వభావం. పనివాళ్ళమీద చేయిచేసుకునే వాడు. చిన్నతనం అని అందరూ ఊరుకున్నా.. పెద్దయ్యేసరికి ఇంకా ఎక్కువయింది. తను హైస్కూలు చదువు ముగించి ఆస్తులపై అజమాయిషీ చేయసాగాడు. తప్పు చేసిన పనివాళ్ళను కొరడాతో కొట్టేవాడు. అందరూ అన్నను చూస్తే చాలు హడలిపోయేవారు. దేవళానికిచ్చే కైంకర్యాలను ఆపించాడు. కొంతమంది పనివాళ్ళు కుటుంబాలను తీసుకుని రాత్రికి రాత్రి వేరే ఊళ్ళకు వెళ్ళిపోయారు. మా నాన్న అమ్మ కీలుబొమ్మలుగా మిగిలారు. అనుకోకుండా చూడ్డానికి వచ్చిన బ్రహ్మారెడ్డి మామ, మా నాన్నతో ఏకాంతంగా మాట్లాడి, అమ్మను, నన్ను కొన్ని రోజులు మా అత్తావాళ్ళు ఉంటున్న  ఊటుకూరుకు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత మా నాన్నను ఊటుకూరుకు పిలిచి విషయాలన్నీ చర్చించాడు. మా నాన్న భోరున ఏడుస్తుండడం చూసి నేను వచ్చి అన్నీ సరిచేస్తాను. భయపడకండి అన్ని హామీ ఇచ్చాడు”. కళ్ళుతుడుచుకుని మళ్ళీ కొనసాగించాడు. "మా మామ వచ్చిన పదిరోజులకు మా అన్న హటాత్తుగా నిద్రలోనే మరణించాడు. మా పాలేర్లు కానీ బంధుజనం కానీ ఏమాత్రం దు:ఖించలేదు.  ఆయన పెద్ద కర్మ ఒక పెద్ద పండుగలా జరుపుకున్నారు. మా నాన్న మామ,  నాకు ఒక సంబంధం చూసి పెండ్లి జరిపించారు. మాకున్న వంద ఎకరాలకు మరో ఏభై ఎకరాలు కలిశాయి. నేను మా నాయన సలహా సంప్రదింపులు తీసుకుంటూ చేసినందువల్ల వ్యవసాయం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగింది అందువల్ల మరో ఏభై ఎకరాలు కలిపగలిగాను. కానీ మా నాన్న హటాత్తుగా ఒకరోజు పొలంలో గుండెనొప్పితో మరణించాడు. అమ్మకూడా దిగులుతో మరుసటి సంవత్సరం కన్నుమూసింది. మాకు పిల్లలు పుట్టలేదు. తిరగని క్షేత్రం కాని, తీర్ధం కాని లేదు. ఇటీవల ఈవయసులో నా భార్య కూడా నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది” అని భోరున ఏడ్చాడు.

"అర్ధమయింది నాయనా.. మీ అన్నది సహజ మరణం కాదు. ఆవిషయం నీకూ తెలుసు. ఆ ఆవేదన ఇంకా నీలో ఉండిపోయింది. పైగా నీకు పిల్లలు లేకపోవడం, నీ తదనంతరం ఆస్థి వ్యవహారాలు చూసుకునే వాళ్ళు లేకపోవడం వల్లనే నీకీ మనశ్శాంతి కరువవడానికి కారణం. నీవు ఎవరినైనా దత్తత చేసుకుని వాళ్ళకు బాధ్యతలు అప్పగించవచ్చు" అని రెడ్డిగారిని చూశాడు. ఆయన దానికి విముఖత వ్యక్తం చేస్తూ "ఈరోజుల్లో అంతా స్వార్ధమే స్వామీ..వాళ్ళు దేవుడి కైంకర్యాలను ఆపించేస్తారు. అదే జరిగితే… నాకు పై లోకాల్లో కూడా మనశ్శాంతి ఉండదు" అనే సరికి "ఇంకో మార్గముంది. మీ కిష్టమైతే చెప్తాను. ఆచరణ అంత సులభంకాదు. కష్టసాధ్యం." అన్నారు. ఆమార్గం విన్నాక రెడ్డిగారి ముఖం వికసించింది. స్వామీజీ పాదాలపై బడి సంతోషంగా ఒప్పుకున్నాడు. అతని మొహం ప్రశాంతంగా ఉంది. ఆనందం తాండవిస్తోంది. అంతలో గదిలోకి వచ్చిన యాజులుగారు రెడ్డిగారి సంతోషం చూసి ఆనందించి స్వామీజీకి మనస్పూర్తిగా నమస్కరించాడు.

-       రెండు రోజుల అనంతరం

యాజులుగారు నదికి స్నానానికి వెళ్ళబోతుండగా రెడ్డిగారు తెల్లవారు ఝామున వచ్చారు. ముఖం చాలా ప్రసన్నంగా ఉంది. రెడ్డిగారి మోహంలో సంతోషం చూసిన యాజులు నవ్వుతూ  "రండి నదికి వెళ్దాం!" అనగానే ఒక పెద్ద కవరు చేతిలో పెట్టి "నాకు కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. కాగితాలు చూడండి. అమలు చేసే బాధ్యత మీదే! శెలవు" అంటూ యాజులుగారికి పాదాలను తాకి, మరో ప్రశ్నకు అవకాశం ఇవ్వకుండా  అంత ప్రాత:కాలాన ఐదు గంటలకే ఒక్కడే గబ గబా నడుచుకుంటూ చీకటిలో కలిసిపోయాడు.

 

యాజులు గారు ఈ కవరేమిటి? నేను అమలుపరచడమేమిటి? అని ఆశ్చర్యపోతూ, నదికి కాసేపాగి వెళ్దాం అనుకుని కుర్చీలో కూర్చుని కవరు విప్పాడు. లోపల ఆస్థి తాలూకు కాగితాల దస్తావేజుల కట్టలు మూడు నాలుగు ఉన్నాయి.  పైన తనను సంభోదిస్తూ ఒక ఉత్తరం ఉంది. ఆశ్చర్యపడుతూ చదవసాగాడు.

 

"బ్రహ్మశ్రీ వేదమూర్తులలిన పరమేశ్వర సోమయాజులుగారి పాద పద్మాలకు నమస్కారములు. ఇది నా వీలునామాగా భావించండి. నాకున్న 200 ఎకరాలలో 150 ఎకరాలను మన ఊళ్ళో సెంటుభూమికూడా లేని పేదవారికి,  పేద రైతులకు జతపరచిన లిస్టు ప్రకారం రిజిస్టర్ చేయించండి. మీకు ఆమేరకు పవర్ ఆఫ్ అటార్నీ ఉంది. అలాగే 50 ఎకరాలను అమ్మణ్ణి పేరు మీద జరిగే కైంకర్యాలు యధావిధిగా జరిపేటందుకు దేవాలయం పేరు మీద రిజిస్టర్ చేయించండి. నేను ఉంటున్న రెండస్తుల భవంతిని ఇవన్నీ సక్రమంగా జరిపించేందుకు, మీపేరు మీద వ్రాసిన ఒక ఉత్తరాన్ని కూడా, ఇందువెంట జతపరిచాను. శెలవు. నాకు మనశ్శాంతి దొరికింది. దానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకొరకు వెదికించవద్దు. నేను రోజు ఎక్కడుంటానో నాకే తెలీదు” చదువుతున్న యాజులు గారికి కన్నీళ్ళు ధారగా కారి పోతున్నాయి. కొడుకు,  భార్య "నాన్నగారూ ఏమయింది? అంటూ వచ్చి ఉత్తరం చూసి నివ్వెరపోయారు.

 

         ఊరిలో ఉన్నజనం అందరూ కలిసి చందాలు వేసుకుని ధర్మారెడ్డిగారి కాంస్య విగ్రహం ఊరి మొదట్లో పెట్టించారు. దేవళానికి కొరతా లేకుండా అన్నీ యధావిధిగా జరిగిపోతున్నాయి. యాజులుగారు రెడ్డిగారి ఇంటిని స్వాధీనం చేసుకోకుండా ధర్మసత్రంగా మార్చారు. అక్కడ ప్రస్తుతం నిత్యాన్నదానం జరుగుతోంది. 


             ఊరివాళ్ళు రెడ్డిగారికోసం మనుషుల్ని పెట్టి జిల్లా మొత్తం వెదికించారు. కానీ జాడలేదు. రెడ్డిగారు తాను కోరిన మనశ్శాంతి దొరికే ఉంటుందని, ఎప్పటికైనా తిరిగొస్తాడని తనను కలుస్తాడని, రోజుకూ ఎదురుచూస్తూ ఉన్నారు యాజులుగారు. 

-0o0-


No comments:

Post a Comment

Pages