ఉద్యమ నేత నేతాజీ - అచ్చంగా తెలుగు

ఉద్యమ నేత నేతాజీ

Share This
 'ఉద్యమ నేత..'నేతాజీ!'
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.



గుండె నిండా ధైర్యంతో
తెల్లవాళ్ల మెడలు వొంచి
వారిలో ఓటమి గుబులు పుట్టించి..
ఒడలు జలదరించేలా పిడికిలెత్తి..
సమరశంఖారావాన్ని పూరించిన
'ఆల్ ఇండియా ఫార్వడ్ బ్లాక్ ' స్థాపకుడు..

"అహింసతో అన్నీ సాధ్యంకావు
అవసరమైతే పోరాటమే సరిఐన మార్గమని..
సాయుధ పోరాటంతో సాధించలేనిది 
ఏమీ ఉండదని"
ఉప్పెనల్లే ఉరికిన ఉద్యమకారుడు..

అవినీతి బ్రిటీష్ పాలకుల 
పరిపాలనకి అలసిపోయిన 
భారత ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకై..
సింగమై సంగ్రామం చేసిన 
'ఆజాద్ హింద్ ఫౌజ్ దళ్' అధినాయకుడు..

కారు చీకటిలో కాంతి రేఖ
చైతన్యయుత తిరుగుబాటుకు ప్రతీక
జాతి కోసం పరితపిస్తూ..
విహంగయానంలో చంద్రబోస్ అస్థిత్వం ప్రశ్నార్థకమైంది..

ఆ దేశభక్తుడి ఉనికి అనుమానాస్పదం..
అగమ్యగోచరం..
స్వాతంత్య పోరాటానికి వేగుచుక్క అయింది..
స్ఫూర్తి నింపింది..
కదం తొక్కింది..

దేశ పౌరుల గుండెల్లో 
అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ 
భరతజాతి మరువలేని మహానేత
అఖండ భారతావని భాగ్యవిధాత
రాజీపడని పోరాట వీరోచిత..
యువతకు స్ఫూర్తి ప్రదాత..
స్వతంత్య ఉద్యమ ప్రియతమ నేత.. 
'నేతాజీ' బిరుదాంకిత!
అందుకో మా వినమ్ర శత జోత!!
****


No comments:

Post a Comment

Pages