ప్రయాణంలో "పరమాత్మ"
దువ్వూరి కృష్ణ
కూ..కూ..చుక్ చుక్...
రైలు పట్టాలు వదిలి కదులుతోంది...
నా మనసు దాని కంటే వేగంగా ఎన్నో
ఆలోచనలతో పరుగెడుతోంది...
“అమ్మా ఈ క్రింది బెర్త్ నీదేనా?”
అడుగుతున్న పెద్దాయన కేసి చూస్తూ "అవునండీ.. మీది?" అడిగాను.
“ఒకటి కింద
మరొకటి పైన వచ్చింది ఏమనుకోక నువ్వు పైకి వెళ్లి పడుకోగలవా” అన్న
పెద్దాయనతో,
“అయ్యో! అలాగే
సర్.” అని లగేజ్ సీటుక్రింద పెట్టి, పైకి
ఎక్కి పడుకున్నా...ఇంతలో ఆ వృద్ధ దంపతుల సంభాషణ ఆసక్తి కలిగించింది..
"ఏమండీ! రామరాజ్యం అనేది కథలా, కలలా మిగిలిపోతుందేమో" అంటున్న
భార్యతో,
"కధ ముగిసిందని మరో కధ చదవకుండా ఉంటామా? కల చెదిరందని మళ్ళీ కల కనకుండా ఉంటామా? ఇది జీవితం సాగిపోతూ ఉండాలి" అంటున్న భర్తకేసి చూస్తూ..
“ఏమండి?”
"కలికాలం కాకపోతే ఏమిటండి నేటి
వైపరీత్యాల ధోరణి మరీ ఘోరంగా..?”
"దేని గురించి నువ్వంటున్నది?"
“నేడు జరుగుతున్న అన్యాయాలు, అరాచికాలు, అకృత్యాలు, వికృత చేష్టలు చూస్తూ మనమంతా ఇలా దుఃఖించవలసిందేనా?”
“మాయరోగం! అత్యాశతో ఆబగా తిని పొర్లుతున్న శునకాలకి,
ఈ అధికార కాంక్ష ఉన్న నాయకులకి పెద్దగా తేడా ఏమి లేదుగాని... ఎక్కువగా గాభరా పడబాక”
అంటున్న భర్తతో,
"భరించలేకుండా ఉన్నానండీ నేటి లోకం తీరు
చూస్తుంటే...మంచి అన్నది కనుమరుగైపోయిందండి."
“ఒక మాట చెబుతాను గుర్తుపెట్టుకో! ఈ పవిత్ర భారతదేశంలో సతికి మాంగల్యం మీద, చేపకి నీటిమీద, సాధువుకి దైవత్వం మీద విరక్తి రానంత
కాలం వారంత చైతన్యవంతులు
ఈ ప్రపంచంలో వేరెవ్వరు లేరు!”
“నిజమేనండి.. కానీ నేడు సనాతన ధర్మానికి
తూట్లు పొడిచే పాడు వ్యవస్థలు నా కంటికి కనపడుతున్నాయి!!”
“నిజమే!”
“విశ్వాసానికి మారుపేరైన దేశప్రజలు
విశ్వాసఘాతకులైన కొంతమంది రాజకీయ నాయకుల నిరంకుశ ధనమదాంధుతచే వారి అధికార దాహానికి
నీటినుండి వేరుచేయబడ్డ చేపల్లా రోడ్డున పడి గిలగిల కొట్టుకోవడం కళ్ళార
చూస్తున్నాను!!”
“కడు శోచనీయం...”
“సాధువులాంటి, కామధేనువుతో సమానమైన, మన హిందువుల పాలిట మహాలక్ష్మి, గోమాతను వధించి ఆరగించే మానవ మృగాల
దుశ్చర్యలని చూడలేక గుండెబద్దలయ్యేలా ఆలపిస్తూ అడ్డుకోలేక అలుపెరుగని గోరక్షణ సేవ
చేసే సాధుపుంగవులని చూస్తున్నాను!!”
“చూసావా! సృష్టిలో ఏది జరగకూడదో అదే
జరుగుతోంది... అందుకే ఈ అరాచికాలు!!”
“మరి దీనికి మార్గం లేదా అండీ?”
“ఎందుకు లేదు... బిడ్డకి తల్లి
పరిచయమక్కరలేదు, నీడ ఏతోడు కోరుకోదు.”
“అంటే? కొంచం అర్థమయ్యేలా చెప్పండి..”
“రాజు అనేవాడు ధర్మం కాపాడుతూ ఈ
దేశాన్నే కాదు, ప్రపంచానికే మార్గదర్శిగా వెలుగొందుతూ, హిందూత్వం ఒక మతం కాదు, జగతికి హితం
అనే సత్యాన్ని లోకానికి చాటిచెబుతూ దేశ సమగ్రతను సామరస్యాన్ని పెంపొందించాలి.”
"అశుద్ధం ఇష్టంగా నియమనిష్టల జీవితం
అయిష్టంగా భావించే నేటి నాయకులనబడే ఈ దుష్టులకు మీరు చెప్పేది అర్థమయ్యేలోపు
సృష్టి వినాశనం ఖాయం అనిపిస్తోంది అండీ! అయినా.. నాదో ధర్మ సందేహం..అడగనా?”
“ఏమిటో అడుగు...”
“జీవితమంటే?”
“ప్రేమ..!”
“ప్రేమ అంటే?”
“జీవితం..!”
“అంటే రెండూ ఒకటేనా?”
“జీవితం ప్రేమ వేరువేరు కాదు.”
“ప్రేమతో జీవిస్తూ జీవితాన్ని
ప్రేమించాలి. ప్రేమే జీవితం జీవితమే ప్రేమ అనే సత్యం అనుభవంలోకి రావాలి...”
“ఇంతకంటే వేరే ఏమిలేదా?”
“నువ్వే ఆలోచించు...మనిషి బ్రతికేది ఏదో
ఒకదాన్ని ప్రేమిస్తూనే కదా! అది ఆటైనా పాటైనా లేక వస్తువైనా
విషయమైనా...జీవించినంతకాలం తనకి నచ్చిన అంశంలో రాణిస్తూ లేదా దైవారాధనలో
సేవాభావంతో మానవత్వాన్ని ప్రేమిస్తూ పరిణితి చెందుతూ ఉండటమే కదా జీవితం.”
“జీవితం అంటే ప్రేమ అన్నారు. ప్రేమ అంటే
జీవితం అంటున్నారు. మరి ద్వేషం మాటేమిటి? రోజూ మనం చూస్తూనే ఉన్నాం ఎంతో
ద్వేషంతో ఏ కోశానా ప్రేమ లేని మృగాళ్ళు... అంతకు మించి...పవిత్ర ఆలయాలు, విగ్రహాల విధ్వంసం కలవరపెడుతోంది.”
“వారంతా జీవితం అంటే ద్వేషం, క్రోధం అనే
మూర్ఖత్వంతో ఉన్నవారు...వారికి శాంతి అంటే అయిష్టం...ప్రశాంతత అంటే తెలియని
స్థితిలో దురాశతో జీవనం గడిపే గబ్బిలాలు...”
“మరి వీళ్ళు మారరా?”
“కొన్నివేల సంవత్సరాల క్రితమే
సాక్షాత్తు దేవుడు ప్రజలతో మమేకమై ఉన్న రోజులలోనే అనేక మంది రాక్షసులు ప్రజలను
పీడించేవారు... ఆ కోవలోవే కృష్ణుడి కథలు.. తెలుసుగా చిన్న వయసునుండి కృష్ణుడు
దుర్బుద్ధికి ప్రతిరూపంగా ఉన్న కంసుడు, శిశుపాలుడి నుంచి దుర్యోధనుడి అంతం
దాకా ఎందరినో సంహరిస్తూనే ఉన్నాడు... మరి ఇప్పుడు దేవుడు మనతో లేని కాలం! అలాగే రాక్షసులు లేరు!! కానీ రాక్షస లక్షణాలని ప్రేమించే
మృగాళ్లుగా తయారయ్యారు పాలించే కొంతమంది నాయకులు.”
“మరి ఎలాగండి ఎదుర్కోవడం?”
“దేవుడు మనతో లేడు కానీ మనలో ఉన్నాడు...
ఆ సత్యం తెలుసుకుంటే మానవుడు మాధవుడే. అప్పుడు కచ్చితంగా ఒక కృష్ణుడు ఒక దుర్గా
మాత ప్రతీ ఒక్కరిలో అవతరిస్తారు..అలా అవతరించిన వారినే నాయకులంటారు...అందుకే మంచి
నాయకులను ఎన్నుకోవాలి...రాక్షస గుణాలున్నవారిని ఓటుతో పాతేయ్యాలి.”
“ఏమండీ చివరగా మరొక్క సందేహం. జీవితం అంటే దొర్లించాడమేనా? బ్రతుకు బండి నడిపించడమేనా?
ఆశలు తీరితే ఆనందం తీరకపోతే విషాదం? ఎవరికి వారు గీసుకున్న చిత్రాల విచిత్ర
లోకంలో విషాద విరహ గీతాలతో లేదా ఉరుకులు పరుగులతో తెలీని తీరాలకు ప్రయాణించడమా?”
“కాదు..కానే కాదు! జీవితమంటే అనేక కోరికల సమాహారం. ఒక జీవితం వివిధ రకాల ఆశలు... ఒక జీవితం వేల భావజాలం... ఒక జీవితం పోటీ పరుగు... ఒక జీవితం హు...ఏ క్షణమైనా ఆగిపోవును,
జీతగాడు జీతం కోసం, వ్యాపారి లాభాలకోసం. ఎవరికి వారు ఎంత మిగులుతుంది ఎలా
సంపాదించాలి... వేరే ధ్యాస ఏముంది? నిజం చెప్పాలంటే ఇది కదా తరతరాలునుండి
జరుగుతున్న కధ... ఇంకేమైనా సందేహాలుంటే అడుగు” అంటూ నవ్వుతున్న భర్తతో..
“జీవితం యొక్క నిర్వచనం మీ మాటల్లో
మరొక్కసారి వినాలనుంది” అని అడుగుతున్న భార్యతో,
"జీవితం అంటే మనిషి అని తెలుసుకోవడం, మంచితనంతో మసలుకోవడం. జీవితమంటే సంతోషంగా
జీవించడం ఆనందంతో సంచరించడం. జీవితమంటే దొర్లించడం కాదు దొరికిన మానవ జన్మను
సార్ధకం చేసుకోవడం."
“ఇది ఎలా సాధ్యం అండీ?”
“ఇది సాకారం చేసుకోవాలంటే అతి చిన్న
విషయాన్నిగుర్తు పెట్టుకుంటే చాలు. అదేమిటంటే ‘జీవితం ఏ క్షణంలోనైనా ముగిసిపోతుంది’
ఈ చిన్న సత్యం మరవకుండా ప్రతీ క్షణం ఒక జీవితం అనుకోవాలి.”
“అబ్బ ఎంత గొప్పగా చెప్పారు... క్షణ కాలం
విలువ తెలుసుకుంటే జీవితం బహుకాలం అంటారు” అని అంటున్న భార్యతో,
“నువ్వు నన్నే కాదు నా మాటలని కూడా బాగా
అర్థం చేసుకుంటావు హహ” అని నవ్వుతూ ఉండగా పొద్దు బోయింది.
“నారాయణా అనుకుంటూ నిద్రపోదాం మరి..” అన్న
భర్తమాటలకు భార్య సరే అంటూ పెద్దాయనికి దుప్పటి కప్పి ఆమె కూడా నిద్రలోకి
జారుకుంది..
అనేక ఆలోచనలతో పరిగెడుతున్న నా మనసుకు
వీరి సంభాషణ ఈ ప్రయాణంలో "పరమాత్మ"
సందేశంలా గోచరించింది.
“ఆఖరి మెట్టు దాటితేనే కదా
గుడిలో దివ్య మంగళ స్వరూపం
కంటికి దగ్గరవుతుంది
ఆఖరి బంతిలో
విజయం దాగుoటుంది
ఆఖరి అడుగులో
పరుగు విజయం తెస్తుంది
అందుకే
ఆఖరి శ్వాస ఆడేదాకా
ఆటని ఆస్వాదిస్తూనే ఉండాలి
శరీరం వడిలినా
"సంకల్పం" సడలకూడదు!
జీవితం
ఒక వరం
జీవన గతులెప్పుడూ
స్థిరమే!
దశ ఏదయినా
చివరాఖరికి
అందరి బస
ఒక్కటే!!
పోయే వారిని తిరిగి తీసుకురాలేము
సాగిపోయే వయస్సుని ఆపనూలేము
ఇది వేదాంతం అనుకుంటే పొరబాటు
ఇది వైరాగ్యం అనుకున్నా పొరబాటే
ఇది కట్టెదుట నాట్యం చేసే నిజం!
వయస్సు మీద పడే కొద్దీ
బుద్దిని బుజ్జగించాలి
మనస్సు ఎదురు తిరిగినప్పుడల్లా
గుండెకి మనోధైర్యం నేర్పడమే!
నడి వయసులో భర్తను కోల్పోయి బరువెక్కిన హృదయంతో సంక్రాంతికి పుణ్యక్షేత్ర
సందర్శనార్థం తిరుమలకు బయలుదేరిన నాకు "ఆత్మే పరమాత్మ" అన్న సత్యం
గర్భగుడిలో కాలు పెట్టకుండానే మర్మ గర్భంగా చెప్పాడా అనిపించి, నేను కూడా నారాయణా వాసుదేవా శ్రీకృష్ణా
గోవిందా అంటూ నిద్రకు ఉపక్రమించాను.
***
No comments:
Post a Comment