చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 15
అనువాద కర్త : గొర్తి వేంకట సోమనాధ శాస్త్రి(సోమసుధ)
ఆంగ్ల మూలం : The Moonstone Castle Mystery
నవలా రచయిత : Carolyn Keene
(నాన్సీ, జార్జ్ పాడుపడిన కోటలోకి ప్రవేశించారు. సాలెగూళ్ళు తోరణాలుగా వేలాడుతున్న గదులను శోధిస్తూ, ఇద్దరు అమ్మాయిలు వంటగదిలోకి చేరుకుంటారు. తిరిగి వెనక్కి వచ్చిన వారు కందకం అవతల వెళ్ళిపోతున్న కారుని చూస్తారు. ఆ కారుని గతంలో తాను చూసినదేనని జార్జ్ చెబుతుంది. కోట గోడ దగ్గర వారికి టైరు గుర్తులు కనిపించి, కారు కందకాన్ని దాటడానికి వంతెనను కిందకు ఎలా దించగలిగారన్నది శోధిస్తారు. కిందకు దిగిన వంతెన కున్న కొక్కాలను బలమైన తీగలతో నేలకు బిగించి కడతారు. తరువాత ...... )
@@@@@@@@@@
ఇద్దరు అమ్మాయిలు కలిసి తీగలో ఉన్న పోగులను కొక్కాలకు ముడివేసి, వంతెనను సురక్షితంగా నేలకు నొక్కిపట్టి ఉండేలా చేశారు.
అకస్మాత్తుగా జార్జ్ నవ్వటం ప్రారంభించింది. "ఈ వంతెనను నియత్రించే వ్యక్తి వచ్చి, దీన్ని పైకి లేపాలని ప్రయత్నించినప్పుడు, అతని చూపుల్లో తేడాను నువ్వు చూడగలవా? మనం చేసిన పనిని అతను గమనించేలోగా, మనం యిక్కడనుంచి బయటపడటం మంచిది."
"ఇప్పటికే అతను మనల్ని చూసి ఉండొచ్చు" అంది నాన్సీ.
అమ్మాయిలు తొందరగా కారుని చేరుకొన్నారు. వారు కారులో వెళ్ళిపోవాలనుకొంటుండగా, నాన్సీ మనస్సాక్షి ఆమెను యిబ్బంది పెట్టడం మొదలెట్టింది. "నీకు తెలుసు జార్జ్! మనమిద్దరం పరాయి వాళ్ళ ఆస్తికి హాని చేస్తున్నాం. ఈ విషయంలో మనం యిబ్బందుల్లో యిరుక్కోవచ్చు."
"పిచ్చిదానిలా ప్రవర్తించకు" ఎగతాళిగా అంది జార్జ్. "ఒక మిస్టరీని పరిష్కరించి దొంగలను పట్టిచ్చినందుకు, పోలీసులు కూడా వాళ్ళను పట్టుకోవటానికి మనం పన్నిన ఎత్తును మెచ్చుకొంటారు."
"నువ్వు మరీ ఎక్కువగా ఊహించటంలేదూ?" నాన్సీ అడిగింది. "కోట లోపల దొంగలు ఉన్నారో, లేదో మనకు తెలియదు. మనను దూరంగా పొమ్మని హెచ్చరించిన వ్యక్తి కూడా భ్రమ అయి ఉండవచ్చు."
"అదే! అతను కోటలోనే ఉన్నాడని దాని యజమానికి తెలియదని పందెం. ఆ నిజాన్ని బయటపెట్టినందుకు అతను మనకు ధన్యవాదాలు చెప్పాలి" జార్జ్ తనను సమర్ధించుకొంటూ చెప్పింది. "ఇక్కడ ఉండే సీమన్ నీకేదో యివ్వాలని ఎలా అనుకొంటున్నాడు? నీకు చంద్రమణిని పంపటంలో ఉద్దేశం ఏమిటి? బహుశా వీటన్నింటితో ఈ చంద్రమణి కోటకు కొంతయినా సంబంధం ఉండి ఉంటుంది."
"కావచ్చు" అని నాన్సీ తల ఊపింది.
తీగతో కిందకు కట్టేసిన వంతెనను ఎవరూ పైకి లేపరనే ఊహతో దాన్ని అలాగే వదిలేద్దామని ఆమె చెప్పింది. "ఈ కోటను రహస్య స్థావరంగా వాడుతున్నారన్న నీ అనుమానం నిజమైతే, మనం సాయం తీసుకొని తప్పనిసరిగా ఈ స్థలాన్ని శోధించాలి."
"పోలీసుల సాయమని అంటావా?" జార్జ్ అడిగింది.
"అదే నేను ఆలోచిస్తున్నాను" నాన్సీ బదులిచ్చింది, "పోలీసులను సంప్రదించటానికి బదులు, మన మిత్రులు నెడ్, బర్ట్, డేవ్ ల సాయానికి ప్రయత్నించవచ్చు."
నెడ్ యొక్క కాలేజీ మిత్రులైన బర్ట్ ఎడిల్టన్, డేవ్ ఎవాన్స్, ప్రస్తుతం రివర్ హైట్స్ సమీపంలో ఉన్న సుక్వాన్ సరస్సు వద్ద కాంప్ కౌన్సెలర్లుగా ఉన్నారు. డేవ్, బెస్ కలిసి తిరుగుతుంటారు, బర్ట్ జార్జ్ ని పార్టీలకు తీసుకెళ్ళి ఆనందిస్తుంటాడు.
"గొప్పగా ఉంది" అంది జార్జ్. "ఒకవేళ వంతెన పైకి లేచి ఉంటే, మనం కారులో కోటకు వెళ్ళలేకపోవచ్చు. అప్పుడు మనం ఒక పడవను అద్దెకు తీసుకొందాం."
అమ్మాయిల సాహస గాథను, నాన్సీ సూచనను తెలుసుకొన్న బెస్ చిరునవ్వు నవ్వింది. "నువ్వు ఖచ్చితంగా ఒక అవకాశం తీసుకొన్నావు నాన్సీ! అంతకు మించి ఎక్కువ దూరం వెళ్ళనందుకు నేను సంతోషిస్తున్నాను. అబ్బాయిలను మనతో కలిసి గూఢచర్యం చేసే ప్రతిపాదనను నేను అంగీకరిస్తాను.. . . పోలీసులను తీసుకోవటం కన్నా, యిది చాలా సరదాగా ఉంటుంది!" అని చెప్పింది.
నాన్సీ ఫోను చేయగానే, నెడ్ ఆమె గొంతు విని పొంగిపోయాడు. "కొన్ని యుగాలుగా నీ నుంచి ఉత్తరం లేదు" అని ఫిర్యాదు చేశాడతను. "కానీ దాని కన్నా యిది మరింత మంచిది."
తన ఆలోచనను నాన్సీ అతనికి వేగంగా చెప్పి, బెస్ మరియు జార్జ్ దాని గురించి ఆసక్తిగా ఉన్నారని అంది. "నువ్వు వస్తావా?"
"సరె! నా విషయం చెప్పాలంటే, నన్ను దూరంగా ఉంచటానికి ప్రయత్నించు!" నెడ్ బదులిచ్చాడు. "ఫోను పట్టుకొని ఉండు. బర్ట్, డేవ్ లను కూడా అడుగుతాను. మా అందరికీ వారాంతపు సెలవు ఉంది."
కొద్ది నిమిషాల తరువాత అతను వెనక్కి వచ్చి, అబ్బాయిలంతా వారి ఆహ్వానాన్ని ఆనందంగా అంగీకరించారని, తాము ముగ్గురు లాంగ్ వ్యూ దగ్గరకు మరుసటి మధ్యాహ్నం కొద్దిగా పొద్దుపోయాక చేరుకొంటామని చెప్పాడు. ఏర్పాట్ల గురించి మాట్లాడుకొంటున్నప్పుడు, బెస్ సొట్ట బుగ్గలను చూపిస్తూ, "అలాన్ రేపు వెళ్ళిపోవటం చాలా మంచి విషయం. నేను ఉపద్రవాలను ద్వేషిస్తాను!"
మిగిలిన అమ్మాయిలు అలాన్ ని కలవాలని ఆమె పట్టుబట్టింది. కాబట్టి కొద్దిసేపటి క్రితం అతన్ని బెస్ విడిచిపెట్టిన ఈత కొలను దగ్గరకు వాళ్ళు వెళ్ళారు. ఆమె, కమిలిపోయినట్లు ఎరుపురంగులో అందంగా ఉన్న టాన్ అనే యువకుణ్ణి, వారికి పరిచయం చేసింది.
కొన్ని క్షణాల సంభాషణ తరువాత, “ఈ సాయంత్రం మీ అమ్మాయిలందరినీ విహారయాత్రకు ఆహ్వానించాలని అనుకుంటున్నాను. ఈరోజు మా అమ్మమ్మ పుట్టినరోజు. ఆమె యిక్కడ డీప్ రివర్ లో నివసిస్తుంది. అందుకే మా కుటుంబం యిక్కడకు వచ్చింది. మేము చాలామంది ఉండటం వల్ల, ఆమె యింట్లో ఉండటానికి వీలు కాదు. అమ్మమ్మ పుట్టినరోజున మాత్రం మొత్తం కుటుంబం అంతా కలిసి దీన్ని జరుపుకొంటాం" అన్నాడతను.
తన అమ్మమ్మ యింటి ముందరే ఈ పిక్నిక్ జరుగుతుందని వివరించి, అమ్మాయిలకు యింటి చిరునామా యిచ్చాడతను.
"ఎంతోకాలం నుంచి మేము ఎదురుచూస్తున్న రాత్రి" అన్నాడతను. "మీరు ముగ్గురు వచ్చి ఆమెకు మేము సన్మానం చేయటంలో సాయపడతారా?"
మొట్టమొదట ఆ అమ్మాయిలు తమ సందేహాన్ని వెలిబుచ్చారు. మిసెస్ రైడర్ కి తాము పూర్తిగా అపరిచితులమని చెప్పారు, కానీ అలాన్ పట్టుబట్టాడు. “ఎక్కువ మంది వస్తే, ఆమెకు బాగా నచ్చుతుంది. సగం పట్టణం అక్కడే ఉంటుంది.”
చివరకు అమ్మాయిలు అంగీకరించారు. నాన్సీ తన సొంత కారును తీసుకువస్తానని చెప్పింది. దాని వల్ల అలాన్ను వేడుకలనుంచి దూరం చేయకుండా, తాము స్వేచ్ఛగా ఉండగలమని నాన్సీ చెప్పింది.
"కానీ నేను బెస్ కోసం రావాలనుకొంటున్నాను" అన్నాడతను. ఆమె కూడా వెంటనే తన అంగీకారం తెల్పింది.
అమ్మాయిలందరూ ఈతకు వెళ్లారు, తరువాత పిక్నిక్ కోసం దుస్తులు ధరించారు. వారు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, నాన్సీ, “బెస్, మాకు మార్గం తెలియదు గనుక మేము నిన్ను మరియు అలాన్‌ను అనుసరిస్తాము” అంది.
అలాన్ రాగానే, వారంతా కార్లు ఆగి ఉండే స్థలానికి వెళ్ళారు. నాన్సీ తన కారుని గన్నేరు పొదలకు దగ్గరలో వదిలింది. కానీ ప్రస్తుతం అది అక్కడ లేకపోవటంతో నాన్సీ ఆశ్చర్యపోయింది. పార్కింగ్ స్థలంలో ఉన్న కార్లన్నంటి వైపు ఒకసారి చూసింది. వాటిలో తన కారు లేదు.
"నా కారు పోయింది!" అంటూ ఆమె అరిచింది.
"ఏమిటి! ఎందుకు! నాన్సీ! నువ్వు కారును వదిలిపెట్టి రెండు గంటలు కూడా కాలేదు!" జార్జ్ విస్తుపోయింది.
"ఎవరో దొంగిలించారు!" బెస్ భయంతో వణికిపోయింది.
నాన్సీ కంగారుగా మోటెల్ లోపలకు పరుగెత్తి పోలీసు కేంద్ర కార్యాలయానికి ఫోను చేసింది. విధుల్లో ఉన్న సార్జెంటుకి తన కారు నంబరుని, దాని వివరణను యిచ్చింది. వెంటనే రేడియో అలారాన్ని పంపిస్తానని అతను చెప్పాడు.
"ఇదేగాక మీరు నాకు మరో సాయం చేసి పెడతారా?" నాన్సీ అడిగింది. "నేనిప్పుడు చెప్పే నంబరున్న కారు యజమాని ఎవరో తెలుసుకోవాలనుకొంటున్నాను." గతంలో సీమన్ని తరలించుకుపోయిన, జార్జ్ చూసిన కారు నంబర్ని యిచ్చిందామె.
నాన్సీ పట్ల చాలా బాధపడుతున్నానని, ఆమెకు సాయం చేయాలనుకొంటున్నానని అలాన్ చెప్పాడు. "మేము పిక్నిక్కి చాలా ముందుగానే వచ్చాం. మీ కారుని కనిపెట్టడానికి నేను మిమ్మల్ని పట్టణమంతా తిప్పి చూపించానే అనుకొందాం. బహుశా మీ కారు దొంగిలించబడలేదు. . . .అవసరానికి ఎవరేనా పట్టుకెళ్ళారేమో!"
"నేనలా అనుకోను" నాన్సీ చెప్పింది. "కారు తాళాలను నేను ఇగ్నిషన్లో వదల్లేదు. కారు దొంగ మాత్రమే దాన్ని తీయగలడు."
(సశేషం)
No comments:
Post a Comment