బాలగోపాల శతకము - పుసులూరి సోమరాజకవి - అచ్చంగా తెలుగు

బాలగోపాల శతకము - పుసులూరి సోమరాజకవి

Share This

బాలగోపాల శతకము - పుసులూరి సోమరాజకవి

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 



కవి పరిచయం:

పుసులూరి సోమరాజకవి ఆర్వేల నియోగి బ్రాహ్మణుడు. ఆపస్తంబసూత్రుడు. ఆత్రేయగోత్రజుడు. తణుకుతాలూకాలోని ఇల్లింద్రపఱ్ఱు గ్రామవాస్థవ్యుడు. ఈకవి వల్లనే ఈగ్రామమునకు "సోమరాజు ఇలింద్రపఱ్ఱు అను పేరు వచ్చింది. ఇతను క్రీ.శ. 1500-1700 మధ్యప్రాంతమువాడని శతక చరిత్రకారుల అభిప్రాయము. ఈతని తండ్రి ఉమాపతి. తల్లి పాపమాంబ. బాలగోపాలుని భక్తిడగిటచేత ఇతనికి "బాలకృష్ణదాసు" అనే మారుపేరుకూడా వాడుకలో కలదు. బహాభక్తుడైన ఈ కవి నిరతాన్నదాన వ్రతుడు. ఈతని పేరు  అన్నదాన వ్రతము వలన దేశమంతట వ్యాపించినదని ఈక్రింది పద్యం వలననే తెలుస్తుంది.

కం. ముసురున వచ్చిన యతిథులఁ
గసరక పొడిబట్టలిచ్చి కారుణ్యమునన్
విసువక యన్నము పెట్టిన
పుసులురి సోమన్న ధీర పుణ్యశరీరా!!

ఈకవి 1. ఇందు శతకము (చంద్రదూత) 2. బాలగోపాల శతకము, 3. బాలకృష్ణ శతకము, 4. అప్పలేశ శతకము, 5. నందనందన శతకము, 6. కృష్ణలీలామృతము అనే గ్రంధాలను రచించినట్లు తెలుస్తున్నది. అయితే వీటిలో ఇందు శతకము, బాలగోపాల శతకము, నందనందన శతకము మాత్రమే లభ్యమవుతున్నవి.

కవి శతకాంతమున తనను గురించి ఇట్లు చెప్పికొనినాడు.

సీ. పుసులూరివంశజభూషణం బగునుమా, పతికిని బాపమాంబకు సుతుండ
శ్రీమదాత్రేయసుస్థిరగోత్రజుఁడ సోమ, నామాత్యుఁ డసమాహ్వయమువాఁడ
నమృతోప(మం బౌనుపాభిధానము) బాల, కృష్ణదాసాక్య(చేఁ గెరలువాఁడ
సమ్యగష్టోత్తరశతపద్య (యుతముగ), సద్భక్తిమకరంద 9శంస్తుతమిది)

గీ యనఁగఁ గృతిఁ గూర్చి యిచ్చితి నవధరింపు
(మధికకరుణాకటాక్షవిన్యాసమొప్ప) 
బాలగోపాల! కరుణాలవాల! నీల ,
శైలపాలావనీపాల! చారిశీల!

శతక పరిచయం:

"బాలగోపాల కరుణాలవాల నీల, శైలపాలావనీపాల చారులీల" అనే మకుటంతో అలరారే ఈశతకంలో 108 సీసపద్యాలున్నాయి. భక్తిరస ప్రధానమైన శతకం. నీలశైలపాలుడగు గోపబాలుని ఉద్దేశించి వ్రాయబడినది. శ్రీజగన్నాథ క్షేత్రమునకు నీలశైనమని మరొకపేరు కనుక ఈకవి తను జగన్నాథ క్షేత్రమును దర్శించినప్పుడు ఆశువుగా శ్రీజగన్నాథస్వామిపై ఈశతకము చెప్పెను.  ఈశతకమునకే "చారులీలశతకం" అని "ఉపకర్ణామృతం" అని మారుపేర్లు కూడా కలవు. ఇందలి పద్యములు కృష్ణకర్ణామృతానుకరణములు.

కొన్ని పద్యాలను చూద్దాము.

సీ. గోపికాజనములఁ గూడి రాసక్రీడ, సల్పిననాటి వాత్సల్యమహిమ
గోవులఁ గాయుచు గోపాలకులకైన, యాపద లెడఁబాపినట్టి కరుణ
జననికిఁ బ్రియముగా సయ్యన పెనురోట, బద్ధుఁడ వైనట్టి (భక్త)వశత
మునిపత్నులకు మోదముగ వారిచే నన్న, మారగించిన (నాటి)యాదరమ్మూ

గీ.విడచితివి నాఁడు వ్రేపల్లె విడుచునపుడు
కాక తక్కిన నీకు పరాకు గలదె?
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైలపాలావనీపాల! చారులీల!

సీ. కరిరాజు మొఱవిని కావఁజాలినఁ గదా, శరణాగతత్రాణబిరుదుఁ గనుట
పతితపావనదీక్షఁ బాలింపఁగాఁ గదా, పతితపావనయశోభర్త వగుట
ద్రౌపదిమానమ్ము రక్షింపఁగాఁ గదా, యాపన్నరక్షణఖ్యాతిఁ గనుట
దాసులను విరజ దాఁటింపఁగాఁ గదా, ధరణిపై మోక్షప్రదాత వగుట

గీ. పౌరుషమ్మునఁ గలిగినభద్రయశము
వెలితి వడ నీకు నావంటితులువకతన
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైలపాలావనీపాల! చారులీల!

సీ. భవదమోఘకటాక్షపానమ్ముచేఁ గాక, భవదంఘ్రికమలసద్భక్తుడగునె
భవదంఘ్రికమలసద్భక్తుఁ డైనం గాక, తత్త్వబోధమ్ము దారిఁ గనునె
తత్త్వప్రబోధమ్ము దారిఁ గాంచినఁగాక, తడయక నీప్రసాదమ్ముఁ గనునె
తడయక నీప్రసాదమ్ముఁ గనునఁగాక, మొనసి జీవుఁడు స్వయంముక్తుఁడగునె

గీ. కాన నిన్నిటికిని మూలకారణమ్ము
నీకటాక్షవిలోకననియతి కాదె
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైలపాలావనీపాల! చారులీల!

సీ. భక్తనేత్రానందభావంబునకుఁ గాక, పరికింప నీకు రూపములు గలవె?
దాసజిహ్వామృతదానంబునకుఁ గాక, మధురాక్షరోక్త నామములు గలవే?
సజ్జనశ్రుతిసుభా(షణములకును) గాక, గుణసముదాయసంకులత గలదె?
దుష్టనిగ్రహశిష్టపుష్టికోసము గాక, మహి నవతారకర్మములు గలవె?

గీ. అఖిలసాక్షివి పరమాత్మవైన నీకు
నామగుణరూపకర్మజన్మంబులు గలవె?
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైలపాలావనీపాల! చారులీల!

సీ. నీలజీమూతసన్నిభశరీరమువాని, శిఖిపింఛభూషితశిరమువాని
మృగమదతిలస(మ్మిళితఫాలము)వాని, రాజీవపత్రనేత్రములవాని
హాసమైత్రీకృతనాసాగ్రమణివాని, సరసారుణాధరోష్ఠంబువాని
కర్ణకుందలదీప్తగండభాగమువానిఁ, గౌస్తుభాభరణవక్షంబువాని

గీ మోగనాకారసంపద మురియువాని
నిన్ను భావింతు నామనోనిలయమందు
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైలపాలావనీపాల! చారులీల!

సీ.గోపికాకుచకుంభకుంకుమారుణహార, కలితవిశాలవక్షంబు వాని
రాసకేళికళావిలాసకుతూహలా, రంభసంరంభవిభ్రమమువాని
గోపికాగీతానుకూలనృత్యక్రమ, ప్రకటహస్తావ(లేపము)లవాని
కటకనూపురఝణత్కారానుగతకర, తాలప్రబంధకృత్యములవాని

గీ. గొమరుగోపాలకాకృతిఁ గొన్నవాని
నిన్ను భజియింతు నామనోనిలయమందు
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైలపాలావనీపాల! చారులీల!

సీ. బాలగోపాలకప్రభులీల గైకొన్న, నారాయణుఁడు జగన్నాథుఁ డయ్యె
పరమహంసప్రార్థ్యపదమైన వైకుంఠ, ధామమ్ము నీలాద్రిధామమయ్యె
సకలలోకానందసంధాత్రియగురమా, పద్మాయతాక్షి సుభద్రయయ్యె
భక్తిమిష్ఠావినాభావసంబంధాన, రాజ్యాధిపతి బలరాముఁడయ్యె

గీ. ననుచు విన్నాడనయ్య! నీయంఘ్రులందు
నాఁడునాఁటికి మరులు గొన్నాఁడనయ్య
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైలపాలావనీపాల! చారులీల!


సీ.వనచరఝషకూర్మవనకిటితనువులు, సాటిననీకథల్ చదివి చదివి
నరసింహవామనపరశురామాకృతిఁ, బరఁగిననీగాథ బల్కి బల్కి
రఘురామబలరామరమ్యబుద్ధాంగముల్, బూనిననీకీర్తిఁ బొగడి పొగడి
కలికివై కలికాలకలుషంబు దొలఁగించఁ, దలఁచిననీమూర్తిఁ దలఁచి తలఁచి

గీ. కొమరుగోపలకాకృతిఁ గొన్న నిన్నుఁ
బ్రస్తితించెద జన్మసాఫల్యముగను
బాలగోపాల! కరుణాలవాల! నీల
శైలపాలావనీపాల! చారులీల!

ఇటువంటి మనోహర భక్తిపూరితమైన పద్యాల సమ్మేళనమే ఈశతకరాజము. అందరూ చదివి ఆనందిచి ఆస్వాదించవలసిన ఈశతకం మీరూ చదవండి. మీ మిత్రులచే చదివించండి. 

No comments:

Post a Comment

Pages