జ్యోతిష్య పాఠాలు - 19 - అచ్చంగా తెలుగు
జ్యోతిష్య పాఠాలు - 19
PSV రవి కుమార్
 



పాఠం -  19

దోషాలు:
కిందటి పాఠం లో యోగాల గురించి చెప్పుకున్నాం. ఈ పాఠం లో దోషాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా చెప్పుకునే దోషాలు కాలసర్పదోషం, కుజ దోషం.

కాలసర్ప దోషం:
ఈ దోషం రాహు, కేతు, కుజ గ్రహాల వలన కలుగును. ఈ దొషం ఉన్నవారికి, వివాహం ఆలస్యం అగుట, ఉద్యోగం లో అభివ్రుద్ది ఉండకపోవటం. ఉద్యోగం సరైన వయసు లో రాకపోవటం. సంతానం కలుగక పోవటం వంటి సమస్యలు ఉండును.ఈ దోషం ఉన్నవారికి కొంత వయసు దాటాక, ఈ దోషం యొక్క ప్రభావం తగ్గి, జీవితం బాగుండును.  ఈ దోషం కింద చెప్పబడిన కలయికల వలన కానీ, గ్రహ స్థానాల వలన గానీ ఏర్పడును. 
అ) అన్ని గ్రహాలు, రాహు, కేతు గ్రహాల మధ్య ఉండుట. ఇది రెండు విధాలగా కలుగును. సవ్య, అపసవ్య. సవ్య పధ్ధతి లో అనగా, రాహు కేతు మధ్యలో సవ్య దిషలో అన్ని గ్రహాలు ఉండుట. అపసవ్య పధ్ధతి అనగా రాహు కేతు మధ్యలో అపసవ్య పధ్ధతి లో అన్ని గ్రహాలు ఉండుట. 

ఆ) రాహు గ్రహం, కుజ గ్రహం కలిసి ఒకే రాశి లో ఉండుట. 
ఇ) పంచమాధిపతి రాహువు కలిసి ఒకే రాశి లో ఉండుట. 
ఈ) రాహువు గురు గ్రహం కలిసి ఉండుట కూడా ఒక రకమయిన కాల సర్ప దోషం అని చెప్పబడును. ఈ కలయిక ను గురు చండాల యోగం అని కూడా అంటారు. ఈ యోగం వలన చాలా వరకు దుష్ఫలితాలు కలుగును. ఒక వేల గురు గ్రహం బలం బాగుంటే, కాస్త దుష్ప్రభావాలు తగ్గి, మంచి ఫలితాలు కలుగు అవకాశం కలుగును. ఈ యోగం ఉన్నవారికి, ఉద్యోగం లో స్తిరత్వం లేకపోవుట, లేదా ఉంటున్న ఉద్యోగం నిలబెట్టుకోలేక ఇబ్బందులు కలుగును. ఆకస్మిక ధన నష్టం కలుగును. అనారోగ్య సమస్యలు, దైవభక్తి లేకపోవుట, కుటుంబ సమస్యలు, ఆర్దిక సమస్యలు వంటి సమస్యలు కలుగును. ఏ స్థానం లో ఈ దోషం ఏర్పడిందో ఆ స్థానం పాడవును. 
ఉ) చంద్రుడు నుండి 8వ స్థానం లో రాహువు లేక కేతు వున్నా కూడా కాలసర్ప దోషం అని కొన్ని చోట్ల చెప్ప బడింది. ఈ విషయం లో వారి జాతకం మొత్తం పరిశీలించి జరిగిన సంఘటనల అనుసరించి ఈ దొషం నిర్ణయించవలెను.
రాహు కేతు మధ్యలో గ్రహాలు అన్ని ఉన్న, కాలసర్ప దోషాలని, అవి ఏర్పడిన స్థానములని బట్టి వివిధ రకముల పేర్లతో పిలువును. 
లగ్నం లో రాహువు ఉండి, కాలసర్ప దోషం ఏర్పడిన అనంత కాలసర్పదోషం అంటారు.
ద్వితీయం లో ఈ దోషం కలిగిన, గుళిక కాలసర్పదోషం అంటారు.
త్రుతీయం లో ఈ దోషం ఏర్పడిన, వాసుకి కాలసర్పదోషం 
చతుర్దం లో దోషం ఏర్పడిన, శంఖపాల కాలసర్పదోషం అంటారు
పంచమం లో ఏర్పడిన, పద్మ కాలసర్పదోషం అంటారు
షష్టం లో ఏర్పడిన, మహా పద్మ కాలసర్పదోషం అంటారు
సప్తమం లో ఏర్పడిన, తక్షక కాలసర్పదోషం
అష్టమం లో ఏర్పడిన, కర్కోటక కాలసర్పదోషం
నవమం లో ఏర్పడిన, శంఖచూడా కాలసర్పదోషం
దశమం లో ఏర్పడిన, ఘటిక కాలసర్పదోషం
ఏకాదశం లో ఏర్పడిన, విషక్త కాలసర్పదోషం
ద్వాదశం లో ఏర్పడిన, శేషనాగ కాలసర్పదోషం
జ్యోతిష్య నిర్ణయం చేసేటప్పుడు, ఈ స్థానలను బట్టి, ఫలితాలు చెప్పవలెను. లగ్నం లో ఈ దోషం ఏర్పడిన, వైవాహిక సంస్యలు, జీవితం లో ఎదుగుదల సమస్యలు కలుగును. 
ద్వితీయం లో కలిగిన, ఆర్దిక సమస్యలు, త్రుతీయం లో ఏర్పడిన, అన్నదమ్ముల మధ్యలో సమస్యలు, సమాజం లో వీరు చేసే పనులు కూడా బాగుండవు. చతుర్దం లో ఏర్పడిన, తల్లికి అనరోగ్య సమస్యలు, వాహనముల వలన ఇబ్బందులు కలుగును. 
పంచమం లో ఏర్పడిన, సంతాన సమస్యలు. షష్టం లో ఏర్పడిన, రుణ బాధలు, శత్రుబాధలు. సప్తమం లో ఏర్పడిన, దంపతుల మధ్య అవగాహనా లోపం వలన సమస్యలు, వ్యాపార సంబందిత సమస్యలు. అష్టమం లో ఏర్పడిన, అత్తగారింటినుండి సమస్యలు, ప్రమాదాలు కలుగవచ్చు. నవమం లో ఏర్పడిన, తండ్రి కి ఇబ్బందులు, ఉన్నత విద్య కోసం అధిక శ్రమ. దశమం లో ఏర్పడిన, ఉద్యోగం లో ఎదుగుదల లేకపోవుట, ఏకాదశం లో ఏర్పడిన, సంతాన సమస్యలు, ఆర్దిక సమస్యలు. ద్వాదశం లో ఏర్పడిన, అధిక ఖర్చులు, ఆకస్మిక ధన నష్టం కలుగును.
ఈ దోషం కలిగినప్పుడు, రాహువు కనుక, కుంభ, వ్రుషభ, మిథున, కన్య రాశి లో ఉన్నట్టయితే, ఈ దోష ప్రభావం తగ్గి, శుభ ఫలితాలు కూడా కలుగును.

కుజ దోషం:
లగ్నం నుండి గానీ, చంద్రుడు నుండి గానీ, శుక్రుడి నుండి గానీ, కుజుడు 2,4,7,8,12 స్థానలలో ఉన్న కుజదోషం ఏర్పడును. ఈ దోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం అవును లేదా వైవాహిక సౌఖ్యం తక్కువగా ఉండును. దంపతుల మధ్య ఎడబాటు ఏర్పడు అవకాశం కలదు. 
ఈ దోషం ఏర్పడిందో లేదో తెలుసుకోవలంటే, పైన చెప్పిన స్థానాలని కాకుండా, కింద చెప్పిన వివరాలు చూసి నిర్ణయించాలి.
అ) కుజుడు స్వక్షేత్రం లో ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడదు.
ఆ) కుజ, గురు గ్రహాలు కలిసి ఉన్న, గురుని ద్రుష్టి ఉన్నా ఈ దోషం ఏర్పడదు.
ఇ) కుజుడు మిత్ర క్షేత్రం లో ఉన్నప్పుడు ఈ దోషం ఏర్పడదు.
ఈ) కుజుడు ఉచ్చ క్షేత్రం లో ఉన్న, ఈ దోషం ఏర్పడదు.
ఉ) దశమ స్థానం లో శుభ గ్రహాలు ఉన్న, కుజ దోషం ఏర్పడదు.
ఈ దోషం ఉన్నవారికి 23-25 వయసులో వివాహం చేసిన జరుగును, లేదంటే, 30 సంవత్సరముల తర్వాత జరగవచ్చు.  
కుజ దోషం ఉన్న వారు, సుబ్రమణ్యేశ్వర స్వామికి నిత్యం పూజించడం ద్వారా, దోష ప్రభావం తగ్గును.
కాలసర్ప దోషం ఉన్నవారు కూడా సుబ్రమణ్యేశ్వర  స్వామిని నిత్యం పూజించడం మంచిది. దోష ప్రభావం ఎక్కువగా ఉన్న, ఏదైనా సుబ్రమణ్యేశ్వర స్వామి గుడిలో దోష నివారణ పూజలు చేయించుకోవచ్చు. 
వచ్చే పాఠం లో జ్యోతిష్య పరిశీలన తెలుసుకుందాం.

***

No comments:

Post a Comment

Pages