మానస వీణ 32
చోడవరపు వెంకట లక్ష్మి
ప్రభుత్వ ఉద్యోగి.
నెమ్మదిగా కోలుకుంటున్న అలివేణి ని చూస్తూ, తమకు ఇంత చేసిన మానసకు మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాడు
కొండలరావు. ఆ రోజెందుకో అతని కళ్ళముందు అతని
జీవితమంతా సినిమా రీల్ లాగా తిరుగుతోంది. తల్లి తండ్రులు ఎన్నో కష్ట నష్టాల
కోర్చి, మరెన్నో
త్యాగాలు చేసి, సుఖాలకు లాక్ వేసుకొని పిల్లలకు మంచి
భవిష్యత్ యివ్వటం కోసమే కదా బ్రతుకుతారు.
వాళ్ళ రక్తమాంసాలను మనకు పంచి, జన్మ యిచ్చి మన నవ్వులు వాళ్ళ జీవితం అనుకొని,
మన విజయం వాళ్ళ విజయంగా నట్టిoట అంబరాన్ని
తాకేలా సంబరాలు చేసిన తల్లిదండ్రులు వయసు మళ్లి, అనారోగ్యం
బారిన పడి అవసాన దశలో నిస్సహాయ స్థితిలో
పిల్లల అండ కోరుకుంటారు.
కొండలరావు ఒక ప్రభుత్వ ఉద్యోగి.
అలివేణి భార్య. యిద్దరూ ఎన్నో ఆశల సౌధాలను నిర్మించు కున్నారు. వారికి 4గురు సంతానం.
ఆకాలంలో కుటుంబ నియంత్రణ సాధనాలు అందు బాటులో లేవు. సంవత్సరానికో సారి అలివేణి
పుట్టింటికి పురిటికి వచ్చేది. కడుపులో ఓ పిల్ల, చంకలో ఓ
పిల్ల, చేతిలో ఓ పిల్ల అని తల్లి తిట్టుకోవటం విన్న
ప్రతిసారి, మరి రాకూడదు అనుకునేది మనసులో. కొండలరావుకు ఆదిలాబాద్ జిల్లా రిబ్బన్
గ్రామం ట్రాన్సఫర్ అయింది. అదో మారుమూల గ్రామం. కరెంట్ సదుపాయం లేదు. భార్య
పిల్లలతో కాపురం పెట్టాడు. పొద్దున్నే కొండలలో సర్వేకి వెళ్ళే వాడు. వారానికి
ఒకసారి వచ్చేవాడు యింటికి. డ్యూటీలో వున్నా యింటి మీదే ధ్యాస ఉండేది. అలివేణి పిల్లలతో ఎలా వుందో అని. పేరుకు తగ్గట్టు
అలివేణి ఆణిముత్యం. గుట్టుగా సంసారం
గడిపేది. భర్త తెచ్చిన జీతం జాగ్రత్తగా ఖర్చు పెట్టి పిల్లల ఆలనా పాలనా చూసేది.
పైస పరక దాచి భర్త అనుమతితో తండ్రికి
పంపేది. మూడో కాన్పునుండీ వస్తు పెద్ద కూతురు 5ఏళ్ళ
దాన్ని పుట్టింట్లో వదలి వచ్చింది.
మెల్లిగా 2 ఏళ్ళు గడిచేసరికి మళ్ళీ కడుపు. 4వ కాన్పుకు వస్తాను అని
పుట్టింటి వారిని అడగలేక వారికి చెప్పకుండా మొగుడు దగ్గరే వుండి పోయింది. అదో
పచ్చి కొండ ప్రాంతం... పొద్దు గూకితె తలుపులు మూసుకొని వుంటారు అందరు. గట్టిగా 15యిళ్ళు ఉంటాయి అక్కడ. తినటానికి
సరిఅయిన తిండి కూడా దొరికేది కాదు. బోలెడు చాకిరీ. నీళ్లు ఎక్కడ నుండో తెచ్చుకొని,
పిల్లలను, భర్తను చూసుకోవాలి... కాని ఏనాడూ
అధైర్యం పడలేదు. పి.యు.సి చదువుకోవటం వల్ల చదువు లేని లంబాడి తండాలో పిల్లలను
చేరదీసి 4 అక్షరంముక్కలు నేర్పేది.
అలివేణికీ
టీచర్ గా ముద్ర పడి పోయింది అక్కడ. అమాయకమైన
లంబాడిలకు అలివేణి చాలా గొప్పగా
కనిపించేది. అందరితో కలుపుగోలుగా ఉండటం వల్ల భర్త క్యాంపుల్లో వున్నా ఏ ముసలమ్మ సాయంతో అయినా వుండటం అలవాటు
చేసుకుంది.
అప్పుడే దశిలి పరిచయం అయింది. ఆమె ఎవరు లేని ముసలమ్మ. దశిలి పద్ధతయిన
జాతిలో పుట్టినా, తప్పని కుటుంబ పరిస్థితులలో ఉద్యోగరీత్యా వచ్చే అధికారుల అవసరం తీరుస్తూ,
వారు యిచ్చే పైసలతోనూ, పురుళ్ళు పోస్తూనూ
జీవిస్తూ వుంది.
గర్భిణీ అయిన అలివేలుకు సాయంగా వచ్చి వెళుతువుండే దశిలిని సాయంత్రం పూట
లంబాడీల ఆచారాలు, పెళ్లి తంతులు అన్నీ అడిగి తెలుసుకునేది.
సుగాలి పెళ్ళిలో పిల్ల
తల్లిదండ్రులకే వరుడు పశువులను, ధాన్యాన్ని కన్యా శుల్కంగా దుస్తులను, ముక్కెరను,
రూపాయల దండను, ఒక తాంగిడిని యివ్వటం వింత ఆచారం..
అలివేణి కొంచెం ఉత్సాహంగా ‘తాంగిడి’ అంటే ఏంటి అని అడగటం ఆలస్యం దశిలి
మొత్తం చెప్పటం మొదలు పెట్టింది..
“అమ్మగోరు యినండి! మా పెళ్ళిళ్లలో పుట్టింటివారు పెళ్ళి కూతురికి కానుకగా
ఇచ్చే గోనె సంచి, వరుడు కొన్ని పశువులు ఆడపిల్ల తల్లి తండ్రులకు కన్యాశుల్కాన్ని సమర్పించి
పెళ్ళి చేసుకొనే ఆచారం ఉంది. పెళ్లి కొడుకు గట్టిగా వున్నాడో లేదో అని దేహ దారుఢ్య
పరీక్ష నిర్వహించి, వాడి సహనాన్ని పరీక్షిస్తూ “జిల్లేడు, మోదుగు
కర్రలతో, రోకళ్ళతో కొడుతూ మా కుతురిని బాధిస్తావా? చెడ్డ మాటలు మాట్లాడుతావా?” అంటూ ప్రశ్నిస్తారు.
బావ మరుదులు చిన్నచిన్న రాళ్ళు చెవులలో పెట్టి, “మా అమ్మ నాన్నని
తిడుతావా? మా చెల్లిని బాధిస్తావా” అంటూ నలుపుతారు. ఎంత
కొట్టినా, ఎంత నలిపినా ‘ఆ నొప్పి!’ అని నోట మాట రాకూడదు. వీటిని
బట్టి వరుని శరీర పటుత్వాన్ని, ఓర్చుకొనే శక్తిని పరీక్షిస్తారు.
పెళ్ళికి వారం రోజుల ముందు నుండే తండాలోని స్త్రీలందరూ కలసి వధువుకు పంపక
సమయంలో ఏడ్చే విధానాన్ని నేర్పుతారు. ఏడ్పును నేర్పించే ఆచారాన్ని ‘ఢావలో’ అని, పంపక సమయంలో
అందరినీ కౌగిలించుకొని ఏడ్వటం, ‘మళేరో’ అని ఎద్దుపై నిల్చొని
తన పుట్టింటి వారు సుభిక్షంగా వుండాలని కోరుకుంటూ పాడేపాటను ‘దావేలి’ అని అంటారు. ‘ఢావలో’
ఎంత కఠిన హృదయులనైనా కరిగిస్తుంది. ఈ పాటలో వధువు పుట్టింటిలో తన బాల్యాన్ని,
తల్లిదండ్రుల ప్రేమానురాగాలను తలచుకొని దుఃఖించే విధంగా తండాలోని వారందరికీ కంట
నీరు పెట్టిస్తుంది. ఆడపిల్ల అత్తయింటికి
వెళ్లే ముందు వధువు పుట్టింటివారు క్షేమంగా వుండాలని కోరుకుంటూ ‘మళేరో’ని ఏడుస్తూ
పాడుతుంది.
‘మళేరో’ అంటే తల్లిదండ్రులను, అన్నదమ్ములను, స్నేహితులను
ఉద్దేశించి తన చిన్ననాటి జ్ఞాపకాలను తలచుకొంటూ దుఃఖించటం. లంబాడీలలో తల్లులే
కాకుండా పెళ్ళి కూతురు తోటి వారు కూడా ఆమె దుఃఖాన్ని ఉపశమింప చేయడానికి
ప్రయత్నిస్తూ అత్తవారింట్లో మెలగవలసిన విధానాలను అప్పగించే పాట ద్వారా బోధిస్తారు.
‘గోట్’ అనే విందు పెళ్ళి
కుమారుడే ఇవ్వటం యిక్కడ మా ఆచారం. తండాకు విందుకై మేకల్ని బలి యిచ్చి, ఆ రక్తాన్ని
పాత్రలో పట్టి ‘సొలోయ్’ వండుతారు. ‘సొలోయ్’ అంటే చింతపండు పులుసు, ఉప్పు, రక్తం కలిపి తయారుచేసి, సాయంత్రం అందర్నీ
బంతిగా కూర్చోబెట్టి సొలోయ్‌ని వడ్డించి మత్తుపానీయాలు సేవనం తరువాత కలసి అంతా
భోజనము చేస్తారు.
కొత్త కోడలు అత్తమామలకు
ప్రతిరోజూ సాయంత్రం వేడినీళ్ళతో స్నానం చేయించి, రాత్రి అత్తమామలకు కాళ్ళు నొక్కడం ఓ ఆచారమని, దశిలి
చెబుతుంటే పిల్లలు విచిత్రంగా వింటూ ‘అమ్మో యిక్కడ మేము పెళ్లి చేసుకోము’ అని
ఏడవటం మొదలు పెట్టారు.
అలివేణికి నెలలు నిండి పురుడు అయింది మళ్ళీ ఆడపిల్ల... చాలా ఏడుపు
వచ్చింది ఎలా పెంచాలి
చాలి చాలని
జీతాలు, బాధ్యతలు... ‘అయ్యో ఆడ పిల్ల!’ అని ఏడుస్తూ వుంటే పురుడు పోసిన దశిలీ
ఓపక్క లంబాడి తండా లోని మరి కొందరు ఆమె ఓదారుస్తూ, ఊరుకో
బిడ్డా ఏడవ కూడదు బాలింతవి. నారు పోసిన ఆ దేముడు నీరు పోయాడా ఏంది?
‘నువ్వు మంచిగా వుంటే కదా, బిడ్డలకు నోట్లోకి కూడు వెళ్ళేది’ అని నచ్చ
చెప్పి, మిగతా పిల్లలను జాగ్రత్తగా
చూసుకుంటూ వుంటే ‘వీరు ఏమవుతారు నాకు? వీరి ఋణం ఎలా తీర్చుకోవాలి?’ అని మధన
పడేది. అలివేణి ఆరోగ్యం కుదుట పడేదాక ఒక
నెల రోజులు యింట్లో తోడుగా ఉండమని దశిలిని అడిగింది. కాస్త యింట్లో వండి పెట్టు,
పిల్లలు ఆకలికి ఉండలేరు, నా తల్లి లాంటి
దానివి సాయం చెయ్యి, మీ సార్ రాగానే నీకు డబ్బులు యిస్తారు అని బ్రతిమాలుకుంది. దశిలి ‘అయ్యో
డబ్బుకోసం రాలేదు తల్లీ, ఆడ కూతురువి నెలలు నిండి అల్లాడి
పోతున్నావని వచ్చెను. ఒక నెల కాదు నువ్వు ఎన్నాళ్ళు ఉండమని అంటే అన్నాళ్ళు ఉంటాను.
నాకు ఎవరు వున్నారు? నా మనవడికి నాలుగు అక్షరం ముక్కలు
నేర్పు చాలు అమ్మ... దొరలా నా మనవడు మంచి ఉద్యోగం చేయాలి’ అంటూ ‘నోరారా అమ్మ, అని
పిలచావు చాలు తల్లీ,’ అని ఏడుస్తూ యింటి పనిలో పడింది.
మెల్లిగా భర్త ఎక్కడ వున్నది దశిలి ద్వారా సమాచారం సేకరించి, ఓ ఉత్తరము
వ్రాసి వేసింది. పురుడు అయిన సంగతి, పిల్లలతో పడుతున్న ఆర్ధిక యిబ్బందుల గూర్చి.
వారం కల్లా కొండలరావు వచ్చేడు ‘మన్నించు అలివేణి, ఉద్యోగం
వత్తిడిలో నీకు నెలలు నిండిన సంగతి తెలియలేదు. నీ ఉత్తరము అందక ముందే నాకు రావలసిన
జీతాలు అన్నీ అందాయి. బయలుదేరి వద్దాం అనుకుంటూ ఉండగానే ఉత్తరము అందింది’ అని, సంతోషంతో తెచ్చిన నోట్లు భార్య తలపై పోసి
అభిషేకం చేసాడు. కూతుర్ని చూసి యిది అదృష్ట వంతురాలు అని ముద్దులాడి దీని పేరు
కనకమహాలక్ష్మి అన్నాడు ప్రేమగా.
యింతలో
దశిలి వేడి చాయ్ తెచ్చి, ‘ఏమి సార్ ఆడ కూతురుకు యిలా వదిలి పోయారు? పిల్లలతో ఎన్ని బాధలు
పడిందో ఎరుక అయిందా నాబిడ్డకు?’ అని కన్నీళ్లు పెట్టుకుంది.
కొండలరావు
తను ఉద్యోగంలో పడి భార్య పిల్లలను అశ్రద్ధ చేసినందుకు సిగ్గుతో తల దించుకున్నాడు.
అలివేణి దశిలి మాటలకి భర్త ఎక్కడ నొచ్చుకుంటాడో అని ‘వెళ్ళు, నీ పని
నువ్వు చూసుకో అక్కరలేని విషయాలలోకి దూరకు’ అని దెబ్బ లాడింది.
కొండలరావు మళ్ళీ వూళ్ళోకి సరుకులకోసం వెళ్ళాడు
రెండో కూతురుని తీసుకోని. భర్త వెళ్ళగానే
చేతినిండా నోట్లు తీసి దశిలి చేతిలో పెట్టి ‘నీ సేవకు నేను వెల కట్టలేను, యీ డబ్బులు ఉంచుకో’
అంది. దశిలికి అవి ఎంతో కూడా తెలియదు. ‘నాకు
వద్దు బిడ్డ డబ్బు, నాకు తిండి పెట్టి, నీడ యిచ్చి అమ్మలా చూసుకుంటున్నావు, చాలు’
అని తిరిగి యిస్తువుంటే దెబ్బలాడి, ‘వుంచు... నీ మనవడిని పట్టణంలోని హాస్టల్లో
చేర్చి మంచి చదువు చెప్పించు’ అని చేతిలో పెట్టింది. కొన్నాళ్ళకు ఆదిలాబాద్నుండీ
వీళ్లకు మళ్ళీ ట్రాన్సఫర్, నలుగురు పిల్లలతో ప్రయాణం
అవుతుంటే దశలి ఏడుస్తూ అడిగింది... ‘నేనూ వచ్చేస్తా దొర’ అని. ‘వద్దు దశిలి.
నువ్వు, నీ మనవడు సింగడిని చదివించు. చక్కని ఉద్యోగం చేస్తాడు, నిన్ను పెద్ద
బంగళాలో వుంచుతాడు’ అని నవ్వుతూ, సింగడి చదువు బాధ్యత తెలిసిన కొందరు అధికారులకు
అప్పగించి, బయలు దేరారు. అలివేణి భర్త చూడకుండా తన దగ్గర వున్న బంగారు చెవి కమ్మలు
యిచ్చి, అవసరానికి వుంటాయి వుంచు అని, గుర్రం బండి ఎక్కి
పిల్లలతో బయలు దేరింది. బండి కనుమరుగయ్యే దాక తండా అంతా ఏడుస్తూ ‘మా తల్లి సల్లగా
ఉండాలి’ అని దివిస్తూ పంపేరు.
తరువాత సింగడు అలివేణి చెప్పిన మాటలకి ఉత్తేజపడి, మంచిగా చదువుకొని తండా
పేరు నిలపెట్టే వైద్య వృత్తిలో మెరిసిపోయాడు.
కొండలరావు, అలివేణి జీవితం నలుగురు పిల్లలతో అలా సాగిపోతోంది, ప్రతీ
యేటా బదిలీలు మారు మూల ప్రాంతాలకు. భార్యభర్తలు
జాగ్రత్తగా కడుపు కట్టుకొని పిల్లలకు తిండి, బట్టకు
లోటు రాకుండా చూసుకుంటూ చదివిస్తున్నారు. చదువులు, ఫీజులు,
పుస్తకాలు పడుతూ లేస్తు సంసారం యీదు తున్నారు. అలి వేణి ఏఊరిలో
వున్నా అక్కడ పిల్లలకు ట్యూషన్ చెప్పటం, చదువు రాని వారికి
ఉత్తరాలు వ్రాయటం, కుట్లు, అల్లికలు
నేర్పడము చేసేది. వాళ్ళు ఏదో కూరగాయలు, పాలు, బియ్యం యిలా తెచ్చి యిచ్చేవారు. దానితో యింట్లో తిండికి లోటు వుండేది
కాదు. అయినా, సహోద్యోగుల ప్రభావంతో కొండలరావు లంచాలకు అలవాటు
పడ్డాడు.
మెల్లగా పెద్ద దానికి ప్రభుత్వ ఉద్యోగస్తుని సంబంధం కుదిరింది. గట్టిగా
అప్పులు చేసి మొదటి పిల్ల అని ఆర్భాటంగా గొప్పగా చేశారు పెళ్లి. అటు యిటు చుట్టాలు
బాగానే వచ్చారు, ఖర్చులు యింకా బాగానే అయ్యాయి. పిల్లని అత్తారింటికి పంపేక యిద్దరూ
అప్పులు ఎలా తీర్చాలి అని బెంగ పెట్టుకొని కూర్చున్నారు. కాలం మెల్లగా తన పని
చేస్తూ పోయింది రెండో పిల్ల చక్కగా చదువు కుంది, చిన్న
ఉద్యోగం వచ్చింది మొదటి నెల జీతం అందగానే అందరి
సంతోషం చెప్పక్కర లేదు..
యింతలో ఓ ఉత్తరము ‘మీ పిల్ల మాకు
నచ్చింది మా అబ్బాయికి చేసుకుంటా’మని. యింకేముంది కొండలరావు ఆనందానికి హద్దులు
లేవు.
‘చూడవోయ్, ఆడ పిల్లలు అని తెగ ఏడిచావు అప్పుడు. నా పిల్లలకు కోరి వస్తున్నారు పెళ్లి కొడుకులు’
అని తెగ మురిసి పోయాడు. కాస్తో కూస్తో కూడ పెట్టిన పి.యఫ్, మేరేజ్ అడ్వాన్స్
తో ఘనంగా చేశారు పెళ్లి. కొడుకు బి.యస్సి. అవగానే అలివేణి తండ్రి తన పలుకుబడితో
చిన్న కంపెనీలో ఉద్యోగం వేయించాడు. యింకేముంది ఆ యింట్లో ఆనందాల హరివిల్లు
సయ్యాటలాడింది, ప్రతిరోజు పండగలా గడిచేది. అందరు స్థిర
పడ్డారు అని ఎంతో నిశ్చింతగా వున్నారు. యిక చిన్నవాడికి ఏదైనా చేయాలి అని కొడుకుతో
మాట్లాడి తన ఉద్యోగం వాడి పేరున
పెట్టేసాడు కొండలరావు. వారి జీవితం గూర్చి
వారికి ఏఆలోచన లేదు ఆనాడు. పిల్లల
భవిష్యత్ ముఖ్యం అనుకున్నారు. అందుకే రేపటి ఆలోచన లేక సర్వం పిల్లలకే ధారపోశారు.
పిల్లాడికి బావ మరిది కూతుర్ని కోరి
కోరి చేశాడు, కోడలు
మేనకోడలు అయితే అత్తగారిని బాగా చూస్తుంది
అని. ఉన్నవన్నీ పంచేసి, కొడుకుదగ్గరికి వెళ్లి పోయారు.
పెన్షన్ డబ్బులుతో కొడుకు దగ్గర జీవితం
వెళ్ళబుచ్చవచ్చని ధీమా. మనవలు పుట్టటంతో అలివేణికి క్షణం తీరిక ఉండేది కాదు, పనుల
వత్తిడి ఎక్కువ అయింది. ముసలి అత్తగారు, మడి వంటలని కోడలి పుల్ల విరుపు మాటలు
సహిస్తూ, ఎక్కడ కొడుకు బాధ పడతాడో అని తెల్లవారిన నుండీ అర్థరాత్రి దాక పని
చేస్తూనే ఉండేది. కొండలరావు గమనించి మందలించే వాడు. ఆ మాటలు ఒకసారి కొడుకుచెవిన పడ్డాయి, దాంతో చిందులు
వేస్తూ ‘నాభర్య ఇంతకన్న ఏమి చేయగలదు మీ అందరికి?’ అని ప్రశ్న వేసే సరికి బి.పి
పెంచుకొని కేకలు వేసాడు కొడుకు మీద. ‘మీ అమ్మ వయసుకు నీ భర్య వయసుకు తేడా లేదా?’
అని. కొడుకు కోడలు మాటలాడటం మానేశారు. మన పిల్లలేగా ఎందుకు గొడవ అని భర్తకు
సర్దిచెప్పి, సర్దుకుని ఉండేది అలి వేణి.
చిన్నకూతురు
పిల్లలకు చూసేవారు లేక మెల్లగా తల్లిదండ్రులను కొన్నాళ్ళు రమ్మని అనగానే సంతోషంగా
వచ్చేరు. యిక్కడ అదే పని అలివేణికి. చిన్న మార్పు ఏమిటంటే, కూతురి ప్రేమముందు
పని భారం తెలిసేది కాదు వాళ్ళకు.
ఏపిల్లలకు అవసరం వచ్చినా ముసలి ప్రాణాలు రెండూ బాగులు సర్దుకుని, ట్రైన్ ఎక్కి
పరిగెత్తుకెళ్ళవలసిందే. మొదటి రెండు రోజులు అభిమానంగా చూసేవారు. తర్వాత ఒక్కో పని
నెమ్మదిగా తగులుకునేవి. బయట పనులు కొండలరావు, యింట్లో పని
అలివేణి. ప్రతీ నెల ఎక్కడ వుంటే అక్కడ వాళ్ళకే పెన్షన్ యిచ్చేవాడు. రోజులు కష్టంగా
గడుస్తున్నాయి. అలివేణి ఆరోగ్యం బాగా బాగులేదు. కొడుకు పనిచేసే కంపెనీ వాళ్ళు
యిచ్చిన ఫ్రీమందులు ఎప్పుడయినా వేసుకుంటూ, యింటి పని,
వంట పని చేస్తూ భర్తకు తెలియకుండా కాలం గడిపేస్తోంది. కొన్నాళ్ళకు
లేవలేని పరిస్థితి వచ్చింది. కొడుకు హాస్పిటలులో చూపిస్తే, పరీక్షలుచేసి
ఊపిరితిత్తుల క్యాన్సర్ అని చెప్పారు. సరిగ్గా మంచి వైద్యం చేస్తే తగ్గిపోతుంది
అని ఖచ్చితంగా కొండలరావుకు చెప్పాడు
డాక్టర్. ‘మీ భార్యకు ఏమైనా పొగ తాగే అలవాటు పూర్వం వుండేదా?’ అని, డాక్టర్ అడిగిన ప్రశ్నకు ఆశ్చర్యం
వేసింది. ‘లేదండీ’ అని చెప్పి ‘ఎందుకు అలా అడిగారు?’ అని ఎదురు ప్రశ్న వేసాడు.
ఊపిరి తిత్తులు పొగ వల్ల పాడై పోయాయి అని చెప్పాడు. అప్పుడు గుర్తు వచ్చింది కర్రల
పొయ్యాల మీద, పొట్టు పొయ్య మీద, రాక్షస
బొగ్గుతో భార్య ఎప్పుడూ వంట చేసేదన్న సంగతి, ఎప్పుడూ
పిల్లలకు వేడినీళ్ల కోసం పెరట్లో వున్న చెట్ల కొమ్ములు, కొబ్బరి
ఆకులు, డిప్పలు పొయ్యిక్రింద వాడేది, బహుశా
ఆ పొగ ఊపిరితిత్తులను కొరికేసి వుండవచ్చు అని డాక్టర్ చెప్పాడు. ‘యిప్పుడు
ఆశ్చర్యంగా 70 సంవత్సరముల ఆడవారికి యీ వ్యాధి బయట పడుతోంది.
మంచి మందులు వాడితే తగ్గి పోతుంది’ అని చెప్పాడు.
తల్లి బాగున్నప్పుడు ఎన్నాళ్ళయినా ఉంచుకునే చిన్నకూతురు, 6 నెలలు అవగానే
విసుక్కోవటం, పిల్లలకు దూరంగా ఉంచటం, వారిని
ఒక గదికే పరిమితం చెయ్యడం చేసింది. అలివేణికి చాలా బాధ వేసేది ‘యిదా దీని
నిజస్వరూపం’ అని. తల్లి ఎక్కువ కాలం
బ్రతకడం కష్టం అని తెలిసిన చిన్నది, ఒకరోజు ‘అన్నయ్య,
అమ్మను చూసుకోవటం నావల్ల కాదు, మీ బావ ఒప్పుకోరు, నువ్వు జాగ్రత్తగా చూసుకో అమ్మకు నేను చేయలేను’ అని పంపేసింది. చిన్న కొడుకు,
కోడలు ఒక నెల చక్కగా చూస్తూ మందులు యిప్పించారు. తర్వాత పెద్ద
కొడుకు దగ్గరకు పంపేసారు. కొడుకు మంచి హోదాలో వున్నందున ‘మీ అమ్మ గారికి కిమొ
తెరపి యిప్పిస్తే నయం అవుతుంది. కొంచెం
ఖర్చులు ఎక్కువ అయినా నయం అవుతుంది’ అని చెప్పాడు డాక్టర్. ‘యిప్పుడు ఎక్కువగా 70 సంవత్సరాల వయసులోని మధ్య తరగతి మహిళలు ఊపిరితిత్తుల కేన్సర్, lung
disorders వ్యాధుల బారిన పడుతున్నారు, వారికి ఏ
వ్యసనం లేకపోవటం ఆశ్చర్యం. అయితే మీరు చెప్పిన ఒకే కారణం కర్రలు, బొగ్గు, వంట చెరుకుగా వాడటం, యింట్లో వారు ఎక్కువగా
పొగ త్రాగటం వల్ల, ఆ పొగ వారి లోపలచేరి వ్యవస్థను నాశనం
చేసింది. ఆ ప్రభావం యిప్పుడు వయసు మళ్ళిన తరువాత బయట పడుతోంది ఈ వ్యాధుల రూపంలో’
అని డాక్టర్ ఎంతో ఓపికగా తండ్రి కొడుకులకు వివరించారు. మంచి హాస్పిటల్కు రిఫరెన్స్
యిచ్చాడు. కొండలరావు భార్యను దక్కించు కోవాలి అని
హాస్పిటల్కు తీసుకొని వెళ్ళాలి అని కొడుకు, కోడలును
మెల్లిగా అడిగాడు. వాళ్ళు వెంటనే సరే అన్నారు. ‘వచ్చేవారం సెలవు పెట్టుకొని
తీసుకోని వెళతాను’ అన్నాడు కొడుకు. ఎంతో సంతోష పడ్డాడు.
పెద్ద పదవిలో వున్న కొడుకు తలచుకుంటే భర్యకు ఖచ్చితంగా నయం అవుతుంది అని.
చిన్న కొడుకు, కూతుళ్లు ఫోన్ చేయటం మానేశారు, ఒక వేళ చేసినా, ‘వాడు ఎలా చెబితే అలా సర్దుకుని ఉండాలి నాన్నగారు. అమ్మకు చెప్పండి
వూరికే హాస్పిటల్ కోసం వాడికి యిబ్బంది పెట్టద్దు,’ అని ఏవో వాళ్ళ స్థాయికి తగిన
చవుక బారు సలహాలు చెప్పి బాధ పెడుతున్న పిల్లల అతి తెలివితేటలకు ఏడుపొచ్చేది. తను
వయసులో వున్నప్పుడు ఎప్పుడూ భార్యను సరిగ్గా చూసుకోలేదు, ఏదో
చాలి చాలని జీతం యిచ్చి ఇవ్వక గడిపేసాడు.
అలివేణి తిని తినక సంసారం గుట్టుగా నెట్టుకొచ్చిoది. పిల్లలకోసం
జీవితమంతా చాకిరీ చేసింది... కిమో థెరపి కోసం అని బయలు దేరారు కొడుకుతో పాటు. కొంత
డబ్బులు యిచ్చి, ‘మీ దగ్గర ఉంచండి నాన్న’ అని కొడుకు అంటే ఎంతో గొప్పగా పొంగి
పోయాడు. మధ్యలో ఒకదగ్గర కారు ఆపి, టిఫిన్ కోసం డాబా దగ్గరికి తీసుకోని వచ్చాడు.
టిఫిన్ తింటూ వుంటే ‘హాస్పిటల్ దగ్గరే నాన్నగారు తిన్నాక వెళదాం, మీ ఫోన్ ఇవ్వండి ఒక్కసారి’ అని తీసుకున్నాడు. అలసిపోయిన యిద్దరూ కాస్త
తిని, టీ త్రాగు తుంటే ‘నాన్న గారు యిప్పుడే వస్తాను. మీరూ
యిక్కడే వుండండి, అదే హాస్పిటల్ మనం వెళదాం’ అని చెప్పి
కారులో వెళ్ళాడు. వెళ్లిన కొడుకు రాత్రి అయినా రాలేదు. ఫోన్ లేదు. ఫోన్ నెంబరులు,
అడ్రస్ వ్రాసుకున్న డైరీకూడా లేదు. ఎవరో కుర్రాడు ‘మీకు యీ బ్యాగులు
యిమ్మని చెప్పి ఒకతను వెళ్లి పోయారు’ అని
యిచ్చాడు. అర్థం అయింది, కావాలని కొడుకు నడి రోడ్డుపై వొదిలేసి వెళ్లి
పోయాడని. మెల్లిగా దగ్గర లోని ఫుట్ పాత్
మీద చిన్న టెంట్ లా వేసుకొని అందులో కాపురం వుంటూ, దగ్గరలోని
టి కొట్టులో పనులు చేస్తూ, అలివేణికి క్యాన్సర్ హాస్పిటలు లో మెరుగైన వైద్యంకోసం ప్రయత్నాలు మొదలు
పెట్టాడు కొండలరావు.
పెన్షన్ డబ్బులతో మందులు కొంటూ డాక్టర్
ఆపాయింట్ మెంట్ కోసం పోరాటం చేస్తూ వున్నాడు భార్యని బ్రతికించు కోవటమే లక్ష్యంగా...
ఎన్నిసార్లు వెళ్ళి బ్రతిమాలినా జాయిన్ చేసుకోకుండా తిప్పే హాస్పిటల్ సిబ్బందిని ఏడుస్తూ, బ్రతిమాలుతూ రోజూ తిరుగుతూనే
వున్నాడు. ఒకరోజు విసిగిపోయి ‘నా భార్య బ్రతకనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని,
యిద్దరం యిక్కడే చచ్చి పోతాం’ అని పెద్దగా ఏడుస్తూన్న కొండలరావుని
మానస వచ్చి ఆదుకుంది. పేపర్ లోని వార్తని GTR కు వివరించి,
కనీసం వాళ్లకు చివరి రోజుల్లో నీడ యివ్వాలి అన్న ఆలోచన తో ఆశ్రమానికి
తీసుకోని వచ్చి, వారికి ఒక గదిలో
ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. దానితో అలివేణి నెమ్మదిగా కోలుకోసాగింది.
పొద్దున్నే మానస పరుగున అలివేణి దగ్గరికి వచ్చి ‘మేడం
గారు, తొందరగా తెమలాలి యీరోజు, మన ఆశ్రమంలో ప్రత్యేక వైద్య శిబిరం వుంది. ప్రముఖ
క్యాన్సర్ వైద్యులు సింఘాల్ వస్తున్నారు.
రిపోర్ట్లు, వాడుతున్న మందులు పట్టుకొని బయలు దేరాలి’ అని
హడావిడి చేసింది. ‘వద్దులే అమ్మ, ఎందుకు అనవసర ప్రయాస’ అని అంటున్న అలివేణితో ‘అమ్మ,
మీరూ చదువుకున్న వారు, యిక్కడ కొన్ని రూల్స్ వుంటాయి, వాటి
ప్రకారం మనం వుండాలి కదా. ఏమో వచ్చే డాక్టర్ మంచి క్యాన్సర్ స్పెషలిస్ట్ అని
తెప్పిస్తున్నారు’ అని కొండలరావుకు చెప్పి వెళ్ళింది. కొండలరావు భార్యను మెల్లిగా పట్టుకొని తీసుకోని
వచ్చాడు. కూచోపెట్టి చెక్ చేస్తూ, రిపోర్ట్ లు అన్నీ
చదువుతున్న డాక్టర్ ని ‘ఏవూరు బాబు మీది?’ అని
మెల్లిగా అలివేణి అడిగింది. ఆదిలాబాద్ దగ్గర ఓ తండా అమ్మ... అని అంటూ ఆమె
మొహం వైపు చూసిన డాక్టర్ ఒక్కసారి లేచి నిలబడి ‘అమ్మగారు! మీరూ... మీరూ..
అంటూ కన్నీళ్లు కారుస్తున్న డాక్టర్ని
పరికించి చూసి ఒళ్ళంతా తడుముతూ, దశిలి ఎలా వుంది? ఎక్కడ వుంది? అందరు బాగున్నారా బాబు...?’ అని ఒకటే ప్రశ్నలు అడిగింది అలివేణి.
ఆనందం, సంతోషం, భద్రత ఒకేసారి కలిగితే
యిక ఏక్యాన్సర్ ఏమి చేయలేదు. ‘ఏమండీ మన... మన సింగడు... ఈ డాక్టర్’ అని తడబడుతూ,
పొంగి పోతున్న భార్యను చూసి... ‘అలివేణి నువ్వు బ్రతుకుతావు.
మన బిడ్డ వున్నాడు’ అని ఆనందంతో ‘భగవంతుడా
నువ్వు యిలా ఎదురు పడ్డావా నాయనా?’ అని రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తుంటే,
‘ఒద్దు సార్ ఆరోజు మీరు, అమ్మగారు చేసిన
ఆర్ధిక సాయం, నేర్పిన చదువు నా యీ స్థితికి పునాది. నేను
పరీక్ష ఫీజు కట్టింది కూడా అమ్మగారు అప్పుడు అవ్వకు యిచ్చిన చెవి కమ్మలు అమ్మిన
డబ్బుతోనే. మీ ఋణం తీర్చుకునే సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నా...
ఋణం తీర్చుకునే సమయం యిప్పుడే వచ్చింది నాకు’ అంటూ... ప్రత్యేక శ్రద్ధతో
ట్రీట్మెంట్ మొదలు పెట్టాడు. ఆశ్రమం వారికి చెప్పాడు, ‘మద్రాస్ లోని తన క్యాన్సర్
హాస్పిటల్ కి అలివేణికి తీసుకోని వెళుతున్నా’ అని. ఊహ తెలియని వయసులో పొందిన
చిన్న సాయం మరువని సింగడి వ్యక్తిత్వం మేరు పర్వతంలా కనిపించింది.
కన్నబిడ్డ కాక పోయినా అంత కన్న మిన్నగా
ఆదుకుని అలివేణిని బ్రతికించే గొప్ప పనిలో వున్నాడు అతడు. కొండలరావు ‘నా భార్య
బ్రతుకుతుంది, బ్రతుకుతుంది’ అని ఆనందంగా తనలో తానే
నవ్వుకుంటూ సంబరంగా చెప్పు కుంటున్నాడు...
No comments:
Post a Comment