ఒక్కమాటలోనివే వొగి బంధమోక్షాలు
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0336-04 సం: 04-211
పల్లవి:
ఒక్కమాటలోనివే వొగి బంధమోక్షాలు
చిక్కినందాకా దేహి చింత బొందీగాని
చ.1: హరి యని నుడిగి రెండక్షరాల బాపేటి-
దురితాలు భువిలోన దొల్లె లేవు
పురిగొని యందుమీద పొంచి విశ్వాసములేక
పెరగగ బెరుగగ పెచ్చు రేగీగాని
చ.2: మతిలో గోవింద యన్న మాత్రమున నంటేటి
అతిపుణ్యాలిలమీద నన్ని గలవా
కతగా నట్టె మహిమగానలేక వుండగాను
బతిమాలగానే యింత బయలాయగాని
చ.3: శ్రీవేంకటేశ నిన్ను సేవించితే నిచ్చేటి-
యేవల వరాలు లెక్క నెంచవసమా
భావించి తెలిసి చేపట్టెడి యరుదింత
దైవము నా కియ్యగాను దక్కె నింతేకాని
భావం
పల్లవి:
బంధమోక్షాలు అనునవి క్రమముగా ఒక్క మాటలోనివే.
బంధాలకు కారణమైన జనన మరణ చక్రములో చిక్కినంతవరకు ఈ జీవి విచారము పొందుతుంటాడు.( బంధ మోక్షములను ఒకే మాట లో ఉన్న మోక్షం కొరకు ప్రయత్నించాలని భావం)
చ.1:
హరి యని చెప్పిన తరువాత ఆ రెండక్షరాలు నశింపచేయలేని పాపాలు ఈ భూమిలో ముందునుంచి లేవు.(అన్ని పాపాలు హరి అను పదోచ్చారణతో నశిస్తాయని భావం)
అన్ని పాపాలు హరి అను పదోచ్చారణతో నశిస్తాయనే మాట మీద నమ్మకం లేకపోతే ఆ పాపాలు ఇంకా పెచ్చుపెరిగిపోతాయి.
చ.2:
మనస్సులో గోవింద అని ఒక్కసారి తలుచుకొన్న మాత్రమున( వచ్చే పుణ్యాలెన్నో లెక్కపెట్టలేము.)
వేంకటేశుని మహిమను కథగా భావించినవారు ఆ మహిమను అనుభవించలేరు.( ఆ స్వామి మహిమను పూర్తిగా నమ్మి శరణు కోరాలని బావం)
స్వామిని ఆర్తితో మహిమా ప్రదర్శనకు బతిమాలితే –ఆ మహిమ బయటపడుతుంది.
చ.3:
శ్రీవేంకటేశ! నిన్ను సేవించితే నువ్వు ఇచ్చే ఎక్కడెక్కడి వరాలు(ఎన్నో వరాలు) లెక్క పెట్టడం మా వల్ల అవుతుందా? ఏవో కొన్ని ఆ దైవము నాకు తెలిసేటట్టు చేయగా వాటిని దక్కించుకొనే అదృష్టం కలిగింది.
***
No comments:
Post a Comment