శ్రీరుద్రంలో విశేషాలు - 11 - అచ్చంగా తెలుగు

శ్రీరుద్రంలో విశేషాలు - 11

Share This
 శ్రీరుద్రంలో విశేషాలు - 11 

శ్రీరామభట్ల ఆదిత్య
 


కళ్యాణశైలపరికల్పితకార్ముకాయ
మౌర్వీకృతాఖిలమహోరగనాయకాయ ౹
పృథ్వీరధాయ కమలాపతిసాయకాయ
హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ ॥ 

నమకంలోని చివరి అనువాకం తరువాత మహామృత్యుంజయ మంత్రం కూడా పఠిస్తారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు అనువాకాంతంలో 7 మంత్రాలను ప్రత్యేకంగా పఠించడం జరుగుతుంది. అందులో మొదటిది 'మహామృత్యుంజయ మంత్రం'. ఈ మంత్రాన్ని శివుడు శుక్రాచార్యునికి ఉపదేశించాడు.  ఈ మంత్రం ఋగ్వేదంలోని ఏడవ మండలంలో ఉన్నా ఇక్కడ విశేషంగా పఠిస్తారు. 

శ్రో॥ త్రయంబకం యజామహే సుగన్ధిం పుష్టివర్ధనమ్ ౹
ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్ ॥ 

అంటే... 

సుగంధ పరిమళం కలిగి, పుష్టిని వృద్ధి చేసే, మూడు కన్నుల పరమేశ్వరా! నిన్ను పూజిస్తున్నాను. తొడిమ నుండి దోసపండును ఎలా వేరుచేస్తున్నావో అలాగే మృత్యువు నుంచి నన్ను వేరుచేయుము. అమృత సమానమైన మోక్షము నుండి నేను విడివడకుండ ఉండును గాక." 

అని అర్థము. ఈ మంత్రం అత్యంత శక్తివంతమైనది. 

తరువాత ఇంకా ఆరు మంత్రాలు చదువుతారు. వాటి అర్థం " అగ్నిలో, నీటిలో, చేట్లలో, మొక్కల్లో, ప్రపంచంలో అంతటా నిండి ఉన్న పరమేశ్వరుడికి నా అనేకానేక నమస్కారాలు." అని. మళ్ళీ " ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైన, విశేషమైన బాణాలు, విల్లు కలవాడైన పరమేశ్వరుడికి, అన్నీ రోగాలను హరించే అమృతతుల్య ఓషధులకు పుట్టినిల్లైన వైద్యనాథునికి, అసురులను సంహరించేవాడికి, మా చిత్తములను శుద్ధిచేయువానికి నా వందనములు." అని ప్రార్థిస్తాడు. 

అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః ౹ అయం మే విశ్వభేషజోఽయగ్ం శివాభిమర్శనః॥ 

" పరమేశ్వరుణ్ణి అర్చించిన నా ఈ చెయ్యి అత్యంత పవిత్రమైనది. పరమేశ్వర పూజలో ఇదియే ముఖ్యసాధనము. ఇది భగవంతునితో సమానము. నాకున్న అన్ని రుగ్మతలకీ ఇదే ఔషధము కూడా." అని సాధకుడు పరమశివుని అర్చనలో భాగమైన తన చెయ్యిని స్తుతిస్తాడు. ఆ తర్వాత " లోకాలను లయం చేసే కాలకంఠుడైన మహాకాలా! నన్ను కాపాడు! జీవులను మృత్యుసమయాన హరించే వేలకొలది పాశాలు కల హే పరమేశా! నా ఈ ప్రార్థనా ఫలితమైన అగ్ని సమర్పణని మృత్యువుకు సమర్పిస్తున్నాను." అని సాధకుడు ప్రార్థిస్తాడు. 

"సర్వవ్యాపియైన పరమేశ్వరునికి నా నమస్కారం. మృత్యువు నా దగ్గికి రాకుండా చూడు స్వామి! సకలాన్నీ లయం చేసే కాలకాలా! ఆత్మకు, ఇంద్రియాలకు మధ్యన ఉండే పరమేశ్వరా! నాలోనే ఉండు. నేను నీకు సమర్పణగా ఇచ్చిన దానిని స్వీకరిస్తున్నాను. నాలోనే ఉండి దానితో సంతృప్తి పడి నన్ను కాపాడు స్వామీ!" అని చివరి మంత్రంలో ప్రార్థన చేస్తాడు సాధకుడు. 

ఆ తర్వాత చమకం ప్రారంభమౌతుంది. చమకంలో కూడా 11 అనువాకాలు ఉన్నాయి. దీనిలో 'చ మే' అనే ప్రయోగం ఎక్కువసార్లు జరిగింది. అందుకే దీనికి చమకం అనే పేరు వచ్చింది. నమకంలో పరమేశ్వరుణ్ణి స్తుతించిన సాధకుడు చమకంలో కోరికలు కోరతాడు. ఇందులో మొత్తంగా 343 కోరికలు మనకు కనిపిస్తాయి. 

నమః శివాయ 

( ఇంకా వుంది )

No comments:

Post a Comment

Pages