కిరసనాయిలు పంతులుగారు
భావరాజు పద్మిని
"కాంతమ్మా! వేళ మించిపోతోంది. ఇంకెంతసేపూ? గమ్మున రావోయ్!" వీధి గుమ్మంలో నిలబడి భార్యను కేకేసారు ఆదూరి భాస్కర్రావుగారు.
"ఓ, వచ్చె, వచ్చె!" ఉత్త గాభరా మనిషమ్మా, క్షణం నిలబడరు ఏవిటో!" నడుముకున్న వడ్డాణం సవరించుకుంటూ వడివడిగా వచ్చారు కాంతమ్మగారు. ఆవిడనే తేరిపారా చూస్తూ,
"సరిపోయింది, ఉద్ధరిణీ పంచపాత్రా లాగా మనిద్దరమే వెళ్దామా? పిల్లలేరీ? ఇంకా తయారవలా?" కసిరారు ఆయన.
ఈలోగా నోట్లో కొబ్బరాకు బూరతో ఊదుతూ, చిన్ని పంచెకండువాతో హనుమంతునిలా వచ్చి, ఆయన ముందుకు ఓ ఎగురెగిరాడు ఆయన కొడుకు శ్రీనివాసు. వెనకే చిన్న డప్పు మ్రోగిస్తూ 'హై, హై రాములోరి పెళ్లికి రారండోయ్' అంటూ దూసుకొచ్చాడు ఆయన మరో కొడుకు రాముడు.
చేతుల్లో ముస్తాబు చేసిన కొబ్బరాకు బొమ్మలతో, పట్టుపరికిణీలు కట్టుకుని, వరద గోదారిలా గలగలమంటూ పరిగెట్టుకొచ్చారు ఆయన కూతుళ్లు నాగరత్నం, పద్మావతి, భ్రమరాంబలు. ముద్దులొలికే తన ఆడపిల్లల్ని చూడగానే ఠక్కున ఎగిరిపోయిందాయన కోపం.వాళ్లనే మురిపెంగా చూసుకుంటుండగా...
"కిరసనాయిలు పంతులుగోరండి, బేగీ ఎమ్మాటిట్టుకు రమ్మంటన్నారండి అయ్యగోరు! మూర్తం దగ్గరడిందట, ఆయ్!" అంటూ వచ్చాడు గోపన్న.
"విన్నారుగా, నామొహంలో ఏమైనా కోతులాడుతున్నాయా? చూసింది చాలుగానీ, పదండి, పదండి..." అంటూ ఆయన అడుగు ముందుకెయ్యగానే అప్పటిదాకా వేచిఉన్న, మంగళవాయిద్యాల వాళ్లు పాటందుకున్నారు. రాయ్ పేట వీధివీధంతా పూజాసామాగ్రితో కోలాహలంగా ఆ కుటుంబాన్ని అనుసరించారు.
ఆదూరి భాస్కర్రావు గారిని మా నర్సాపురంలో 'కిరసనాయిలు పంతులు గారు' అంటారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత కిరసనాయిలు దొరక్క అంతా ఇబ్బంది పడుతున్నప్పుడు వీరు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి దగ్గర పీపాలతో కిరసనాయిలు కొని అందరికీ అమ్మేవారట. అందుకే ఆ పేరొచ్చింది. అంతేకాదు, పాలకొల్లు-నరసాపురం రోడ్డు నుంచి నరసాపురం వస్తున్నప్పుడు ఊరి మొదట్లో కనిపించే పెట్రోల్ బంకు కూడా ఒకప్పుడు ఆయనదే! అయితే అప్పట్లో పెట్రోల్ బంకులను 'బర్మా షెల్' అనేవారు. ఇది కాకుండా ఆయనక టైర్ల కొట్టు కూడా ఉండేది. రెండు కార్లు, రెండు బస్సులు, తోటలు, పొలాలు వంటి అపరిమితమైన సంపదతో వెలిగిపోయే వారి కుటుంబం ఉండేది, రాయ్ పేట కరంటాఫీస్ దగ్గర.
సుమారు ఎకరం వైశాల్యం ఉన్న వాళ్ళ ఇంటి గుమ్మంలో ఉండే చిన్న చెక్క తలుపును తీసుకుని, లోపలికి అడుగుపెట్టగానే, ఆ గుమ్మానికి అల్లుకునున్న విరజాజి, గిన్నెమాలతి తీగల పూల పరిమళం గుప్పున మనల్ని కమ్మేస్తుంది! ఏడు గదులున్న విశాలమైన పెంకుటిల్లది. ముందు వసారాలో నాపరాళ్లలో పులిమేక ఆట గళ్లు వేసుంటాయి. పంతులుగార్ని కలవడానికొచ్చిన వాళ్లు, వారాల భోజనం కోసం వచ్చిన వాళ్లు, చుట్టాలు, స్నేహితులతో ఆ వసారా నిత్యం కళకళలాడుతూ ఉంటుంది.
గేటుకు ఎడమచేతి ప్రక్కనున్న సపోటా చెట్టుకు పిల్లల కోసం వేసిన తాడుయ్యాల కనిపిస్తుంది. కుడిచేతి పక్కన పెద్ద పనస చెట్టు, ఇంకొంచెం ముందుకి వెళితే ఈశాన్యం మూలన బావి దర్శనమిస్తాయి. చేదతో నీళ్లు తోడుకుని, కాళ్లు కడుక్కుని, సందులోంచి అలా లోపలికి వెళితే రకరకాల మందారాలు, బొడ్డు మల్లి, నీలాంబరం(టప్ టప్) పూలు, దానిమ్మ, సీతాఫలం, జామ చెట్లు, మధ్యమధ్యన ఇంటిచుట్టూ సిపాయిల్లా అమరిన కొబ్బరి చెట్లూ ముచ్చట గొలుపుతాయి.
ఇంటి వెనుక భాగంలో రకరకాల మామిడి చెట్లు, పంపరపనస చెట్టు, మాను కట్టిన ముద్ద మందార చెట్టు, నారింజ చెట్టు, పశువులు, వాటి కోసం మేట వేసిన గడ్డివాము కనిపిస్తాయి. పెరటి నిండా విరబూసిన రకరకాల మందారాలు, మల్లెలు చూసేందుకు కళ్లు సరిపోవు!
కళలకు కాణాచి ఆ ఇల్లు! వాల్మీకి రామాయణ పద్యాలు, వ్యాస భారతం పద్యాలన్నీ పంతులు గారికి నోటికొచ్చు. ఊళ్లో అవసరమైన వారికి ధర్మబద్ధమైన వడ్డీలకి అప్పులిచ్చేవారు పంతులుగారు. అయితే ఆయన దగ్గర అప్పు దొరకాలంటే మాత్రం, వచ్చినవాళ్లు ఆయన పాడే పద్యాలన్నీ వినాల్సిందే!
కాంతమ్మ గారు కూడా విసుగూ, విరామమెరుగని దొడ్డ ఇల్లాలు. నిత్యం వచ్చిపోయే వాళ్లకు, ఏ సమయానికొచ్చినా కూడా, చిరునవ్వు చెక్కు చెదరకుండా కట్టెలపొయ్యి మీద వండి వారుస్తూ ఉండేదావిడ. దయ, ప్రేమ మూర్తీభవించిన ఆవిడ, కళకళలాడే మోముతో, పట్టుచీర, నగలతో అమ్మవారిలా ఉండి, ఊరందర్నీ కలుపుకు పోయేది. దగ్గర్లో ఉన్న సంస్కృత పాఠశాలలో చదువులకొచ్చిన పిల్లలు వారాలు చేసుకుంటూ, భోజనానికొస్తే అమ్మలా ఆదరించేది. ఎన్నో పెళ్లిళ్లు వారి ఇంటిబయట పందిట్లోనే జరిగాయి.పిల్లలతో అప్పుడప్పుడూ తమ స్వంత వాహనాల్లో యాత్రలకు వెళ్లడమంటే భలే సరదా ఆయనకు!
నిత్యం పెళ్లివారింటిలా సందడిగా ఉండే ఆ ఇంట్లో, పడకలకి రాత్రైతే ఇంటి ఆరుబయట వరుసగా మడతమంచాలు వేసేవారు. చుక్కల్ని, చందమామని చూస్తూ, బోలెడన్ని కబుర్లు చెప్పుకుంటూ, ఆ పరివారమంతా ఎప్పుడు నిద్రలోకి జారుకునేవారో తెలీదు. అప్పట్లో ఇప్పట్లా భయాలు, బెరుకులూ ఉండేవి కాదు మరి!
ఆవకాయల సీజన్ వచ్చిందంటే ఆ ఇంట్లో గొప్ప సందడి నెలకొనేది. పనివాళ్లతో కారాలు కొట్టించి, ఆవాలు, కళ్లుప్పు నూరించి, జల్లించి పక్కన పెట్టేవారు. ప్రత్యేకంగా నడవపల్లి తోటల నుంచి సేకరించిన గులాబీలు, కలక్టర్ కాయల గుట్టలు పోసేవారు. కాయలు కడిగి, తుడిచి పెట్టాకా, పెద్దలంతా ఆమకాయ కత్తిపీటలతో మామిడికాయ ముక్కలు తరుగుతుంటే, పిల్లలంతా కన్నాలు పెట్టిన ఆల్చిప్పలతో, మామిడికాయ తొక్క తీస్తూ, పెద్దల మాటలకు ముసిముసిగా నవ్వుకుంటూ ఉండేవారు. ఏడాదంతా హఠాత్తుగా వచ్చిపోయే వారందరికీ ఆదరువు ఆ ఆవకాయే కనుక భారీ ఎత్తున ఆవకాయ పెట్టి జాడీలకెత్తేవారు. తరిగిన ముక్కలన్నీ పెద్ద పెద్ద గిన్నెల్లో వేసి, ఆవగుండ, నూనె సిద్ధమయ్యకా, ఒకగదిలో తలుపులేసుకుని, మడిగా ఆవకాయ కలిపేవారు కాంతమ్మగారు. ఆ తర్వాత ఆవకాయ గుచ్చెత్తిన జాడీలకు, గుడ్డలతో వాసెన కట్టి, ఇంటి వెనుక భాగంలో ఉన్న ఆవకాయల గదిలో పెట్టేవారు.
నలుగురాడపిల్లలు, నలుగురు మగపిల్లలు ఆయనకు. వాళ్ల పిల్లలు కూడా, అప్పటికప్పుడు పాటలు, పద్యాలు, వ్రాసి బాణీలు కట్టి పాడడంలో, సరదా నాటకాలు వ్రాసి వేయడంలో, మిమిక్రీ చేయడంలో, నిష్ణాతులు. అందుకే శ్రీరామనవమి పందిట్లో తొమ్మిది రోజులూ సాయంత్రాలు సందడంతా వాళ్లదే!
మేళతాళాలతో బయల్దేరిన పంతులు గారి కుటుంబం, రాయ్ పేటలోని రామాలయం చేరుకుంది. అక్కడ శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తమ ఇంట్లో కాసిన కాయో కసరో, పువ్వో పండో తీసుకొచ్చి, అక్కడున్న బేసిన్లలో వేస్తున్నారు కొందరు. వడపప్పు, పానకాలు, అరటిపండ్లు విరివిగా పిల్లలకు పంచి పెడుతున్నారు. పట్టు పరికిణీల కుచ్చిళ్లు తడిసి పానకాలోడుతున్నా, ఇంకా గంగాళాలలో కలుపుతూనే ఉన్న పానకం కోసం పోటీలు పడుతూనే ఉన్నారు తూనీగల్లాంటి ఆడపిల్లలు. రాత్రికి వెయ్యాల్సిన నాటకం గురించి, పాడాల్సిన పాటల గురించి, చెయ్యాల్సిన సందడి గురించి ఒక ప్రక్కన గుట్టుగా చర్చించుకుంటున్నారు రామదండు లాంటి పిల్లమూక! మరీ చిన్నపిల్లలు పందిరి గుంజల చుట్టూ 'అల్లీబిల్లీ చందామామ' అంటూ గుండ్రంగా తిరుగుతూ సందడి చేస్తున్నారు. కొందరు యువకులు రామాలయంలో ఉన్న అక్షయం లాంటి బావి నుంచి మంచినీళ్లు తోడి, పెద్ద బిందెల్లో పోస్తున్నారు. కొందరు యువతులు రాములవారిని, సీతమ్మవారిని తయారు చేసి, బుగ్గన దిష్టి చుక్క పెట్టి, తమ కల్యాణ ఘడియ ఎప్పుడొస్తుందా అని మనసులో కలలు కంటున్నారు.వృద్ధులు కొంతమంది కొత్తగా ఇచ్చిన విసనకర్రలతో విసురుకుంటూ అందర్నీ ఓర కంట గమనిస్తున్నారు. కాస్త అవతలగా మధ్యాహ్న భోజనాలకు, నివేదనలకు సిద్ధమౌతున్న వంటకాల సువాసనలు నసాళాలు తాకుతూ, అందరినీ ఊరిస్తున్నాయి.
కొబ్బరాకు పందిట్లో వేదికపై ఉన్న రాములవారికి ఎదురుగా పీటల మీద కూర్చుని, రాములవారి కళ్యాణాన్ని జరిపిస్తున్నారు, భాస్కర్ రావు గారు, కాంతమ్మ గారు. అసలు రాయ్ పేటలోని రాములవారి గుడి కట్టించింది పోతరాజు వంశస్థులు. ఏదో అడ్డం రావడం వల్ల ఆ ఏడాది ధర్మకర్తయిన భాస్కర్రావు గారినే పీటల మీద కూర్చోమన్నారు.
ముహూర్తం వేళవడంతో మంగళవాద్యాలు మిన్నంటాయి. కొత్తగా చేయించిన మంగళ సూత్రాలను అందరికీ చూపించి, రాములవారికి తాకించి, సీతమ్మ వారి మెడలో అలంకరించారు అర్చకులు. అటుపైన అమ్మవారిని అయ్యవారి ప్రక్కన కూర్చోపెట్టి ముత్యాలు కలిపిన తలంబ్రాలు పోసారు. పిల్లలంతా వెనుకనుంచి చాటుగా ఆ ముత్యాలు ఏరుకుని, ఒకరిపైనొకరు జల్లుకోసాగారు. ఈలోగా కొంతమంది ముత్తైదువులు వేదిక వద్దకు చేరి, "రామచంద్రాయ జనక" అంటూ శ్రావ్యంగా పాడుతూ నవదంపతులైన సీతారాములకు మంగళహారతి ఇవ్వసాగారు. ఆకాశం నుంచి దేవతలు కూడా దీవిస్తున్నారా అన్నట్లు జడివాన మొదలైంది. అప్పటివరకు మండిపోయే ఎండనుంచి, వాతావరణం చల్లగా, ఆహ్లాదకరంగా మారిపోయింది.
పెద్దలంతా పెళ్లి వేడుకల్లో మునిగి ఉండడంతో ఇదే సందని, పిల్లలు వానలో తడిసి ఎగరసాగారు. ఎవరి ముఖాల్లో చూసినా ఆనందం, ఆహ్లాదం. రాములవారి పెళ్లంటే ఊరంతా పండుగే కదా! అలా మనసంతా నిండిన ఆనందంతో అందరూ ఇంటి దారి పట్టారు.
కాలం ఎప్పుడూ ఒకేలా సాగదు. కొన్నేళ్ల తర్వాత పంతులుగారు కాలం చేసారు. ఆ సరికే ఆస్తులన్నీ పంపకాల్లో, నష్టాల్లో హారతి కర్పూరమయ్యాయి. కొడుకులంతా కళ్లముందే కాలం చేయడంతో కాంతమ్మగారూ స్వర్గస్తులయ్యారు. నందనవనంలాంటి ఇంటిని అమ్మి కోడళ్లు పుట్టిళ్ల వైపుగా వెళ్లిపోయారు. కూతుళ్ల బిడ్డలంతా, వృద్ధిలోకొచ్చి చక్కగా ఉన్నారు. ఈ కథ వ్రాస్తున్న నాతో సహా!
అవును, నేను వాళ్లమ్మాయి పద్మావతి కూతుర్నండీ, కిరసనాయిలు పంతులుగారి మనవరాల్నండి, ఆయ్! మాది నర్సాపురవండి!
No comments:
Post a Comment